(అండమాను జైల్లో ముస్లిం స్వాతంత్య్ర సమరయోధులు)
డా॥పి.వి.సుబ్బారావు
సెల్: 9849177594
‘‘ఇతిహాసపు చీకటి కోణం/ అట్టడుగున పడి కాన్పించని/ కథలెన్నో కావాలిప్పుడు’’శ్రీశ్రీ. సయ్యద్ నశీర్ అహమ్మద్ పట్టువదలని విక్రమార్కుడిలా చరిత్రలో భాగంగా మిగిలిపోయిన ప్రత్యేకించి అండమాను జైలు జీవితం గడిపిన ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల గాథలను ఎన్నో గ్రంథాలు పరిశీలించి రచించాడు. ఈ గ్రంథం రాయాలన్న ఆలోచన 2014లో ఆయనకు కలిగింది.దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ చరిత్రకారులు ప్రొపెసర్ శామ్‌సుల్ ఇస్లామ్ రాసిన ‘‘అన్ సంగ్ హీరోస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ అండమాన్స్’’ ‘‘హూ ఈజ్ హూ’’అనే గ్రంథాన్ని 2014 నవంబరు 21వ తేదీన ఈ రచయితకు పంపించాడు. ఆ గ్రంథాన్ని ‘‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్, సెల్యులార్ జైల్, పోర్ట్‌బ్లెయిర్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్’’ కు చెందిన రషీదా ఇగ్బాల్ (పోర్ట్‌బ్లెయిర్, అండమాన్ నికోబార్ దీవులు) రచించారు. నశీర్ అహమ్మద్ ఆ గ్రంథాన్ని శ్రద్దగా చదివి దాన్ని తెలుగులో రాయాలనిపించింది. వెంటనే ఆ గ్రంథ రచయిత డా॥రషీదా ఇగ్బాల్‌ని సంప్రదించాడు. అప్పటి నుండి 2021 జనవరి వరకు ‘అండమాను జైలు
ముస్లిం స్వాతంత్య్ర సమరయోధులు’ పుస్తక రచనకు అవసరమైన సమాచారం కోసం అన్వేషిస్తూ అప్పటి బ్రిటీషు ప్రభుత్వం భారత ప్రభుత్వ దస్త్రాలను, అధికారిక, అనధికారిక పత్రాలను, తత్సంబంధమైన గ్రంథాలను సేకరించాడు. నశీర్ అహమ్మద్ చరిత్రలో మరుగునపడిపోయిన ప్రముఖులను గూర్చి ఇప్పటికి దాదాపు 20 గ్రంథాలను రాశాడు.
నశీర్‌అహమ్మద్ ఏదైనా గ్రంథరచన చేసేప్పుడు తత్సంబంధమైన చారిత్రక ప్రదేశాలను స్వయంగా దర్శించిన అనుభూతితో ఆరంభించే సంప్రదాయాన్ని పాటించడంఆభినందనీయం. ఈ గ్రంథ రచనకు ముందు ఆయన శ్రీమతి రమీజాభాను సలహాతో అండమానులో పోర్టుబ్లయర్‌లో ఉంటున్న ప్రముఖ పరిశోధనాత్మక రచయిత డా॥రషీదాఇగ్బాల్, ప్రముఖ విద్యావేత్త యం.అహ్మద్‌ముజ్‌తాబాతో ఈ విషయాలు మాట్లాడారు. తాను అండమానుకు రావాలనుకుంటున్నానని వారితో చెప్పాడు. అప్పుడు కరోనా విజృంభణ వల్ల అక్కడ కూడ లాక్‌డౌన్ ప్రకటించినందున అక్కడి సంస్థలన్నీ మూతపడి ఉన్నాయనీ, వచ్చినా ప్రయోజనం ఉండదనీ, ముస్లిం స్వాతంత్య్ర సమరయోధులు’ గ్రంథ రచనకు అవసరమైన సమాచారం, ఛాయాచిత్రాలు కరోనా లాక్‌డౌన్ తర్వాత వారు పంపిస్తామని గ్రంథ రచనను తక్షణమే ఆరంభించమని సూచించారట. ఆ విధంగా వారి నుంచి లభించిన ప్రేరణతో 2021 ఫిబ్రవరిలో గ్రంథ రచన ప్రారంభించాడు. తాను సేకరించిన సమాచారంతో విస్తృతంగా నోట్స్ తయారు చేసుకున్నాడు. మరింత సమాచారాన్ని అంతర్జాలం ద్వారా సేకరించాడు. అందులో లభించిన గ్రంథాల అధ్యయనం ద్వారా సరికొత్త పుస్తకాలు తెప్పించుకోవాలనే ప్రయత్నంలో మొదటి నుండి నశీర్‌అహమ్మద్‌ను ప్రోత్సహించే శ్రీఅబ్దుల్‌సత్తార్‌ఖాన్ ఐపీయస్ సహకారంతో అవి వచ్చాయి.
అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి 19వ శతాబ్ది ఆరంభంలో వచ్చిన అనేక గ్రంథాల సమాచారం అంతర్జాలం ద్వారా అందుకున్నాడు. ఆ లభించని కొన్ని దస్త్రాల పిడియఫ్ ఫైళ్లు చరిత్ర పరిశోధకులు ఇండోర్‌కు సంబంధించిన సుహైల్ అహమ్మద్ వాని సహకారంతో పాటు మిత్రుల సహకారంతో కూడా తన గ్రంథ రచనకు కావలసిన సమాచారం లభించింది. 1857 నాటి తొలి స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబానికి చెందిన ప్రముఖ రచయిత, విద్యావేత్త ఎమ్.అహ్మద్ హజితాబ్ (అండమాన్ నికోబార్ దీవులకు దగ్గరున్న పోర్ట్‌బ్లయర్) పరిచయం వల్ల చాలా సమాచారం లబించింది. 1858 లో అండమానుకు పంపించినప్రథమ స్వాతంత్య్ర సంగ్రామయోధుల చరిత్రల సమాచారం సమగ్రంగా లభించింది. అండమానులో స్ధిరపడిన 1857 నాటి స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులతో పరిచయం కలిగించి వారిని సంప్రదించే అవకాశం కూడ కల్పించారు.
అండమాను జైలు మాజీ రాజకీయ ఖైదీల వారసత్వ సంస్థకు అధ్యక్షులైన ‘అనుప్‌దాస్‌గుప్తా’ పరిచయంతో ఆయన బెంగాలీ భాషలో రాసిన సెల్యులార్ జైల్ ఇ.నిర్బసిటో బిప్లోబైడర్ అనే గ్రంథాన్ని పబ్లిషర్ నుండి తెప్పించుకున్నాడు. దాస్‌గుప్తా దగ్గరున్న తనకు అవసరమైన సమా చారాన్ని తెప్పించుకున్నాడు. తాను సేకరించిన సమాచారాన్ని అక్షరబద్ధం చేయటానికి మార్చి 2021లో ప్రారంభించాడు. ఏకబిగిన ఆగస్టు రెండో వారానికి గ్రంథాన్ని పూర్తి చేశాడు.
ఈ గ్రంథంలో సమాచారాన్ని సమయం, సందర్భాన్ని బట్టి 8 భాగాలుగా వర్గీకరించి వివరించటం సముచితంగా ఉంది. మొదటి భాగంలో గ్రంథానికి సంబంధించిన సవివరమైన నేపథ్యాన్ని అందించారు. బ్రిటీషు పాలకుల మదిలో అండమాను జైలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన అంకురించిన విధానాన్ని 1858లో అది శిక్షా క్షేత్రంగా రూపుదిద్దుకొని ఓపెన్ జైలుగా మారిన తీరు, క్రమేపి చేర్పులు, మార్పులతో 1906లో ‘సెల్యులార్ జైలు’ గా మారిన విషయాన్ని వివరించాడు. భారత స్వాతంత్య్రోద్యమంలో భాగంగా సాగిన బ్రిటీషు ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులను వివిధ సందర్భాల్లో అండమాను జైలుకు తరలించిన విషయాన్ని ఇందులో వివరించాడు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా 1942 మార్చి 23వ తేదీన అండమాను దీవులను జపాను సైన్యం ఆక్రమించుకున్నాక ఆసియన్లు మిత్రులని జపాన్ సైన్యం ప్రకటించిన తర్వాత అండమానులోని ప్రజలు, ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ సభ్యులు, భారత జాతీయ సైన్యం యోధులు గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణ మీద వారిని బలి తీసుకున్న తీరుతెన్నులను రచయిత మొదటి భాగంలో ఆర్ద్రంగా వివరించాడు.
