Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆరని అభ్యుదయ దీప్తి భీష్మ సాహ్నీ

భీష్మ సాహ్నీ పుట్టింది పాకిస్తాన్‌ లోని రావల్పిండీలో. మాతృ భాష పంజాబీ. చదివింది ఇంగ్లీషు. రాసింది హిందీ, ఇంగ్లీషు లో. సంస్కృతం, రష్యన్‌ భాషలు నేర్చిన వాడు. దేశానికి స్వాతంత్య్రం రావడంతో పాటే దేశం నిలువునా చీలింది. ఆ విభజన అనేక గాయాలు రేపింది. అప్పటిదాకా కలసి మెలసి ఉన్న వారే ఒకర్నొకరు అనుమాన దృష్టితో చూడడం మొదలు పెట్టారు. కత్తులు దూసుకున్న సందర్భాలూ ఉన్నాయి. దేశ విభజన హిందూ-ముస్లింల మధ్య అపారమైన విద్వేషాగ్ని రగిల్చింది. సరిహద్దుకు రెండు వేపులా రక్తం ఏరులై పారింది. మానవత గడ్డకట్టుకు పోయింది. ఈ ఘోరకలికి ప్రత్యక్ష సాక్షి ప్రసిద్ధ రచయిత భీష్మ సాహ్నీ (1915 ఆగస్టు 8 2003 జులై 11). వ్యక్తిగతంగా సౌమ్యుడు. మృదుభాషి. ఆలోచనా పరుడు. సాంస్కృతిక జీవితం లోతులు తెలిసినవాడు. స్వాతంత్య్రానంతరం భీష్మ సాహ్నీ కుటుంబం పాకిస్తాను నుంచి ఇండియాకు వచ్చి స్థిరపడిరది. లాహోర్‌ ప్రభుత్వ కళాశాల నుంచి ఎం.ఎ. ఇంగ్లీషు పట్టా పొందారు. చండీగఢ్‌ లోని పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో 1958లో పిహెచ్‌.డి. చేశారు. సాహ్నీది వ్యాపార కుటుంబం. తండ్రి ప్రోద్బలంతో కొంతకాలం వ్యాపారం చేసి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత అధ్యాపక వృత్తి చేపట్టారు. మహాత్మా గాంధీ పిలుపునందుకుని 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. దేశ విభజన సమయంలో ఆయన కాంగ్రెస్‌ లో ఉన్నారు. రావల్పిండి కాంగ్రెస్‌ కార్యదర్శిగా ఉన్నారు. 1947లో రావల్పిండీలో శరణార్థుల సహాయ కార్యకలాపాలలో పాల్గొన్నారు. 1948లో భీష్మ సహాని ప్రజానాట్య మండలి (ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ ఇప్టా) లో చేరారు. అప్పటికే ఆయన అన్న బల్‌ రాజ్‌ సాహ్ని ప్రజానాట్య మండలిలో చురుకైన కార్యకర్తగా ఉండే వారు. సోదరుడి సరసన నటనలో శిక్షణ పొంది అనేక నాటకాలలో నటించారు. నాటకాలకు దర్శకత్వం వహించారు. ప్రజా నాట్యమండలి ప్రదర్శించిన నాటకాలలో సాహ్నీ తన జీవిత భాగస్వామి షీల, కైఫీ ఆజ్మీ భార్య షౌకత్‌ ఆజ్మీతో కలిసి భూత్‌ గడి నాటకంలో నటించారు. ఈ నాటకానికి బల్‌ రాజ్‌ సాహ్ని దర్శకత్వం వహించే వారు. ప్రగతి శీల భావాలు వ్యాప్తి చేయడంలో, సాంస్కృతిక పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషించిన ప్రజానాట్యమండలిలో పని చేస్తున్న ప్పుడు బొంబాయిలో ఉన్న భీష్మ సాహ్నీ ఆ తర్వాత పంజాబ్‌ వెళ్లారు. కొంత కాలం అంబాలాలో, మరి కొంత కాలం అమృత్సర్‌ లోని ఖాల్సా కళాశాలలో లెక్చరర్‌గా పని చేశారు. ప్రజానాట్యమండలిలో పని చేస్తున్న కాలంలో ఆయన మార్క్సిజం వైపు ఆకర్షితుడై కమ్యూనిస్టు పార్టీలో చేరారు. కడదాకా సి.పి.ఐ.లోనే ఉన్నారు. బుద్ధి జీవిగానే ఆయన కమ్యూనిస్టు కారు, ఆచరణవాది. పంజాబ్‌ అధ్యాపక సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1952లో దిల్లీ చేరుకున్నారు. దిల్లీ కళాశాల (ప్రస్తుతం దిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న జాకీర్‌ హుసేన్‌ కళాశాల)లో అధ్యాపకునిగా పని చేశారు. 1956లో మాస్కో వెళ్లి విదేశీ భాషల ప్రచురణాలయంలో 1963 దాకా టాల్‌ స్టాయ్‌ కథలు, రిసరక్షన్‌ నవలతో పాటు అనేక రష్యన్‌ రచనలను హిందీలోకి అనువదించారు. స్వదేశం తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ దిల్లీ కళాశాలలో అధ్యాపకునిగా కొనసాగారు. 1965 నుంచి 1967 దాకా సాహిత్య రంగంలో గౌరవస్థానం సంపాదించిన నయీ కహానీ పత్రికకు సంపాదకులుగా ఉన్నారు.
