Friday, April 19, 2024
Friday, April 19, 2024

‘‘కవితా వధూటి కంటి తడి – కాలం వెలిగించుకున్న కొడి!’’

మందలపర్తి కిషోర్‌

శ్రావణాంబర మేఘావరణములోన రంగురంగుల మేలి తోరణము లేల దిగ్వధూ చరణారుణ దీప్తిలోన ఏ లలిత హృదయేచ్ఛ మేలుకొనును?’’ అనే పద్యం రాసేనాటికి అబ్బూరి వరద రాజేశ్వరరావు వయసు పదకొండేళ్ళు మాత్ర మే. 1933 నాటికి భావ కవిత్వం కోడెవయసులో వుందని చెప్పాలి! ఆనాటి భావ కవులందరూ – ఎవరో అన్నట్టుగా – ‘కృష్ణ పక్షమే వహించివున్నారు! మెరుగు కళ్ళజోళ్ళు, గిరజాలు సరదాల ఆ సుందర సుకుమారుల మధ్యలో బాలకవిగా భాసిల్లినవాడు వరద. దాదాపు అర్ధశతాబ్దం పాటు కవిత్వం రాసిన వరద కేవలం భావకవిగా మిగిలిపోలేదు. ఆ మాటకొస్తే, ఆయన ప్రతి సాహిత్య వుద్యమంతోనూ – ఏకకాలంలోనే- అభిన్నంగానూ, అలీనంగానూ కొనసాగారు. తన జీవితకాలంలో తలెత్తిన ప్రతి సాహిత్య ధోరణినీ, ముందు కుతూహలంతోనూ – ఆ పై ఆసక్తితోనూ పరిశీలించిన సాహిత్యైకజీవి వరద. అభ్యుదయ సాహిత్యానికి తెలుగునాట బీజావాపనం చేసిన అబ్బూరి రామకృష్ణరావుగారి కుమారుడైన వరద – కృష్ణశాస్త్రి, విశ్వనాథ, శ్రీశ్రీ, శిష్ట్లా, ఏల్చూరి, బెల్లంకొండ, తిలక్‌, రా.వి.శాస్త్రి, ఆరుద్ర, బూదరాజు, చేకూరి- ఇలా తరతరాల సాహిత్యజీవులతో బాంధవ్యం పెనవేసుకున్నారు. వాస్తవానికి వరద సాహిత్య మూర్తిమత్వం యాభయ్యేళ్ళపాటు నిత్య-నిరంతర పరిణామ శీలంగా రూపుదిద్దుకుంటూ వచ్చింది! ఆ గతిశీలతే, ఆయన మూర్తిమత్వానికి అంత నిండుదనం, సమగ్రత తెచ్చిపెట్టింది. దానికి తోడు మరో లక్షణం కూడా వరదలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాని గురించి కాస్త వివరంగా మాట్లాడుకోవలసిన అవసరం వుంది.
‘‘కవిత్వం విధ్వంసక కారణ విచ్ఛేదన, కవిత్వం నిత్య సౌందర్యారాధన’’ అంటూ ఓ నిర్వచనం చెప్పారు వరద. ఈ నిర్వచనంలో మనకి కవి కన్నా పండితుడే – లాక్షణికుడే – ప్రస్ఫుటంగా కనిపిస్తాడు. అలాగని, వరద తక్కువ కవేం కాదు! ఒక్కమాటలో చెప్తే ఆయన ఓ పండితకవి, లేదా కవిపండితుడు. ప్రపంచంలోని ప్రతి నాగరిక దేశంలోనూ పండిత కవులూ కవిపండితులూ కనిపిస్తారు. రుగ్వేదంలోని మూడో మండలం – దాదాపు మొత్తంగా- రాశాడని చెప్పే విశ్వామిత్రుడు గాయత్రి (సా విత్రి) లాంటి ఛందస్సులను కూడా సృష్టించాడని అంటారు. అలాంటి వాళ్ళ కారణంగానే వైదిక సంస్కృతంలో ‘‘కవి’’ అనే మాటకి రుషి అనే అర్థం స్థిరపడినట్లుంది. ఇక , క్రీస్తుకు పూర్వం ఏడు-ఆరు శతాబ్దాలకి చెందిన ప్రాచీన గ్రీకు కవయిత్రి శాఖో కూడా సొంతంగా రూపొందించుకున్న ఛందస్సుల్లోనే గీతాలను రాసివుండడం చూస్తే, ఆమె పాండిత్యం తన కవిత్వకళకు ఏమీ తీసిపోదని అర్థమవుతుంది. కాగా, క్రీ.