Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అగ్రశ్రేణి అభ్యుదయ కవి అనిసెట్టి

డా॥పి.వి.సుబ్బారావు, సెల్‌: 9849177594

అనిసెట్టి అభ్యుదయ కవిగా, అభ్యుదయ కవితా ఉద్యమ సారథిగా ప్రసిద్ధులు. శ్రీశ్రీ చెప్పినట్లు ‘‘అనిసెట్టి, ఆరుద్రలు అభ్యుదయ కవితా ఉద్యమానికి అ, ఆ’ లు. అభ్యుదయ కవుల ఆశయం సమసమాజ స్థాపన. శ్లిష్ట్లా, శ్రీశ్రీల భ్రావంతో అనిసెట్టి, ఆయన మిత్రులు రెంటాల, కుందుర్తి, ఏల్చూరి, వంటి వారి కవితా దృక్పథం అభ్యుదయం వైపుకు మళ్లింది. అభ్యుదయ కవులంతా తమ రచనల్లో సామ్యవాద ధోరణి ప్రదర్శించారు.
అనిసెట్టి సుబ్బారావు అక్టోబరు 23 వ తేదీన 1922 లో నరసరావుపేటలో సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఆదిలక్ష్మమ్మ, కోట్లింగం. ఆయన పాఠశాల విద్యాభ్యాసం నరసరావుపేట మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో సాగింది. కుందుర్తి, రెంటాల, మాచిరాజు దేవి ప్రసాదులు ఆయన సహాధ్యాయులు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం, స్వామి కేశవతీర్థలు ఆయన సీనియర్‌ విద్యార్థులు. అనిసెట్టి 1941 లో గుంటూరు ఏ.సి కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. 1941 నుండి 1947 వరకు అనిసెట్టి వివిధ పత్రికల్లో ప్రచురించిన కవితా ఖండికల్లో కొన్నింటిని ‘అగ్నివాణ’ కవితాసంపుటిగా (1949) ప్రచురించాడు. దానితో పాటు సోమసుందర్‌ వజ్రాయుధం, ఆరుద్ర త్వమేవాహమ్‌, దాశరథి అగ్నిధార కవితా సంపుటాలు (1949) వచ్చాయి. శ్రీశ్రీ మహాప్రస్థానం(1950), పుట్టపర్తి పురోగమనం(1951), అనిసెట్టి ప్రభావంతో రెంటాల సంఘర్షణ, కె.వి.రమణారెడ్డి భువనఘోష, గంగినేని ఉదయినివంటి అభ్యుదయ కవితాసంపుటాలు వచ్చాయి. ఈ సంపుటాలు ఆధారంగా ఆచార్య సి.నారాయణరెడ్డి 1.వర్గసంఘర్షణ, 2. విప్లవ ప్రబోధం, 3. యుద్ధ విముఖత` శాంతి కాముకత, 4. సమ సమాజ నిర్మాణం, 5. వీరగాథా కథనం వంటి ఐదింటిని అభ్యుదయ కవితా లక్షణాలుగా పేర్కొన్నాడు. అనిసెట్టి కవిత్వంలో వీరగాథా కథనం తప్ప మిగిలిన లక్షణాలన్నీ ఉన్నాయి.కార్మిక కర్షక ప్రబోధం వంటి అంశాలున్నాయి. అభ్యుదయ రచయితల సంఘం 1943 లో తాపీ ధర్మారావుగారి అధ్యక్షతన తెనాలిలో జరిగిన తొలి మహాసభల నుండి 1947 లో పి.వి. రాజమన్నార్‌ అధ్యక్షతన జరిగిన నాల్గో మహాసభ వరకు కార్యవర్గ సభ్యుడిగా చురుకైన పాత్ర నిర్వహించాడు. అనిసెట్టి కవిత్వంలో అభ్యుదయ కవితా లక్షణాలను విశ్లేషించడమే ప్రస్తుత వ్యాస ముఖ్యోద్దేశం.

