సి.హెచ్.శ్రీకళ, సెల్: 7093757593
కాదనగలవా?..వాతం కమ్మిన బాలింతలాంటి పుడమి తల్లిని ప్రకృతి వైపరీత్యాలేవో/
నిత్యమూ పొడుచుకు తింటుంటే..నెపమేదో వంచన ఎరుగని పంచభూతాలపై తోసేసి../
రాసుకున్న ఒప్పందాలూ..ఒడంబడికలూ నేడు వధ్య శిలపై వేలాడుతుంటే../
క్షిపణులు వాలుతున్న నేలపై ఇప్పుడిక నీకంటూ మిగిలేది నిశ్చల శ్మశాన వేదికనేనని..!/
కాదనగలవా?.. శివారు ప్రాంతాల మురికి బూడిద కుప్పల్లో చెదలు పట్టిన
అంకురమేదో లోనికి..లోలోనికి కుంగిపోతుంటే../
పొగ గొట్టాల విసర్జకాల విసురుకు సిమెంటు వృక్షాల కతీతంగా విస్తరించిన హరిత శ్వాసకోశాలు../
కరకు గొడ్డళ్ల ధాటికి వంటచెరకుగా ముక్కలు చెక్కలై ఆక్రందనలతో నేలకొరుగుతుంటే../
నీ ఖననానికైనా ఒక కట్టె కూడా దొరకని శూన్య శవపేటికలో నీవిప్పుడు నిర్జీవ దేహానివని..!/
కాదనగలవా?..తగులబడ్డ అమెజాన్ అడవుల పొత్తికడుపు కార్చిచ్చులో మాడిపోయిన../
లక్షల పక్షుల విశ్వ దుఃఖపు అశ్రు సమీక్షణనను వేటాడిన శిఖండుడిగా../
కృత్రిమ మేధస్సుతో జినోమ్..క్లోనింగ్ల నీడన జబ్బలు చరుస్తూ విర్రవీగే నీ బోన్సాయ్ బతుకుకిక../
శాశ్వత చిరునామా నిర్జన ఎడారిలో నిర్వాసితమేనని..!/
స్వర్గారోహణం మొదటి మెట్టులోనే ఒరిగిపోయిన సహదేవుడిలా సాకునేదో నలగ్గొట్టకముందే../
సమ్మతిస్తావా?..మూలమిదేనంటున్న..మట్టిలా విస్తరించి
రాబోయే తరాలకికనైనా నాలుగు పచ్చని చెట్లను రాసివ్వాలని../
దిక్కులేని సముద్రంలో ఒంటరి కొయ్య పడవపైని చివరి పక్షొకటి
తప్పెవరిదంటూ తన రెక్కల తెరచాపనెత్తక మునుపే../
సమ్మతిస్తావా?..నదిలా బాహువులు చాచి పచ్చని పొదుగులా../
మన ఆకుపచ్చని స్వప్నాల్ని తలా దోసెడు కన్నీళ్లు పోసైనా సరే పండిరచుకోవాలని../
పరాజిత ఆక్రందనలా ప్రతిధ్వనించే ‘‘ఆ ఒక్క ఆకూ రాలక మునుపే..!’’
సమ్మతిస్తావా?..లక్షల ఉల్కాపాతాల్ని మోస్తున్న ఆకాశంలోని గుడ్డి సూర్యునిలా మిగిలిపోక../
‘‘తరుణమిదేనంటూ..‘‘కోట్ల ప్రాణాల చక్రభ్రమణంలో కొన్ని వేలసార్లు మరణించైనా..
ప్రకృతి ప్రసాదించిన వరంగా../
‘వృక్షాం దేహీ..!’’ అంటున్న జీవనోత్సవపు మురిపాల పచ్చని కలనొకటిని../
విప్పార్చుకొనేందుకు ఇంకొక్కసారైనా పునర్ జన్మించాలని…!!!
(అరసం యువ వచన కవితా పోటీలు`2023 లో ప్రథమ బహుమతి పొందిన కవిత)