Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అమృతానందాలు!

ఎగరేయండి! ఎగరేయండి!
ఇంటింటిపై జెండా ఎగరేయండి!
ఎగరేయండి! ఎగరేయండి!
దేశమంటే మట్టికాదోయ్‌!
దేశమంటే మనుషులోయ్‌!
ఈ రెండు లైన్లు జెండా దిమ్మ
నుదిటిపై కొత్తగా రాయించండి.
కాకుంటే నాదో కండిషన్‌…
మేకిన్‌ ఇండియా కాదు రంగుడబ్బా
మేడ్‌ ఇన్‌ ఇండియా కావాలి.
జెండాకు కట్టే దారం నైలాన్‌ వద్దు.
స్వదేశీ జూట్‌ మిల్లు తయారీ తేవాలి,
జెండాలోకి గుప్పెడు పూలు కావాలి.
ప్లాస్టిక్‌ పూల విషం వెదజల్లొద్దు.
నీ చేతితో పెంచిన గులాబీ మొక్కలవో
వీధిలో మీ చేతుల్తో పాదు చేసి నీళ్లు పోసి
పెంచిన తురాయి పువ్వులో అయి ఉండాలి.
ఎగరేయండి! ఎగరేయండి!
ప్రతి ఇంటా ఓ జెండా ఎగరేయండి!
ఏ అప్పులూ లేని మీ సొంత ఇంటిపై మాత్రమే
సగర్వంగా జెండా ఎగరేయండి.
ఇళ్ళు లేనోళ్లంతా ఇళ్లు కావాలని
మీ మెడలో ఒక బోర్డు తగిలించుకొని
ఎగరేయండి! జెండా ఎగరేయండి!
కౌలు భూములు కానీ, తాకట్టులో లేని
మీ సొంత పొలంగట్లపై కూడా ఎగరేయండి!
ఒక్కసెంటైనా భూమి లేని వాళ్లంతా
గుంపులు గుంపులుగా వెళ్లి
ఊరికి ఉత్తరాన స్మశానంలో ఎగరేయండి.
దింపుడు కల్లంలో నిలబడి
75 ప్రదక్షిణలు చేయండి.
దేశమంటే మట్టికాదోయ్‌!
జెండాకు సెల్యూట్‌ చేయండి.
దేశమంటే మనుషులోయ్‌!
అంటూ గురజాడ గీతాన్ని బిగ్గరగా ఆలపించండి.
జెండా గాల్లో ఎగిరితేనే సరిపోదు మిత్రమా!
జనం గుండెల్లో కూడా ఎగరాలి.
ఎగరేయండి! ఎగరేయండి! జెండా ఎగరేయండి!
ఉసూరుమంటున్న ఐడిపిఎల్‌
మొండి గోడలపై ఎగరేయండి.
పనిలోపనిగా పాడుబడ్డ
ఉస్మానియా హాస్పిటల్‌పై మొలచిన
మర్రి చెట్టుక్కూడా ఒక జెండా కట్టండి.
మర్చిపోకండి సార్లూ….
మీ కాన్వాయ్‌ ఆ దారిన పోయేటప్పుడు
ఒక్కసారి తలెత్తి చూడండి.
రంగు లేక వెలవెల బోతున్న
బిఎస్‌ఎన్‌ఎల్‌ బిల్డింగ్‌ పై కూడా
రంగుల జెండా ఎగరేయండి.
ప్రజలారా!
మీ రక్తం చెమటలతో నిర్మించుకున్న
రైల్వేస్టేషన్లలో బస్టేషన్లలో రోడ్ల పొడవునా
రైలు పట్టాలకటూ ఇటూ
రక్షణ జెండాలు ఎగరేయండి!
వందేళ్ల సంబురాలదాకా బతకనిస్తరో లేదో
ఇంటింటా ప్రతిజ్ఞ చేసి రక్షించుకుంటామని
వందల జెండాలు ఎగరేయండి!
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ముందు
ఉక్కు సంకల్ప జెండా ఎగరేయండి!
నవరత్నాలను కాపాడుకుంటామని
9అడుగుల పోరాట జెండాలెగరేయండి!
అమ్ముడుపోని ధాన్యపు రాశుల ముందు
రైతు తలపాగా జెండాగా ఎగరేయండి.
ఆ నిరసన జెండాలో …
నవధాన్యాలూ మూటగట్టి ఎగరేయండి.
మరోవందేళ్లు విత్తనాల్ని కాపాడుకుంటామని.
ఎగరేయండి! ఎగరేయండి! జెండా ఎగరేయండి!
నదులమీదా సముద్రతీరాల పొడవునా
అడవిలో చెట్టు చెట్టుపై ఎగరేయండి!
రేపటికి ఏవి మిగులుతాయో
ఏవి కనుమరుగవుతాయో.
ప్రతి చెట్టుకి కాపలాగా పెట్టండి జెండాకర్రను
ఎగరేయండి! జెండాను ఎగరేయండి!
అన్నింటికన్నా దేశభక్తితో…
అగ్నివీరుల ఆధునిక చేతులతో
ఆకాశమంత ఎత్తు జెండాలు దేశ
సరిహద్దుల పొడవునా ఎగరేయండి!
ఎగరేయండి జెండా ఎగరేయండి
కనిపించకుండా పోయిన చెరువుల జ్ఞాపకార్థం
స్మారక స్తూపాలు కట్టి వాటి పలకలపై
‘ఇక్కడ ఒక ఆకుపచ్చని సమాజం ఉండేది’
అని రాసి పక్కనే ఒక జెండా ఎగరేయండి!

