Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎవరి కోసం యీ మందహాసం?

చందు సుబ్బారావు

ఎవరి కోసమేమిటయ్యా కళాభిరుచి, రసజ్ఞత ఉన్న ప్రియుల కోసం..కళా కుమారి చిరునవ్వు అందిస్తోంది! అదేచెప్పొస్తూంది నూటికి అరవైమందికి అక్షరమ్ముక్క రాని కాలంలో రసజ్ఞత, రస పిపాసానా? ఏ రసం, నిమ్మరసమా, బత్తాయి రసమా..అనడగమా! ఒకవేళ రసం తెలిసిన వారే అయినా..వారందరి కోసం చిరునవ్వులు చిందిస్తూ ఉంటే ఏమవుతుంది. దిగంబర కవి జ్వాలాముఖి అన్నాడు ‘‘కళామతల్లి కారుణ్యాల కల్పవల్లి..కవోష్ణాల వడ్డీ కిచ్చి కళాసేవ బురద జల్లి కంపు గొట్టు కళఅకారుడికి షష్టిపూర్తి’’... ఆ ముసలి మొసళ్ల కోసమా మన కళా కుమారి చిరునవ్వులు చిందించాలి..? ప్రతి యువతకీ తన సౌందర్యం ఎవరి కివ్వాలి అనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. సంవత్సరాల తరబడి ఆలోచిస్తుంది. ఆధునిక కళాకుమారి కూడా అలానే తర్కించాలి. వందల సంవత్సరాలు విజ్ఞానానికి, విజ్ఞతకూ, రసజ్ఞతకూ దూరంగా నిలబడ్డ ఆ మనిషి కోసం చూడబోతే సమాజంలో అన్నిరకాల సేవలకూ, ఉత్పత్తులకూ, సరదాలకూ అందరి సంతోషాలకూ అతనిదే కృషి. పందిళ్లు వేసి తోరణాలు కట్టేది అతనే. మైకులు బిగించి కుర్చీలు అమర్చేది అతనే. ప్రతి కళా కార్యక్రమానికీ హంగులు కూర్చేది అతనే..ఆ తర్వాత ‘ఎస్పీబాలు’ సంగీతమైనా, సభారంజని నృత్యమైనా, వేణుమాధవ్‌ మిమిక్రీ అయినా పీసపాటి వారి పాటల హోరయినా, ఆతను కేవలం శ్రోత. ప్రేక్షకుడు.. లేకుంటే కేవలం మంచినీళ్లందించే యువనేత. కార్యక్రమానంతరం ఆనంద పానీయాలమర్చే ఔత్సాహిక సేవక భ్రాత! వారి కోసం కళామతల్లి ఏం చేయగలదుఏం రాయగలదు ఏం పాడగలదు..ఏం ఆడగలదు.
ఇలానే చాలా కాలం అనుకున్నార్లెండి. కాకపోతే సినిమా పరిశ్రమ కొత్త విప్లవానికి కారణమైంది. సినిమా ప్రేక్షకులు అంతా నూటికి తొంభయి పాళ్లు నేల, బెంచీల వాళ్లయ్యారు. ఆదాయాలన్నీ వారి చిరిగిన జేబుల నుంచేనని గ్రహించారు. అప్పుడు వారి నుండి సంగ్రహించ టానికి, వారిని వెర్రెత్తించటానికి, పరుగులు తీయించటానికీ, రోజుకు మూడు, నాలుగాటలు వేసి కలెక్షన్లు లెక్కించుకోవటానికి వారికి తెలిసిన భాష, కదిలించే కథా ఘోష, నవ్వించే నడకల స్క్రిప్టూ, కవ్వించే పాటల వేటా మొదలైంది. అప్పటికే గ్రామాల వీధులకూ పల్లెలకూ చేరిన ‘ప్రజానందకర సామగ్రి’ సినిమాల్లో గుప్పించటం మొదలైంది. ఆల్‌ఫ్రడ్‌ డగ్లస్‌ అనే ఆంగ్ల మహాకవి అన్నట్లుగా ‘‘లండన్‌లో రాత్రిపూట ఎగసిపడే దీపాలు, ఆ నగర యువతి వక్షోజాలు మాత్రమేఅందుకే నాకు వాటిపై ప్రేమ’’ అన్నాడు. అదిగో అందుకోసం మనవారి మందహాసాలు కూడా రూటు మార్చాయి. అంటే, రసగ్రహీతలనే పెద్ద మాటలెందుకు లెండి..‘నన్ను దగ్గరకు తీసుకోగల పురుషుడు’ అన్న భావన కళామతల్లి హృదయంలో బాగా నాటుకు పోయింది. ‘‘సలలితరాగ ఘల్లుమన.. కరకంకణములు గలగలలాడగ..