1975 నుంచి 1985 దాకా అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటులోనూ, నిర్వహణలోనూ ప్రధాన బాధ్యత నిర్వహించిన సజ్జాద్‌ జహీర్‌ తర్వాత భీష్మ సాహ్నీ అభ్యుదయ రచయితల సంఘానికి పెద్ద దిక్కయ్యారు. ఆఫ్రో ఆసియా రచయితల సంఘానికి కూడా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ సంస్థ ప్రచురించే లోటస్‌ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. భిన్న సంస్కృతుల మధ్య సమన్వయం సాధించడానికి ఏర్పాటు అయిన సహమత్‌ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉన్నారు. హత్యకు గురైన రంగస్థల నటుడు సఫ్దర్‌ హాష్మీ స్మృతిలో సహమత్‌ ఏర్పడిరది. జీవితాంతం సాహ్నీ ఈ సంఘానికి అండగా ఉన్నారు.
వ్యాపారంలో వైఫల్యం, ప్రజానాట్యమండలితో అనుబంధం కారణంగా అనేక ప్రాంతాలలో పర్యటించడం వల్ల జన జీవితాన్ని పరిశీలించే అవకాశం రావడం, అనువాదకునిగా చేసిన కృషి, జీవితానురక్తి, సామాన్య ప్రజల హృదయ వేదనను అర్థం చేసుకోగలిగే ఔదార్యం సాహ్నీకి బోలెడు జీవితానుభవాన్ని సంతరించి పెట్టాయి. వ్యక్తిగానూ, రచయితగానూ భీష్మ సాహ్నీ స్వరం నిర్మలమైంది. హాస్య చతురుడు. సౌమ్యంగా కనిపించినా మూలుగలను తాకే వ్యంగ్యాస్త్రాలు విసరగల నేర్పు ఉన్న వాడు. గిలిగింతలు పెట్టే రీతిలో రాసి పేరు సంపాదించకుండా ఆలోచనలను రేకెత్తించే రచనలు చేసి ప్రసిద్ధుడైన వాడు సాహ్నీ. జీవితానుభవం సాహ్నీని ఉత్తమ రచయితగా దిద్ది తీర్చితే, రచయితగా ఆయన గడిరచిన అనుభవం జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన రచనలు చేయడానికి ఉపకరించింది. ఆయన కలం ఎన్నడూ ఆగలేదు. అయినా ఆ కలం పాతబడలేదు. ప్రతి రచనా నవనవోన్మేషంగానే ఉండేది. నవలా రచయితగా, కథకుడిగా, నాటక రచయితగా ఏ ప్రక్రియ చేపట్టినా అన్నింటిలోనూ మేటి అనిపించుకున్నారు. విస్తారంగా రాయడమే కాక విస్తృతమైన పాఠకులను సంపాదించుకో గలిగారు. ఆయన రచనల గురించి సామాన్యులు కూడా చర్చించగలరు. 20వ శతాబ్ది హిందీ సాహిత్యకారులలో భీష్మ సాహ్నీది చెరగని సంతకం. ప్రేమ్‌ చంద్‌, హరిశంకర్‌ పర్సాయ్‌ కి ఉన్న పాఠకాదరణ ఆధునిక సాహిత్యకారుల్లో భీష్మ సాహ్నీకి మాత్రమే ఉంది.
