Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

సాహిత్య పెన్నిధి`సంగీత నిధి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ

జన్మించిన గ్రామంలో చదువుకోవటానికి పాఠశాలలు లేవు. చదువుపై ఆపేక్ష కలిగిన ఆ బాలుడు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు తండ్రి వద్దనే తెలుగు, సంస్కృత భాషలు నేర్చుకున్నారు. తల్లి వద్ద సంగీత సాధన చేశారు. తండ్రి సాహిత్య గురువుగా, తల్లి సంగీత గురువుగా ఉభయ ప్రక్రియల్లోను ప్రతిభను పెంచుకోవటానికి మైసూరు వెళ్లి కృష్ణబ్రహ్మ తంత్ర మఠంలో ఉంటూ రాజేంద్ర సంస్కృత పాఠశాలలో చదువు కొనసాగించాడు. ఆ సమయంలో అనేక రంగాలలో కీర్తిప్రతిష్టలు అందుకున్న ఆంధ్రుడు డా.కట్టమంచి రామలింగారెడ్డి మైసూరు రాజా కళాశాలలో చరిత్ర, తత్వశాస్త్రం తర్కశాస్త్రం, ఆంగ్లం బోధించే ఆచార్యునిగా కొనసాగుతుండేవారు. బాలునికి కట్టమంచితో పరిచయం కావటం, అది దినదినాభివృద్ధి చెందటంతో ఇతనిలోని లక్షణాలు కట్టమంచికి బాగా నచ్చి, 1912లో మైసూరు రాజా కళాశాలలో తెలుగు పండితునిగా పనిచేసే అవకాశం కల్పించారు. అప్పటికి అతనికి ఏ యోగ్యతా పత్రాలు (సర్టిఫికెట్లు) లేవు. మనిషిలోని మంచితనం, మనసులోని సున్నితత్వములే కళాశాల విద్యార్థులకు తెలుగు బోధించే అపూర్వ అవకాశం కల్పించాయి. అది కూడా తెలుగు భాషకు పెద్దగా గుర్తింపు లేని మైసూరు రాష్ట్రంలో 1911లో అయన రాసిన ‘‘తారాదేవి’’ ఖండకావ్యం ఆనాటి ప్రముఖ పత్రిక సరస్వతిలో ప్రచురించటం కూడా 1912లో ఆయన ఉపాధ్యాయునిగా నియమితులు కావటానికి ప్రధాన కారణం అని కూడా వారి అనుయాయులు అంటుండేవారు. ఆ తర్వాత వారి కలం ఆగకుండా రచనలు చేసింది. గళం ఆగకుండా సంగీత మధురిమలు ఒలికించింది. సాహిత్య కళానిధిగా, సంగీత పెన్నిధిగా చరిత్రలో నిలిచారు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ.
అనంతకృష్ణశర్మ 1893 జనవరి 23న జన్మించారు. అనంతపురం జిల్లా, కల్యాణదుర్గం తాలూకా, రాళ్లపల్లి అనే చిన్న పల్లెటూరు వీరి జన్మస్థలం. తల్లి అలివేలు మంగమ్మ. తండ్రి కృష్ణమాచార్యులు. రాళ్లపల్లిలో చదువుకోవటానికి అవకాశాలు లేనందున అనంతకృష్ణశర్మ 1906లో మైసూరు వెళ్లారు. అప్పటికే సంస్కృతాంధ్ర భాషల్లో మంచి గుర్తింపు పొందారు. తల్లి స్వభావసిద్ధంగా సంగీత బాణీలో వినిపించే పాటలు వింటూ సంగీత బాణీలు ఒంటబట్టించుకున్నారు. అటు తర్వాత మైసూరు వెళ్లి రాజేంద్ర సంస్కృత పాఠశాలలో చదువుతూ సంస్కృతంతో పాటు ప్రాకృత, వ్యాకరణ, అలంకారాలు, శాకుంతల లాంటి నాటకాలను కూడా ఔపోసన పట్టారు. మైసూరులో ఉన్న సమయంలో డా.రామలింగారెడ్డితో పరిచయమైంది. అనంత కృష్ణశర్మలోని సుగుణాలు వారికి నచ్చాయి. మైసూరు మహారాజా కళాశాలలో తెలుగు పండితునిగా అనంత కృష్ణశర్మ చేరే అపూర్వ అవకాశం కల్పించారు. అప్పటికీ శర్మకు ఏ సర్టిఫికెట్లు లేవు. అయినా తెలుగు పండితునిగా నియమితులయ్యారు. 1912 లో ఆ కళాశాలలో అధ్యాపకునిగా కొనసాగుతున్న కాలంలో వైణిక శిఖామణి. వీణా విశేషణ మైసూరు వాసుదేవాచార్య లాంటి సంగీత శాస్త్రవేత్తలతోపరిచయం పెరిగి సంగీతంలో మంచి గుర్తింపు పొందారు. 1909 లో జ్యేష్ట శుద్ధ ఏకాదశి నాడు శ్రీ నాల్వడి కృష్ణరాజు ఒడియార్‌ వర్థంతి ఉత్సవ సందర్భంగా గానీ విశారదగా కీర్తించే బిడారం కృష్ణప్ప నిర్వహించిన సంగీత కచేరీకి విచ్చేసిన అనంత కృష్ణశర్మ వారి గానానికి ముగ్దులై వారిని అర్దించి, ఆశ్రయించి నాలుగేళ్లు ఆయన వద్ద సంగీతం నేర్చుకున్నారు. అలా సంగీత సాధన కూడా చేస్తూ 38 సంవత్సరాలు తెలుగు పండితులుగా బాధ్యతలు నిర్వర్తించి 1951లో పదవీ విరమణ చేశారు.
