Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

సమకాలీనతకు పట్టంకట్టిన కవిత

ఏ మనిషీ సమకాలీన సంఘటనలకు స్పందించకుండా, వాటి గురించి ఆలోచించకుండా వుండకపోవడం జీవితంలో ఒక భాగమైపోయినట్టు సమకాలీన స్పృహతో సామాజిక అంశాలను స్పృశించకుండా వుండలేకపోవడం సాహిత్యంలో ఒక భాగమైపోయి దానిని ఒక బాధ్యతగా అది నిర్వర్తిస్తూ వుంది. కవిత్వమూ సమకాలీనతతో అంత అనుబంధాన్ని పెంచుకుంది. అనేకానేక వర్తమాన అంశాలను తనలో ఇముడ్చుకుంటోంది. కళ్ల ముందు అనునిత్యం దోబూచులాడే దృశ్యమాలికల పరిమళాల్ని తనివితీరా ఆస్వాదిస్తూనే వుంది. దుఃఖ రాగాల్నీ రికార్డు చేస్తోంది. అది ఒక ఆమనిjైు అరుదెంచే ప్రతీసారీ జీవితపు చెట్టుపై కొత్త చిగుళ్లను చిగురింపజేస్తూనే వుంది. అక్షర పూలబాలల మకరంద మాధుర్యాలను పంచుతూనే వుంది. దాని దృష్టి సమ కాలీనతపై సెర్చిలైటులా పడుతూనే వుంది. ఒక పక్క గతాన్ని త్రవ్వుకుంటున్నా మరో పక్క వర్తమానపు లోగిళ్ల నిండా తన చూపుల్ని ప్రసరిస్తూనేవుంది. అది ఒకఅద్దంలా సమకాలీనతను ప్రతిబింబిస్తూ తన ప్రయోజనాన్ని నెరవేర్చుకుంటూనే వుంది.
‘చెల్లరే విల్లువిరుచునే నల్లవాడు
పదిపదారేండ్ల యెలరాచ పడుచువాడు
సిగ్గుసిగ్గంచు లేచి గర్జించినారు
కనులు గట్టిన తెల్లమొగాలవారు’
(శివధనుర్భంగము ఖండిక నుంచి)
అంటూ రామాయణంలోని ఒక దృశ్యాన్ని సమకాలీన స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో వర్ణిస్తాడు కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి. శివధనుర్భంగం ఘట్టంలో స్వాతంత్య్రోద్యమ తుది విజయాన్ని వీక్షించాడు కవి. దానిని ధ్వన్యాత్మకం చేసింది కవిత్వం. సీతాదేవిని వరించే సందర్భంలో రాముడి పరాక్రమాన్ని వర్ణిస్తూనే సమకాలీనతను మరచిపోలేదు కవి. అంతఃపురంలో అంతమంది రాజకుమారులున్నా ఎవ్వరూ విరచలేని శివధనస్సును రాముడు ఫెటిల్లుమని విరిచేస్తే అక్కడి వాళ్లంతా అవమానభారంతో కృంగిపోయారట. అహింసామార్గంలో ఒక వ్యక్తి చైతన్యశక్తిjైు, గాంధీ మహాత్ముడై స్వాతంత్య్ర పోరాటంలో విజయాన్ని సాధిస్తే తెల్లవాళ్లు తెల్లమొగాలు వేశారట. తెల్లశబ్దంతో పద్యంలోని అసలు రహస్యాన్ని బట్టబయలు చేసి సమకాలీనతకు అద్దం పట్టిందీ కవిత్వం.
‘ఏడీ ఎక్కడ ధర్మజుడేడీ హరిశ్చంద్రుడేడీ
దేవతావస్త్రాల కథల్లో పసిపిల్లడేడీ
త్రిశూలాలతో కూల్చేశారా రబ్బరు గుండెలకు
కొక్కేలను తగిలించి శుద్ధి చేశారా
చరిత్రకు చేతబడి చేశారా రాలిన శిథిలాల్లోంచి
ఉరాంగ్‌ ఉటావ్‌ లేచి రాలేదా
మనిషి సిగ్గుపడుతున్నాడా
దేశాన్ని నగ్నంగా చేసిచూద్దాం మనుషులను
ఒకటొకటిగా వలిచేద్దామా లోపల చెదలు పుట్టలు తప్ప విగ్రహాలుండవు’ (క్రీ.పూ. 1992 డిసెంబర్‌6 ఖండికనుంచి)
అంటాడు వర్తమాన కవి ప్రసేన్‌ కళ్లముందు జరిగిన హృదయవిదారక సంఘటనకు అక్షరరూపమిస్తూ. ఒక ప్రశాంతత వున్నట్టుండి అల్లకల్లోలంగా మారినప్పుడు, ఒక దృశ్యం ఒక్కసారిగా విధ్వంసక దృశ్యమైపోయినప్పుడు పెల్లుబికిన అలజడి కవిత్వమైంది. కన్నీటిధారల్ని వర్షించింది. జడలు విచ్చుకున్న మతమౌఢ్యపు వికారాన్ని అది బట్టబయలు చేసింది. మతకలహాల మారణహోమ పరిణామాల్ని వ్యంగ్యంగా ఎత్తిచూపింది. ఈ మారణహోమాన్ని వివరిస్తూనే ధర్మరాజు, హరిశ్చంద్రుడు వంటి మహామహుల్ని గుర్తు చేసింది. చరిత్రకే చేతబడి జరిగిపోయిందని వాపోయింది. వేలయేళ్ల నాటి అనాగరిక ఆటవిక సమాజపు దుస్థితిని సమకాలీన సమాజంలో దర్శించలేకపోయింది. మనిషి నిండా చెదల్లా, పుట్టల్లా అల్లుకుపోతున్న మతమౌఢ్యాన్ని చూడలేక సతమతమైపోతూ వుంది కవిత్వం. అందుకే అది సమకాలీనతను సంస్కరించాలని తపించిపోతూ వుంది.
డాక్టర్‌ కొత్వాలు అమరేంద్ర, సెల్‌: 9177732414

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img