తమస్‌ నవల సాహ్నీ రచనల్లోకెల్లా ఎక్కువ జనాదరణ పొందింది. దేశ విభజన మిగిల్చిన గాయాలను ఆయన ఈ నవలలో చిత్రించారు. దేశ విభజన జరిగి మూడు దశా బ్దాలు గడిచిన తర్వాత తన ప్రత్యక్ష అనుభవాలను సాహ్నీ తమస్‌ నవలగా మలిచారు. దేశ విభజన రేపిన గాయాల ఆధారంగా హిందీ, ఉర్దూలో అపారమైన సాహిత్యం వచ్చింది. అందులో సాహ్నీ తమస్‌ నవల సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఈ నవలతో పాటు ఇదే ఇతివృత్తంపై సాహ్నీ రాసిన మరో రెండు కథల ఆధారంగా గోవింద్‌ నిహ్లాని తమస్‌ ఫిల్మ్‌ గా చిత్రీకరించారు. ఇది 1988లో దూరదర్శన్‌ లో ధారవాహికగా ప్రసారమైంది. దీనికి జనాదరణ ఎంత ఉందో హిందూ మతోన్మాదుల వ్యతిరేకత కూడా అంతే ఉంది. సాం స్కృతిక పోలీసు బాధ్యతను నెత్తిన వేసుకునే మతోన్మాదులు ఈ ప్రసారాన్ని అడ్డుకోవడానికి చేయని ఆగడం లేదు.
మతోన్మాదులు అన్ని మతాల్లోనూ ఉంటారని, వారు రాజకీయ ప్రయోజనాలకోసం మతాన్ని దుర్వినియోగం చేసి సమస్యలు సృష్టిస్తారని సాహ్నీ ఈ నవలలో తేల్చి చెప్పారు. దేశ విభజన మానవ జాతి చరిత్రలో విషాద ఘట్టం అని చెప్పడానికే సాహ్నీ ఈ నవల రాశారు. ఈ నవల ఇంగ్లీషు, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌ వంటి విదేశీ భాషలతో పాటు తమిళం, తెలుగు, గుజరాతి, మలయాళం, కశ్మీరీ, మణిపురి భాషల్లో కూడా వెలువడిరది. హిందీ సాహిత్యానికి పాఠకుల కొరత ఉంది అన్న సాహిత్యకారుల, ప్రచురణ కర్తల వాదనను భీష్మ సాహ్నీ రచనలన్నీ పరాస్తం చేశాయి. ఆయన సాహిత్యంలో ప్రధానపాత్రధారులు ధీరోదాత్తులు కారు. అతి సామాన్యులు. కాని ఆ అతి సామాన్యులనే ధీరోదాత్తులుగా నిలబెట్టారు సాహ్నీ. వామపక్ష ఉద్యమంతో సాహ్నీకి సన్నిహిత సంబంధం ఉండడమే కాక అందులో భాగస్వామి అయినందువల్ల, మార్క్సిస్టు భావజాలం సత్యాన్వేషణలో కాగడాగా ఉపకరించినందువల్ల ఆయన రచనలన్నీ ఉత్తమ సాహిత్య సంప్రదాయాన్ని ప్రోది చేశాయి. ఉదాత్త సాహిత్య వారసత్వాన్ని మిగిల్చాయి.
విచిత్రం ఏమిటంటే 69వ ఏట భీష్మ సాహ్నీ సినిమాల్లో నటించారు. 1984లో సయీద్‌ అఖ్తర్‌ మిర్జా దర్శకత్వం వహించిన మోహన్‌ జోషి హాజిర్‌ హో సినిమాలో సాహ్నీ నటించారు. గోవింద్‌ నిహ్లాని దర్శకత్వం వహించిన తమస్‌ టీవీ చిత్రంలో కూడా సాహ్నీ నటించారు. ఆయన నటించిన ఆఖరి సినిమా మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అయ్యర్‌ (2002). తమస్‌ కాక మరో ఆరు నవలలు, పది కథా సంపుటాలు, అయిదు నాటకాలు సాహ్నీ వెలువరించారు. బాలల కోసం కథలు రాశారు. ఆయన మొదటి రచన భాగ్య రేఖ 1953లో వెలువడితే ఆఖరి రచన ఆజ్‌ కే అతీత్‌ (ఆత్మ కథ) జీవిత చరమాంకంలో రాశారు. సాహిత్య అకాడమీ అవార్డు, సంగీత నాటక అకాడమీ అవార్డు, సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌, సోవియట్‌ లాండ్‌ నెహ్రూ అవార్డు, పద్మశ్రీ, పద్మ భూషణ్‌ సత్కారాలు సాహ్నీకి దక్కాయి. ఆయన సాహిత్యం ఎంత పరిపూర్ణమైందో జీవితమూ అంతే నిండైంది.
-ఆర్వీ రామారావ్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img