Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తెలంగాణ సాహిత్య అస్తిత్వ జల ‘పలుకు జెలి’

నిత్య సాహితీ పరిశోధకుడుగా అనేక పుస్తకాలను రాసి, మరెన్నో సాహితీ గ్రంథాలకు సంపాదకత్వం వహించి శ్రీలేఖ సాహితి ద్వారా ప్రచరించి, ఉత్తమ సాహిత్య వ్యాప్తికి కృషి చేస్తున్న డా.టి. శ్రీరంగస్వామి రాసిన తెలంగాణ సాహిత్య అస్తిత్వ అంశాల జల ‘పలుకు జెలి’ వ్యాససంపుటి. ఇందులో మొత్తం 16 వ్యాసా లున్నాయి. ఇవి వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. తెలంగాణ స్వాతం త్రోద్యమ సాహిత్యం, హనుమకొండ జిల్లాలో జాతీయ స్వాతంత్రోద్యమం అనే రెండు వ్యాసాల్లో తెలంగాణాలో సాహిత్యమే లేదన్న వాదనను తోసిపుచ్చుతూ సోదాహరణంగా చక్కనివివరణ చేశారు. బ్రిటీషిండియాలో సాగిన స్వాతంత్య్రోద్యమ స్వరూపం వేరని, నిజాం రాష్ట్రంలో సాగిన పోరాట స్వరూపం వేరని, దానికనుగుణంగానే సాహిత్యంకూడా వచ్చిందని అంటారు. నిజాం వ్యతిరేక పోరాటం జాతీయ స్వాతంత్య్రోద్యమంలో భాగంగానే వచ్చిందని, గ్రంథాలయోద్యమం ద్వారా తెలుగు భాష,సాహిత్య విస్తృతికి ఆనాటి కవులు, గ్రంథాలయోద్యమ నాయకులు చేసిన కృషిని విశ్లేషించారు. గ్రంథాల యోద్యమంలో కొమర్రాజు లక్ష్మణ రావు, మాడపాటి హనుమంతరావులతో పాటు అనేకమంది చేసిన కృషిని ఇందులో విపులీకరించారు. అదే విధంగా సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి, కాళోజీ, దాశరథి రంగా చార్యులు, వట్టికోట ఆళ్వారు స్వామి, కాంచనపల్లి చినవెంకట రామారావు, నెల్లూరి కేశవస్వామి, భాగి నారాయణ మూర్తి, దేవులపల్లి రామానుజ రావు లాంటి అనేక మంది జాతీయోద్యమ,స్వాతంత్య్రోద్యమ సాహిత్యం సృజించారని వారి వారి సాహితీ కృషిని ఇందులో సోదాహరణంగా వివరించారు.
పోతన రాసిన భాగవతానికే నాంది నారాయణ శతకమని, ఆ శతకంలో భాగవత బీజాలున్నాయని అది పోతన రాసిందేనని అంటారు. ఒక పాలకుని ఆత్మఘోష అనే వ్యాసంలో అప్పటి నైజాం చివరి ప్రధాని మీర్‌ లాయఖలీ ఏట్రాజడీ ఆఫ్‌ హైదరాబాద్‌ పేర నిజాం పాలన అంతిమ దశకు మదనపడుతూ తన బాధను రాశాడని, దానిని ఏనుగు నరసింహారెడ్డి హైద్రాబాద్‌ విషాదం పేరుతో అనువదించిన తీరును ప్రశంసించారు. అందులో నిజాం రాష్ట్రం భారత్‌లో విలీనమైనపుడు లాయక్‌ అలి పడిన ఆత్మఘోషను శ్రీరంగస్వామి వివరిస్తూ 17, 18 శతాబ్దాలలోనే హైద్రాబాద్‌ నిజాం రాష్ట్రం నిజాం రైల్వేస్‌, నిజాం తంతి తపాలా, ఆకాశవాణి, రవాణా, దక్కన్‌ ఏర్‌ లైన్స్‌, లాంటి విశిష్ట వ్యవస్థలను కలిగి ఉందని, ఒక నౌకాశ్రయం కూడా ఉండేదని, దీనిని ఆంగ్లేయులకు భరణంగా ఇచ్చారని వివరించారు.
