Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కవిత మౌలిక రూపం ఏమిటి?

ఎవడేనా హెచ్చులు మాట్లాడుతుంటే ‘ఇహ చాల్లే కయిత్వం సెప్పక’ అంటారు. ఏదైనా అసంగతులు అతిశయోక్తులు మాట్లాడుతుంటే ‘ఓయబ్బ క‘పి’త్వం సెబుతున్నాడండీ’ అంటారు. కపిత్వం అంటే కోతి పలుకులన్న అర్థం ఉందని వాళ్లకు తెలియకపోవొచ్చును. తీవ్రమైన భావ సంచలనం వచ్చినపుడు, మనిషి మాటలు సాధారణ స్థాయి దాటి కనిపిస్తాయి. పాపం తన భావానికి ఫోర్స్‌ ఇవ్వాలన్న తపనే తప్ప ‘కవిత్వం’ చెప్పాలని ఎవడికీ ఉండదు. నిజానికి బర్ట్రండ్‌ రస్సెల్‌ కవిత్వాన్ని చిన్న నిర్వచనంలోకి తేవాలన్న తపనతో ‘బెస్ట్‌ వర్డ్స్‌ ఇన్‌ దెయిర్‌ బెస్ట్‌ ఆర్డర్‌’ అన్నాడు కాని, అది కేవలం మేధావి అయిన కవి ప్రయత్న పూర్వక విజయమే అవుతుంది. ఏమయితేనేం, ఇది సాధారణ ఆలోచన కాదుసాధారణ భాష కాదు. వ్యక్తి ఏదో ఆవేశానికి, తన్మయత్వానికీ తపనకూ గురయ్యాడు అని తెలిసిపోతుంది. కాదూ..‘ఇదిగో భోజనం అయిపోయింది ఇపుడు కవిత్వ రచనకు కూచుంటున్నాను’ అన్నాడనుకోండి. ఆ కవిత్వం అడుక్కుతిన్నట్లుంటుంది. సినిమాల్లో ప్రేమ పాటలు, ప్రేయసీ ప్రియుల తన్మయత్వాలు వందలు వింటుంటాం కానీ, ఎప్పుడూ మనలో చలనం కలగదు. కారణం అది ‘నటన’ అని మనకు తెలుస్తూనే ఉంటుంది. నాటి నటీనటులు నాగేశ్వరరావు, సావిత్రిరామారావు అంజలీదేవి, జగ్గయ్య కృష్ణకుమారి కళా ఖండాల్ని సృష్టించారు. మనం కూడా చూచి తన్మయత్వం చెందాం. అంత వరకే. శత దినోత్సవాలు జరిపి శతాధిక ప్రశంసలందించారు. అంతవరకే..అంతేకాని వారి భావాలతో ఏకత్వం ప్రకటించలేదు. అవి మనల్ని కదిలించలేదు. మనల్ని ఆనందపరిచాయి. నిజమే. అందుకే మనమెపుడూ వారిని ప్రశంసించాం కాని, ‘అహో సావిత్రీ, నీవు పార్వతి అయితే నేను దేవదాసుని, అహో ఎన్టీఆర్‌, నీవు కృష్ణుడివైతే నేను సత్యభామను. నన్ను కూడా అలా ఓదార్చవా అని అడగలేదు. కారణం కళా దర్శనం వేరు. స్వీయానుభూతి వేరు. కవిత్వం స్వీయానుభూతి నుండి తప్ప కళాభిరుచి నుండి వెలువడదు. స్వీయానుభూతి..ఓకే. ఎల్లవేళలా నీ జీవితం నుండే రానక్కరలేదు. ప్రక్కవాడి నుంచి, ఎదుటివాడి నుంచి, భార్యా పిల్లల నుంచి, మిత్రుల నుంచి, సహచరుల నుంచి రావొచ్చును. ‘‘కార్మిక వీరుల కన్నుల నిండా గలగలలాడే కణకణమండే విలాపాగ్నులకు విషాదాశ్రులకు’’ అని కవి రాసినపుడు ఆ కవి ఫాక్టరీ ఓనరూ, పెట్టుబడిదారుడూ కాదు. నిజానికి అవి చూసాడో లేదో కూడా చెప్పలేం. ‘కానీ విన్నారు. పసిగట్టాడు..చదివాడు..హృదయంలో అదిమాడు..అవి చలించి, జ్వలించి తిరుగుబాటు ప్రకటించి బయటకొచ్చాయి. అంతే..అందులో అనుభూతి పలుకుల రూపం మాత్రమే ప్రధానం. ఫిలిప్‌ లార్కిన్‌ అనే ఆంగ్ల కవి (1945) అతి సాధారణమైన కవిత్వం రాశాడు. ఒకచోట.
