Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పద్యంలో పాదుకొన్న ప్రజాహిత భావాలు!

ప్రజాహిత భావ పరంపర అంతా వచన కవిత్వంలో ఇరవయ్యో శతాబ్ది సూర్యోదయంతోనే ప్రసరించిందనే అభిప్రాయం ఒకటుంది. మనం సజీవులం కనుక, పాఠకులు మన బంధు మిత్ర పరంపర కనుకా మనమేం చేస్తే అది ఘనకార్యమని సులభంగా నమ్మించగలం. పద్యం రాయటానికి ఆధునిక కవి శ్రేణులకు శక్తి చాలదన్నది వాస్తవమే. యతి ప్రాసలూ, గణాలు నేర్చుకుని కూర్చుకునేటప్పటికే నీరసం వస్తుంది. కనుక నాలుగు ముక్కలు విసిరి ‘‘నా కళ్లు వెలుగు లోగిళ్లు..నీ కెందుకు కుళ్లు’’ అనేసి ఎంత గొప్పగా కవిత్వం రాసాం అనిపించుకుంటున్నాం. అచ్చువేసే పత్రికలున్నాయి కనుక తిరిగొచ్చే ప్రమాదం లేదు. రసిక జన పాఠకోత్తములెవ్వరూ ‘అదేం కవిత్వం నీ బొంద..’ అనే వాళ్లు లేరు. మనకెందుకని కొందరూ, మనం కూడా యిలాగే ‘‘నీ కుళ్లు కన్నీళ్లు..నాకు ఆవేశం పరవళ్లు..’’ అని రాసి పారేసి కవినామానికి అర్జీ పెట్టుకోవచ్చును కనుక వారిపై యీగ వాలనీయం. అదేమంటే అది విమర్శకుల పని మాకేల అంటారు. ఒకవేళ ఎవరైనా విమర్శకుడు ‘యిది కవిత్వం కాదు నాన్నా’’ అన్నాడనుకోండి వాణ్ణి సామాజిక ప్రగతి సాహిత్య శత్రువు, దుర్మార్గుడు, కళాభినివేశం లేని నక్క బల్లచెక్క అని బహు నామాలతో సత్కరించి కాని వదలరు. అటు అకవిత్వవంటకాలూ, యిటు ‘శత్రువులపై’ దండకాలూ కొనసాగిస్తే మన జోలికొచ్చే వాడుండడు. మనం ఏం రాస్తే అది కవిత్వం. ఏం కూస్తే అది నవత్వం అని భావించే సమూహం విస్తృతంగా విహరిస్తుంది. పోనీ రాయనక్కర్లేదు. పద్యాలు చదవండర్రా. వల్లె వేయండర్రా..వేమన, సుమతీ శతకాలు, కుమార, భాస్కర శతకాలు, కవి చౌడప్ప పద్యాలు నోట్లో తిరుగుతుంటే చాలు నా నాలుక నాట్యం చేయటం ప్రారంభిస్తుంది. బుర్రలో కర్రలు కవాతు చేయటం ఆరంభిస్తాయి. కదిలి కలం నుండి దూకటం నేర్చుకుంటాయి. అవి కవితా మూలికలని నీకే తెలిసిపోతుంది. లేదా ప్రక్కనున్న మిత్రుడూ, ఎదురొచ్చిన సహృదయుడూ చూసి చెప్పేస్తారు. అన్నట్లు సాహిత్యం సృష్టించటానికి ‘సహృదయం’ కావాలని పెద్ద పెద్ద అలంకారికులు సెలవిచ్చారట. ఇదేంటబ్బా అని ఆశ్చర్యపోనక్కరలేదు. అక్కడ సహృదయం అంటే జాలి, కరుణ, దానం, త్యాగం వంటి గుణ విశేషం అని కాదు..స్పందించ గల్గినది అని మాత్రమే అర్థం. రస గ్రహణ శక్తి కల్గినది అని మాత్రమే అర్థం. అది వున్న తక్షణం నీలో ఉన్న ‘‘ఆ నూరు మాటల మూటా నృత్యం చేయటం ప్రారంభిస్తుంది..’’ నా ఊహ చాంపేయమాలరస రాజ్యడోల నా ఊళ కేదారగౌళ’’ అనేస్తాడు.అందుకు నిజంగానే బుర్రలో పదాల మాటలు చేరాలి.