Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చిలకమర్తి వారి జాతీయోద్యమ కవిత్వం

డా॥పి.వి.సుబ్బారావు, సెల్‌: 9849177594

చిలకమర్తి లక్ష్మీనరసింహం తొలి జాతీయోద్యమ కవిగా, ప్రముఖ నాటకకర్తగా, నవలా రచయితగా, సంఘ సంస్కరణవాదిగా, సుప్రసిద్ధ పాత్రికేయుడిగా 19 వ శతాబ్ది చివర, 20 వ శతాబ్ది ఆరంభంలో తెలుగు సాహిత్యాభివృద్ధికి గణనీయమైన కృషి చేసిన గొప్ప రచయిత చిలకమర్తి. చిలకమర్తి వారు 1867 సెప్టెంబరు 26 వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు రత్నమ్మ, వెంకయ్య. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం వీరవాసరంలో , ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం నరసాపురంలో సాగింది. రాజమండ్రి కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. కొన్నాళ్లు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఒక్క సంవత్సరం పాటు సరస్వతీ పత్రిక సంపాదకుడిగా చేశాడు. ఆ తర్వాత ఉద్యోగాన్ని విరమించి 1899 లో హిందూ లోయర్‌ సెకండరీ స్కూల్‌ స్థాపించి 9 సంవత్సరాలు నిర్వహించి, తర్వాత దాన్ని వీరేశలింగం ఉన్నత పాఠశాలగా మార్చాడు. ఆయన 30 సంవత్సరాల వయసులో రేచీకటి వ్యాధికి గురైనా, ఎంతో శ్రమించి కంటిచూపు అవరోధాన్ని అధిగమించి ఎన్నో రచనలు చేశాడు.
బ్రిటీషు వారి కుటిల తంత్రాల్లో చిక్కి భారతీయులు పారతంత్య్రంలో అలమటిస్తున్న స్థితిలో మహాకవి గురజాడ ‘‘దేశమంటే మట్టి కాదోయ్‌/ దేశమంటే మనుజులోయ్‌’’ దేశానికి దేశభక్తికి నిర్వచనాలు చెప్పి ప్రజలను ప్రబోధించాడు. ఆచార్య రాయప్రోలు వారు దేశీయుల్లో దేశాభిమానం రేకెత్తించే విధంగా ‘‘ఏ దేశమేగినా/ ఎందు కాలిడినా/ పొగడరా నీతల్లి/ భూమి భారతిని/ అని దేశీయుల్లో మాతృ దేశాభిమానాన్ని ప్రదీప్తం చేశాడు. జాతీయోద్యమం తొలిదశలో బిపిన్‌ చంద్రపాల్‌ దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా 1907 వ సంవత్సరం ఏప్రియల్‌ నెలలో రాజమండ్రిలో మూడురోజులు పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన ఉపన్యాసాలను చిలకమర్తి వారు అనువదించాడు. అప్పటి బ్రిటీషు ప్రభుత్వం వారి దురాగతాలను, డోపిడీ విధానాన్ని, జాతీయోద్యమ స్ఫోరకంగా, చైతన్య ప్రేరకంగా ఆశువుగా చివరి రోజు సభలో ‘‘భరతఖండంబు చక్కని పాడియావు/ హిందువులు లేగడూడలై యేడ్చుచుండ/ తెల్లవారను గడసరి గొల్లవారు/ పితుకుచున్నారు మూతులు బిగియబట్టి అని చెప్పాడు. చిలకమర్తి వారి పలుకులు కమ్మని కలకండ పలుకుల్లా ప్రజల నాలుకలపై నాట్యమాడాయి. భారతమాతను పాడిఆవుతో, భారతీయ సంపదను పాడితో, హిందువులను లేగదూడలతో, వారనుభవించే కష్ట నిష్ఠూరాలను లేగదూడల ఏడ్పుతో వర్ణించాడు. తెల్లవారిని గడసరి గొల్లవారనడం వల్ల ప్రభుత్వం వారి నిర్ధాక్షిణ్య కాఠిన్యాన్ని, సంపదను కొల్లగొట్టడాన్ని సూచించాడు. ‘మూతులు బిగియబట్టి’ అని చెప్పడం వల్ల సమకాలీన స్వాతంత్య్రరహితమైన దుస్థితిని వ్యక్తపరచాడు. అప్పట్లో చిలకమర్తి వారి పద్యం దేశీయుల ప్రజాభిమానాన్ని పొందింది. దేశాభిమాన రహితులైన కొందరు పండితులు ఆ పద్యంలో చిలకమర్తి బ్రిటీషు ప్రభుత్వంలో తెల్లవారిని గొల్లవారితో పోల్చి అభిశంసించాడని చెప్పి చిలకమర్తి వారికి జైలు శిక్ష విధించేట్లు చేశారు. దేశాభిమానులైన కొందరు పండితులు ఆ పాదానికి చక్కని విరుపుతో ‘తెల్లవారిన వెంటనే గొల్లవారు’ అనే అర్థం చెప్పి జైలు నుండి విడిపించారు.
