Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తాపీ ధర్మారావు హేతువాద జిజ్ఞాస

డా॥ కత్తి పద్మారావు
సెల్‌ : 9849741695

సంఘానికి పట్టిన మకిలిని వదిలించడానికి, భాషకు పట్టిన మడ్డిని తుడిచి వేయడానికి, భావాలకు పట్టిన చీడను దులిపివేయడానికి, సంస్కృతికి పట్టిన జిడ్డును కడిగి వేయడానికి, బ్రతుకంతా కుతకుత, ఉడికి కొత్త పాళీతో కొత్త భావాలు తెలుగు గుండెలకు అందించిన వాడు. కొత్తగొంతుతో కొత్తకూతను ఎలుగెత్తిన అభ్యుదయ రచయిత తాపీ ధర్మారావు. ‘‘చచ్చిన నియమాలతో, పుచ్చిన సంప్రదాయాలతో, దడదడ కవిత్వాల వేలం వెర్రితో, బండిరా (ఱ) ల, అరసున్నల (ఁ) బిగింపులతో, తెలుగు సాహిత్యం గాసట బీసటగా ఉన్న నాడు, దాని అంతరాలలోకి వెళ్ళి పరిశీలించి, పిట్టకలాలను పారద్రోలి, కొత్త కలాలకు, కొత్త సూత్రాలకు కొత్త దారులు తెలిపిన విమర్శకుడు తాతాజీ.’’ సంస్కృత సమాజ వ్యామోహాన్ని నిరసించి, తెలుగు పలుకుల, తెలుగు పలుకుబడుల, తెలుగు మాండలీకముల తీయందనాలను దోసిళ్ళకొద్ది అందించాడు. తెలుగు మాటల శక్తి పసదనాన్ని రాశులు బోశాడు. సాహిత్యం జాతి జీవితానికి ప్రతిబింబం అన్న ముఖ్య సూత్రంతో ముందుకు నడిచాడు తాతాజీ.
తాపీ వారి హేతువాదం:
ధర్మారావు బహుగా శ్రమించి, భారతీయ సాహిత్యమే కాక, రష్యా, జర్మనీ, నార్వే, స్వీడను, ఫ్రాన్సు, ఇంగ్లాండు, అమెరికాదేశాలలోని మిక్కిలిఉత్తమమైన గ్రంథాలు, కరువు తీర చదివారు. ‘అందువలన మూడు సంవత్సరాల లోను నేను దగ్గర దగ్గర 40, 50 వేల పేజీల సారస్వతం చదవ గలిగాను’ అని తెలిపారు. చదవడమేగాక విమర్శించు కొన్నారు. తర్కించుకొన్నారు. మనస్సుకు పట్టించుకొన్నారు. వాటి సారాన్ని గ్రంథాల ద్వారా, వ్యాసాల ద్వారా, నాటికల ద్వారా, విమర్శనల ద్వారా, పరిశోధనల ద్వారా, కథల ద్వారా, తెలుగు ప్రజలకందించాడు. కవి అన్న వాణ్ణి ప్రజల భాషలో, ప్రజల కోసం బతకమన్నాడు.
‘‘ప్రజల కవివై గొంతు/ రగిలించి పాడితే
ఒక్క డొక్కలురేగి ప్రళయ మారుతమట్లు
తక్కువెక్కువ లెల్ల ఒక్క దెబ్బను కూల్చి
లోకాలనూగింపవా!
ఓ కవీ/శోకాలు తొలగింపవా!’’
అని ప్రజల గుండెలు రగిలి, లోకాన్నే మార్చుకో గలిగిన చైతన్యం ప్రజలకు కలిగించమన్నాడు.