పతిని కోరి పడి రతీదేవి దుఃఖితమతిjైు రోదించగా’’ అన్నప్పుడు సగటు ప్రేక్షకుడు తలవంచుకుని ప్రక్కకు తప్పుకోక తప్పదు కదా. పండిత ప్రేక్షకులకీ చాలా సేపటికిగాని ఎక్కదులెండి. పండిత ప్రేక్షకుడు టిక్కెట్‌ కూడా కొని చావడు. విఐపి పాస్‌లు ఎక్కడ దొరుకుతాయా అని చూస్తాడు. రాగాపోగా ఆ రోజు కష్టంలో పెళ్లాంబిడ్డలకు తిండికి పోను మిగతాది సినిమా నేల టికెట్‌, దొరక్కపోతే కుర్చీ టిక్కెట్‌ కొనుక్కో వలసిందేనన్న తీర్మానంతో ఉంటాడు. ‘‘నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే, వారి బుగ్గల నిగ్గునీకువచ్చిచేరెను తెలుసుకో’’ అని ఆత్రేయ అనగల్గుతాడు. మేడలో కులుకు తున్న కుర్రదానా..ఆ మేడ కట్టిందెవరు. జిలుగు వెలుగుల చీరె కట్టిన చిన్నదానా.. జిలుగు వెలుగుల చీరె శిల్పం ఎలా వచ్చెనో తెలుసునా..అర్ధాకలితో ఉన్న నేతగాళ్లు నెత్తురూ, కండలూ కరిగించి నేసిన వస్త్రమది తెలుసుకో అంటున్నాడు. కవితా మందహాసం ఎవరికి చేరాలో విడమర్చి చెప్పాడు. ఆ పాటను చూసి మురిసిపోలేదు సుమండీ! కార్మికులు, చేనేత శ్రామికులూ వారికెప్పుడూ శ్రమపయినా, ఉత్పత్తి పైనే ధ్యాస! ‘క్వాలిటీ’ పైనే ఆశ!తాను సైతం గట్టి వాణ్ణనిపించుకోవాలన్న కోర్కె పేరొందినవారే వేతనాలపై కూడా దృష్టి ఉండదు. గమనించండి జాగ్రత్తగా! ఈ అల్లిన బుట్ట, యీ చేసిన కుండ, యీ నేసిన చీరె, యీ కట్టిన గోడ, యీ వేసిన పంట అందంగా అందరూ మెచ్చే విధంగా ఉండాలన్నదే ఆ అమాయకుడి ఆవేదన!తాను సైతం సమాజంలో అతి ప్రాధాన్యం గల జీవి అనిపించుకోగలననే ఆవేదన. ఉత్పత్తి కేవలం రూపవిస్తృతి కాదు. కళాభిరుచి ది ఆర్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ శ్రామికుల చేతివృత్తుల్లో ఉన్నంతగా పెద్ద నటుడు, చిత్రకారుడు, గాయకుడు కవీశ్వరుల్లో నిత్యం నృత్యం చేయడు. పదివేల పాటలు రాసిన కవిగారు, ఇరవైవేల పాటలు పాడిన బాలూగారు, ప్రతిరోజూ తన కార్యక్రమానికి చెమటోడ్చారని చెప్పలేం. అవలీలగా, సునాయాసంగా రాజేయగలరు. పాడేయగలరు. బాలూ రోజుకు నాలుగు పాటలు రికార్డు చేసిన సందర్భాలున్నాయట! అలాగే చేతి వృత్తులను లెక్కగట్టగలమా. చేనేత కార్మికుడు ఒక చీరెను పదిరోజులు నేసేవాడు. (ఈనాటికీ!) యాంత్రిక యుగం కథను మార్చి వేసిందిలెండి. కొత్త సమస్యలు, కొత్త యత్నాలు ఆదాయాలు` వనరులు తలెత్తాయి. కానీ, నేటికీ నానా తిప్పలు పడుతున్న చేతివృత్తులూ, సామాన్య శ్రామికులూ వందలూ వేలల్లో ఉన్నారు. వారి చెమట బిందువులు సంతోషించేటట్లుగా కళామతల్లి చిరునవ్వులు ఉండాలని మన ఆవేదన. ఉండేటట్లు మన కళాకారుల్ని హెచ్చరించాలన్నది మన ఆశయం!
వ్యాస రచయిత సెల్‌: 9441360083

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img