  1. వర్గ సంఘర్షణ: వర్గ పోరాటానికి కార్మిక కర్షకాళిని ప్రేరేపించడం ద్వారా వర్గ సంఘర్షణతో సమ సమాజం సిద్ధిస్తుందని అనిసెట్టి ఆశయం. అగ్నివీణకు పీఠిక లాంటి కవితలో ‘‘నరబలిలో చిరపీడనలో/ గుడిలో యంత్రపు దోపిడిలో/ హతులౌ పతితుల ప్రాణ జ్వాలలతో/ లోకపు చీకటి కన్ను తెరుస్తూ/ నూత్న మానవుని కూపిరి పోస్తూ/ అసత్యహింసల ద్వేషిస్తూ/ సమధర్మం స్థాపిస్తూ/ నర బలిలో హతులైన వాళ్లు, చిరకాలపు పీడనలో యంత్రపు దోపిడీలో పతితులైన వాళ్ల ప్రాణ జ్వాలలతో లోకపు చీకటిని పారదోలుతానంటాడు. అసత్య హింసలను ద్వేషిస్తూ సమధర్మం స్థాపిస్తానంటాడు. కవి దృష్టిలో సమధర్మం సమ సమాజమే. సమాజపు అట్టడుగున పడి నలుగుతున్న అధోజగత్సహోదరులకు, వారికి అండగా నిలిచిన అజ్ఞాత వీరులకు అభినందన సందేశమే తన అన అగ్నివీణ సంగీతమంటాడు. అగ్నివీణలో ‘‘వచ్చాను వచ్చాను వ్యాస సంతతి వాణ్ణి’’ ఖండికలో సమ సమాజ స్థాపనకు ప్రళయ రుద్రునిలా విజృంభిస్తూ ‘పగిలించి రణభేరి పద్మవ్యూహము త్రెంచి/ శివమెత్తి విస్ఫు లింగములు చిమ్ముతూ లేచి/ ఈ జగతిలో నూత్న జగతిని పెకలిస్తాను’’అంటాడు. సమ సమాజ స్థాపనను అడ్డుకొనే ఫ్యూడల్‌వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి యుద్ధభేరిని మోగించి పద్మవ్యూహాన్ని ఛేదించి విస్ఫులింగాలు చిమ్ముతానంటాడు. ఈ జగతిలో నూత్న జగతి అనిసెట్టి దృష్టిలో సమసమాజమే. వర్గ పోరాటానికి కూడు లేని గూడు లేని దీనులైన సోదరులను పురికొల్పుతూ ‘‘లేవరా! లేవరా! కూడులేని సోదరా!/ లోకపు సిరి సంపదలకు మనకూ హక్కుందిరా/ లోకపు సౌందర్యానికి మనకు హక్కుందిరా!’’ అంటాడు. లోకంలో ప్రజలంతా సమానమే. సమాజంలో గాలి, నీరు, భూమి అందరివి. కానీ సంఘంలో కొందరు స్వార్థపరులైన ధనికస్వాములు అక్రమంగా, అన్యాయంగా గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. తినడానికి తిండిలేని, సోదరులతో కవి మమేకమై లోకపు సిరిసంపదలపై, లోకపు సౌందర్యంపై మనకు హక్కుందని తిరుగుబాటు చేయమని ప్రేరేపిస్తాడు.
  2. వీరావేశంవిప్లవ ప్రబోధం: అనిసెట్టి పారతంత్య్ర ఛేదనం, స్వాతంత్య్ర సాధనకు వీరావేశంతో విప్లవ ప్రబోధ గీతం రాశాడు. శత్రువులైన బ్రిటీషు వారిని తరిమి కొట్టేందుకు, పురాదాస్యాన్ని పోగొట్టేందుకు ‘‘పుడమి నిండ నీ నెత్తురు/ పుష్కలముగ చిమ్మరా!/ పురాదాస్య పరాభవము/ పూర్తిగా కడిగేయరా!’’ భరతమాత దాస్య విముక్తికి రక్తాన్ని చిందించమన్నాడు. పురాదాస్య పరాభవాన్ని రక్తంతో కడిగేయమని వీరావేశంతో ప్రబోధించాడు. ప్రజల హక్కులను హరించి బందీలుగా చేస్తున్న బందిఖానాలను బ్రద్దలు కొట్టమని వీరావేశంతో..‘‘ఉక్కు బంది ఖానాలను/ ముక్కలు చేయాలిరా! గడియసేపు కాలమాపి/ గత కాలం మార్చరా..’’ అంటారు పామరుల శిరస్సులతో బంతులాడే పాలకులను ప్రగతి చక్ర ఘట్టనతో సంహరించమంటాడు.