అందుకు సరైన మార్గం నిన్నటి మన పద్యాల పరంపరను దాచుకోవటం. పద్యం ఎందుకయ్యా అంటే గుర్తుంచుకోవటం సులభం. ‘‘చదువది ఎంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబుగుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్‌ పదునుగమంచికూర నలపాకమునైనఉప్పు లేక రుచి పుట్టునటయ్య భాస్కరా’’ అన్నాడు. నిజమే కుసింత రసపోషణ లేకపోతే చదువులు వేస్టు టేస్టు రాదు..ఎవ్వడూ మెచ్చుకోడు. కూరలో ఉప్పు లేకపోతే మింగగలవేమిటి..వంకాయ వేపుడైనాటెంకాయ పచ్చడైనా..ఉప్పు లేకపోతే ఢాం’’ అనవచ్చును. భాస్కర శతకకారుడి కంటే మనమే గట్టిగా చెప్పి ఉండవచ్చును. కాని అది గుర్తుండదు. నీవు నుడివిన మాటల తుంపర ఎవ్వడి బుర్రలోకీ వెళ్లదు. ముహం మీద పడి అతగాణ్ణి విసిగిస్తుంది. అంతే గణ ప్రాసల కున్న సౌలభ్యం అదే. ‘‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ’’ అన్న పదం వలన అంతకు ముందున్న చరణంలోని నీతి వాక్యం మరింత వెలుగులో భాసిస్తుంది. మరింతగా నాదం మ్రోగిస్తుంది. ‘‘బలవంతుడు తనకేమని పలువురితో తగవులాట కూడదు సుమ్మీబలవంతమైన సర్పము’’ అదీ దాని విశిష్టత. నీతి బోధలో అహంకారం కూడదు. హీరోననుకోకు. అందరి మీద ఒంటికాలిమీద వెళ్లిపోకు. జాగ్రత్త’’ అన్న హెచ్చరిక దాగుందని తెలుస్తుంది. చిన్నపద్యంలో జీవిత విశేషం చొప్పించేశాడు. అదీ మనమూ చెయ్యవచ్చును వచనంలో. కానీ మన వచనం గుర్తుండదు. గాలికి పదాలు తడబడతాయి. ఎగిరిపోతాయి. ‘‘అదేరా కాస్త బలం ఉందని విర్రవీగిపోకు..నీకంటే బలంగలోడు ఎదురుపడి చావగొట్టేయగలడు. అని రాయవచ్చును. పాఠకులకు సారాంశం చేరవచ్చును. వారి బుర్రల్లోకి కూడా వెళ్లవచ్చును’ అక్కడ నిలవటానికి వీలైన పదార్థం లేదు. మనసు పొరల్లో అతుక్కోవటానికి కావలసిన జిగురు లుప్తమవుతుంది. నిజమే. పద్యాల్లో కూడా వందలు, వేలు వుత్త చెత్తవి ఉన్నమాట నిజమే’.. కాని వాటి అమరికలో లోనికి ప్రవేశించటానికి సులభంగా ఉంటాయి. వచన కవిత్వంలో వందలవేల సందేశాల పిలుపులు, హెచ్చరికలు, సామాజిక చైతన్య దీపికలూ ఉన్నమాట కూడా వాస్తవమే. కానీ అక్కడొక శ్రీశ్రీఇక్కడొక తిలక్‌, అక్కడొక ఆరుద్రఇక్కడొక మల్లారెడ్డి అక్కడొక కుందుర్తి` ఇక్కడొక అదృష్ట దీపక్‌..అంతే మిగతా శతాధిక వచన కవుల నుండి ఒక్కముక్క కూడా కోట్‌ చెయ్యలేం. బుర్రలోకి వెళ్లి కూడా అంతర్థాన మయ్యాయి. జ్ఞాపక రక్తంలోకి అంటే పోషకాహార పదార్థాలు లేవన్న మాట. అక్కడ వచన కవిత్వం తిరుగులేని ఓటమికి గురవుతుంది! అని కవి పండితులు గ్రహించి హెచ్చరించాలి..!
వ్యాస రచయిత సెల్‌: 9441360083

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img