బిపిన్‌ చంద్రపాల్‌ ఆంధ్రదేశ పర్యటనకు పూర్వమే 1905 డిసెంబరు 15 వ తేదీన ‘కృష్ణా పత్రిక’ లో ‘‘ది క్రై ఆఫ్‌ మదరిండియా’’ (హిందూ దేశపు మొర) అనే గీతాన్ని అజ్ఞాత కవి ప్రచురించాడు. చిలకమర్తి పద్యానికి మూలం ఆ గేయంలోని ‘‘దూడ నోరుగొట్టె ద్రోహులు గొల్లలు’’ అనే అజ్ఞాత కవి గేయమన్న ఆచార్య సుబ్బారెడ్డి అభిప్రాయం సమంజసమైందే. కొందరు పండితులు చిలకమర్తి వారి పద్యాన్ని చెన్నాప్రెగడ భానుమూర్తిదని చెప్పడం సరైందికాదు. బ్రిటీషు ప్రభుత్వం 1909 లో ‘పంజాబ్‌ కేసరి లాలాలజపతిరాయ్‌ని నిర్బంధించిన సందర్భంలో చిలకమర్తి వారు బ్రిటీషు ప్రభుత్వాన్ని అభిశంసిస్తూ ‘‘భరతఖండంబె యొక గొప్ప బందిఖాన/ అందులోన్ను ఖయిదీలు హిందుజనులు/ ఒక్కగది నుండి మార్చి వేరొక్కగదిని/ బెల్టుటేగాక చెఱయంచ వేరెగలదె’’ అన్నాడు. ఈ పద్యంలో చిలకమర్తివారి వేదన గమనార్హం. భారతీయులు బానిసత్వంలో ఎంతగా బాధలుపడేవారో, పారతంత్య్ర కుతంత్రాల్లో ఎంతగా కుమిలిపోయేవారో ‘‘భరతఖండంబెయొక గొప్ప బందెఖాన’’ అనే పాదం వల్ల స్సష్టమవుతుంది. ఖయిదీలు హిందు జనులనడంలో ఎట్టి నిర్భర కష్ట నిష్ఠూరాలను అనుభవించేవారో అవగత మవుతుంది. చిలకమర్తి వారు మరో పద్యంలో స్వాతంత్య్ర భావనా పరులైన వారికి ‘‘చెఱసాలల్‌ పృథు చంద్రశాలెయగున్‌/ చేదోయి గీతించునయ్యర దండల్‌ విరిదండలయ్యెడన్‌ హేయంబైన చోడంబలే/ పరమాన్నంబగు, మోటు కంబళులు దాల్పిన్‌ పట్టు సెల్లాలగున్‌/ స్థిరుడై యే నరుడాత్మ దేశమును భక్తిన్‌ గొల్చునవ్వానికిన్‌’’
స్వాతంత్య్ర భావనా కాంక్షితులు దేశాభిమాన దీధితులైన వారికి చెఱసాలలు చంద్రశాలలుగా, అరిదండలు విరిదండలుగా, చోడంబలి పరమాన్నంగా, మోటు కంబళులు పట్టు సెల్లాలుగా భాసిస్తాయని చెప్పడం కారాగార భీతులను దేశాభిమాన దీధితులుగా ప్రబోధించడం కోసమే. చిలకమర్తి వారిననుసరించి గేయకవి సార్వభౌముడైన గరిమెళ్ల సత్యనారాయణ ‘‘మాకొద్దీ తెల్లదిరతనము’’అనే గేయం రాశాడు. మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి ఆనాటి సంఘంలోని అస్పృశ్యతను అధిక్షేపంగా చేసికొని ‘‘అంటరాని వారెవరు? మా వెంట రానివారే’’ అని ప్రజల హృదయాల్లో నిబిడీకృతంగా ఉన్న వీరత్వాన్ని దేశాభిమాన తత్త్వాన్ని రెచ్చగొట్టి స్వాతంత్య్రోద్యమోన్యుఖులుగా చేశారు. కవిరాజు త్రిపురనేని రామస్వామిచౌదరి ‘‘వీరగంధము/ తెచ్చినారము/ వీరులెవ్వరో చెప్పుడీ’’ అంటూ ప్రశ్నించి ప్రజల మనసుల్లో వీరత్వాన్ని, దేశభక్తిని ప్రదీప్తం చేశాడు. రాయప్రోలు, విశ్వనాథ, జాషువా, తుమ్మల, దువ్వూరి వంటి కవులు పారతంత్య్రం భేదకంగా, జాతీయోద్యమ స్ఫోరకంగా, స్వాతంత్య్రం సాధకంగా కవితలు రాశారు. స్వాతంత్య్ర సాధనకు కవితల ద్వారా తమ వంతు కృషి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img