Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మార్క్సిస్టు సౌందర్య శాస్త్రవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి గియోర్గి లూకాచ్‌

డా॥ తక్కోలు మాచిరెడ్డి, సెల్‌: 9666626546

మధ్య యూరప్‌లోని ఒక చిన్న దేశం హంగేరి. 1885 వ సంవత్సరం ఏప్రిల్‌ 13 న బుడాపెస్ట్‌లో ఓ సంపన్న యూదు కుటుంబంలో జన్మించాడు గియోర్గి లూకాచ్‌. అతని నాన్న ఓ బ్యాంకు నిర్వాహకుడు. అమ్మ కఠినమైన క్రమశిక్షణ అమలు చేసే వ్యక్తి. కుటుంబంలోని వారందరూ యూదు వాదాన్ని తిరస్కరించేవారే. లూకాచ్‌ తొమ్మిదవ ఏటనే హోమర్‌ రాసిన ‘ఇలియద్‌’ చదివాడు. 15 ఏళ్ల ప్రాయంలో బాదలేర్‌, ఎమిలిజోలా, ఇబ్సెన్‌, స్విన్‌బర్న్‌ రచనల రుచి చూశాడు. ఫ్రెంచ్‌ భాష నేర్చుకున్నాడు. జర్మనీ, ఆస్ట్రియా ఘటనల్ని ప్రభావితం చేసే పనిలో ఆయన జర్మన్‌ భాషపై కూడ పట్టు సాధించాడు. 18 వ ఏట తాను రాసిన రచనల్ని నాశనం చేశాడు. 1906 లోఅంటే తన 21 వ సంవత్సరం వయసులో బుడాపెస్ట్‌లో డాక్టరేట్‌ డిగ్రీ పొందాడు. తర్వాత ఎక్కువ భాగం బెర్లిన్‌, హైడల్‌బర్గ్‌ పట్టణాలలో నివసించాడు. 1908 లో కార్ట్‌మార్క్స్‌ రాసిన ‘పెట్టుబడి’ చదివాడు. జర్మన్‌ జాతివాదం కారణంగా వచ్చిన మొదటి ప్రపంచ యుద్ధాన్ని నిరసించాడు. ఆ సమయంలో రోజా లక్సెమ్‌బర్గ్‌ రచనలు చదివాడు. హంగెరీ సామ్యవాద పార్టీలో చేరి కమ్మూన్‌లో (19181919) తన పాత్ర నిర్వహించాడు. 1919 లో కొంత కాలం పాటు హంగేరిలో ఏర్పాటు చేసిన ‘హంగేరి సోవియత్‌’ ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా పని చేశాడు. ప్రపంచ విప్లవం వస్తుందని నమ్మాడు. ఈ నమ్మకంతోనే ‘‘చరిత్రవర్గ చైతన్యం’’ అనే ఉద్గ్రంథం రాశాడు. (1923) అందులో లూకాచ్‌ పై హెగెల్‌ ప్రభావం గమనించవచ్చు. ‘‘ఆర్థికానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం కాదు మార్క్స్‌ వామపక్ష సిద్ధాంత విలక్షణత, సమస్తత అభివర్గానికి ప్రాధాన్యం ఇవ్వడమే దాని విశిష్టత’’ అని అంటాడు లూకాచ్‌. సమస్తత ఒక మౌలిక భావన. ఈ భావన ద్వారా కలిగే చైతన్యం ప్రపంచాన్ని నిర్దేశిస్తుంది. ఒక క్రమంలో లేనట్లు కన్పించే ఘటనలను పొందుపరచి మనకు అవగాహన అయ్యేట్లు చేస్తుంది. ఈ సమస్తతా భావన