Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఆఖరిలంకె

ఆర్వీ రామారావ్‌

ఉద్యమాలను వ్యక్తులు నిర్మించరు అన్నది నిజమే అయినా ఆ ఉద్యమాలలో పాల్గొన్న వ్యక్తుల కార్యకలాపాలు చరిత్ర నిర్మాణంలో భాగం అవుతాయి. కందిమళ్ల ప్రతాప రెడ్డి జీవితం సుదీర్ఘ కాలం ప్రజోద్యమాలతో, యువజనో ద్యమాలతో, ప్రజా నాట్య మండలితో, కమ్యూనిస్టు పార్టీతో పెనవేసుకు పోయింది. ఆయనకు సంబంధం ఉన్న అంశాల చరిత్ర ఇతరత్రా అపారంగా అందుబాటులో ఉండవచ్చు. కానీ వ్యక్తిగతంగా ఆయన అనుభవాలు కూడా చరిత్ర నిర్మాణానికి ఉపకరణాలే.
కందిమళ్ల ప్రతాపరెడ్డి అడపా దడపా రాజకీయ, సాంస్కృతిక అంశాలపై రాసిన వ్యాస సంపుటి ఈ ‘‘మరవ కూడని మన చరిత్ర’’. కమ్యూనిస్టు పార్టీతో ప్రతాపరెడ్డికి సుదీర్ఘకాలంగా సంబంధం ఉంది. చాలాకాలం రాష్ట్ర నాయకత్వంలో భాగస్వామి. తెలంగాణ సాయుధ పోరాటంలో చిన్ననాటే అంటే యుక్తవయసైనా రాకముందే సంబంధం ఉన్న వారాయన. సాహిత్య రంగం లోనూ ఆయన కృషి తగినంతగా ఉంది. ప్రజానాట్య మండలి పునర్నిర్మాణం తరవాత ఆయన ఆ కార్యకలాపాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించారు. ఇలా వివిధ రంగాలలో ఆయన అనుభవాలు, జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. ఈ అనుభవాల్లో కొన్ని ఇదివరకే గ్రంథస్థమైనాయి. మిగిలిన వ్యాసాలను కూర్చి ఈ గ్రంథం సిద్ధం చేశారు.
ఏడు దశాబ్దాల కన్నా మునుపటి చరిత్రను, ఆ తరవాత వివిధ రంగాల్లో ఆయన క్రియాశీల పాత్ర గురించి రికార్డు చేయడం ఈ దశలో అవసరం. స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం ఉన్న వారి, దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారి తరం క్రమంగా వెళ్లిపోతోంది. ఆ వరసలో ప్రతాప రెడ్డి లాంటివారు అతి కొద్ది మందే మిగిలి ఉండొచ్చు. సాయుధ పోరాట స్మృతులు ఆయన జ్ఞాపకాల పేటికలో ఇంకా భద్రంగానే ఉన్నాయి. ప్రత్యక్షంగా ఆ పోరాటంలో పాల్గొన్న వారిలో చాలా మంది ఆ అనుభవాలను గ్రంథస్థం చేశారు. ఆ వరసలో ప్రతాప రెడ్డి బహుశః ఆఖరి లంకె కావచ్చు.
తెలంగాణ సాయుధ పోరాటం, ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ, ప్రత్యేక తెలంగాణ వాదం, ప్రజానాట్య మండలి, కమ్యూనిస్టు ఉద్యమ అనుభవాలు, అవరోధాలు, కమ్యూనిస్టుల ఐక్యత ఆవశ్యకత, దానికి ఎదురవుతున్న అడ్డంకులు, యువజ నోద్యమాలు మొదలైన అనేక అంశాల మీద ఆయన భిన్న సందర్భాలలో రాసిన వ్యాస గుచ్ఛం ఇది. ఈ సకల అంశాల్లో ఆయన ఏం చెప్పినా అది తెలుగు వారి, వారి సంస్కృతి, భాష, సాహిత్యం, పోరాటాల చుట్టే తిరుగుతుంది. ఈ దారి పొడవునా ప్రతాపరెడ్డి పాదముద్రలూ కనిపిస్తాయి. ఆ నడకలో తప్పటడుగులు, తప్పుటడుగులు ఉన్న వాస్తవాన్ని కప్పి పుచ్చడానికి ప్రయత్నం చేయకపోవడం ఆయన చిత్త శుద్ధికి తార్కాణం.
