Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అమ్మకు కవితా నీరాజనం

ఈ ప్రపంచంలోనే అపురూపమైనది, అపూర్వమైనది అమ్మ. అమ్మకు ప్రత్యామ్నాయం లేనేలేదు. అమ్మకు ప్రతిరూపం లేనేలేదు. సృష్టిలో ఎన్ని అనుబంధాలు కలుషితమై పోతున్నా శతాబ్దాల మాతృత్వం మాత్రం కల్మషం లేనిది. కలుషితం కానిది. అమ్మ ఎన్నెన్నో పూల ఆత్మీయతల్ని భుజస్కంధాలపై మోసే రెమ్మ. ఎన్నెన్నో దుఃఖాలను తనలో ఇముడ్చుకొనే కన్నీటి చెమ్మ. ఆమె నవ్వు కురిపించే కాంతులు చీకటిని చిదిమేస్తూ జగమంతా పరచుకునే వెన్నెల కిరణాలు. ఆమె మాట అందించే ఆహ్లాదం పూల సరాగాలతో అలరించే మధుమాసం. అమె ఆత్మీయత వెదజల్లే చల్లదనం ఎదఎదలో రaల్లుమంటూ పారే తొలకరి గానం. ఆమె అనురాగం వినిపించే సుస్వరాల రaరి నడిరేయి సెలయేటి గలగలల సంగీత విభావరి. అనుబంధపు వులితో బ్రతుకుల రాళ్లను మహత్తర శిల్పిలా అందంగా, బహుచందంగా రూపుదిద్దుతుంది. అటువంటి అనంత పార్శ్వాలున్న అమ్మ ప్రేమకు కవిత్వమూ దాసోహమైపోతుంది. అమ్మలో పరకాయప్రవేశం చేసి తానే అమ్మ అయిపోతుంది. మనకు గోరుముద్దలు తినిపిస్తూ వెన్నెలంత అనుభూతుల్ని పంచుతుంది. అమ్మ ఆశీనురాలు కావడానికి తానే సింహాసనం అయిపోతుంది. అమ్మ తలపుల ఆత్మీయతల్ని మన మనసుల్లోకి అలవోకగా వొంపుతుంది. కవిత్వం అమ్మపాటై పొటమరిస్తుంది. 

‘నువు పాడుతుంటే అమ్మా/ అమ్మలందరూ ఒక సముద్రమై
మన ఇంటిముందుకు/ పొంగిపొరలుకుంటూరావడం
నాకు అగుపించిందమ్మా/ అమ్మా, ఇప్పుడు నీ పాట నా చిటికెన వేలికి
నువ్వు చేయించిన నీలంరాయి ఉంగరంలా/ తగులుతున్నదమ్మా’
(‘అమ్మచెట్టు’ సంకలనం నుంచి)
అంటూ అమ్మను విలక్షణ పదచిత్రాలతో కీర్తిస్తారు పైగంబర కవి దేవిప్రియ. అమ్మ పాటను ఉప్పొంగే కడలిలో దర్శించింది కవిత్వం. అమ్మ గొప్పతనాన్ని వర్ణించడానికి, అమ్మ ఆత్మీయతను బేరీజు వేయడానికి పొంగిపొరలి వచ్చే సముద్రానికి మించిన ప్రతీక ఇంకే ముంటుంది!?. ఎందరో అమ్మల కలయిక సముద్రమైతే సముద్రం ఎంత శక్తిమంతమైనది అయివుండాలి!?. ఆ శక్తిని పాలపుంతలుగా కురిపించి తానూ శక్తిమంతమైపోయింది కవిత్వం. అమ్మపాటను సముద్రం చేసినందుకు గర్వంగా తలెత్తుకొని తన ఠీవిని ప్రదర్శించింది. తన చిటికెన వేలిని అమ్మ చేయించిన నీలం రాయి ఉంగరం ఎంత ఇష్టంగా హత్తుకుంటుందో అంతే ఇష్టంగా అమ్మపాట తన హృదయాన్ని హత్తుకున్నదంటూ కవి అమ్మకు నీరాజనా లర్పిస్తాడు. ఆ నీరాజనాలతో కవిత్వం చేతులు కలిపి అమ్మకు సమున్నత గౌరవాన్ని కల్పించింది. సముద్రపు పొంగులలో అమ్మకు ఎన్నో హంగులు కల్పించింది. మాతృత్వాన్ని రంగులమయం చేసింది.
‘బానిసత్వపు అలుపెరుగని పేగుల్లోంచి/ గుండెల్ని కుతకుతలాడిరచే చెమట చిత్తడుల్లోంచి
ఆకలి ఊటలు సముద్రాలైనా యజమాని ఆజ్ఞలను పాటస్తూ/ సూర్యుడితో పోటీపడే అమ్మ
ఎన్నో దీపాల్ని కళ్లలో పెట్టుకొని చూసినా/ తనివితీరని ఓ పండువెన్నెల
జాలిని పాలించే రాజ్యాధినేత్రి…….నాలోంచి నన్ను చేదుకొని తరతరాలు
తలెత్తుకొని సెల్యూట్‌ చేసే/ అసలుసిసలైన అమ్మజెండానావిష్కరించాలి’
(‘అమ్మజెండా’ ఖండిక నుంచి)
అంటూ శ్రమజీవన సౌందర్యానికి ప్రతీకలా కనిపించే అమ్మను ఆత్మగౌరవ పతాకంగా దర్శించాలని తపిస్తారు కొమ్మవరపు విల్సన్‌ రావు. ఇక్కడ అమ్మ గుండెలోతుల్లోని ఆర్ద్రతను మరింతగా తడుముతూ ఆవేదనై వర్షించింది కవిత్వం. తరతరాల బానిసత్వాన్ని పెంచిపోషించే ఆజ్ఞలను ప్రశ్నించింది. అనంత సముద్రంలో తీరని ఆమె ఆకలి ఊటల్ని దర్శించింది. వేదనను అనుభవిస్తూనే అమ్మ విధిని నిర్వహిస్తూ చూపించే నిబద్దతను సూర్యుడితో పోల్చింది. పండు వెన్నెల లాంటి, జాలి రాజ్యానికి అధినేత్రి వంటి అమ్మఅస్తిత్వ పోరాటంలో పాలుపంచుకుంది కవిత్వం. అందుకే ఆమె పట్ల నిర్లక్ష్యం చూపిన తరతరాలే నీరాజనాలర్పించే నిలువెత్తు ఆత్మగౌరవ పతాకంగా ఆమెను ఆవిష్కరించాలని సమాయత్తమవు తోంది. కవిత్వం అమ్మ అయినప్పుడు గొప్ప వాక్యాలుగా ప్రవహిస్తూ వుంటుంది.ఆత్మీయతా జలపాతాలైపోతూ వుంటుంది. మనల్ని లాలిస్తూ ముప్పిరిగొంటుంది. కవిత్వం అమ్మలోని కమ్మదనాన్ని పాలలోని వెన్నెలా వెలికితీస్తుంటుంది. అమ్మతనానికి ఎన్నో భాష్యాలు చెబు తుంటుంది. అమ్మ ఒక పూల రుతువైతే కవిత్వం ఆమనిలా ఆమె వెన్నంటే వుంటూ మాతృత్వపు సొబగుల్ని ప్రపంచానికి చాటిచెబుతూ వుంటుంది.
-డాక్టర్‌ కొత్వాలు అమరేంద్ర , సెల్‌: 9177732414

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img