తత్వశాస్త్రం , కళ ఈ సమస్తతా సారం కోసం అన్వేషిస్తాయి. ‘‘చరిత్ర వర్గ చైతన్యం’’ అనే గ్రంథం ఏడవ ఎడిషన్‌కు రాసిన భూమికలో (1967) లెనిన్‌ గురించి రాస్తూ లూకాచ్‌ ‘‘లెనిన్‌ ఒక సిద్ధాంత కర్త, వ్యవహారదక్షుడు మాత్రమే కాదు, ‘ఫిలాసఫర్‌ ఆఫ్‌ ప్రాక్సిస్‌’ అని అభివర్ణిస్తాడు. ఆలోచన, ఆచరణ కలగలిసి ఉండేదాన్ని ప్రాక్సిస్‌ అంటారు. మనిషి వస్తువుగా ఎలా మారతాడో చెబుతూ ‘సరుకుల మహిమారాధన’ ఆధునిక పెట్టుబడివాద యుగపు ప్రత్యేకమైన సమస్య అని అంటాడు లూకాచ్‌. ప్రస్తుతానికి అన్వయించుకుంటే, మనిషిని ఇపుడు వస్తువు కంటే సరుకు కంటే హీనంగా పరిగణిస్తున్నారు. పెట్టుబడివాద సమాజంలో మనుషులు చేసిన వస్తు ప్రపంచం మనుషుల పైనే పెత్తనం చలాయిస్తుంది. మనుషులు కేవలం పదార్థాలుగా, వస్తువులుగా, సరుకులుగా, వూరికే కూచునే నిష్క్రియ ప్రేక్షకులుగా తయారవుతున్నారు.
వస్త్వీకరణ వల్ల కలిగే పరిణామాల్లో ఒకటి సమస్తత యొక్క ప్రతి రూపమూ ధ్వంసం కావడం. ఈ సమస్తతా భావన కార్ల్‌మార్క్స్‌ హెగెల్‌ నుంచి తీసుకున్నాడు. దీన్నే లూకాచ్‌ విశ్లేషించాడు, అన్వయించాడు. సమస్తత ద్వారానే వాస్తవికతను అర్థం చేసుకోవడం, అందులోకి చొరబడగలగడం వీలవుతుంది. అది వర్గం మాత్రమే చేయగలుగుతుంది. అపుడే పరివర్తన సాధ్యమౌతుంది అని లూకాచ్‌ భావిస్తాడు. ఆనాటి యూరప్‌ రాజకీయాల్ని విశ్లేషిస్తూ హిట్లర్‌ గురించి చెప్పాడు లూకాచ్‌. ఒక రాజనీతిజ్ఞునిగా హిట్లర్‌ జర్మనీ అధ్యక్షుడు ఎలా అయ్యాడో విశ్లేషించాడు. ఏకాధికార పెట్టుబడివాదం ఫాసిజానికి దారి తీసింది. అరికట్టలేని నిరుద్యోగిత, ప్రజల దారిద్య్రం వల్ల జనంలో పెట్టుబడివాద వ్యతిరేక పవనాలు వీచసాగాయి. నిరాశ, నిస్పృహ చెందిన మధ్య తరగతి జనం, బుద్ధి జీవుల ప్రజా సమూహాలు జాతీయ సమాజవాదం వైపు మొగ్గారు. జర్మనీకి ఒక విశ్వసనీయమైన, కష్టాలు తీర్చగలిగే అద్భుతాలు చేయగల ఒక నాయకుడు కావలసి వచ్చింది. ‘‘దైవ దత్త అసాధారణవ్యక్తి’’గా హిట్లర్‌ రావడం జరిగింది. అంతే ఇక ఏముంది? ఫాసిజంకు దారి సుగమమైంది. దానికి జర్మన్‌ భూమి పరిపక్వమైనట్లు అయింది. ఇదీ లూకాచ్‌ విశ్లేషణ. మన దేశంలో ఇపుడు దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది.