పూ. అయిదు-నాలుగు శతాబ్దాలకి చెందిన తొలి గ్రీకు విషాదాంత నాటకకర్త ఈస్టిలస్‌ డెబ్బై నుంచి తొంభై వరకూ నాటకాలు రాశాడు. మహా విద్వాంసుడై వుంటే తప్ప ఈస్టిలస్‌ అలాంటి నాటకాలు అన్ని రాయలేడని పండితులంటారు. సంస్కృతం విషయానికి వస్తే, క్రీస్తు శకం రెండో శతాబ్దానికి చెందిన అశ్వఘోషుడు, నాలుగయిదు శతాబ్దాలకి చెందిన కాళిదాసు, ఆరో శతాబ్దానికి చెందిన భారవి, ఏడో శతాబ్దానికి చెందిన బాణుడు, ఎనిమిదో శతాబ్దానికి చెందిన భవభూతి – మాఘుడు, వారిద్దరికీ మధ్యకాలంలో వాడని చెప్పే దండి, తొమ్మిదో శతాబ్దానికి చెందిన రాజశేఖరుడు, 14-15 శతాబ్దాలకి చెందిన విద్యాపతి, పదిహేడో శతాబ్దానికి చెందిన జగన్నాథ పండితరాయలు, 19-20 శతాబ్దాలకి చెందిన కొక్కొండ వెంకటరత్న ‘శర్మ, కందుకూరి వీరేశలింగం – వీళ్ళందరూ కవిపండితులే, పండితకవులే!! విశాఖలో వరద కళ్ళారా చూసిన మారేపల్లి రామచంద్ర శాస్త్రి అనే ‘కవిగారు’, మద్రాసులో చూసివుండే అవకాశమున్న మానవల్లి రామకృష్ణ కవిగారు కూడా అదే బాపతు. సాహిత్య సామగ్రి వరకూ, వరదకూ – ఇక్కడ చెప్పుకున్న కవిపండితులకూ పెద్ద తేడా వుండకపోవచ్చు కానీ, జీవన దృక్పథం విషయానికి వస్తే వరద, సంప్రదాయం బాగా తెలిసిన అత్యంత ఆధునికుడు. ఆయన కవిత్వంలో అడుగడుగునా ఈ విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే వుంట అంది.
‘‘అనుపశ్య యథాపూర్వే ప్రతిపశ్య తథాపరే, సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివ అజాయతే పునః’’ (పూర్వికులు ఎలా ప్రవర్తించారో పరికించు- భావితరాల వారెలా ప్రవర్తించనున్నారో గమనించు- పైరుపండి రాలినట్లు ముసలిjైు లయించు జీవిబీ వచ్చేదొక కొత్తకారు, పండేదొక కొత్త పైరు!) అంటూ నచికేతుడు కరోషనిషత్తు లో చెప్పిన మాటల్ని, పాతకాలం పండితకవివరేణ్యులు కొన్ని వందలసార్లు ఉట్టంకించివుంటారు.
కానీ, ‘‘దిక్కులేని జనులకు, తెలుపు కనని కనులకు, పురాతనం మంచిది, పురోగమనమెందుకు?’’ అని వాళ్ళెవరూ అనలేదు- వరద మాత్రమే అన్నారు! అలా అనగలగడానికి అవసరమయిన ఆధునిక దృక్పథం ఆయనకే వుంది!! ‘‘కవీ, వేడి కన్నీళ్ళు చిలుకు – స్తవం మాని వాస్తవం పలుకు’’ అని పాతకాలపు పండిత కవులెందుకంటారు? ‘‘రుణం కన్న దారుణం లేదు’’ అనాలంటే ఆధునిక దృక్పథం ఉండి తీరవలసిందే! ‘‘అంతము లేని యీ భువనమంతయు నాకు పరాణ్ముఖమ్ము’’ అని, 1948లో, వరద అన్న మాటలు వింటే 1926నాటి ‘‘కవి కోకిల’ దువ్వూరి పద్యం గుర్తుకు వచ్చి తీరాల్సిందే! అయితే, ఉమర్‌ ఖయ్యామ్‌ రుబాయత్‌కి వరద ‘చెరకాలం’ ఎంత భిన్నం! ‘‘వెర్రి కేకల చీర విప్పదు చీకటి నే’’డని వరద చూపించే వరదహస్తం, ఏ ప్రాచీనకాలపు పండితకవి చూపించగలడు?? ‘‘వినిపించిన ప్రతి భయంకరరావం, కనిపించిన ప్రతి విపత్కరజీవం, వికసించని నరమేధస్సున కతీతమయి, విరిసె నిలా తలంలోన మహాదైవమయి’’ అనడానికి చారిత్రక దృక్పథం వుండి తీరాలని ప్రత్యేకించి చెప్పాలా? ‘‘మంత్రాల మహిమవల్ల నడచిన గతం, యంత్రాల వలె నడుస్తుంది ప్ర స్తుతం’’ అని పలికించిందీ అదే చారిత్రక దృక్పథం. ఇరవయ్యో శతకం, ఇరవై దశకంలో పుట్టిన పండితకవి వరదకూ- పాతకాలపు కవిపండితులకూ భేదం ఇదే.