తెలుగు వారిది ఒకే భాష, ఒకే సంస్కృతి అయినా ఈ రెండిరటిలోనూ ప్రాంతాలనుబట్టి స్వల్పమైన తేడాలు ఉండొచ్చు. రాజకీయంగా తెలుగు వారు అన్ని వేళలా ఒకే చట్రం కింద లేనందువల్ల ఈ తేడాలు కనిపించవచ్చు. యాసలోనూ వ్యత్యాసాలు ఉండవచ్చు. కానీ అంతర్లీనంగా ఏక సూత్రతా ఉంది. తెలుగు వారు చాలా సందర్భాలలో కలిసి ఉన్నారు. మరెన్నో సందర్భాలలో విడిగానూ ఉన్నారు. ఈ తరానికి తెలుగు వారి రాజకీయ అస్తిత్వం గురించి అవగాహన బొత్తిగా లేకపోవడం చూస్తూనే ఉన్నాం. కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో భాగమని, ఇప్పుడు తెలంగాణ అంటున్న ప్రాంతం 225 ఏళ్ల పాటు నిజాం నవాబుల ఏలుబడిలో ఉండేదని, దాన్ని హైదరాబాద్‌ సంస్థానం అనే వారనీ అందులోనే కన్నడం, మరాఠీ ప్రాంతాలు కూడా ఉండేవని ఈ తరంలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయి ఏర్పడిరది ఆంధ్ర రాష్ట్రమే తప్ప ఆంధ్రప్రదేశ్‌ కాదని, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం ఆంధ్రప్రదేశ ఏర్పాటు కోసం కాదని తెలిసిన వారు దుర్భిణీ వేసి చూస్తే తప్ప కనిపించడం లేదు. ఇలాంటి వారికి 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి లీల గానూ, రెండు దశాబ్దాల కిందటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి స్పష్టాస్పష్టంగా తెలిసి ఉండవచ్చు. 1972 నాటి ప్రత్యేకాంధ్ర ఉద్యమానికీ తెలంగాణ ఏర్పడబోయే ముందు సమైక్యాంధ్ర ఉద్యమం మధ్య తేడా తెలిసిన వారిని అయితే వెతికి పట్టుకోవలసిందే.
తెలుగు వారిది సుదీర్ఘమైన చరిత్రే. అయితే తెలుగు వారు రాజకీయంగా భిన్న పాలనలో ఉన్న ఊసు, ఆ తరవాత మళ్లీ ఐక్యంగా ఉన్న వాస్తవం తెలిసిన వారు బహు కొద్ది మందే. కాకతీయుల కాలంలో తెలుగు వారు సమైక్యంగా ఉన్నారు. మళ్లీ ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడిన తరవాతే సమైక్యంగా ఉన్నారు. ప్రతాప రెడ్డి రాసిన ‘‘మరవ కూడని మన చరిత్ర’’ ఈ లోటు పూడ్చడానికి ఉపకరిస్తుంది.
తెలుగు వారి సమైక్యతకు, విభజనకు గల కారణాలను ఈ గ్రంథంలో కూలంకషంగా వివరించడమే కాక విలీనం నుంచే విభజన వాదం ఎలా పాదుకుందో సాధికారికంగా తెలియజేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలలో మొదటిది తెలుగు వారిదేనని గొప్పగా చెప్పుకుంటాం. భాష మాత్రమే ప్రజలను కలిపి ఉంచే అంశం కాదని తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో కొనసాగిన ఉద్యమాలు నిరూపించాయి. ఏ భాష మాట్లాడే వారైనా ఒకే రాజకీయ ఛత్రం కింద ఉండాలని, ఉండి తీరుతారని అనుకోవడం కుదరని పని అని నిరూపించింది కూడా తెలుగువారే.
తెలంగాణా సాయుధ పోరాటం కేవలం తెలంగాణా ప్రాంత ప్రజలదేనన్న భ్రమ చాలా మందిలో ఈ నాటికీ ఉంది. భౌగోళికంగా చూస్తే ఆ మాట నిజమే కావచ్చు. కానీ అది సత్యదూరం. కోస్తా ప్రాంతం, కోస్తా ప్రాంతానికి చెందిన రచయితలు, కళాకారులు, రాజకీయవాదులు సాయుధ పోరాటానికి నిరుపమానమైన సహకారం అందించారన్న విషయం ఇప్పటి వారికి తెలియకుండా పోయే లోటు పూడ్చడానికి ఈ పుస్తకం ఉపయోగపడ్తుంది.
