Friday, April 19, 2024
Friday, April 19, 2024

అభిశప్త కథలు విశ్లేషణ

డా॥వెలువోలు నాగరాజ్యలక్ష్మి రచించిన అభిశప్త కథలు కల్పించిన కథలు కావు. వాస్తవాలను కథలుగా అల్లిన కథలు. అయితే ముగింపులన్నీ వాస్తవాలు కాదు. వాస్తవాలయితే బాగుండుననిపించేవి కొన్ని, ఆలోచింపచేయటానికి, అంశం మనసుకి హత్తుకునేలా చేయటానికి, కొన్నిటిని అలా ముగించాల్సి వచ్చాయి. కొన్ని నిజంగా కూడా అలా జరిగినవి.
ఒక రచయిత్రిగా, ఒక సమాజ సేవికగా బాలల వెతలని రచనలుగా, వారికి మిగిలిన సమాజం అండగా ఉండాల్సిన అవసరం తెలియచేయటానికి చేసిన రచనే ‘అభిశప్త’ కథలు. ఒక స్త్రీ జీవితంలో వివిధ దశలన్నీ నేటి రోజులలో కథా వస్తువులుగా తీసుకోవాల్సిన సామాజిక సమస్యలుగా మారటం నిజంగా దురదృష్టకరం. భూమి మీదకు రాకుండా చేయటానికి భ్రూణ హత్యల నుంచీ, పసిపాపగా బాల్యంలో రక్షించటం, కౌమారంలో మోసపోకుండా చూడటం, వివాహ సందర్భంలో, వైవాహిక జీవితంలో గృహ హింస, వృద్ధాప్యంలో పోషించాల్సినంత వరకు సమస్యలే! అయితే అభిశప్తలో బాల్య కౌమారాల్లో ఆడపిల్లల గురించేగాక బాల్య జీవితంలో మగపిల్లల దైన్యాన్నిగురించి కూడా చాలాగంభీరమైన అంశాలను రచయిత్రి కథా వస్తువులుగా స్వీకరించారు. అటువంటి కథలే మబ్బులు వీడిన సూర్యుడు, అమ్మ దొరికింది, ప్రస్థానం, వెలుగుదారి, మసకబారిన బాల్యం, ఈ పాపం ఎవరిది?మొదలైనవి! మొత్తం 22 కథలు మూడు విభాగాలు చేయవచ్చు. ముఖ్యంగా ఆడపిల్లల సమస్యలలో రచయిత్రి ఈ పుస్తకానికి పేరుగా పెట్టిన అభిశప్తలో శిరీష అనే హెచ్‌.ఐ.వి ఉన్న దంపతుల బిడ్డ కథే! తల్లిదండ్రులను కోల్పోయి పనిమనిషిగా పదిహేనేళ్ల వయసులో కామాంధులకి ఆటవస్తువై హెచ్‌.ఐ.వి పాజిటివ్‌గా బాలల సంరక్షణ సమితి ద్వారా వసతి పొందుతుంది. తననిలా చేసిన వారికి కూడా తన జబ్బుని అంటిస్తానని లేఖ రాసి వెళ్లిపోవటాన్ని కథా వస్తువుగా రచయిత్రి మొదటి కథగా అందించారు. హెచ్‌.ఐ.వి వచ్చి వ్యభిచార వృత్తి చేసేలా ఒక శిరీష కోమలమైన ముగ్ధ బాలిక నిర్ణయం సమర్ధించటం కాదు రచయిత్రి ఉద్దేశ్యం. శిరీష మనసులో హాలాహలాన్ని, ఆ మనసులోని ఆవేదన, ఆక్రోశం, ఆవేశాలను వ్యక్తం చేయాలనే! వయసు రావటమే శాపంగా అభిశప్త శిరీష చిన్న వయసులోనే రోగాన్ని మోస్తూ మనుషుల పట్ల విశ్వాస గౌరవాలు లేని అశాంతితో పరిపక్వత లేక సమాజానికి హాని చేయాలనుకోవటం