‘‘మండుటాకులలోను/ఎండకు నాల్కలలోను
మొండిబారిన పేద బండ గుండెలలోను
గాండ్రిరచు భావాల నిండిరచి నీ గొంతు
సింహనాదము చేయరా
ఓ కవి/స్థిరమైన పేర్మోయరా’’
ఆకలి సొదలో నుంచి సింహనాదాలు పుడతాయని, విప్లవాలు పుడతాయని అయితే వాటికి ప్రేరణ కలిగించేవాడు కవి అని సందేశం ఇవ్వగలిగాడు.
తాతాజీ జ్ఞాన జిజ్ఞాస:
తాతాజీ ఎవరూ తడమని, ఎవరూ వివరించడానికి పూనుకోని అంశాలను పరిశీలించారు. సాహితీ విమర్శలో కొత్తపుంతలు తొక్కారు. ఆంధ్ర సాహిత్యాన్ని ఆమూలాగ్రంగా ఆయన పరిశీలించారు. ప్రబంధ సాహిత్యంలో అన్వయ క్లిష్టమైన సాంప్రదాయ పండితులకు సహితము కొరుకుడుపడని చేమకూర విజయ విలాసానికి హృదయోల్లాస వ్యాఖ్య సహృదయ రంజకంగా చేశారు. కవి సార్వభౌములుగా, పండిత ప్రకాండులుగా పేరుపొందిన వారికెవ్వరికి తీసిపోని భాషా సంపద ఆయన చేతిలో వుంది. ఎంతటి క్లిష్టమైన విషయాన్నయినా పండితుని దగ్గర నుండి ప్రజా సామాన్యం వరకు పనస తొనల్లా వొలిచి పెట్టడం ఆయన విశిష్టత. అసత్యాన్ని వేటాడడం ఆయన వృత్తి, గతంపై విప్లవం చేయడం, భవిష్యత్తుకు విజయం చేకూర్చడం ఆయన ప్రవృత్తి.
లేకపోతే తరతరాల దేవాలయ సంస్కృతిలో అనాగరికతకు చిహ్నంగా నిలబడిన ‘దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు’ అని ప్రశ్నించినవారు ఎవరు? బూతుకి దేవాలయానికి వున్న అనుబంధాన్ని వివరించిన వారు ఎవరు? గుడి గర్భాన్ని పరిశీలించిన వారు ఎవరు? గర్భగుడికి, గర్భాదానానికి ఉన్న సంబంధాన్ని విప్పి చెప్పినవారెవరు? గోపురాల మీద, రథాల మీద, గర్భగుడి విమానాల మీద, కోవెల గోడల మీద లక్షల సంఖ్యలో వున్న బూతు బొమ్మలు ఏ నాగరికతకు, ఏ సంస్కృతికి ప్రతీక అని నిలదీసిన వారెవరు? యజ్ఞాలలో దాగున్న బహిరంగ సంభోగాలను, యాగాలలో దాగున్న పశు సంపర్కాలను, పూజలలో దాగున్న బూతు విధానాలను, పండగల పేరుతో జరిగిన అనాగరిక సమ్మేళనాలను వాటి మూలాల్లోకి వెళ్ళి వివరించిందెవరు?
భారతదేశ చరిత్రను, నాగరిక మూలాలను మాతృ స్వామ్య వ్యవస్థ నిర్మాణాన్ని, సామాజిక శాస్త్రాలను, మత పౌరాణిక సర్వస్వాలను, జాతి కుల భేదాల పుట్టుకలను, మనస్తత్వ శాస్త్రాలను, స్త్రీ పురుష సంబంధ తత్వాలను, మానవ పరిణామ చరిత్రను అధ్యయనం చేసి హృదయానికి పట్టించుకొని మేధస్సుతో తర్కించుకొని ప్రజా సామాన్యానికి సులభమైన సరళమైన తెలుగులో అందించినదెవరు?