‘‘ఒంటిగంటకు సీసా ఖాళీరెండు గంటలకు చేతి పుస్తకం మూత ప్రేమికుల ప్రేముడి విడివడ్తుంది మూడిరటికివిడిపోయి పడుకుంటారు నాలుగింటికి మందపవనాలు చీకటిపై దాడి..నామంలేని గుహపై నాదంలేని నది దాడి’’ అని ఆగిపోయాడు. మొదటి నాలుగు చరణాలు కేవలం వార్తా విశేషం. అందరూ ఎరిగిందే. ప్రేమికుల ముడి సైతం తెలియని వారుండరు. మద్యపానానంతరం సంగమ విశేషం సంతోష సశేషం అనికూడా ఎరిగిన విషయమే. అక్కడితో కవిత ఆగిపోతే పసివాడి నవ్వుల పలుకులు అనో, చెలికత్తె సరసల్లాపం అనో వ్యాఖ్యానించి వూరుకునే వాళ్లం. ‘ఫిలిప్‌ లార్కిన్‌’ లు ప్రతి వూళ్లో ఉంటారు లెద్దూ. అని ముఖం త్రిప్పుకునేవాళ్లం. ఇంతోటి కవితకు వ్యాఖ్యానం రాయాలేమిటోయ్‌ సుబ్బారావ్‌ అని నుదుటిపై ముడతలు చూపేవాళ్లం. అనంతరం ఆయన రాసిన రెండు వాక్యాలూ చూడండి..
నాలుగింటికి ఉదయ పవనాలు చీకటిపై దాడి..బాగానే ఉంది. రాత్రి సుఖం అయిపోవచ్చిందా అనుకుంటాం. చివరి వాక్యం చూడండి.. నామంలేని గుహపై నాదం లేని నది దారి…! నామంలేని గుహ జీవితం ..నాదం లేని నది ప్రవాహం. జీవితంపై జలపాతం విరుచుకుపడిరదట. అసలే రుచీపచీ లేని చీకటి గుహరా బాబూ అంటుంటే అందులోకి తుఫాను వర్షంతో నదీ ప్రవాహం ప్రవేశించిందా! గుహలోకి నీరొస్తే ఏమవుతుందో అందరం చూచి ఉండకపోవొచ్చు. కానీ ఊహించగలం!! కవిత్వం యావత్తూ హ్రస్వలిపిలా, మౌనఘోషలా ఉండాలని కాదు కాని… కవిత్వం మౌలిక రూపం ఎలా ఉంటుందో చెప్పటానికి అద్భుతమైన ఉదాహరణ అన్నమాట! ‘అమ్మా నీ జారిపోయిన చీరె నుండి బిడ్డ అలనాడు త్రాగి విడిచిన పాలసీసాలు’ అన్నప్పుడు ప్రతి మాటా రెండర్థాలు సూచిస్తుంది గమనించండి. కవిత్వం చెప్పే దశ కనుక ఆమె సొంత తల్లి కానక్కరలేదు..అయినా తల్లితో జారిపోయిన చీరె గురించి ఎవరూ మాట్లాడరు. కవిగారు మరో స్త్రీమూర్తితోనే సంభాషిస్తున్నారు. కాకపోతే ప్రతి స్త్రీ పాలిండ్లలోనూ తల్లి పాల ప్రస్తావన గుర్తుకు వస్తుంది. అలా రాకపోతే వాడు మనిషే కాడు. అని కవి సూచిస్తున్నాడు. నీ సహచరి అయినా సరే ` ‘రానున్న’ నీ బిడ్డడికి అవి పాల సీసాలే’ అని గుర్తొచ్చి చిరునవ్వు లొలికిస్తాడు. అప్పుడు కూడా నీ శృంగార గృహాలని అనుకునే నీచత్వం కవికి ఉండదు. ఆకలితో వెదుకులాడే శిశువు నోట్లో పాలనదీ ప్రవాహం మాత్రమే స్ఫురిస్తుంది. శుభం..అదే కవితకు మౌలిక రూపం అని లార్కిన్‌ ప్రతిపాదన!
వ్యాస రచయిత సెల్‌: 9441360083

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img