Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

స్ఫూర్తిదాయక కవిత్వం‘1818’

భీమేకొరేగావ్‌ యుద్ధం నేపథ్యంలో సాగే 1818 దీర్ఘ కవితను ‘పుప్పాల శ్రీరామ్‌’ రాసారు. ఆ యుద్ధం జరిగి రెండు వందల యేళ్లు గడిచిన సందర్భంగా 2018లో భారీయెత్తున అక్కడ దళిత ఐక్యతా సమావేశం జరిగింది. దానిపై మనువాదులు కుట్ర పన్ని రసాభాస చేశారు. అయితే ఈ 1818 కవిత దళితఅస్తిత్వం, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సమ్మిళితంగా సాగుతుంది. నదులు నాగరికత సూచీలు. కవి భీమానది చుట్టూ ఈ దీర్ఘ కవితను అల్లడమనేది సింబాలిక్‌గా చాలా ఆవశ్యకమైనది. అంటే దీనిద్వారా కవి ఒక కౌంటర్‌/ఆల్టర్నేటివ్‌ హిస్టరీని మన ముందు ఉంచుతున్నట్లుగా ఉంది. ఈ ప్రక్రియ ఒక రాజకీయ, సాంస్కృతిక అస్తిత్వానికి సంబంధించి ఒక సృజనాత్మక ఎత్తుగడ. సమాజంలో ఒక ‘మెజేరిటియన్‌ వ్యూ’ బలంగా పోతున్నప్పుడు దానికి ఆధిపత్యం కూడా తోడవుతున్నప్పుడు, వాటిని తిప్పికొడుతూ వచ్చే ‘కౌంటర్‌ కల్చరల్‌ మూవ్‌మెంట్‌’ చాలా ముఖ్యమైనది. ఈ మూవ్‌మెంట్‌ చరిత్రలో జరిగిన విషయాలను తీసుకుని ఒక రాజకీయ, సాంస్కృతికమైన నేరేటివ్‌తో మెజారిటేరియన్‌ వ్యూని ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉంటాయి. భీమేకొరేగావ్‌ సంఘటన దాని చరిత్ర, దాని సమకాలీన ప్రాసంగికత అన్నీ కూడా దీనిలో భాగంగానే చూడాలి. ఈ కోణాన్ని ఆవిష్కరించడంలో ఈ దీర్ఘ కవిత చాలా మేరకు విజయం సాధించిందనే చెప్పాలి.
1818 భీమే కొరేగావ్‌ యుద్ధం, 1857 సిపాయిల తిరుగుబాటు రెండు విభిన్న లక్ష్యాలతో జరిగినప్పటికీ వీటి పోలిక కొంతమేర అవసరం. సిపాయిలు తిరుగుబాటు చర్య ఆంగ్లేయులపై జరిపినది కాబట్టి ఒక దేశభక్తి చర్యగానూ, భీమే కోరేగావ్‌ యుద్ధం ఒక దేశ వ్యతిరేక చర్యగానూ చెప్పబడుతుంది. ఈ 1818 దీర్ఘ కవితలో చెప్పినట్లు దళితులు (మహర్లు) ఈ దేశ నిర్మాణంలో భాగం. శ్రామికులుగా, వ్యవసాయ కూలీలుగా, వలస కార్మికులుగా మన సమాజ నిర్మాణంలో వారి పాత్రను విస్మరించి భీమే కోరేగావ్‌ లాంటి సంఘటనలతో వారి దేశభక్తిని శంకించడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి. అప్పటికే దేశంగాలేని సమయంలో జరిగిన సంఘటనని దేశభక్తి కోణంలో చూడడంతో వారు చారిత్రకంగా సాధించుకున్న విజయాలను కించపరచడమే కాకుండా, సమకాలీన అస్తిత్వ పోరాటాలను, రాజకీయ ఎదుగుదలను ఏ కుట్ర కేసుగానో, రాజ ద్రోహంగానో చూడడం అనేది రాజ్యం యొక్క ఆధిపత్య, అహంకార భావజాలానికి నిదర్శనం. చారిత్రకంగా బ్రాహ్మణీయ భావజాలాన్ని ప్రశ్నించడంలో మరాఠీల, మహర్ల యొక్క పాత్ర చాలా కీలకమైనది. అనాదిగా వీరిరువురూ కలిసి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నిరసిస్తూ వచ్చారు. ఇప్పుడు సమకాలీన రాజకీయాలలో మరాఠీలను, మహర్లను వేరు చేసే పనిలో భాగంగానే మొన్న జరిగిన దాడులు కనిపిస్తున్నాయి.
ఈ కవితను ఇంకా పరిశీలించినట్లయితే, మూడు విషయాలు కనిపిస్తాయి. ఒకటి రాజ్యం చేసే హింస మరియు అణచివేత, రెండు దళితులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆధిపత్య కులాల దాడులు, మూడు జాతి నిర్మాణంలో దళితుల యొక్క శ్రామిక పాత్ర-ఆధిపత్య కులాలపై వారి తిరుగుబాటు. ఈ మూడిరటిని సమాజం అర్థం చేసుకోవాలనే తపన కవిలో కనబడుతోంది.
