Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

చెల్లని రూపాయి

చిందం రమేష్‌

  • ఇక్కడ సృష్టి రహస్యపు దాకవరాలేవి తెరుచుకోనివ్వరు... ప్రసవవేదన ఓ సాంఘిక దురాచారం పదునైన ఓ కార్పొరేట్‌ కత్తి పెట్టే అడ్డమైన కాటుకి మాత్రం ఆచారం అంటారు... కత్తిగాట్లకి ముహుర్తం చూసి మురిసిపోతారు... చనుబాలని గడ్డకట్టించి ప్లాస్టిక్‌ డబ్బాలోకి ఎక్కించిన వాడే అసలైన నాగరికుడు... అడ్డదారిలో వచ్చి అష్టవంకరల బుద్ది కలవాడు స్వతంత్ర జీవివని ప్రకటించుకున్న నాడు తల దాచుకోవడానికి పైన ఆకాశం ఉండదు. సరిహద్దులతో కుచించుకుపోతుంది... వ్యాపార మేఘాలన్ని ఆశల తారలను కమ్మేస్తాయి... ప్రతిరోజు ఓ చీకటి తెర వెనక నీ చెమట చరిత్ర గొంతు నులిమి సుగంధ లేపనాలు పూస్తారు... ఎన్నో కృత్రిమ మేధో మథనాల మధ్య నిన్ను పోగుల లెక్క పంచుకున్నాక ఒక సుతారమైన సుందరి ఒళ్లు మీద జారే సబ్బు నురుగతో చేసిన లైట్‌ వెయిట్‌ సంకెళ్లతో నిన్ను బందిస్తారు. కాని నిన్ను బంధించిన విషయం నీకే తెలియదు... స్వేచ్ఛగ స్వచ్ఛమైన గాలిని కూడ పీల్చలేవు... ఆక్సిజన్‌కి అత్తరు పూసి ఖరీదు కడతారు... ఇగ వర్షం అంటావా? అది కురవదు... నీ దుఃఖాన్ని తనలో కలుపుకోడానికి అప్పుడప్పుడు తడిపొడిగా పడుతుంది అంతే... టివిలో వాణిజ్య ప్రకటనలాగ మనిషి ఆశ అంత పొడవు నిచ్చెన వేసుకుని ఇంద్రధనస్సుకి కొత్త రంగులు వేస్తారు... నీ స్వతంత్రం అంతా రకరకాల రంగు సీసాల్లో రాత్రుళ్లు బుస్సున పొంగిస్తారు... ఆ నిశీధి మత్తులో నింగి నేలను ఒకటి చేసి నేను స్వేచ్ఛా జీవినని రెండు చేతులు చాచాలన్న ఆ సౌకర్యానికి సమయానికి అద్దె కట్టాలి... నిత్యం కార్పొరేట్‌ నీకొక రేట్‌ కట్టి అంగడిలో ఆటబొమ్మగా ఆడిస్తుంటే ఇగ నువ్వనుకునే స్వేచ్ఛా, స్వతంత్రం అనేది ఇక్కడ చెల్లని రూపాయలే... (అరసం యువ వచన కవితా పోటీలు2023 లోద్వితీయ బహుమతి పొందిన కవిత.)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img