Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ప్రపంచ నేత్రం రాహుల్‌ సాంకృత్యాయన్‌

‘ఓ నరుడా వెళ్ళు విశాల విశ్వమంతా పయనించు. దానికై నీకింకొక జీవితం లభ్యం కాదు. నీవెంత సుదీర్ఘకాలం జీవించినా నీ యవ్వనం తిరిగిరాదు. అంచేత అనంత విశ్వాంతరాళలో నిరంతరం పధికుడిగా సాధ్యమైనంత విజ్ఞానాన్ని సొంతం చేసుకో’ అనే లక్ష్యంతో మహాపండిట్‌, పర్యాటక సాహితీ పితామహుడు, పద్మభూషణ్‌ రాహుల్‌ సాంకృత్యాయన్‌ ప్రజలను జాగృత పరిచారు. దేశవిదేశాల్లో సుదీర్ఘ యాత్రా పర్యటనలు జరిపారు. ఆ యాత్రల వల్ల అనంతమైన అనుభవాలను, విజ్ఞానాన్ని పొందారు. ఇలా గ్రహించిన విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అనేక గ్రంథాలను రాశారు.18భాషల్లో పరిజ్ఞానం సంపాదించాడు. మొత్తం నలభై అయిదేళ్ళకు పైగా యాత్రలు చేసి చరిత్ర సృష్టించారు. ప్రాచీన మత గ్రంథాలను పరిశీలించి అందులో ఉన్న ఛాందస భావాలపై తిరుగు బాటు బావుటా ఎగరేశాడు. మూఢాచారాలను తీవ్రంగా ఖండిరచాడు. సమతా భావమే ధ్యేయంగా భావించి మార్క్సిజాన్ని స్వీకరించాడు. మానవ కళ్యాణానికి మార్క్సిజమే శరణ్యమని విశ్వసించాడు. ‘మహాపండిట్‌’ బిరుదును పొందిన సాంకృత్యాయన్‌ అసలు పేరు కేదార్‌నాథ్‌ పాండే. ఈయన 1893 ఏప్రిల్‌9న ఉత్తరప్రదేశ్‌ లోని అలంఘర్‌ జిల్లా పండహ అనే పల్లెలో జన్మించారు.
ఆయనకు ప్రపంచాన్ని చూడాలన్న కోరికతో ముందుగా కలకత్తా వెళ్ళాడు. అక్కడ బెంగాలీ భాషలో పోస్టర్లను చూసి ప్రభావితుడై ఆ భాషను నేర్చుకున్నాడు. ఆ పిమ్మట ఆయన ప్రయాగ, గంగోత్రి, కేదారనాథ్‌ తదితర ప్రాంతాలను పర్యటించాడు. అక్కడ సంస్కృతం నేర్చుకున్నాడు. నేపాల్‌, టిబెట్‌, శ్రీలంక దేశాలను పర్యటించాడు. అక్కడ అమూల్యమైన బౌద్ధ గ్రంథాలను సేకరించి, పరిశోధనలు జరిపాడు. వీటిపై అనేక గ్రంథాలను రాశాడు. ఇంగ్లండు, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, కొరియా, మంచూరియా తదితర దేశాలను పర్యటించాడు. 1922లో భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు ఛప్రాలో అరెస్టయ్యారు. ఫలితంగా ఏడు నెలలపాటు జైలు శిక్షను అనుభవించారు. కమ్యూనిస్టు నాయకునిగా రైతు మహాసభలను, ఉద్యమాలను నిర్వహించడం వల్ల జైలు శిక్షకు గురయ్యాడు. 1931లో రెండోసారి సింహళం వెళ్లేముందు మార్క్సు, ఎంగెల్స్‌ల కమ్యూనిస్టు ప్రణాళికను హిందీలోకి అనువదించాడు. 1935లో పూర్తి కాల కమ్యూనిస్టుగా మారాడు. 1937-38,1947-48సంవత్సరా లలో రష్యాలోని లెనిన్‌ గ్రాడ్‌ విశ్వ విద్యాలయంలో సంస్కృత ప్రొఫెసర్‌గా పనిచేశారు. చైనాలో నాలుగు నెలల పాటు పర్యటించినప్పుడు అక్కడి విశేషాలపై రెండు పుస్తకాలు రాశారు. తన పర్యాటక అనుభవాల గురించి పూసగుచ్చినట్టుగా హిందీ, సంస్కృతం, భోజ్‌పురి, పాళీ, టిబెటన్‌ భాషల్లో రచించారు.
ఉర్దూ, పర్షియన్‌, అరబిక్‌, తమిళం, కన్నడ, ఫ్రెంచ్‌, రష్యన్‌ భాషల్లో కూడా ప్రావీణ్యం ఉన్న రాహుల్‌ తన ఇరవైవ ఏట నుంచి రచనలు చేయడం మొదలు పెట్టాడు. ఒక పక్క యాత్రలను జరుపుతూ మరో పక్క 150 గ్రంథాలను రాశారు. వీటిలో మేరా జీవన్‌ యాత్ర(5సంపుటులు), మానవ సమాజ్‌, వైజ్ఞానిక భౌతిక వాద్‌, సింహసేనాపతి, వోల్గాసే గంగా తక్‌ ముఖ్యమైనవి. వీటితో పాటు చరిత్ర, జానపదం, నిఘంటువులు తదితర అంశాలను సైతం స్పృశించారు. 1958లో ‘మధ్య ఆసియాకా ఇతిహాస్‌’ గ్రంథానికి సాహిత్య అకాడమీ అవార్డు, 1963లో పద్మభూషణ్‌ పురస్కారం ఆయనకు లభించింది. అనారోగ్యానికి గురై మెరుగైన చికిత్స కోసం రష్యా వెళ్లాడు. తిరిగి స్వదేశానికి వచ్చిన తరువాత 1963 ఏప్రిల్‌ 14న తనువు చాలించాడు. దేశం ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిని, గొప్ప యాత్రా పరిశోధకుడ్ని, విశేష రచయితను కోల్పోయింది.
– వాండ్రంగి కొండలరావు,
సీనియర్‌ పాత్రికేయుడు, సెల్‌ 94905 28730

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img