ప్రత్యేక తెలంగాణ వాదం ఎందుకు తలెత్తిందో ఆయన వివరించిన తీరుకు కారణం 1969నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని, ఆ తరవాత ఈ ఉద్యమానికి విరుగుడా అన్నట్టు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో 1972లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కొనసాగడం ప్రతాపరెడ్డి కళ్లారా చూసిన పరి ణామాలే. 1972నాటి ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి కారణాలు ఈ గ్రంథంలో ఛాయా మాత్రంగా కనిపిస్తాయి. 1969నాటి పోరాట సమయంలో ప్రతాపరెడ్డి సమైక్యవాదే. కానీ రెండు దశాబ్దాల కింద మొదలైన ప్రత్యేక తెలంగాణా వాదాన్ని సమర్థించడానికి కారణాలూ ఆయన వివరించారు. ఇది కమ్యూనిస్టు పార్టీలో వైఖరిలో వచ్చిన మార్పు మాత్రమే కాదు. పరిస్థితులు వైఖరి మారడానికి దారి తీశాయి. డాదాపు రెండు దశాబ్దాల కింద మళ్లీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తలెత్తినప్పుడు 1972లో ప్రత్యేక ఆంధ్ర కావాలని ఉద్యమించిన వారు రెండో విడత సమైక్యాంధ్ర అని ఎందుకు వాదించారో అర్థం కావాలంటే ఇలాంటి పుస్తకాలు చదవాల్సిందే. మంచి పుస్తకం ఆలోచనలను తట్టిలేపుతుంది. తరచి చూడ వలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. ‘‘మరవ కూడని మన చరిత్ర’’ ఈ పనే చేస్తుంది.
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తే తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం నిరంకుశ పాలనలోనే మగ్గిపోయారు. కర్కశమైన నిజాం నిరంకుశత్వాన్ని అంతమొందించడానికి ఇక్కడి ప్రజలు ఆయుధాలు చేపట్టక తప్పలేదు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే అపురూపమైంది. ఒక వేపు సాయుధ పోరాటం కొనసాగుతుంటే కేంద్రంలోని నెహ్రూ ప్రభుత్వం 1947 నవంబర్‌ 29న నిజాంతో యథా ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ఏడాది తరవాత పరిస్థితి బేరీజు వేసి మళ్లీ ఒప్పందాన్ని పొడిగించాలనుకున్నారు. ఆ పరిస్థితి దాపురించకుండా నివా రించింది తెలంగాణ సాయుధ పోరాటమే. ఆ ప్రమాదాన్ని ఈ గ్రంథ రచయిత ఎలా వివరించారో గమనించండి: ‘‘తెలంగాణ ప్రజా పోరాటం లేకపోతే ఏం జరిగేది? యథా తథ ఒప్పందం కొనసాగి భారత దేశ నడిబొడ్డున ‘ఆజాద్‌ హైదరాబాద్‌’ఉండేదా? లేక ముస్లిం మతోన్మాదుల ఒత్తిడికి లొంగి నిజాం నవాబు హైదరాబాద్‌ ను పాకిస్తాన్‌ లో విలీనం చేసే వాడా? అలా చేస్తే భారత దేశ గుండెల మీద పాకిస్తాన్‌ భూభాగం ఉండేది! ఆ ప్రమాదాలను తెలంగాణ సాయుధ పోరాటం తొలగించింది. నాలుగు వేల మంది అమరవీరుల, వీర వనితల త్యాగాలతో ఆ ప్రమాదాన్ని నివారించింది’’ అంటారు ప్రతాపరెడ్డి. మొదటి సార్వత్రిక ఎన్నికలలో నెహ్రూ కన్నా తెలంగాణ సాయుధ సమరసేనాని రావి నారాయణ రెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చాయని ఇప్పుడు అందరికీ తెలుసు. కానీ సుంకం అచ్చాలు కు సైతం నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి అన్న వాస్తవం ప్రతాప రెడ్డి లాంటి వారు తప్ప ఎవరు చెప్పగలరు?
తెలంగాణ సాయుధ పోరాటం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగితే దాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిందని ప్రచారం చేసే వారు బయలుదేరారు. ఆ పోరాటంతో ఏ మాత్రం సంబంధం లేని వారు హైదరాబాద్‌ నిజాం ఉక్కు పిడికిలి నుంచి విముక్తమైన సెప్టెంబర్‌ 17న అట్టహాసంగా చిందులు వేస్తుంటారు. సర్దార్‌ పటేల్‌ పంపిన సేనలే నిజాం పాలన పీడను విరగడ చేశాయని వీరంగం వేస్తుంటారు. ఈ సైనిక చర్యకు ముద్దు పేరే పోలీసు ఆక్షన్‌. పటేల్‌ పంపిన సేనలు చేసిన పనల్లా సాయుధ పోరాటం తాకిడికి ఊపిరి సలపకుండా ఉన్న నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ను ఒక్క తోపు తోయడమే. కానీ అవే సేనలు కమ్యూనిస్టుల మీద ఎలా విరుచుకు పడ్డాయో చెప్పకుండా దాచేసే కుట్రలను ఈ గ్రంథం విప్పి చెప్పకపోయినా ఆ అవసరాన్ని గుర్తు చేస్తుంది.
