Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అభివ్యక్తి కవితాంతరంగశక్తి

మనసులోని భావాలకు రెక్కలు తొడిగితే కవితావిహంగమౌతుంది. అందంగా, బహు చందంగా ఆ రెక్కలు తొడగడమే అభివ్యక్తీకరణ. భావాలను తావిని రువ్వే పువ్వులుగా వికసింపజేస్తే కవితోద్యానమవుతుంది. వాసంత సుమధుర దరహాసంలా ఆ పువ్వులను పూయించడమే అభివ్యక్తీకరణ. కవితావస్తువు సామాన్యమైనదైనా అభివ్యక్తీకరణ తెస్తుంది దానికి నిండుదనం, హుందాతనం. అప్పుడు అవుతుందది అసామాన్యం. అది అక్షరాలను చెక్కి శిల్పసౌందర్యాన్ని పోతపోసి హృదయనేత్రాలను అబ్బురపరుస్తుంది. భావం మేఘమైతే తొలకరి అభివ్యక్తి. అప్పుడే వర్షధారలు సమృద్ధిగా కురిసి కవిత్వపు భూమి సస్యశ్యామలమవుతుంది. హృదయోద్యానాల నిండా పచ్చని అనుభూతులు పరచుకుంటాయి. కవిత్వపు రాత్రిని అభివ్యక్తి వెన్నెల వెలుగులతో నింపుతుంది. అభివ్యక్తి కవిత్వపు అంతరంగాన్ని అనంతంగా చాటిచెప్పే బృహత్‌ శక్తి. కవిత్వపు దీపాన్ని వెలుగుతో నింపే చమురు అభివ్యక్తి. అలలు తోడైతే సముద్రం హొయలు బోయినట్టు అభివ్యక్తి తోడైతే కవిత్వమూ హొయలుబోతుంది. అభివ్యక్తీకరణకు మెరుగులు దిద్దాలంటే కావాలి కవి హృదయానికి సాధన, శోధన, జీవితం పట్ల ఆరాధన. కవితాతత్వానికి నిండుదనాన్ని తొడిగి కవిత్వం పట్ల మనిషి మమకారాన్ని పెంచుతుంది. కవిత్వసారాన్నిపంచుతుంది. అందుకే కవిత్వానికి అభివ్యక్తి అంటే ఎంతో మమకారం.
‘చంద్రుడు ఇరుసుగా జీవితం తిరుగుతున్నప్పుడు
పూలు చర్చించుకునేవి
ఈ వసంతం ఎప్పుడు వచ్చిందని
అశ్రువు ఇరుసుగా జీవితం తిరుగుతున్నప్పుడు
శిశువులు చర్చించుకుంటున్నారు
ఈ జన్మ ఎందుకు వచ్చింది’
(‘శేషేంద్ర చమత్కారికలు’ నుంచి)
అంటాడు గుంటూరు శేషేంద్రశర్మ. ఎంత అందమైన, అద్బుతమైన అభివ్యక్తీకరణ ఇది!? వైరుధ్యం కనిపించే రెండు వేరువేరు దృశ్యాలను కవిత్వంగా అభివ్యక్తీకరిస్తున్నాడు కవి ఇక్కడ. అందులో ఒక దృశ్యం ఆనందానికి సంకేతమైతే మరో దృశ్యం విషాదానికి సంకేతం. ఇరుసు లేకపోతే చక్రం తిరగదు. చక్రానికి కేంద్రబిందువు ఇరుసు. పూల ఆనందమయ జీవితాలకు ఆనందానికి ప్రతీక అయిన చంద్రుడు కేంద్రబిందు వయ్యాడు. చంద్రోదయవేళ వసంతమాసంలో పూలు ఉబ్బితబ్బిబ్బవుతూ ఆనందమయ జీవితాన్ని గడపడం ఒక దృశ్యంలో కనిపిస్తే కన్నీటి