Friday, April 19, 2024
Friday, April 19, 2024

కానరాని సాహితీ, సాంస్కృతిక సౌరభాలు

కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డి
సెల్‌: 9948774243

అక్షర దివ్వెలు దారి దీపాలై మానవ జీవితానికి ప్రయోజకత్వాన్ని గూర్చే అర్థాన్ని, పరమార్థాన్ని చూపెడతాయి. ఏ ప్రక్రియలో రాసే సాహిత్యంలోనైనా సామాజిక స్థితిగతులు ప్రతిబింబిస్తుండాలి. వాటినే క్రియాశీలక రచనలు అంటాము. ప్రజా జీవితంలోని అనేక చీకటి కోణాల్ని, వెలుగుకుమూలాల్ని కళాత్మకంగా చక్కని చిక్కని అభివ్యక్తితో వ్యక్తీకరించిన సాహిత్యం సమాజంలో పదికాలాలపాటు బతుకుతుంది. ఆధునిక వైజ్ఞానిక భావజాలాన్ని, చైతన్నవంతమైన చలన సూత్రాల్ని ఎత్తిచూపుతూ ప్రజా సాహిత్యం వ్యక్తమౌ తుంటూంది. ఇటువంటి సాహిత్యాన్ని ప్రజలే కాదు, ప్రభుత్వమూ పట్టించుకోవాలి. తగిన గుర్తింపు నివ్వాలి. నేడెందుకో పాలకవర్గాలు సాహిత్యంయెడల శీత కన్నేశారు. సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం రాష్ట్రంలో ఏర్పడ్డాయి. వాటికి కేటాయించిన ఏవొక్క బాధ్యత నిర్వర్తించిన దాఖలాలు కనిపించడంలేదు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఉదాసీన వైఖరి అవలంభిస్తుందో అర్థంకాకుంది. ప్రభుత్వం అధికార భాష యెడల, సాహిత్య సాంస్కృతిక కళల యెడల విముఖత కనపరచడం ఆరోగ్య దాయకమైన చర్యకాదు. మీదు మిక్కిలి యిది చారిత్రిక దోషమే అవుతుంది.
జీవితంలో ఏ వ్యక్తిగాని, సంస్థ గాని అందిపుచ్చు కున్న అవకాశాల్ని నిష్టగా, నీతి నిజాయితీగా సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే ఆయా పదవులు రాణిస్తాయి. ప్రజలకు ఉపయోగకరంగాను ఉంటాయి. నిజం చెప్పాలంటే ఎక్కడైనా సాహిత్య సాంస్కృతిక కళారంగాలు అంతరించి పోవడమంటే, మనిషిలో మానవీయతా విలువల సజీవత చచ్చిపోవడమే అవుతుంది.
సాహిత్యం జనంలో సంస్కారాన్ని ప్రోత్సహిస్తుంది. లలిత కళలు సమాజంలో ప్రేమానురాగాలకు, ఆత్మీయతానుబంధాలకు, మానవ సంబంధాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి అనేది నిర్వివాదాంశం. ఆర్థికాపేక్ష మనిషిని భౌతికంగా మెరుగులు దిద్దడానికి దోహదపడవచ్చు. కాని సాహిత్య సాంస్కృతిక కళా రంగం మనిషి అంతరంగాన్ని పదునెక్కించి మనిషి తనాన్ని నిలబెడుతుంది. నేడు సమాజం వస్తురూపమెత్తి స్వార్థచింతనతో ప్రగతిశీల దృక్పథాలకు, అభ్యుదయ భావాలకు తగిన విలువలివ్వని పరిస్థితుల్ని చూస్తున్నాం. ఈ విషయాల్ని సాహితీవేత్తలు వారి సాహిత్యంలో ఎత్తి చూపుతూనే ఉన్నారు. ప్రజల్లో చైతన్యం రావాలనే ఆరాటంతో వివిధప్రక్రియల్లో సాహిత్యాన్ని పండిస్తున్నారు.