ఇంకా మనం నిర్మించుకున్న వ్యవస్థలతోనే ప్రజాస్వామ్యం మీద, ప్రాథమిక హక్కుల మీద జరిగే దాడిని కవి ప్రశ్నిస్తాడు. ఎంత అణిచినా, ప్రశ్న మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తుందని హెచ్చరింపు కూడా చేస్తాడు. ‘ప్రశ్నల్ని ఒప్పుకోవట్లేదు/ చీపురు పుల్లలతో పిల్లల్ని బాణాలాట ఆడుకోనివ్వట్లేదు/ వానపాముల పొట్లో మట్టిరేణువుల్ని కూడా/ పెళ్లగిస్తున్నారు/ దమ్ములో మొలకల్నీ/పదునైన వాటి మొనల్ని/ కోడిపుంజు పూలనీ, ఎగరేసే వాటి తలల్ని/జైళ్ళలోకి నెట్టేస్తున్నారు’ ఇలా రాజ్యం వ్యవహారశైలిని కవి తీవ్రంగా తప్పుబడతాడు.
‘విచారణ ఖైదీలెవ్వరికీ విచారమే లేదు/చేసిన నేరాలు తెలియనక్కరలేదు/అండర్‌ ట్రయిల్‌ గాళ్ళకి/భారత శిక్షా స్మృతిలో మిల్లీమీటర్‌ చోటుండదు/పుస్తెలు కట్టీకట్టగానే అరెస్టైన నూనూగు మీసాలవాణ్ణి/పున్నమిరాత్రి విడిచి పెట్టాలి/వకీళ్లను అనుమతించాలి/ములాఖత్‌ అర్జీలపై మనసుతో దస్తఖత్‌ చేయాలి/అసలు నా ఇంటిపేరేమిటి/సందు మొగసాల నుంచి మాదెన్నో ఇల్లు/నా ఆధార్‌ కార్డులో నెంబర్లు ఎక్కడికి వెళ్లాయి/నా కిలోబియ్యం ఎవరింట్లో ఉడుకుతుంది/నా చూపుడువేలిపై ఇంకుమరకని ఎవరు తుడిచేసారు’ విచారణ పేరిట అరెస్టయ్యే ఖైదీల హక్కులు కాలరాయబడ్డాన్ని కవి ప్రశ్నిస్తాడు. అంటే ఈ దేశంలో విచారణ ఖైదీలకు ఎటువంటి ప్రాధమిక హక్కులు లేవా? కనీసం ఓటు వేసే హక్కు కూడా లేదా? అంటూ రాజ్యం పోకడలను దుమ్మెత్తిపోస్తున్నాడు.
దీర్ఘ కవితలో కవి పలు దేశీయ సంఘటనలను కూర్పుచేసాడు. ఆయా అంశాల పట్ల పాలకులు వ్యవహరించిన తీరుతో కవి విభేదిస్తాడు. సంచలనమైన హత్రాస్‌, ఉన్నావ్‌, కథువా, నిర్భయ మొదలగు దళిత, మైనారిటీ ఆడబిడ్డలపై జరిగిన అమానవీయ సంఘటనలను కవితలో చొప్పించకపోవడం వెలితే. ‘మై డియర్‌ ఇండియా/నీకు తెలియడం లేదు గానీ/నువ్వెంత భయదరూపానివో, వొంగి చూసుకుందుకు/ఒక ఖాళీ అద్దం పలకను తీసుకొస్తాను’ ఇలా చివరి కవితలో ఇండియాను ఆక్షేపిస్తారు. ‘నేను భీమానదిని ఆఖరిసారి హెచ్చరిస్తున్నాను/ఇండియా సాయిబాబాని విడిచిపెట్టు/నా ప్రియాతి ప్రియమైన కవి వరవరరావు కూడా’ మొత్తంగా చివరికి కవి బహిర్గతం అవుతాడు. కవిత్వ లక్షణాలు దృష్టిలో చూసుకుంటే, అలా అవ్వొచ్చా? లేకపోతే ఈ కవిత నేపథ్యం దృష్ట్యా అలా బహిర్గతం అవ్వడమే మంచిదా? దీర్ఘకవిత లక్షణానికి భిన్నంగా కవి వస్తువును దాటి ప్రయాణించారు. దీన్ని కవి కొత్త ప్రయోగమనవచ్చు. అయితే ఏ కవితా వస్తువునైనా కవిత్వ లక్షణాలతో బంధించొచ్చా? లాంటి విషయాలను మనం చర్చించుకోవాలి. కవితను బొమ్మ కట్టించడంలో కొంతమేర తడబాటు ఉంది. దీనికి కారణం గాఢమైన పదాల ప్రయోగం మరియు వస్తువు పరిధి పెంచుకోవడం కావచ్చు. మొత్తంగా చూస్తే శ్రీరామ్‌ కవిత్వంలో జవసత్వముంది. ఉద్వేగం ఉంది. అది చిరుత పరుగులా ఉంటుంది. పులి పంజా విసిరినట్లుంటుంది. సింహం జూలు విదిల్చినట్లుంది. డేగ చూపులా తీక్షణంగా ఉంటుంది. నలుచెరగులా ప్రతిధ్వనించే సాంద్రమైన కవిత్వమిది. నలుగురి నోట పలకగలిగే సామాజిక, రాజకీయ కవిత్వమిది.
పిల్లా తిరుపతిరావు,7095184846

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img