Friday, April 19, 2024
Friday, April 19, 2024

మతతత్వవాదుల చెర నుంచి శివాజీని విడిపించిన పన్సారే

మంచి చెడు రెండూ జంటపదాలు. మంచిని మెచ్చే వారు సాధారణంగా చెడును విస్మరిస్తుంటారు. కానీ అదును చూసుకుని చెడు బుసలు కొడ్తుంది. మనం గోవింద్‌ రనడే, కార్వే, అగర్కర్‌, సాహూ మహా రాజ్‌, మహాత్మా ఫూలే, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ను తలుచుకుంటూ ఉంటాం. నాథూరాం గాడ్సే మహాత్మా గాంధీని హతమార్చినవిషయాన్ని అంతగా పట్టించుకోం. కానీ గాడ్సేకు గుడి కట్టే వారు బయలుదేరారు.
ఛత్రపతి శివాజీ అంటే చాలా మంది ఆరాధిస్తారు. అయితే ఆయన చేసిన అనేక మంచి పనులకోసం కాకుండా ఆయనను హిందువుల సం రక్షకుడిగా భావించి అభిమానిస్తారు. శివాజీ సామాన్య ప్రజలకు చేసిన మేలును ప్రస్తావించేవారు జాతీయతావాదం, మతతత్వం పెచ్చరిల్లిపోయిన స్థితిలో ఎక్కడోగాని తారసపడడం లేదు. శివాజీ న్యాయం కోసం నిల బడ్డారు. మహిళల భద్రతకు పూచీ పడ్డారు. కులమతాలకు అతీతంగా సైన్యాన్ని పటిష్ఠం చేశారు. కమ్యూనిస్టు నాయకుడు, సంస్కరణాభిలాషి గొవింద్‌ పన్సారే (1933 నవంబర్‌ 25 -2015 ఫిబ్రవరి 20) శీవాజీలో ఉన్న ఈ ప్రజానుకూల అంశాలను వెలికి తీసి ‘‘శివాజీ ఎవరు’’ అనే చిరు పుస్తకం రాశారు. మతోన్మాదులు దీన్ని సహించలేక పన్సారేను 2015లో హతమార్చారు. శివాజీని హిందూ మత సంరక్ష కుడిగా చూడడంతో పాటు ఆయనను ప్రధానంగా మరాఠా వీరుడిగానే చూడడం జాతీయవాదులకు ప్రధానమైంది. కానీ శివాజీ బతికున్న రోజుల్లోనే కర్నాటక, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలలో కూడా మంచి అభిమానం సంపాదించారు. దీనితో మతావేశం పూనిన వారికి ప్రమేయంలేదు. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమ సమయంలో పి.కె.ఆత్రే లాంటివారు ఆయనను మహారాష్ట్ర నాయకుడిగానే పరిమిత దృష్టితో చూస్తే శివసేన ఆయనను హిందూ రాజుగా కీర్తించింది. ఇది శివాజీ అసలు స్వభావానికి విరుద్ధమైన పోకడ. ముస్లిం వ్యతిరేక ఎజెండాను ముందుకు తోయడం కోసం శివసేన శివాజీ పేరును బాగా వాడుకుంది. ‘‘జై భవానీ, జై శివాజీ’’ అన్న నినాదాలిస్తూ దళితుల మీద విరుచుకుపడిరది.
శివాజీ మహారాష్ట్ర సామాజిక-రాజకీయ సంస్కృతిలో భాగం అయిపోయాడు. శివాజీ మీద ఉన్న అభిమానానికి సంవేదన జోడిరచి కొన్ని రాజకీయ పార్టీలు తమ సంకుచిత లక్ష్యం నెరవేర్చుకున్నాయి. ఈ ధోరణులనే గోవింద్‌ పన్సారే ‘‘శివాజీ ఎవరు’’ అన్న గ్రంథంలో నిలదీశారు. శివాజీని హిందుత్వ ప్రచారానికి వాడుకోవడాన్ని పన్సారే తీవ్రంగా వ్యతిరేకించారు. శివాజీ నిర్భీకతను, ధైర్య సాహసాలను, వివేకాన్ని విస్మరించి ఆయనను హిందుత్వ వాదిగా దిగజార్చే యత్నాలను ఎండ గట్టారు. పన్సారే గ్రంథం ప్రచారంలో ఉన్న ఈ కూటవాదాలన్నింటినీ పటాపంచలు చేసింది. అలాంటప్పుడు మూర్తీభవించిన మూర్ఖత్వం రాజ్యమేలుతున్న స్థితిలో పన్సారేను హతమార్చడంలో ఆశ్చర్యం ఏముంటుంది. దుండగుల తుపాకీ తూటాలకు బలై గాయపడి పన్సారే 2015 ఫిబ్రవరి 20న ప్రాణాలు వదిలారు. అంతకు ముందు యు.పి.ఎ. హయాంలోనే 2013 ఆగస్టు 20న ప్రసిద్ధ వైద్యుడు, సామాజిక కార్యకర్త, హేతువాది, రచయిత నరేంద్ర అచ్యుత్‌ దభోల్కర్‌ ను హతమార్చారు. ధబోల్కర్‌ను చంపిన వారు కూడా ‘‘జై భవానీ జై శివాజీ’’ అని నినాదాలు చేయడం యాదృచ్చికం ఏమీ కాదు. దభోల్కర్‌ మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్‌ సమితి ఏర్పాటు చేసి మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడారు.