ముగింపుగా చూపారు. ఇలా వాస్తవికంగా జరిగే అవకాశం ఉంది. ఇందువలన ఎన్నో కుటుంబాలు శిరీష వలన మరొక స్త్రీ ఆమె భర్తవాళ్ల పిల్లలు అన్యామవటం ఇవన్నీ ఊహిస్తేనే భయంకలిగించేఅంశాలు. పరిస్థితులచే కామాంధులచే శపించబడిన శిరీష మరెంతమంది కాముకుల కుటుంబాలను శపించాలను కోవటం ‘నిష్ఠుర వాస్తవాలు’ లో విహారిగారన్నట్టు అంతర్వీక్షణావసరమైన సశేష ప్రశ్న! ప్రపంచ వ్యాప్తంగా మాఫియాగా మారిన పసివాళ్లను అపహరించి యాచకులుగా చేయటమనే గంభీరమైన సమస్యను చూపిన కథ వెలుగు దారి. తండ్రి తల్లిని చంపే దృశ్యం చూసిన ఆనంద్‌ మనసుకి కలిగిన గాయాన్నుంచీ కోలుకునేలా చేయటాన్ని ‘మసకబారిన బాల్యం’ కథలో వివరిస్తారు. పిల్లలు లేని దంపతులు ప్రభుత్వ నిబంధనలతో అనాధ బిడ్డలను దత్తత తీసుకుని ఆనందాన్ని పొందటం జీవనజ్యోతి కథలో ఫోస్టర్‌ కేర్‌ ద్వారా బిడ్డని పొందిన పద్మ, కృష్ణమూర్తిల కథ అనుబంధంలో చూస్తాము. ఇక విధివశాత్తూ బిడ్డ తప్పిపోయి రెండు పుష్కరాల తర్వాత కలవటం అమ్మ దొరికిందిలో కరోనా కారణంగా వైద్య వసతిలేని దైన్యాన్ని విధి, బతుకుబండి నడపలేక కరోనాతో నలిగిపోయిన కథలు కూడా రచయిత్రి ఇందులో చేర్చారు. ‘లక్ష్యం’ కథ బాలల సమస్యల్లో అతి ఘోరమైనది. నాగరిక సమాజానికి సవాలుగా నిలచిన ‘‘బాల్య వివాహం’’ గురించి వివరించిన రచయిత్రి పిల్లలే చట్టం గురించి తెల్సుకుని 18సంవత్సరాల కన్నా ముందు పెళ్లి చేసుకోకూడదని సూచిస్తారు. అన్ని కథల్లో సునంద పాత్ర ప్రభుత్వమందించే బాలల సంరక్షణ కేంద్రం ద్వారా బాలలకందే అనేకాంశాలను తెలియచేస్తూ కథలను రచించటం అభిశప్త కథలన్నిటినీ ఏకగుచ్ఛంగా చేసి చూపటం ఏ రచయిత్రి ప్రతిభతో పాటు సమాజానికి బాలల పట్ల అందించగల వివిధ సాయాలను ప్రభుత్వ శాఖల గురించిన అంశాలను కూడా తెలియచేస్తారు. అంతేకాదు, హాయిగా బాల్యం గడపలేని అనేక సమస్యలతో సతమతమవుతున్న బాలల వెతలను తెలియచేయటంలో రచయిత్రి కృతకృత్యులయ్యారు. ఆమె కలం నుంచి మరెన్నో సమాజానికి అవసరమైన రచనలు రావాలని ఆశిస్తున్నాను.
అభిశప్త, రచన: డా॥వెలువోలు నాగరాజ్యలక్ష్మి,వెల:రూ.100/`
ప్రతులకు: డా॥వెలువోలు నాగరాజ్యలక్ష్మి, ఫ్లాట్‌నెం: 301,1వ లైను, రామన్నపేట, గుంటూరు.సెల్‌:9394113848.
డా॥వేమూరి సత్యవతి, సెల్‌: 9885136308

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img