Monday, December 5, 2022
Monday, December 5, 2022

సమతా మానవతామూర్తి జాషువా

డాక్టర్‌ జంధ్యాల పరదేశిబాబు
సెల్‌: 9121985294

ఆధునిక సాహిత్యంలో ఖండ కావ్య ప్రక్రియకు విశేషమైన ప్రాచుర్యం కలిగించిన మహాకవి జాషువా. మానవతామూర్తి. బుద్ధుడు, ఏసుక్రీస్తు, గాంధీమహాత్ముడుఈ మువ్వురు ప్రబోధించిన శాంతి, అహింసా సిద్ధాంతాలకు ప్రాధాన్యమిచ్చిన కవి జాషువా. సమాజంలో ప్రబలిన అస్పృశ్యతను, కులమత వర్ణ వ్యవస్థల్ని సమూలంగా పెకలించటానికి సాహిత్యాన్ని ఒక సాధనంగా స్వీకరించాడు జాషువా. ‘మత పిచ్చి గానీ, వర్ణో / న్నతి గానీ, స్వార్థ చింతనము గానీ, నా/ కృతులందుండదు, శబ్దా/ కృతి బ్రహ్మానందలక్ష్మి నృత్యమొనర్చున్‌.’’ కుల మత వర్ణాలకు సంబంధించిన విషయాలు తన కవిత్వంలో కానరావనీ, స్వార్థ చింతనం తన కవితలో ఉండదనీ, అందమైన పదాల పొందికతో కూడిన బ్రహ్మానందలక్ష్మి తన కవిత్వంలో నృత్యం చేస్తుందని జాషువా స్వయంగా విన్నవించారు. కరుణ రసానికి కవితల్లో పట్టాభిషేకం చేశారు. వినుకొండలో జన్మించి విశ్వనరుడుగా ఎదిగాడు. ప్రాథమికోపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి, నాటి మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా గ్రామ గ్రామం తిరిగి, కందుకూరి, చిలకమర్తి వంటి వారి ఆశీస్సులు పొంది, తిరుపతి వేంకట కవుల ప్రోత్సాహంతో ముందుకు నడిచారు జాషువా కవి. ఉభయ భాషా ప్రవీణులై తెలుగు పండితునిగా, ద్వితీయ ప్రపంచ సంగ్రామ సమయంలో యుద్ధ ప్రచారకునిగా, ఆ తర్వాత ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో తెలుగు ‘ప్రొడ్యూసరు’ గా ఉద్యోగాలు సమర్థవంతంగా నిర్వహించారు. భరతమాత, భారత వీరుడు, తెలుగ తల్లి, ఆంధ్రుడను, శిశువు, గిజిగాడు, శిల్పి, కృష్ణానది, అఖండ గౌతమి, మొదలైన అసంఖ్యాక కావ్య ఖండికలు రచించి నిరుపమాన జాతీయాభిమాన్ని, దేశ భక్తిని చాటి చెప్పారు జాషువా కవీంద్రుడు. ‘‘నేతాజీ’’,‘‘శివాజీ’’, ‘‘బాపూజీ’’Ñ ‘‘రాష్ట్ర పూజ’’ వంటి వారి ఖండ కావ్యాలు దేశభక్తి నుద్దీపింప జేయునవి.
జాషువా సమాజంలోని వాస్తం పరిస్ధితుల్ని కైలాసంలోని పరమ శివునికి ‘గబ్బిలం’ ద్వారా విన్నవిస్తాడు. మానవత్వంలోని విశిష్టమైన జీవ కారుణ్య భావన జాషువా కవితా ఖండికల్లో గోచరిస్తాయి. తోటి మానవుడ్ని మానవునిగా చూడమనీ ప్రబోధిస్తాయి. ఆయన రాసిన కవితా ఖండికలు ఏడు ఖండ కావ్యాలుగా వెలువడ్డాయి. ‘శిశువు’ ను గురించి జాషువా రచించిన పద్యాలు పరమ హృద్యాలుప్రత్యక్షర రమణీయాలు. ‘‘నవ మాసముల భోజనము నీర మెఱుగక / పయనించు పురిటింటి బాటసారి/ చిక్కు చీకటి చిమ్ము జేనేడు పొట్టలో/ నిద్రించి లేచిన నిర్గుణుండు/ నును చెక్కిళుల బోసి నోటి నవ్వులలోన/ ముద్దులు చిత్రించు మోహనుండు/ అక్షయంబైన మాతృక్షీర మధుధారా/ లన్నంబుగా తెచ్చుకున్న అతిథి/ బట్ట గట్టడు బిడియాన పట్టువడడు/ ధారుణి పాఠశాలలో జేరినాడు/ వారమాయెనో లేదొ? మా ప్రకృతి కాంత/ కఱపి యున్నది వీని కాకలియు నిద్ర.’’ ‘భరతమాత’ ను గురించి, ‘తెలుగు తల్లి’ ని గురించి జాషువ కవి పద్యాలు ఆపాత మధురాలు. జాతీయ భావం, దేశభక్తి స్ఫోరకాలు. ‘‘సగర మాంధాతాది షట్చక్రవర్తుల / యంక సీమల నిల్చినట్టి సాధ్వి/ కమలనాభుని వేణుగాన సుధాంబుధి/ మునిగి తేలిన పరిపూత దేహ/ కాళిదాసాది సత్కవి కుమారుల గాంచి/ కీర్తి నందిన పెద్ద గేస్తురాలు/ బుద్ధాది ముని జనంబుల తపంబున మోద/ బాష్పముల్విడిచిన భక్తురాలు/ సింధు గంగానదీ జల క్షీరమెపుడు/ కురిసి బిడ్డల పోషించు కొనుచునున్న/ పచ్చి బాలెంతరాలు మా భారతమాత/ మాతలకు మాత, సకల సంపత్సమేత.’’ కుల మత వర్ణ వర్గ భేదాలు తొలగిపోయి, విశ్వ మానవ ప్రేమ జనించాలనీ, సరికొత్త సమాజం ఆవిర్భవించాలనీ ఆశించిన కవి జాషువా. ‘‘లేవిట వర్ణ భేదములు లేవిట నెట్టి మతాలు/ సత్క్రియా, పావన మూర్తులే యట నివాస మొనర్తురు/ డాంబికాలకుం, దావు లవంబు లేదు కుల తత్వము చెల్లదు’’ చెప్పులు కుట్టి జీవనం సాగించే ‘అరుంధతీ సుతుని’కథను లోకానికి తెలియజెప్పిన మానవతా దృక్పథం గల మహనీయ కవి జాషువా. ‘‘సామాన్యుని మాన్యునిగా’’ చేసిన కవి అతడు. ‘‘చిక్కిన కాసుచే తనివి చెందు నమాయకుడెల్ల కష్టముల్‌ / బొక్కెడు బువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి న/ ల్దిక్కులు గల్గు లోకమున దిక్కరి యున్న యరుంధతీ సుతుం/ డొక్కడు జన్మమెత్తె భరతోర్వరకుం గడగొట్టు బిడ్డడై’’. ప్రపంచమందలి అద్భుత శిల్ప కళా శోభితాలైన భవనాలకు తలమానికమై, భారతీయ కళా కౌశలానికి ఎత్తిన పతాకమై, శతాబ్దులు గడిచినను సడలని సౌందర్య శోభతో అలరారుచున్న ‘‘తాజ్‌మహలు’’ నిర్మాణానికి మూలమైన, మొగలు సమ్రాట్టు షాజహాను పవిత్ర ప్రణయ వృత్తాంతంతో కూడిన కరుణ రసాత్మక కావ్యం జాషువా ‘‘ముంతాజ్‌ మహలు’’. కలకాలం నిల్చియుండే కట్టడం ‘తాజ్‌మహలు’. ‘‘ఎన్ని యుగముల వఱకు సహించుకొనునొ/ తెలుగు శిల్పుల చాతురీ విలసనంబు/ యమున యొడ్డున పూచి దిగంతములను/ యశము నించిన తాజమహాలు కొఱకు?’’ భూమి, ఆకాశం, నీరు, అగ్ని, గాలి ఇవి పంచభూతాలు. వీనితో కూడిన ఈ ప్రకృతి సుఖాన్ని అనుభవించే హక్కు సృష్టిలో ప్రతి ప్రాణికి ఉన్నది. తోటి ప్రాణిని అణిచివేసే రాక్షసత్వానికి, బల ప్రయోగానికి ఎవ్వరూ పాల్పడకూడదనీసకల ప్రాణుల యెడ ‘సమత్వ దృష్టి కలిగి ఉండాలనీ జాషువా ప్రబోధించాడు. ‘‘పంచభూతాత్మకంబైన ప్రకృతి సుఖము/ ననుభవించెడి హక్కు మర్త్యునకె గాదు/ కలదు, ప్రతి చిన్ని ప్రాణ భృత్తులకు కూడ/ బలము గలదంచు దోపిడి సలుపదగదు.’’ అంధకార బంధురమైన సమాజానికి శాంతి, అహింసా సిద్ధాంతాన్ని ప్రబోధించిన బుద్ధ దేవునికి కమనీయ కవితా నీరాజనాలు సల్పారు జాషువా. ‘‘మాతృ గర్భము నందె భూత కోటింగాంచి/ జాలితో నభయ మొసంగినావు / గాయంబు గల యంచ రాయనింగని, పెంచి/ కన్నీటి దాహంబు గడిపినావు/ నడలేక మడిదున్ను బడుగుటెద్దును జూచి/ నెనరు జూపుల మేను నిమిరినావు/ తనువు చాలించి పోయిన జీవి నీక్షించి / నడుము నక్కున వ్రీలి నలిగినావు/ ప్రాజ్య సామ్రాజ్య దివ్య వైభవము నందు / నమ్మకము దప్పి, బోధి వృక్షమ్ము నీడ/ గుండె దిగులెల్ల నీ ముందు కుప్పవోసి/ ప్రజ్వరిల్లితె శాంతి దీపంబవగుచు.’’ ‘‘ఆయన గొప్ప కవి. ఒక చక్కని మధురమైన శైలిలో కవిత్వం రాసినాడు. పద్యరచన ధారాశుద్ధిగా చాలా అందంగాచేసిన కవులలో అతడొకడు’’ అని కవిసమ్రాట్‌ విశ్వనాథ వారు జాషువాను ప్రశంసించారు. ‘జాషువా సాటిలేని మేటి కవి చంద్రుడు, ఆయన వాణి అందాల అలివేటి, మాధుర్య సౌందర్య సౌకుమార్యాల త్రివేణి, సాహితీ రసజ్ఞులకు మోజు కూర్చే మేజువాణి.’ అని కరుణశ్రీ కవి అభినందించారు.