మర్చిపోకండి మిత్రమా! మర్చిపోకండి.
బలవన్మరణానికి బలైన లక్షల రైతులను
మనసునిండా స్మరిస్తూ రెండు నిమిషాలు
మౌనం పాటించడం మర్చిపోకండి.
ఎగరేయండి జెండా ఎగరేయండి
మూతబడ్డ ప్రతి స్వదేశీ ఫ్యాక్టరీ
పొగ గొట్టాన్నీ వెతికి తెచ్చి
పేరు పేరునా సంతాపజెండా ఎగరేయండి.
ఉపాధి కోల్పోయిన కార్మికులంతా
ఒక నిమిషం నిశ్శబ్దంగా …
ఎగిరే జెండా ముందు నిలబడండి చాలు
బహుళజాతి బూట్లచప్పుడు వినిపిస్తుంది.
ఎగరేయండి! ఎగరేయండి!
ఇప్పుడే ఎగరేయండి!
రేపటి రోజున.. ఏదేశంలోనైనా
ఎగరవేయడానికి జెండా దిమ్మెలు
ఇళ్ళూ వాకిళ్ళు స్కూళ్ళు సినిమాహాళ్లు
శిథిలాలుగా మారచ్చు ఉక్రెయిన్‌ లా..
సామ్రాజ్యవాదుల యుద్ధాల బీభత్సాన్ని తలుచుకుని
మీ పిల్లలతో ఎగరేయించండి.
ఎగరేయండి! జెండా ఎగరేయండి!

నూరేళ్ల పండుగ నాటికి
ఎగరేయడానికి మీ చేతిలో తాడూ
మీటరు జెండాగుడ్డనూ కొనలేకపోవచ్చు
ఇప్పుడే ఎగరేయండి! ఎగరేయండి!

పది అడుగులు ఎత్తులో ఎగిరే జెండాను
డాలరు ఎనభైకి దిగిన రూపాయి సంకేతంగా
ఎనిమిదడుగులు అవనతం చేయండి!
అపుడు మీకేమనిపిస్తుంది?
నాకైతే తల తెగి నేలపై పడ్డట్టనిపిస్తుంది.

జెండా అంటే…
మూడడుగుల గుడ్డముక్క కాదని
తరతరాల ఆత్మగౌరవమనిపిస్తుంది.
దేశమంటే.. మట్టికాదని
దేశమంటే… మనుషులనీ తెలుస్తుంది.
– పినాకిని

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img