రెండో భాగంలో 1858 మార్చి 10 వ తేదీన అండమాను చేరుకున్న 1859 నాటి తొలి భారత స్వాతంత్య్ర సమరయోధులతో పాటు అండమానుకు తరలించిన వీరుల వివరాలను పేర్కొన్నాడు. మూడో భాగంలో ‘‘ప్రజా పోరాట వీరుల శీర్షికలో’’ 1857 తర్వాత వివిధ పోరాటాల్లో పాల్గొన్న భారత వాయువ్య సరిహద్దు ప్రాంతాన్ని కార్య క్షేత్రంగా చేసుకొని ఆంగ్ల ప్రభుత్వం మీద పోరాటాలు సాగించిన వహబీ యోధులను అండమాను జైలు తరలించిన వారి జీవిత విశేషాలను సవివరంగా ‘‘ప్రజా పోరాటయోధులు’’ శీర్షికలో చెప్పారు. నాల్గో భాగంలో 1906 నుండి ప్రారంభమైన జాతీయోద్యమంలో భాగంగా సాయుధ పోరాటాల బాట సాగించిన విప్లవకారులను గూర్చి తెలిపాడు. ఐదో భాగంలో మలబారు తీర ప్రాంతలో భూస్వాములకు వ్యతిరేకంగా ఆరంభించి 1919నాటి ఖిలాఫత్ సహాయ నిరాకరణో ద్యమంలో ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిని ‘మలబారు మోప్లా మొనగాళ్లు’ శీర్షికతో పేర్కొనటం ఔచిత్యంగా ఉంది. ఆరో భాగంలో స్వాతంత్య్రోద్యమంలో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి సెల్యులార్ జైలుకు వెళ్లిన స్వాతంత్య్రం సమరయోధుల వివరాలను ‘పోరాట యోధులు’ శీర్షికలో వివరించాడు. ఇందులో 1942 మార్చి 23 నుండి 1945 ఆగస్టు 15వ తేదీ వరకు అండమాను దీవులను తన ఆక్రమణలో ఉంచుకున్న జపాన్ సైన్యం గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న నెపంతో అండమానువాసులను, భారతీయ సైన్యాన్ని, ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ సభ్యులను ఉరిశిక్షలకు, సామూహిక కాల్చివేతకు బలిచేశారు.
ఏడో భాగంలో జపాన్ సైన్యాల కిరాతకత్వానికి బలైన ‘సమరయోధులుఅమరవీరులు’ శీర్షికలో వివరించటం ఔచిత్యంగా ఉంది. ఎనిమిదో భాగంలో 1858 నుండి 1945 వరకు అండమాను తరలించిన వారిలో 25 మంది సమరయోధుల జీవిత విశేషాలను, వారి రేఖా చిత్రాలను పొందుపరచి ఈ గ్రంథాన్ని ముగించటం సముచితంగా ఉంది. తొమ్మిదో భాగంలో గ్రంథ రచనలో ఉపయోగించిన ఆధార గ్రంథాలు
పత్రికలు, సమాచార సేకరణలో సహకరించిన మిత్రలుకు ధన్యవాదాలు తెలిపాడు. నశీర్‌అహమ్మద్‌కు బాల్యంలో ప్రాణం పోసిన పాలతల్లి స్వర్గీయ గురజాల యశోదమ్మకు (1931`2011) ఈ గ్రంథాన్ని అంకితమివ్వడం ఆయన కృతజ్ఞతా భావానికి నిలువెత్తు నిదర్శనం. మిత్రులైన దాతల సహకారంతో నశీర్ అహమ్మద్ తన ఇతర గ్రంథాల్లా అకర్షణీయమైన ఛాయా చిత్రాలతో అందంగా పాఠకులను ఆకర్షించే విధంగా ప్రచురించటం ప్రశంసనీయం. పాఠకులు, చరిత్రాభిమానులు విధిగా చదువదగిన గ్రంథం.