కవికి సమాజంలో సముచిత స్థానమివ్వాలనీ, సత్కరించి, గౌరవించుట తగునని జాషువా ‘‘ఫిరదౌసి’’ కావ్యమందు ప్రబోధించారు. ‘‘కవిని కన్నతల్లి గర్భంబు ధన్యంబు/ కృతిని చెందువాడు మృతుడుగాడు/ పెరుగు తోటకూర విఖ్యాత పురుషులు / కవిని వ్యర్థజీవిగా దలంత్రు’’. భారతీయ ఆదర్శ దాంపత్యధర్మాన్ని జాషువా ‘ముంతాజమహలు’ కావ్యంలో అద్భుతంగా వర్ణించారు.
‘‘రాణి విడిచిపోయె రాజు నొంటరి చేసి/ రాజు విడిచిపోయె రాజ్య రమను/రాజ్యరమయు విడిచే రాజుల పెక్కండ్ర/ తాజి విడువలేదు రాజసంబు’’.
‘‘ఈ తనువుండు నంతవఱకింతయు నెమ్మది లేదు ప్రాణికీ/ భూతలమందు కష్ట సుఖముల్‌ చెలికత్తెయలై భజింపనా/ శాతరళాక్షి తాండవము సల్పుచు నుండును మృత్యుదేవతా/ ద్యూత వినోదరంగమిది తోరపు సంపదలెల్ల పాచికల్‌.’’
మానవునకు కష్ట సుఖాలు ఒకదాని వెంట మరొకటి వస్తాయనీ, మానవుడు ఆశాజీవియనీ, మృత్యు దేవత ఎప్పుడైనా రాచ్చుననీ, ఈ సంపదలు అశాశ్వతాలనీ తాత్త్విక భావాల్ని వెల్లడిరచాడు జాషువా.
‘కులమతాలు గీచుకొన్న గీతలుజొచ్చి/పంజరాన కట్టువడను నేను/ నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు/ తరుగులేదు విశ్వ నరుడ నేను’ ‘చక్కని కవితకు కులమే యెక్కువ తక్కువలు నిర్ణయించినచో నింకెక్కడి ధర్మము తల్లీ!’ అని భరతమాతను ప్రశ్నిస్తారు. దేశకాలాలకు అతీతుడై, ఋషితుల్యుడై కవి కలకాలం నిలుస్తాడని ‘ఫిరదౌసి’ కావ్యం ద్వారా నిరూపించారు జాషువా కవీంద్రుడు.
షాజహాన్‌ముంతాజ్‌ల అనురాగ దాంపత్యాన్ని అద్భుతంగా ‘ముంతాజ్‌ మహల్‌’ కావ్యంలో అభివర్ణిస్తారు జాషువా. ఇహ పరాలకు పయనించు రెండు ఆత్మల కలయికగా, మార్మిక చింతనతో ‘‘ముసాఫరులు’’ అను తాత్త్విక కావ్యం ఆయన సృష్టించారు. క్రీస్తు జీవిత విశేషాలు మహత్యాలతో వారు రచించిన ‘క్రీస్తు చరిత్ర’ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఆయన విజయ వాటికా నగరంలో ‘గజారోహణం’, ‘గండపెండేరాది’ సత్కారాలు పొందారు. నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సమ్రాట్‌, కళా ప్రపూర్ణ, పద్మభూషణ, కవి దిగ్గజ, కవితా విశారదఇత్యాది బిరుదులు జాషువాను వరించాయి. విశ్వ మానవ ప్రేమ, జీవకారుణ్యం, సర్వమత సమత్వ దృష్ట్టి, జాషువా కవితల్లో అడుగడుగునా సాక్షాత్కరించి, ఆయనను ఉత్తమ కవితా స్రష్టగా, సంస్కరణ కవిగా సాహిత్య చరిత్ర పుటలలో ‘చిరంజీవి’ గా నిలిపాయి. (247`2022) జాషువా వర్థంతి)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img