  3. యుద్ధ విముఖతశాంతి కాముకత: శాంతి కాముకుడైన అనిసెట్టి యుద్ధాలను నిరసించాడు. యుద్ధం వల్ల జరిగే అపారనష్టాన్ని, వ్యయాన్ని ధనపు మూల్యంతో లెక్కకట్టలేమని మేధావులు పేర్కొన్నారు. సంపన్న దేశాలు కోట్లాది రూపాయలు వెచ్చించి అణు బాంబులు తయారుచేస్తున్నాయి. న్యూట్రాన్‌ బాంబులువంటివి మనిషిని హింసించి చంపుతాయి. 1945 వ సంవత్సరం ఆగస్టు ఆరో తేదీన అమెరికా జపాన్‌ నగరాలైన హిరోషిమా, నాగసాకీ పట్టణాల జనశ్రేణులపై అణుబాంబులను పేల్చింది. ఎవరికీ తెలియకుండా అమెరికా రహస్య పాటవ పరీక్షగా ప్రయోగించిన అణుబాంబులవల్ల లక్షలాదిప్రజలు, అమాయకపు శిశువులు దారుణ మారణకాండకు బలై పోయారు. ఎందరో శాశ్వత వికలాంగులయ్యారు. ఈ బీభత్సకాండ ప్రపంచ ప్రజలందరినీ కదిలించింది. తెలుగు కవుల్లో హృదయ సౌకుమార్యం గల శాంతి కాముకుడైన అనిసెట్టి మాత్రమే ఆర్ద్ర హృదయంతో స్పందించి 1945 అక్టోబరు ప్రతిభలో అణుబాంబు పేరిట సుదీర్ఘ కవితను రాశాడు. తర్వాత అణు సంగీతంగా మార్చి ‘కల్పన’ కవితా సంకలనంలో (1953) చేర్చాడు. ఈ కవితా ఖండికను సోమసుందర్‌ ప్రశంసిస్తూ ‘‘హిరోషిమా నాగసాకి సంఘటనతో చలించిన తెలుగుకవి అనిసెట్టి ఒక్కడే ‘అణుసంగీతం’ ఆలాపించాడు. ఆంగ్ల కవయిత్రి ఎడిత్‌సిట్‌వెల్‌ ‘‘ది అటామిక్‌ ఏజ్‌’’ అనే గొప్పకవిత రచించింది.ఆ దారుణ మారణకాండపై ప్రత్యక్షంగా రచింపబడినవి నేనెరిగి నంతవరకు ఇవే చిరస్మరణీయమైనవి’’ అన్నాడు. అనిసెట్టి అణుబాంబులను ప్రయోగించే మానవుణ్ణి నిశితంగా నిలదీస్తూ ‘‘మానవుడా నీకు హక్కు లేదు మానవాభ్యుదయ చరిత్రను కళంకితం చేయబోకని కళంకితం’’ చేయబోకని హెచ్చరించాడు. ‘‘గుప్పెట ఇమిడే బాంబుతో గుప్పెడు బూడిద చేయకుమని’’ బాంబులను ప్రయోగించే మానవుణ్ణి వేడుకొంటాడు. శాంతి కాముకుడైన అనిసెట్టి అభ్యుదయ రచయితందరిలో శాంతిప్రియత్వానికి అగ్రతాంబూలమిచ్చాడు.స్వాతంత్య్రోద్యమంలో ప్రజల్లో మమేకం చెంది ‘‘నేను గూడ! నేను గూడా నడుస్తాను/ శాంతి కొరకు! జగతి దాస్యం ముక్తి కొరకు / శత్రుసేన తుత్తినియలు చేసేందుకు నేను గూడా నడుస్తాను’’` అంటాడు. అనిసెట్టి శాంతి ప్రియత్వం దాస్యాన్ని భరించడం కాదు. దాస్యాన్ని ఛేదించిన పారతంత్య్రాన్ని పటా పంచలు చేసిన పిదప శాంతిని నెల కొల్పడం ఆయన ధ్యేయం. ఆయన శాంతి మూకాభినయం ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లీషు, రష్యా, చైనా వంటి భాషల్లోకి అనువదించబడి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది.