ఉపాధ్యాయునిగా కొనసాగుతూ ఎందరో విద్యార్థుల్ని ఉన్నత స్థానాలకు తీసుకురావటం అనంత కృష్ణశర్మ అనే నాణానికి ఒకవైపు సాహిత్యపరంగా రచనా వ్యాసంగం కొనసాగించుతూ, సంగీత సభలకు హాజరై అవగాహన పెంచుకోవటం ఆ నాణేనికి రెండవ వైపు. 1911లో తారాదేవితో మొదలైన వారి రచనా వ్యాసంగం అనేక చారిత్రక గ్రంథాలతో పాటు, విమర్శనా గ్రంథాలు కూడా అందించారు. మీరాబాయి (పద్యకావ్యం), లీలాదేవి (కల్పిత గాథ) లాంటి వాటితో పాటు సాహిత్యోపన్యాసాలు, నాటకోపన్యాసాలు శాలివాహనా గాథా సప్తశతి, స్పర్దా కావ్యము (సంస్కృతి) లాంటి సాహితీ గ్రంథాలను వెలువరించారు. లీలాదేవి అనేది బెంగాలీ ఆధారిత నవల. రాళ్లపల్లి తెలుగులోకి అనువదించారు. 1928లో అనంతపురంలోని సీడెడ్‌ డిస్ట్రిక్ట్‌ కళాశాలలో శర్మ ‘వేమన’ గురించి ఇచ్చిన అనేక ఉపన్యాసాలు అనేకమంది ప్రశంసలు అందుకున్నాయి. శర్మ 1932లో రాసిన శాలివాహన గాథా సప్తశతి తెలుగు పలుకుబడులతో కూడిన అత్యుత్తమ అనువాద గ్రంథంగా గుర్తింపు పొందింది. వారు రాయలసీమ కావటం వల్లనేమో రాయలసీమ వ్యావహారిక భాషా విధానమంటే వారికి చాలా ఇష్టం. రాయలసీమ నుడికారం, పలుకుబడిని తన రచనల్లో ఎక్కువగా పొందుపరిచారు. ‘నృత్య రత్నావళి’, పాండురంగ మహత్మ్యము, శ్రీమదాంధ్ర భాగవతాలను కూడా అందించారు. తెలుగు విమర్శనా వాజ్ఞయంలో సాహిత్యానికి మంచి గుర్తింపు తెచ్చారు. పీఠికా రచనను ఒక విమర్శ కళగా అభివృద్ధి చేశారు. వీరి పీఠికలు 1978 లో పుస్తకంగా ముద్రించారు. శర్మ రాసిన ముఖ్య కవితల్లో పెనుగొండ కొండ, శమీపూజ, సంధ్యావందనము, విస్తృత వేణుగీతి, మంచి ప్రాచుర్యం పొందాయి. ఈ కవితలు 1922 లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ప్రచురితం కావటం విశేషం.
సంగీత రంగానికి కూడా ఎనలేని సేవలు చేశారు. మరుగున పడి ఉన్న తాళ్లపాక అన్నమయ్య కీర్తనలను వెలికితీసి వాటికి అమూల్యమైన పీఠికలు రాసి స్వరపరిచి సంగీతాభిమానులకు అందించారు. సాహిత్య, సంగీత కార్యక్రమాల్లో తరుచుగా పాల్గొంటూ ఉపాధ్యాయునిగా పదవీవిరమణ చేసిన వెంటనే మరో అవకాశం అంది వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆహ్వానంపై తిరుపతిలోని ప్రాచ్య పరిశోధనా సంస్థలో చేరారు. దానిలో సుమారు 20 ఏళ్లు పనిచేశారు. సుమారు ఏడేళ్ల పాటు తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలకు స్వరకల్పన చేసి తెలుగు సంగీత సంప్రదాయాలకు ఎనలేని సేవ చేశారు. వాటిని రెండు సంపుటాలుగా వెలువరించింది తిరుమల తిరుపతి దేవస్థానం.
ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడెమీ పక్షాన నిర్వహించిన ప్రథమ సంగీత సమావేశంలో అనంత కృష్ణశర్మను ‘గాన కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది. మైసూరులోని సంగీత పరిషత్‌ ‘గాన కళాసింధు’ బిరుదుతో సత్కరించింది. బెంగళూరు గాయక సమాజం వారి ద్వితీయ సంగీత సమ్మేళనంలో ‘సంగీత కళారత్న’ బిరుదుతో సత్కరించింది. 1974లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్‌తో సత్కరించింది. 1970లో రాళ్లపల్లి అభినందన గ్రంథం ‘అనంతరాగం’ ప్రచురించారు. 1979 మార్చి 11వ తేదీ ఉదయం తి.తి.దేవస్థానం కార్యనిర్వహణాధికారి శర్మ గారింటికి వెళ్లి తి.తి.దేవస్థానం వారు మిమ్మల్ని ‘సప్తగిరి సంగీత విద్వన్మణి’ గా నియమించారని తెలియపరచారు. అదే రోజు రాత్రి శర్మగారు మరణించారు.
` దాసరి ఆళ్వారస్వామి
సెల్‌: 9393818199

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img