వామపక్ష ఉద్యమం బలహీన పడ్తుండడం ఈ గ్రంథ రచయితను చికాకు పెడ్తోంది. నిజానికి కమ్యూనిస్టులు కాని వారి అభిప్రాయం కూడా అదే. వామపక్ష రాజకీయాల ప్రయోజనాన్ని కమ్యూనిస్టు వ్యతిరేకులూ గుర్తిస్తూనే ఉన్నారు. మొదటి నుంచీ ప్రభుత్వాలు అంతో ఇంతో పురోగామి విధానాలు అనుసరించడానికి వామపక్ష పార్టీలు నిరంతరం కొనసాగించిన పోరాటాలే దీనికి కారణం. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణకు కమ్యూనిస్ట్‌ పార్టీ పోరాటాలు ఎలా ఉపయోగపడ్డాయో ప్రతాపరెడ్డి సంక్షిప్తంగానైనా వివరించారు.
నాల్గవ అధ్యాయం వామపక్ష ఉద్యమాన్ని విమర్శనాత్మకంగా వివరించ డానికి ఉపయోగపడ్తుంది. వామపక్షాలు బలహీన పడ్తున్నాయని అనుకునే వారికి ఈ అధ్యాయం కచ్చితంగా నూతనోత్సాహం కలిగిస్తుంది. కమ్యూనిస్టుల ఐక్యతకు ఉన్న అవరోధాలను చర్చించి ప్రధానంగా రెండు వామపక్ష పార్టీలు విలీనం కావడానికి ఉన్న అవకాశాలను విడమర్చి కనిపించే మార్గాన్ని కూడా ప్రతాప రెడ్డి పొడకట్టించారు. ఆయన సూచన అమలు అవుతుందా లేదా అన్నది చర్చనీయాంశం కాదు. అయితే ‘‘కమ్యూనిస్టుల ఐక్యత-సమస్యలు-నేటి కర్తవ్యం’’అన్న వ్యాసంలో కమ్యూనిస్టుల ఐక్యతకు ఆయన ఆర్తి ఎంత తీవ్రమైందో ద్యోతకం అవుతోంది. ఇలాంటి అభిప్రాయం, కమ్యూనిస్టులు బలపడాలని, ఏకం కావాలని కోరుకునే వారు ఈ పార్టీలతో సంబంధం ఉన్న వారే కాదు. వామపక్షాల అభిమానులూ కాకపోవచ్చు. కానీ కమ్యూనిస్టుల ఐక్యతను జనం కోరుకుంటున్నారన్నది మాత్రం వాస్తవం. ఈ ఐక్యత సాధ్యాసాధ్యాల గురించి సవివరంగా చర్చ జరగవలసిందే. అప్పుడే ఐక్యత దిశగా అడుగేయడం సాధ్యం. ఈ ఐక్యత జనం ఆకాంక్ష అని వామపక్ష పార్టీలు గ్రహించి చిత్త శుద్ధితో కృషి చేస్తే అసాధ్యం ఏమీ కాదు అన్న భావన ప్రతాప రెడ్డి వ్యాసాల్లో అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది.
ప్రజానాట్య మండలి పునరుద్ధరణలో ప్రతాప రెడ్డి పాత్ర గణనీయమైంది. ఆభ్యుదయ రచయితల సంఘానికి ఆయన అందించిన సహకారమూ తక్కువేం కాదు. ప్రజానాట్యమండలి కార్యకలాపాల గురించి ఆయన కొన్ని అధ్యాయాల్లో ప్రస్తావించినా అందులో తన పాత్ర గురించి ఎక్కడా విశేషంగా ప్రస్తావించకపోవడం ఆయన వినయానికి, అణకువకు నిదర్శనం. ఏ ఉద్యమమైనా ప్రజల మద్దతుతోనే పురోగమిస్తుంది అన్న విశ్వాసం ఉన్న వారు కాబట్టి తన పాత్రను పనిగట్టుకుని తగ్గించి చూపించినట్టున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img