నిర్దిష్ట చారిత్రక దశలో శివాజీ మొగల్‌ సామ్రాజ్యాధినేతలతో తలపడి ఉండవచ్చు. కానీ ఆ యుద్ధాలు సామ్రాజ్య విస్తరణలో భాగమే తప్ప ముస్లింలకు వ్యతిరేకమైనవి కావు. మొగలుల పరిపాలన కొనసాగుతున్న దశలోనే అనేక మంది హిందూ రాజులు తమ ఏలుబడిని విస్తరించు కోవడానికి, ఇతర రాజుల భూభాగాలను కాజేయడానికి యుద్ధాలు చేశారన్న వాస్తవం చరిత్ర అంతో ఇంతో తెలిసిన వారికి అంతుపట్టని విషయ మేమీ కాదు. శివాజీ పరిపాలన ఆధునికమైంది. ఈ ఆధునికతను, మనం సంపాదించిన స్వాతంత్య్రాన్ని, సామాజిక సమానత్వాన్ని సహించని వారే శివాజీని హిందుత్వ గాటకు కట్టేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని నిర్భయంగా ఎదిరించినందుకే పన్సారే తన ప్రాణమే వదులుకోవలసినంత త్యాగం చేయవలసి వచ్చింది. శివాజీ వ్యక్తిత్వాన్ని వివరించడానికి దీక్షతో, మొక్కవోని సంకల్పబలంతో, నిజాయితీతో కృషి చేయడం మతో న్మాదులు జీర్ణించుకోలేక పోయారు. గౌరీ లంకేశ్‌, ఎం.ఎం.కల్బుర్గి, సతీశ్‌శెట్టి లాంటివారు కూడా పురోగామి విశ్వాసాలు ప్రోది చేసినందుకే ‘‘జై భవానీ, జై శివాజీ’’ అని నినదించే వారి తూటాలకు బలయ్యారు.
శివాజీ ఎవరు గ్రంథ రచయిత పన్సారే 1952లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. మహారాష్ట్ర సీపీఐ విభాగం కార్యదర్శిగా ఉన్నారు. కార్మికోద్యమంలో కీలక పాత్ర పోషించారు. న్యాయవాద వృత్తిలోనూ కార్మిక వర్గానికే అండగా నిలిచారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. పన్సారే మంచి వక్త, బహుగ్రంథకర్త. శివాజీ ఎవరు అన్న గ్రంథం ఆయన మరాఠీలో రాస్తే అది తరవాత హిందీ, ఇంగ్లీషు లాంటి భాషల్లోకి అనువాదమైంది. దాదాపు లక్షన్నర ప్రతులు అమ్ముడైంది. సవ్యంగా ఆలోచించాలనుకునే వారు శివాజీ ఎవరు పుస్తకాన్ని తప్పకుండా చదవాలి.
పన్సారే సంయుక్త మహారాష్ట ఉద్యమంలో, గోవా విమోచనోద్యమంలో చురుకుగాపాల్గొన్నారు. 1962లో భారత్‌-చైనా యుద్ధం జరిగినప్పుడు ఆయన చైనా సమర్థకుడన్న ఆరోపణతో అరెస్టు చేశారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పన్సారే నడిపిన ఉద్యమాలు ఎంత లోతైనవిఅంటే ఆయన పుత్రకామేష్టి యజ్ఞాలను వ్యతిరేకించారు. పుత్రకామేష్టి యజ్ఞం లక్ష్యం సంతాన ప్రాప్తి కాదు. కొడుకు పుట్టడంకోసం. అంటే ఈ యజ్ఞ లక్ష్యమే ఆడపిల్లల జననానికి విరుద్ధం అన్న మాట. టోల్‌ గేట్ల వద్ద పన్ను వసూలుచేయడాన్ని, నాథూరాం గాడ్సేను మహాపురుషుడిగా చిత్రించడాన్ని సైతం ఆయన వ్యతిరేకించారు.
హిందుత్వ వాదులు ప్రచారం చేస్తున్నట్టుగా శివాజీ సంకుచిత హిందుత్వవాది కాదు. మేలిముత్యం లాంటి జాతీయవాది. ఆయన కేవలం రాజు కాదు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించిన పరిపాలకుడు. ఆయనను గో సంరక్షకుడి స్థాయికి, బ్రాహ్మణ పరిరక్షకుడిగా కుదించడం అన్యాయం. ఆయన జనాన్ని లూటీచేసిన పాలకుడు కాడు. ఎంత చిన్నదైనా ఒక సామ్రాజ్య వ్యవస్థాపకుడు. బ్రిటిష్‌వారు మన దేశ చరిత్ర రాసేటప్పుడు హిందూ, ముస్లిం అని యుగ విభజనచేశారని ఈసడిరచేవారు పాలితుల విషయంలో ఏమాత్రం వివక్షచూపని శివాజీని మాత్రం హిందూ రాజుగా కట్టిపడేయడం మతోన్మాద పూరిత దుర్మార్గం.
-ఆర్వీ రామారావ్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img