Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

దుఃఖ పర్వం

అది మాటకాదు కంఠంలో ఊపిరి
ఇది గీత కాదు దాటడానికి వీలులేని
ఒక భావోన్ముఖపు ఒప్పందం
చెప్పడం కూడా తప్పిదమే
మౌనంలో వాటిని
తగలబెట్టడమే ఉపశమనం
అటూ ఇటూ లోపలా బయటా
మాటాడావో పంచుకున్నావో దుర్గంధమయ్యావే
కకావికలాన్ని కిరీటంగా ధరించినట్టే
కొన్ని కన్నీటి చుక్కలు కూడా రాలనీకు
మునిపంటికింద అదిమిపట్టి
ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసల్లో
ముంపుకు గురిచేసి దిగమింగు
కొన్ని ఒప్పుకో బయటపడనీకు
దుఃఖం గేట్లు పగలనీకు
వింటూ పో నచ్చినవి నచ్చనివి
మనల్ని మనం కాస్తైనా మిగిల్చుకోవడానికి
జీవితమంతా మంద్రస్థాయి యుద్ధం సలపాలి కదా
ఇక్కడ వేరుపడడానికి వీలులేదు
ఉండాలి కత్తిపై సాము చేస్తూ
బతకాలి నెత్తిపై తొణికే కుండలవరసతో
ఇప్పుడు చెప్పు
కనురెప్పలవెనకాతలి గోసలు
కాస్తైనా నేను వింట
నిన్నేమీ అంచనా వెయ్య అగాధంలోకి తొయ్య
నలుగురి నాలుకల్లో నిన్ను పడనియ్య
మాటిస్తున్నా…
కడుపునిండా
ఏడువు పేగులు చాచి వెక్కి వెక్కి
చివరి రాగం వరకూ ఊపిరి కొసవరకూ
అది చీకట్లని చీలుస్తూ
ఇంకో వ్యథల పొద్దుని
ఇట్టాగే తెల్లారనీ మట్టిలోకి ఇంకిపోనీ
తాజాగా మొహం కడుక్కో కిరణాల ఒడ్డున
లేత ఎండ ముక్కలతో…
గట్టిగా నిట్టూర్చి ఇక తేలికపడి పో
కొత్తగా నడుస్తూ
నేనొక కాల్పనిక కలగన్నాననుకుంట
చూస్తా నిన్ను మాత్రం
అల్లంత దూరం పొయేవరకు తదేకంగా
ఒట్టు ఎక్కడా చెప్ప ఏ దిక్కుకు
ఈ దుఃఖ పర్వాన్ని రాయ ఏ బతుకుపేజీలో
ఇది ఇంతటితో సమాప్తం..
నాలో పరిసమాప్తం!

  • రఘు వగ్గు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img