సామాజిక ధర్మం కోసం పోరాటం చేసిన ధర్మారావు గారు కాదా! ఈ పోరాటం కోసం ఎంతమంది మేధావుల రచనల్ని ఆయన పరిశీలించారు. ూARణ్‌ AపజుదీఖR్‌ – ణR. జీAవీజుూ నూూుIచీGూ, RూదీజుRు దీRIఖీఖీAఖూు జుణGAR ునఖRూుూచీ, జుRచీజుూు జRూఔూజ్‌ు – జు.A ఔజుూుజుRవీARఖ, Aదీదీజు ణఖదీూIూ – ూ..ఔAూూ, ూIR. జీ.G ఖీRAూజుR – జీూనచీ ఔూూణRూఖీఖీజు, జు.ూ.నARుూAచీణ – జుRుIజ జీూనచీ ణIచీGఔAూూ, ఔIూూIవీ G. ూఖవీవీజుR – GజుూRGజు R. ూజూుు.
వీరందరూ ఆయన తరపున చారిత్రక సాక్ష్యాన్ని ఇచ్చి ఆయన నినదించిన సత్యానికి బాసటగా నిలచిన వారే.
తాపీ వారి హేతు ప్రజ్ఞ:
తెలుగు ప్రజలకు కొత్త సత్యాలను అందించడానికి,
కొత్త ఆరోగ్యాన్ని చేకూర్చడానికి, కొత్త జవసత్వాలను నింపడానికి ఆయన చరిత్ర గర్భంలో చొచ్చుకుపోయి ఎంత పరిశోధన గావించారో దేవాలయాలపై బూతు బొమ్మలు చాటి చెపుతోంది. ఆయన ఈ పరిశోధన మూఢ విశ్వాస వన కుఠారమై ప్రవర్తిల్లింది.
గూడవల్లి రామ బ్రహ్మం సంపాదకత్వాన వెలువడిన ‘ప్రజామిత్ర’లో ఈ వ్యాసాలు ప్రచురితమై మూఢ విశ్వాసాల పునాదులను కదిపినాయి. పాత రాతి యుగంనాటి ఆచారాలపై ఎందుకు? అనే ప్రశ్న విచక్షణతో పొటమరించింది. ఆధునిక విజ్ఞాన శాస్త్రాలకు నమూనాలు వెదుకుతున్న కుహనా మేధావుల పుర్రెకు కొర్రు పడిరది. క్రైస్తవ మిషనరీలు, మా చర్చీలు పవిత్రమైనవని బోధిస్తుండగానే, ఆ చర్చిలు గుడిచేటివాళ్ళకు నిలయమనే చారిత్రక సత్యం రోడ్డుకొచ్చింది. మందగా విచక్షణా రహితంగా, ఏది చెప్పితే అది వినే ఈ జాతికి ఆలోచన రేకెత్తింది. గతాన్ని, మతాన్ని పరిశీలించాలి అనే జిజ్ఞాస కొందరిలోనయినా పొటమరించింది. సమాజం మారుతుంటే సమాజంలో వున్న ప్రతి అంశం మారుతుందనే. అలాగే ‘పెళ్ళి’ సంగతి కూడాను. ఆదిలో పెళ్ళిళ్ళు ఈనాటి పెళ్ళిళ్ళ లాగా పురోహితుల మంత్రాలతో, అగ్నిసాక్షిగా ‘నాతిచరామి’ అన్న ప్రమాణాలతో జరుగుతూ వుండేవని అంటే నలుగురూ నవ్వుతారు. పెళ్ళికి సంబంధించిన అభిప్రాయాలు, ఆచారాలు అంచెలంచలుగా మారుతూ వచ్చాయి.