ఈనాడు సైద్ధాంతిక దృక్పథం లేని, ఊసరవెల్లి భావనా తౌల్యం గల రాజకీయ పార్టీలు, కల్లబొల్లి కబుర్లు చెప్తూ అధికారంలోకి వస్తున్నాయి. జనాన్ని హామీల ఎత్తుగడలతో, ఆశల సుడిగుండాల్లోకి దించి, ఓట్లు వేయించుకుంటున్నారు. ప్రజాపక్షాన విలబడి పాలకులను ప్రశ్నించే సాహితీవేత్తల్ని, దేశ ద్రోహులుగా భావిస్తూ జైళ్లలో పెడుతున్నారు. ఐదేళ్ల కొకసారి జరిగే ఎన్నికల గురించి ‘అలిశెట్టి ప్రభాకర్‌’ తన మినీ కవితలో ‘‘ఐదేళ్లకొకసారి/ అసెంబ్లీలో మొసళ్లూ/ పార్లమెంటులోకి తిమింగలాలూ/ ప్రవేశించడం పెద్ద విశేషం కాదు/ జనమే ఓట్ల జలాశయాలై/ వాటిని బతికించడం/ విషాదం’’ అంటాడు. ఈవేళ రాజకీయ నాయకుల మాటలు నమ్మి ఓట్లు వేయడాన్ని అలిశెట్టి ఎంత గొప్పగా, నిజాయితీగా చెప్పాడంటే ‘‘ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందట/ ఇంకెవర్నీ మోసగించనని/ ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందంట/ తోటి జంతువుల్ని సంహరించనని/ ఈ కట్టుకథ విని/ గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయ్‌ ’’ అంటారు. ఈ కవితలు కవి దాదాపు ఐదు దశాబ్దాల క్రితం రాసినా యింకా వాటి భావనా నిర్దేశితం మరుగున పడలేదు. ఇది సాహిత్యపు గొప్పతనం.
జన హితాన్ని కోరే సాహిత్యం ఎప్పుడూ పాలక పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. ప్రతిపక్షం హోదాలో నిలుస్తుంది. సాహిత్యం ఎత్తిచూపే లొసుగుల్ని పాలక పక్షం గ్రహించి సరిదిద్దుకోవాలి కాని సాహిత్యాన్ని నిషేధించకూడదు. లేదా పట్టించుకోకుండా నిరాదరణకు గురి చేయకూడదు. ఏదో సంవత్సరానికి ఓసారి అవార్డుల రూపంలో సాహితీవేత్తలకు డబ్బు కొంత ముట్టచెప్పినంత మాత్రాన పాలకులు సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కాదు. ఇవి కంటి తుడుపు చర్యలు మాత్రమేననే విషయాన్ని అందరూ గమనిస్తునంటారు అనే సత్యాన్ని పాలకులు గ్రహించాలి. దయాదాక్షిణ్యాల వేడుకోలుతో, నీతి వాక్యాల వినికిడితో దోపిడీ వ్యవస్థ మారదు. కృప, కరుణ, శాంతి ప్రవచనాలతో కుళ్లిన సమాజం బాగవదు. నేడు సమాజంలో ఉద్బోదించాల్సింది ప్రతిఘటనా శక్తిని చేకూర్చుకునే నేర్పరితనాన్ని ఎదురు ప్రశ్నించే ధైర్యాన్ని, అవసరమైతే అన్యాయం మీద పిడికిలెత్తే పటుత్వాన్ని. కాలంతో కలసి నడిచే కవి సమాజంలో జరుగుతున్న విధ్వంసక మూలాల్ని పసిగట్టి తన సాహిత్యంలో ఎత్తి చూపుతాడు. వాటిని నిరోధించే ఆలోచనలు కలిగిస్తాడు.
నేడు విద్యా విధానంలో ఆంగ్లం నేర్పించి, విద్యార్థులకు వలస రెక్కలిచ్చి, బానిసత్వాల దోపిడీ బరువును మోయమని ఇతర దేశాలకు అపించడం అభ్యుదయంగా పాలకులు ప్రచారం చేసుకుంటున్నారు. చదువులకు తగిన వనరులను ఏర్పాటు చేస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పించే పారిశ్రామిక వసతి కూడా కల్పించినప్పుడే ప్రభుత్వం తలపెట్టిన నూతన విద్యా విధానం విజయవంతమైనదని భావించవచ్చును. సాహిత్య అకాడమీని, తెలుగు అకాడమీని, అధికార భాషా సంఘాన్ని స్వేచ్ఛగా తమ విధులను కొన్నింటినైన నిర్వహించే వీలు ప్రభుత్వం చిత్తశుద్ధితో కల్పించాల్సి ఉంది. అక్షరాన్ని నిరాదరించిన ఏ ప్రభుత్వమైన సురక్షితంగా చరిత్రలో మనగలిగిన దాఖలాలు లేవు అనేది సత్య దూరమైన అంశం కాదు అని నేటి పాలకులు గమనిస్తారని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img