లూకాచ్‌ సౌందర్య శాస్త్రం
‘కళాతాత్వికత’ అనే వ్యాసంలో లూకాచ్‌ సౌందర్యాత్మక స్థాయిని సంతరించుకొనే ప్రకృతి సౌందర్యానుభూతి ఉండవచ్చు అని అంటాడు. అందువల్లే ప్రకృతికి సంబంధించిన ఓ సౌందర్య శాస్త్రం రూపొందించ వచ్చు అని అభిప్రాయపడతాడు. ఆధునికతా వాదం కళను ఉన్నతీ కరించదు. సరికదా అది కళనునిజమైన కళను తిరస్కరిస్తుంది అని ప్రకటిస్తాడు. సోషలిస్టు సమాజంలో కూడ విమర్శనాత్మక వాస్తవికతా వాదంఉంటుంది. ఉండాలి అని అంటాడు లూకాచ్‌. మన రస సిద్ధాంతాన్ని పోల్చినట్లు అన్పించే ఒకమాట అంటాడు ఆయన. పాఠకుడు లేక శ్రోత, లేక ప్రేక్షకుడు పునరనుభవిస్తాడు అని అంటూ అది తనదైన అనుభూతి అనీ, కళ నుంచి పొందే అనుభూతి అనీ విశదీకరిస్తాడు. పునరనుభూతి ఎంత తీవ్రంగా ఉంటే అంత స్వతఃస్ఫూర్తంగా కూడ ఉంటుంది. ఆ అనుభూతి అని చెబుతాడు. 1930 దశాబ్ది నుంచి లూకాచ్‌ కళా సమస్యల్ని గురించి ప్రత్యేకంగా ఆలోచించాడు. మాస్కోలో ఉన్నా స్టాలిన్‌ వాదాన్ని ముఖ్యంగా జ్దానొవ్‌ సూత్రీకరణల్ని అంగీకరించేవారు కాదు, బాహాటంగా కాక నర్మగర్భంగా విమర్శించేవారు. మార్క్స్‌వాదాన్ని సౌందర్యశాస్రానికి ఎలా అన్వయించాలి అనేఅంశాన్ని లోతుగా ఆలోచించాడు. సంప్రదాయాన్ని అర్థంచేసుకోవడాన్ని అధిగ మించాలి అని భావించాడు. మార్క్స్‌వాదం సమస్త సంప్రదాయానికే వ్యతిరేకం కాదని నమ్మాడు, కార్ల్‌మార్క్స్‌, షేక్స్పియర్‌ నాటకాల్ని, కవితల్ని మెచ్చుకునేవాడనీ లూకాచ్‌ గుర్తుచేసేవాడు. ప్రకృతి కంటే, చిత్రీకరించిన ప్రకృతి అందంగా ఉంటుందనే వాదం సరికదని అనేవాడు. ప్రకృతిసౌందర్యాన్ని ఆస్వాదించలేనివాడు కళను ఎలా ఆస్వాదించగలడు అని ప్రశ్నిస్తాడు. సుందర వస్తువుల్ని, అందమైన ప్రకృతినీ ఆస్వాదించేశక్తి మనకు మానవ పరిణామ చరిత్ర ఇచ్చింది. కళా ప్రయోజనాన్ని గురించి రాస్తూ లూకాచ్‌ కళ మనల్ని కుల, మత దేశాలకు అతీతంగా ఉంచుతుంది. దేశ కాలాలను అధిగమించేట్లు చేస్తుంది. జీవితంలో గొప్ప క్షణాల్ని ఇస్తుంది. ఇది ఒక జీవిత విలువ. కళకు ఒక ప్రత్యేకత ఉంటుందని, ఒక సమగ్రత ఉంటుందని అంటాడు. లూకాచ్‌ దృష్టిలో శ్రేష్ఠమైన కళ మానవ జీవితసంపూర్ణత్వాన్ని సమగ్రంగా ప్రతిఫలించాలి. అంతేకాదు కళాకారునికి ఓ ప్రపంచ దృక్పథం (జర్మన్‌ భాషలో వెల్టన్‌ షావుంగ్‌) ఉండాలంటాడు. ‘వెల్టన్‌ షావూంగ్‌’ అంటే సంవేదనతో కూడిన ప్రపంచ దృక్పథం.