బిందువే పసిపిల్లల జీవితాలకు కేంద్రబిందువైనప్పుడు ఆ దుర్భర జీవితాన్ని తలచుకొని వారు కుమిలిపోవడం మరో దృశ్యంలో కనిపిస్తుంది. సుఖదుఃఖాలు ఇరుసులుగా జీవితచక్రం తిరగడం అందమైన అభివ్యక్తీకరణ. ఇక్కడ రెండు వేరువేరు సందర్భాలలో ఆ సందర్భాలకు తగినట్టుగా ఆలోచనలు మారిపోయాయి. వాతావరణాలు మారిపోయాయి. అమితమైన దుఃఖాన్ని ప్రకటించేందుకు అశ్రువు ఇరుసుగా మారిపోయిందనడం శక్తిమంతమైన అభివ్యక్తీకరణ.
‘తాను డెబ్బైవసంతాల
వయసు మీదేసుకున్న జీవనది
కాలం చేసిన గాయంతో/తనిప్పుడు ఒంటరిపాయలా
మా వీధిలోని/ఇంటినుంచి ఇంటికి ప్రవహిస్తుంటుంది
అనుభవాన్నంతా
భుజానికెత్తుకున్నటు వంగిన నడుము
ఎండిన డొక్కలతో
పూటపూటకు ఆకలిగండం గట్టెక్కడానికి
ప్రతి ఇంట్లో/ కంచాల గిన్నెల్లో తాను మెరుపై మెరుస్తుంటుంది
బండలపై మకిలీనే కాదు
బండబారిన మనసుల్ని తుడిచేస్తుంటుంది
ఒక ఉత్తరమై
గుండె తలుపుల్ని తడుతుంది’
(‘జీవనదిలా’ ఖండిక నుంచి)
నిత్యజీవితంలో ఎంతోమంది బ్రతుకులతో మమేకమైపోయే ఒక వృద్ధురాలైన పనిమనిషి జీవనచిత్రాన్ని ఆమె పనితనపు కార్యదీక్షకు గౌరవం కల్పించేదిశగా హృదయంగమైన అబివ్యక్తీకరణతో ఆవిష్కరిస్తాడు ఈ. రాఘవేంద్ర. ఇక్కడ అభివ్యక్తీకరణ వృద్ధమహిళ జీవన పార్శ్వాల లోతుల్ని మనముందు నిలిపింది. ఆ పార్శ్వాలలో నిత్యచైతన్యశీలి అయిన జీవనది కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ శ్రమనెరుగక ఆమె ఇంటింటికీ ప్రవహించే పాయ అయి పోతుంటుంది. ఆమె నడుమును వంచేసిన అనుభవమూ కనిపిస్తుంది. ఆకలివేసినప్పుడల్లా ఆమె కంచాల గిన్నెల్లో ఆకలిని తీర్చే ఆనందం వంటి మెరుపైపోతుంటుంది. మురికి పేరుకుపోయిన బండల్ని శుభ్రం చేయడమే కాదు కరడుగట్టిన మనసుల్నీ తుడిచేసేంత మహత్యం కలది ఆమె జీవనశైలి. ఇంకా ఆమె హృదయంగమైన అక్షరాల్ని తొడుక్కొని గుండె గుండెను తాకే ఉత్తరమూ అయిపోయి తలుపులు తడుతుంది. అందుకే అమె కవిత్వమై పోయింది. ఆ కవిత్వానికి అభివ్యక్తీకరణ తోడైతే అది అనుభూతుల, ఉద్వేగాల ప్రవాహమై కదులుతుంటుంది. అది హృదయతంత్రులపై ఎన్నెన్నో జీవనరాగాలను పలికిస్తూవుంటుంది.
-డాక్టర్‌ కొత్వాలు అమరేంద్ర, సెల్‌: 9177732414

Previous articleదినం
Next articleబతుకంటే

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img