ఆరుద్ర రాసిన సమగ్రాంధ్ర సాహిత్యచరిత్రలో కాని, మధునాపంతుల ఆంధ్ర కవి తరంగిణిలో కాని తెలంగాణ సాహిత్య చరిత్రపై చిన్న చూపు చూశారని, ప్రాంతీయ వివక్షతో రాశారని అంటారు. అందుకే సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ కవుల సంచిక, మొదలుకొని ఇప్పుడు అనేకమంది తెలంగాణ వాస్తవ సాహిత్య చరిత్రను తెలంగాణ దృక్కోణం నుండి రాస్తున్నారని ఆయా రచయితలు చేస్తున్న కృషిని తొలి తెలంగాణ సాహిత్య కరదీపిక అనే వ్యాసంలో విశ్లేషించారు.
1970-95 వరకు 25 సంవత్సరాల కాలంలో వచ్చిన తెలంగాణ శతక సాహిత్యంపై పరిశోధన చేసిన డా. పల్లేరు వీరస్వామి అనేకమంది శతక కవులను వెలుగులోకి తెచ్చిన తీరును, తెలంగాణ శతక సాహిత్యం పల్లేరు పరిశోధనలు అనే వ్యాసంలో వివరించారు. సమగ్ర శతక లక్షణాలు కలిగిన పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకంతో శతక ప్రక్రియ తెలంగాణ అనే పుట్టిందని అంటారు. అదే విధంగా ఉత్తర తెలంగాణలో వెలువడిన కథలపై ఉత్తర తెలంగాణ కధలు పేరున డా.ఆకునూరి విద్యాదేవి పరిశోధనలోని కథలను, వాటి ప్రాశస్త్యాన్ని ఉత్తర తెలంగాణ కథలు, సమగ్ర పరిశీలన అనే వ్యాసంలో చాటిచెప్పారు. తెలుగ కథా సాహిత్యంలో మొట్టమొదటి కథా రచయిత్రి బండారు అచ్చమాంబ అని, మొదటి తెలంగాణ కథా రచయిత మాడపాటి హనుమంతరావు అని విద్యాదేవి తన పరిశోధనలో తేల్చి చెప్పారని వివరించారు.
మనకాలపు తెలంగాణ యోగి వరకవి భూమాగౌడ్‌ అనే వ్యాసంలో ఒక సాధారణ వ్యక్తి కవిగా, యోగిగా ఎలా పరిణామం చెంది విశిష్టాద్వైత భక్తి తత్వాన్ని బోధించారో ఆయన జీవిత విశేషాలను, కవిత్వాన్ని విశధీకరించారు.
పత్రికా నీలమణి మాడభూషి శ్రీనివాసచార్య అనే వ్యాసంలో, శ్రీనివాసచార్య వరంగల్‌లో జనధర్మ పత్రిక స్థాపించి దాని ద్వారా నిజాం ప్రభుత్వ వ్యతిరేకోద్యమ చైతన్యం రగిలించిన తీరు, సాహిత్య వ్యాప్తికి చేసిన కృషిని వివరించారు. ఇంకా ఈ వ్యాస సంపుటిలో భర్తృహరి వైరాగ్యశతి అమ్మంగి వేణుగేపాల్‌ వ్యాసాలు, తొలి మహిళా పదకోశకర్త ముదిగంటి సుజాత రెడ్డి, అమృత ఏకాంత గానం, నిశ్శబ్ద యోధ, నిత్య సాహితీ వసంతుడు తదితర వ్యాసాలు అనేక ప్రామాణికమైన కొత్తవిషయాలతో వేటికవే ప్రత్యేకతను చాటుకున్నాయి. తెలంగాణ సాహిత్యంపై పరిశోధన చేయాలనుకునే వారికి చక్కని దారి దీపం ఇది.

  • వేల్పుల నారాయణ, 9440433475

పలుకు జెలి.(సాహిత్య విమర్శ వ్యాసాలు)
రచన : డా.టి.శ్రీరంగస్వామి
వెల: రు.100/`, పేజీలు: 104
ప్రచురణ: శ్రీలేఖ సాహితి, వరంగల్లు.
ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్‌ హౌజ్‌ అన్ని బ్రాంచీలు. మరియు, శ్రీలేఖ సాహితి సాంస్కృతిక సమాఖ్య,
27-14-53,మండల కార్యాలయం
ఎదురుగ, హసన్‌ పర్తి, వరంగల్లు-506371.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img