‘‘యూరప్‌లో వాస్తవికతావాదంఒక అధ్యయనం’’ అనే తన గ్రంథంలో లూకాచ్‌ రష్యన్‌ రచయితలను గురించిరాస్తూ కొన్ని విషయాలు ప్రస్తావిస్తాడు.బెలీన్‌స్కి, ఫూష్కిన్‌ను ప్రశంసించాడనీ, చెర్నిషేవ్‌స్కి దొబ్రల్యు బొవ్‌ విప్లవ ప్రజాస్వామిక వాదులనీ, (మన గురజాడ లాగవ్యాస రచయిత), చెర్నిషేవ్‌స్కి తొల్స్‌తోయ్‌ రచనలపైనా, అతని వాస్తవికతావాదం పైనా రాశాడనీ వివరిస్తాడు. ఈ ఉద్గ్రంథంలోనే తొల్స్‌తోయ్‌ను గురించి గోర్కీతో లెనిన్‌ అన్న మాటల్ని లూకాచ్‌ ఉన్నదున్నట్లు ఉటంకిస్తాడు. లెనిన్‌ ఉద్వేగంతో ఇలా అన్నాడట ‘‘ఓహో ఎంత విరాట్‌ రూపం! మహత్తర మూర్తిమత్వం! మన ఆదర్శ కళాకారుడు! అంతకంటె చెప్పుకోదగ్గ అతని రైతు కంఠం! రైతు ఆలోచనా విధానం! స్వభావ రీత్యా కూడ ఆయన ఒక రైతే! తొల్స్‌తోయ్‌ రాకముందు మన సాహిత్యంలో ఒక్క రైతు రచయిత లేడు’’ గోర్కి కళ్లలోకి చూస్తూ నిక్కచ్చిగా లెనిన్‌ అంటాడు‘‘యూరప్‌లో అతనికి సాటి వచ్చేదెవరు? ఎవరూ లేరు మరి!’’ అదే గ్రంథంలో బాల్జాక్‌ను గురించిన ఓ వ్యాసం ఉంది. బాల్జాక్‌ నవల ‘‘రైతులు’’ లో వాస్తవికతా వాద పాత్ర చిత్రణ ఉంది. జమీందార్లకు వ్యతిరేకంగా రైతులు, వ్యాపారస్తులు చేసిన పోరాటాలు ఈ నవలలో వర్ణించారు. జమీందార్లను ఎదిరించిన రైతులు చిన్నచిన్న కమతాలను ఏర్పాటు చేసుకుంటారు. కాని పెట్టుబడి వాదులు పంజా విసిరి రైతుల్ని కొల్లగొడతారు. బాల్జాక్‌ స్వయంగా అభ్యుదయవాది కాకపోయినా ఆయన రచనల్లో వాస్తవికతావాదం చోటుచేసుకుంది. ‘‘యూరపులో వాస్తవికతా వాదం ఒక అధ్యయనం’’ అనే ఈ గ్రంథంలో గమనించాల్సిన మరో అంశం ఉంది. అదేమిటంటే మార్క్స్‌వాదాన్ని ఆధునికతావాదులు ఇదంతా కాలం చెల్లిన భావజాలం. ఇది అభిలషణీయం కాని 19వ శతాబ్ది వారసత్వం’’ అని కొట్టి పారేస్తారు. ఉద్దేశ పూర్వకంగానో, ఉద్దేశరహితం గానో, సచేతనంగానో అచేతనంగానో వీరు ఫాసిస్టు భావజాలాన్నిఅంటే సంస్కృతినీ మానవతా వాదాన్నీ తిరస్కరించే ఫాసిస్టు భావజాలాన్ని సమర్థిస్తారు అని లూకాచ్‌ స్పష్టం చేస్తాడు. లూకాచ్‌ను గురించిన ఒక అపోహ ఉంది. అతడు కవిత్వాన్ని తక్కువ చేసి చూసేవాడని. ఇది తప్పు అని ప్రొఫెసర్‌ నామ్‌వర్‌సింగ్‌ స్పష్టం చేస్తాడు. కవిత్వాన్ని గురించి లూకాచ్‌ ఎలా భావిస్తాడో అతని మాటల్లోనే ‘‘పొయెట్రీ ఈజ్‌ ది మదర్‌ టంగ్‌ ఆఫ్‌ మ్యాన్‌ కైండ్‌’’ కవిత్వం ‘‘మానవ జాతి మాతృభాష.’’ లూకాచ్‌ వస్తువుకూ రూపానికీ సమాన ప్రాధాన్యం ఇస్తాడు. కాని అతడు రూపవాది కాడు, రూపాన్ని సామాజిక అంశంగా పరిగణిస్తాడు. నిజంగానే రూపం సామాజిక సారాన్ని ప్రతిబింబిస్తుంది. పద్యాలు రాచరిక యుగానికి సామంతవాదానికి చెందినవే. ఆధునిక యుగానికి చెందిన రూపంకాదు అది. ‘నవలా సిద్ధాంతం’ (1915) అనే తన గ్రంథంలో లూకాచ్‌ మహాకావ్యం స్థానంలో ఆధునిక యుగంలో నవల వచ్చింది అని అంటాడు. మహా కావ్యం జీవిత సంపూర్ణత్వానికి రూపం ఇస్తుంది. నవల దాగివున్న జీవిత సంపూర్ణత్వాన్ని వెలువరిస్తుంది. నవలలో వాస్తవికత ఆవిష్కరిస్తారు. నవలా రచనలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్వాభావికంగా నవల గేయాత్మకతనూ, నాటకీయతనూ సంతరించుకునే ప్రమాదం ఉంది. వాస్తవికతను కుదింపచేసి వర్ణనలకు ప్రాధాన్యం ఇస్తే ఆ నవల కాలక్షేప నవలగా మిగిలిపోతుంది. నవలను ఆయన ‘అర్ధకళ’ గా భావిస్తారు. అర్ధ కళ అయినా నవల కొన్ని కఠినమైన కళా నియమాల్ని పాటించవలసి ఉంటుందని అంటాడు. నవలలో నైతికాంశం ప్రతి ఘట్టంలోను దృశ్యమానమవుతూ ఉంటుంది. ప్రతి ఘట్టానికీ రచయిత స్వీయాత్మక ప్రతిచర్యను వ్యక్తీకరిస్తూ పోతే అది పాఠకుల్ని అలరించగలదేమో కాని, ఆ రచన గంభీర పాఠకున్ని ఆకట్టుకోలేదు. నగిషీలు రచనకు పనికిరావు. నవలా రచయిత రచన పట్ల నిర్మమంగా ఉండాలి. అపుడే మనిషి యొక్క పరాయీకరణ వ్యక్తం కాగలదు.
గియోర్గి లూకాచ్‌ రాసిన ‘సౌందర్య శాస్త్రం’ ఉద్గ్రంథం ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చింది. మొదట 191112 శీతాకాలంలో ఫో్లంన్స్‌ పట్టణంలో ఓ స్వతంత్ర సమగ్ర సౌందర్య శాస్త్రం రాయాలని అనుకొన్నాడట. ఐడెల్‌బర్గ్‌ 1912 14 మధ్య దీనిపై కొంత కృషి చేశాడు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు. 1930 లో ఓ ప్రణాళికా బద్ధమైన సౌందర్య శాస్త్రం రాయాలనేది ఒక యోచనగా మాత్రమే మిగిలింది. రెండు దశాబ్దాల తర్వాత, అంటే 50 వ దశాబ్దంలో ఆ కల నెరవేరింది. హంగేరియన్‌ భాషలో రాసిన ఈ గ్రంథం మన భాషల్లోకి ఇంకా అనువాదం కాలేదు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గియోర్గి లూకాచ్‌కు మన దేశంలో రావాల్సినంత గుర్తింపు రాలేదేమో.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img