Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

హరివిల్లు వర్ణాల అగ్రహారపు జీవితాలు

కేరాఫ్‌ కూచిమంచి అగ్రహారం. పేరు వింటేనే దాని ప్రత్యేకత చాలామందికి అర్థమైపోతుంది. నేడు ఎక్కడో తప్ప అటువంటి పేర్లు వినపడటం లేదు. పేరు విన్నంతనే అందుండే వారి జీవితాలు కొందరికి హాస్యంగా, మరికొందరికి ఆశ్చర్యంగా, ఇంకొందరికి మూర్ఖంగా కనిపిస్తే, పైకి కనిపించని వేదనాభరిత మైనవి మరెన్నో. విషయం తెలిసిన మనసులకు ఒకింత గౌరవం, ఇంకొంత బాధ కలుగుతుంది. అర్థమయ్యే రీతిన చెప్పాలంటే అందరూ అనుకునే నవరసభరితంగా కనిపిస్తాయి ముక్కామల బుజ్జిగాడు (చక్రధర్‌)గారి ఈ కేరాఫ్‌ కూచిమంచి అగ్రహారంలోని పాత్రలు.
ఇందలి కథల్లోని పాత్రలన్నీ తెలిసినట్లే అనిపిస్తాయి. తొలి కథ ‘వేసవికాలం.. ఊరగాయల కోలాహలం.’ అగ్రహారంలోకి తొంగి చూసేవారికి అక్కడివారి తిండి మొదలుకొని అన్నిటా ప్రత్యేకంగా అనిపిస్తుంది. అగ్రహారం ఊరగాయల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఈ కథ ఆ ప్రత్యేకతను తెలియజేస్తుంది. ‘కారాల దంపుడుతో అగ్రహారంలో పండగ ప్రారంభమయ్యేది. కారాల దంపుడు ఆగ్రహారంలో సామూహిక సహజీవనం. కారాల దంపుడు ఆగ్రహారంలో మండువేసవిలో ఘాటైన మురిపెం. కారాల దంపుడు అగ్రకులాల మహిళలతో కింది కులాల మహిళల స్నేహసౌరభం.’ అంటారు. అగ్రహారంలో ఊరగాయల కోలాహలాన్ని ఇది తెలియజేస్తుంది. మరో కథ ‘అగ్నిహోత్రుడుఅల్లప్పచ్చడీ’. పేరే కొత్తగా తమాషాగా అల్లప్పచ్చడీ గురించేమోనని కొద్దిపాటి సందేహం ఉన్నా అగ్నిహోత్రుడికి ఆగ్రహారంతో ముడిపడిన అతని జీవనచిత్రాన్ని కళ్ళముందు అక్షరాల చిత్రంగా మలుస్తారు రచయిత. ఉండే నివాసం మొదలు జీవనం వరకు అంతా ప్రత్యేకతే. అగ్నిహోత్రుడు వంటమనిషి. వంటమనిషా అని పలకడంలోనే హేళన ధ్వనించే నేటితరానికి తెలిసేలా చెఫ్‌ అంటే అబ్బో అంటారన్నమాట. గాడిపొయ్యి దగ్గర గంటలతరబడి వంటచేసే అగ్నిహోత్రుడికి సైతం అంతే గౌరవం ఉంటుంది అగ్రహారంలో. శుభ, అశుభ కార్యాల్లో తనదైన ప్రత్యేక లక్షణంతో ఎవరికి ఇబ్బంది లేకుండా వంటచేసే అగ్నిహోతుడంటే అందరికి అభిమానమే. ఒక్కమాటలో చెప్పా లంటే అగ్రహారం అతను లేకుంటే చిన్నబోతుంది. అందరికి నోట్లో నాలుకలా ఉండే అతను ఒకసారి గోదావరిపుష్కరాలకని రాజమండ్రివెళ్ళి మళ్ళీ అగ్రహారంలో కాలుపెట్టలేదు. అగ్నిహోత్రుని కోసం అగ్రహారం వారు కొందరు వెళ్లి పుష్కర ప్రాంతాల్లో వాకబుచేసినా సమాచారంలేదు. అప్పుడెళ్ళినవాడు మళ్ళీరాలేదు. ఇప్పటికీ రాలేదు..