జతకట్టడానికి, పెళ్ళికి ఉన్న తేడాను చారిత్రకంగా నిరూపించడం చాలా అవగాహనతో కూడుకున్న పని. జతకట్టడమనేది ప్రకృతికి సంబంధించిన విషయం. ప్రకృతి సిద్ధం. ప్రకృతిలో అంతర్లయగా పశుపక్ష్యాదులన్నిటిలో ప్రవహిస్తున్న విషయం. ప్రకృతి ప్రగతికి ఆది మూలం. పెళ్ళి కృత్రిమమైన విషయం. పెళ్ళి పేరుతో ఒక వ్యక్తి భావాలకు, కోరికలకు ఇనుపకచ్చడాలు కట్టడం కృత్రిమ సామాజిక కల్పనం. పెళ్ళి సంకుచితంగా, స్వేచ్ఛారహితంగా మారిపోవడం, పెళ్ళిలో భిన్న ఆచారాలు, భిన్న సంప్రదాయాలు, భిన్న పద్ధతులు ఉండడమే పెళ్ళిని సమాజం కృత్రిమంగా నిర్ణయించు కున్నదని అర్థమవుతోంది. మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీకున్న స్వేచ్ఛ, హక్కు, బాధ్యతపోయి పితృస్వామ్య వ్యవస్థలో బానిసత్వం, దాస్యం స్త్రీకి అలంకారాలుగా చెలామణి అయ్యాయి. పెళ్ళి అనే దాని స్వరూప స్వభావాలు సమాజానికి రాను రాను అంతుబట్టక దానిలో చాలా వికృతాలు వచ్చాయి. బాల్య వివాహాలు, సతీ సహగమనాలు ఈ దురవగాహనకు ఫలితాలు. భర్తకు భార్యను అమ్ముకునే హక్కు, కన్యాశుల్కాలు పెట్టి కొనుక్కునేహక్కు వంటి వ్యాపార సరళికి పెళ్ళి దిగజారడం ఈ అవగాహన వల్లనే. ఈనాటి పెళ్ళంటే పెద్ద వ్యాపారం. కులానికొకరేటు, డిగ్రీకి ఒక రేటు ఇచ్చి ఆడపిల్లలు మగపిల్లల్ని కొనుక్కోవడం ప్రేమ, అనురాగం, మానవత్వం ఏవీ పెళ్ళనే తంతుకు మూలంగా ఈనాడు లేవు. పెళ్ళి జరగడంలో కృత్రిమత్వం పెరిగే కొద్ది కాపురాలలో కూడా విపరీతమయిన కృత్రిమత్వం కనిపిస్తుంది.
పూర్వం మనం సాంప్రదాయకంగా చేసుకున్న పెళ్ళిళ్ళన్నీ కృత్రిమాలే. వరుడికి ఇష్టం లేకుండా కట్టడాన్ని బ్రహ్మ వివాహమన్నారు. కన్యాదాత వరుడ్ని పక్కనే కూర్చోపెట్టి పురోహితుడికి దానమిస్తే దైవ వివాహ మన్నారు. రెండు జతల గోవుల్నిచ్చి కన్యను చేసుకోవడం ఆర్ష వివాహమన్నారు. వరుణ్ని ఒప్పించి ఇవ్వడాన్ని ప్రజాపత్యమన్నారు. డబ్బిచ్చి కన్యను కొనుక్కొవడం అసురమన్నారు. బలాత్కారంగా లేపుకెళ్ళడం రాక్షస మన్నారు. నిద్రలో నున్నప్పుడు బలాత్కారంగా జతగూడడం పైశాచికమన్నారు. వధూవరులు ఇష్టపడి చేసుకుంది ఒక గాంధర్వం మిగిలిన వివాహ పద్ధతులన్నీ కృత్రిమమైనవే. దౌర్జన్యం, బలాత్కారం, అమ్ముకోవడం, కొనుక్కోవడం మన సంస్కృతిలో పెళ్ళిగా చెలామణి అయ్యింది. ఈనాటికి ఈ పద్ధతులలోనే సంప్రదాయం పేరుతో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. తాపీ ధర్మారావు గొప్ప హేతువాది, మానవతా వాది, సమతావాది కులమత బేధాలు లేని గొప్ప మనిషి, బ్రాహ్మణవాదం మీద తిరుగులేని కత్తి విసిరాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img