వరద గురించి మాటాడే సందర్భంలో, ఆయన హాస్య చతురత గురించి మౌనం వహించడం అసాధ్యం. ఆక్సిజెన్‌ మీద వున్నప్పుడు సైతం, పేషెంటు బతికి బట్టకట్టడానికి ‘విల్‌ పవర్‌’ ఒక్కటీ చాలదు- ‘బిల్‌ పవర్‌’ కూడా వుండాలని చమత్కరించగలగడం వరదకే సాధ్యమని పిస్తుంది. కరోనా సంక్షోభం సందర్భంగా పదే పదే రుజువైన కఠోర సత్యమిది! ‘‘బ్రహ్మజ్ఞానులొస్తున్నారు బట్టగుడ్డలు భద్రం’’ అనే సాంప్రదాయిక ఛలోక్తిని పేరడీగా కొనసాగిస్తూ ‘‘మహానాయకులొస్తున్నారు మనీపర్సులు భద్రం’’ అన్నారు వరద! రాజకీయ నాయకులు ఏమారి వున్నప్పుడు వాళ్ళ మీద చాటుమాటుగా నాలుగు బండరాళ్ళు దొర్లించి పారిపోయే పిరికి గుండె మనిషి కాదు వరద! ఎంతమంది రాజకీయులతో -వ్యక్తిగత స్థాయిలో- ఎంతటి స్నేహ సంబంధాలున్నా, మన మహానాయకుల గురించి అనవలసిన మాట అనితీరే స్థైర్యం, ధైర్యం ఆయన సొంతం! సతీమణి ఛాయాదేవితో కలిసి వరద సంకలించిన ‘‘కవిత’’ తొలిసంపుటిని, ‘మనసులో కవి’ ఆ నాటి మహానాయకుడు నెహ్రూకే అంకితమిచ్చిన సంగతి మనకి తెలుసు. పీ.వీ. నరసింహారావు, కోట్ల విజయభాస్కర రెడ్డి తదితర మహా నాయకులు మరెందరో ఆయనకు సన్నిహిత మిత్రులు! ఆయన శిష్యకోటిలో కూడా మహానాయకులు మరెందరో వున్న సంగతి అందరికీ తెలిసిందే! అటువంటి ‘‘భవబంధాలకు’’ అతీతంగా జీవించలేని అతిసామాన్యుడు, అలాంటి వ్యాఖ్యలు చేసి ఒప్పించడం కష్టం!
పదకొండు వందల సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రలో, ఆధునిక సాహిత్యం వాటా గట్టిగా ఇరవయిశాతం కూడా ఉండదేమో! దానికే పరిమితమయి పరిశీలిస్తే, ఆధునికయుగంలో ఓ పిడికెడంత మందే అరుదయిన ‘‘వ్యక్తులు’’ కనిపిస్తారు. వాళ్ళల్లో అబ్బూరి రామకృష్ణరావు, వాళ్ళబ్బాయి వరద రాజేశ్వరరావు కచ్చితం గా లెక్కలోకొస్తారు! ‘చెరకాలం’గానీ, ‘సామిథేని గానీ, వరద నాటకాలు గానీ, ‘కవన కుతూహలం’గానీ, ‘వరదకాలం’గానీ, ‘వరదోక్తులు’గానీ- ఏ పుస్తకం మళ్ళీ చదివినా యురేకా స్పిరిట్‌ తో ఏదో మాటాడాలని అనిపించడం ఖాయం. దాని ఫలితమే ఈ నాలుగు ముక్కలూను! అవును- అనుక్షణ నవీన మోహిని వరదాక్షరి!!
వ్యాస రచయిత సెల్‌: 8179691822

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img