  4. గత నిరాసం (చారిత్రక దృక్పథం): అభ్యుదయ కవి గతాన్ని గుడ్డిగా విశ్వసించడు. ఆలోచనాత్మకంగా అవలోకిస్తాడు. విమర్శనాత్మకంగా విశ్లేషిస్తాడు. చరిత్రగతిలో హఠాత్పరిణామాన్ని అంగీకరించడు. సామాజిక ప్రయోజనం లేని గత చరిత్రల గమనాన్ని అభ్యుదయ కవులు నిరసించారు. అవి కేవలం శుద్ధ చరిత్రలు. మనకున్న చరిత్రలు దాదాపు ఈ కోవకు చెందినవే. సమాజంలో వ్యక్తుల కన్నా సమాజానికే చరిత్రలో ప్రాధాన్యం ఉండాలని ఎమిలీబరన్స్‌ చెప్పారు. ఇంతవరకు నడిచిన గత చరిత్రంతా వర్గ పోరాటాల చరిత్రేనని మార్క్స్‌, ఏంగెల్స్‌లు అభిప్రాయ పడ్డారు. అభ్యుదయ కవులంతా గత చరిత్ర గమనాన్ని తీవ్రంగా గర్హించారు. శ్రీశ్రీ దేశ చరిత్రలో ఖండికలో ‘‘నరజాతి చరిత్ర సమస్తం/ పరపీడన పరాయణత్వం/ గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళులతో’’అంటాడు. యుద్ధంలో రక్త ప్రవాహాన్ని, కన్నీటిమయ గాథలను శ్రీశ్రీ నిరసించాడు. అనిసెట్టి కూడా గత చరిత్ర గమనాన్ని నిరసిస్తూ ‘‘నరజాతి చరిత్ర క్రిక్కిరిసిన/ ప్రళయ సమర సంఘర్షణ/ జారిన వీరులరక్తం/ ఆరని వనితలదుఃఖం’’ అంటాడు. గత చరిత్రలో యుద్ధాల్లో జారి ప్రవహిస్తున్న వీరులరక్తం, వీరులమరణంతో ఆరని దుఃఖాగ్నితో అలమటిస్తున్న రాణుల స్థితి మానవతా దృష్టితో ఆలోచిస్తే మనసులు ద్రవించిపోతాయని అనిసెట్టి గత చరిత్ర గమనాన్ని తీవ్రంగా నిరసించాడు. దాశరథి వంటి వారు కూడా గత చరిత్ర తీరును నిరసించాడు. అనిసెట్టి కవిత్వంలో కార్మిక కర్షక ప్రబోధం ద్వారా వారిని వర్గ పోరాటానికి పురికొల్పి సమ సమాజ స్థాపనకు ప్రేరేపించాడు. అభ్యుదయ కవితా లక్షణాలన్నీ అనిసెట్టి కవిత్వంలో పుష్కలంగా ఉన్నాయి. అనిసెట్టి 1979 డిసెంబరు 27వ తేదీన మరణించినా అభ్యుదయ కవితాప్రియుల హృదయాల్లో చిరస్మరణీయుడు.
    (అనిసెట్టి సుబ్బారావు శతజయంతి సందర్భంగా)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img