అంటూ అతని జీవితానికి విషాదంతంగా ముగింపునిస్తారు రచయిత. ‘నీకు సంతోషం కలిగిందనుకో.. మీ యావిడ కళ్లలోకి సూడు.. నే కాపడతా... ఎప్పుడైనా ఏడుపొచ్చిందనుకో నీ మనిపర్సులో మీ అమ్మ ఫుటో ఉంది కదా. అది తీసి చూడు.. మళ్ళీ నే కాపడతా.. నీకు బయమేసిందునుకో నీ కూతురు సేయట్టుకో.. నీకు ధైర్యాన్నిస్తా...’ అన్న వాక్యాలతో ‘బోగం వీధి సుగుణ’ కథకు ముగింపునిస్తారు. కథలోని సుగుణలో స్నేహితురాలిని, తోబుట్టువును, అమ్మను దర్శింపజేస్తాడు రచయిత ఈ మాటల్లో. ఆమె ఎవరైనా..అతనెవరైనా..కల్మషంలేని మనసులుగా కథలో పాత్రలకు ఉత్తమస్థానమిచ్చారు. రాజకీయాలు నేడు ఓ వృత్తిగా మారాయి. కాని అసలు రాజకీయాలంటే, పాలకులంటే ప్రజలకు కష్టంలేకుండా చూసుకోవడం. వర్ణాలు, వర్గాలతో సంబంధం లేకుండా సాయంచేయడం. అటువంటి సాయమే కూచిమంచి కిష్ణుడు గారు చేసేది. కథలో రిక్షా వర్కర్ల సమస్యపై రిక్షాస్టాండ్‌ దగ్గర నేలపై మౌనంగా కూర్చోవడం తప్ప అంతకుమించి ఏమి చేయల. కాని ఆ విషయం అలా..అలా.. ఆ విషయం ఎంత దూరమంటే ఎంఎల్‌.ఎ. సైతం కల్పించుకునేంత. చివరకు తన తప్పిదంపై ఎస్‌ఐ క్షమాపణ కోరుతూ వివరణ ఇస్తాడు. మరొకరైతే ఆ విషయాన్ని ఘనవిజయంగా భావించుకుంటారేమోగాని ‘కిష్ణుడుగారు ఓ నవ్వు నవ్వారు. ఎస్సై భుజం మీద తట్టాడు. ఆ నవ్వులో విజయం కాదు... మనిషి మీద ప్రేమ కనిపించింది. అధికారం కాదు... అందరూ బతకాలనే ఆశ కనిపించింది. మనుషులంకదా... మనుషుల మీద ప్రేమ...జాలి ఉండాలనే సందేశం వినిపించింది.’ అంటారు రచయిత. ఆ తర్వాత రాజకీయంగా కొన్ని సంఘటనల అనంతరం పట్టుబట్టి అమలాపురం పట్టణ ఛైర్మన్‌గా ఎన్నికైన కిష్ణుడు గారు ఓ సంఘటన తర్వాత ఒకసారి తనబండిపై వస్తూ అకస్మాత్తుగా మరణిస్తాడు. ఆ మరణం తర్వాత అక్కడి వాతావరణం మారిపోతుంది. రాజకీయాలకు నిజమైన అర్థంచెప్పి ప్రజలమనిషిగా చరిత్రను తిరగరాసిన కూచిమంచి కిష్ణుడు మరణించాడు. అలా ఆయన కథ విషాదంగానే ముగుస్తుంది. పేరుచూసి అన్ని అగ్రహారం కథలే అనుకోనక్కరలేదు. అగ్రహారంలోని కుటుంబాలతో ఇతరుల స్నేహానుబంధాన్ని చదవవచ్చు. అందరికి అసామాన్య జీవితాలుగా కనిపించే అగ్రహారంలోని జీవితాలు.. అందరిలా సామాన్య జీవితాలే. కొన్ని తెరిచిన జీవితాలు, మరికొన్ని మూసిన గుప్పెట జీవితాలు..అలాగే అనిపించే, కనిపించే కథల మాలిక ఈ కేరాఫ్‌ కూచిమంచి అగ్రహారం కథలు. వనమాలి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img