Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మూడు పదుల పుట్టుమచ్చ

ఆర్వీ రామారావ్‌
‘…నా మత విశ్వాసాలు కుట్ర
నా సామూహిక ప్రార్థనా సమావేశాలు కుట్ర
నేను మత్తుగా పడి ఉండటం కుట్ర
నేను మేల్కొనేందుకు ప్రయత్నించడం కుట్ర
నేను నలుగురిలో కలిసి వుండాలనుకోవడం కుట్ర
నా అజ్ఞానం కుట్ర, నా వెనుకబాటుతనం కుట్ర
నేను పెళ్లాడటం కుట్ర, నేను పిల్లల్ని కనడం కుట్ర’

1991లో ఖాదర్‌ మొహియుద్దీన్‌ ‘పుట్టుమచ్చ’ పేరుతో దీర్ఘకవిత రాసినప్పుడు ఇంత నిరాశ ఎందుకు అనిపించింది. సకల పీడితవర్గాలను చైతన్యపరచి అభ్యుదయ పథంలో నడిపించవలసిన వారు బాధ్యత విస్మరిస్తున్నందు వల్లే అస్తిత్వవాదాలు పెరుగుతున్నాయేమో అని భావిస్తున్న రోజులవి.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే తాను ఈ దేశంలో ఉండలేనని ప్రసిద్ధ కన్నడ రచయిత, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత యు.ఆర్‌. అనంత మూర్తి అన్నారు. మోదీ ప్రధాని అయిన తరవాత మూడు నెలలకే అనంత మూర్తి మృతి చెందారు. ఆ తరవాత ఆయన జీవించి ఉంటే ఏమయ్యేదో తెలియదు.
‘ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల గురించి వెల్లడిరచేందుకు నేనొక ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నా. నాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు హార్వర్డ్‌లో చదువుతున్నాడు. కుమార్తె లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి పట్టా పొందింది. ఇక్కడ వాతావరణం సరిగాలేదు కాబట్టే అక్కడే స్థిరపడాలని వారికి సూచించాను’… ఇవి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌.జె.డి.) నాయకుడు అబ్దుల్‌ బారీ సిద్ధీఖీ ఇటీవల అన్న మాటలు. సిద్ధిఖీ వ్యాఖ్యలు భారత్‌లో ముస్లింల దురవస్థను చాటుతున్నాయి. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. దేశంలో నివసించడం ఆయనకు అంతకష్టంగా ఉంటే, ఇక్కడ పొందే సౌకర్యాలు, సౌలభ్యాలు వదిలేసి పాకిస్తాన్‌ వెళ్లిపోవాలని బీజేపీ నాయకులు అన్నారు.
దేశ విభజన సమయంలో రేగిన గాయాలు క్రమంగా మానుతాయనుకున్న దశలో బాబ్రీమసీదు వివాదం ముస్లింలను మరీ పరాయివాళ్లను చేసింది. బాబ్రీ విధ్వంసం కాకముందే ఖాదర్‌ సుదీర్ఘ కవిత పుట్టుమచ్చ రాశారు. ఇప్పటి పరిస్థితిని చూస్తే ఖాదర్‌ చాలా క్రాంతదర్శిలా కనిపిస్తున్నాడు.
అందుకే…
…పట్టెడన్నం కోసం
పేవ్మెంట్ల మీద పూలమ్ముకుంటాను
పండ్లమ్ముకుంటాను, పల్లీలమ్ముకుంటాను
గొడుగులు బాగుచేస్తుంటాను. గడియారాలు బాగు చేస్తుంటాను
వీధరుగుల మీద దర్జీ పని చేస్తుంటాను
దూదేకుతుంటాను దినం గడుపుకుంటాను
ఏ గొడవల్లేకుండా
బతుకును వెళ్లమార్చాలనుకుంటాను
ఉన్నట్టుండి ఎందుకో మరి
నగరాల నడి వీధుల్లో నా నెత్తురు
తీర్థ స్నానఘట్టమవుతుంది…
…పార్లమెంటు భవనంలో వాలేందుకు
నా నెత్తురు పాదలేపనమవుతుంది’ అంటారు ఖాదర్‌.
మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన మారణకాండ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. ఆయన ప్రధానమంత్రి అయిన తరవాత పథకం ప్రకారం అనుసరిస్తున్న విద్వేషపూరిత, ముస్లిం వ్యతిరేక విధానాలు గుజరాత్‌ మారణకాండకన్నా ఎక్కువ హాని చేస్తున్నాయి. గోరక్ష పేరిట ముస్లింలను హతమార్చడం, దాడులు చేయడం విపరీతంగా పెరిగింది. దేశంలో రెండు రకాలవారు ఉన్నారు. ఒకరు-రాముడి సంతానం (రాంజాదే). రెండు హరాంజాదే (అక్రమ సంతానం) అని గొంతు చించుకునే మోదీ భక్తులకు కొదవే లేదు. అంటే ఈ దేశం కేవలం హిందువులదేనన్న ప్రచారం సంఫ్‌ు పరివార్‌ చాలా తీవ్రంగా చేస్తోంది. ముస్లింలను పూర్తిగా పరాయివారిని చేసేశారు. ఒక్క ముస్లింకు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి మోదీ నాయకత్వంలోని బీజేపీ అవకాశమే ఇవ్వడంలేదు. పనిగట్టుకుని ముస్లింలకు విలువ తగ్గుతోంది. ఈ వినాశకర దృశ్యాన్ని ఖాదర్‌ మూడు దశాబ్దాలకు ముందే ఊహించారు. కాదు కాదు ముస్లింల అనుభవాన్నే ఖాదర్‌ కవిత్వీకరించారు. నాడు ఖాదర్‌ వ్యక్తం చేసిన భయం, నిరాశ, అభద్రతాభావం కేవలం భ్రాంతో అపోహో కాదని నేటి పరిస్థితులు రుజువు చేస్తున్నాయి. ముస్లింలను పరాయివారిగా పరిగణించడం కన్నా అధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువుల మెజారిటీ వాదాన్ని సుస్థిరం చేయాలని సంఫ్‌ు పరివార్‌ ఒక పథకం ప్రకారం అమలు చేస్తోంది. ఈ భయాన్ని వ్యక్తీకరించగలిగినందుకే పుట్టుమచ్చ గొప్ప కవిత అయింది. అంతకుముందూ ముస్లింలు చాలా మంది తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. కాని పుట్టుమచ్చకన్నా ముందు ముస్లింల దుస్థితిని ఇంత శక్తిమంతంగా వ్యక్తీకరించిన దాఖలాలు లేవు.
జిన్నాకు ముందే ద్విజాతి సిద్ధాంతాన్ని హిందూత్వవాదుల కులగురువు సావర్కర్‌ ప్రతిపాదించిన వాస్తవాన్ని విస్మరించలేం. ముస్లింల మీద వ్యతిరేక భావం నాటుకోవడానికి మత ప్రాతిపదికన దేశ విభజన కారణం కావచ్చు. పాకిస్తాన్‌ ఏర్పడినంత మాత్రాన అదే తమ దేశం అనుకున్న ముస్లింలు మితిమీరిన సంఖ్యలో ఏమీలేరు. పాకిస్తాన్‌ వెళ్లి అక్కడ పరిస్థితులతో ఇమడలేక తిరిగి వచ్చిన ప్రముఖులూ ఉన్నారు. అసలు పాకిస్తాన్‌ వెళ్లిపోవాలన్న ఆలోచనకే తావివ్వకుండా తమ దేశం ఇదేనని ఉండిపోయిన వారు అసంఖ్యాక మంది ఉన్నారు.
పాకిస్తాన్‌లో జన్మించినా ఇక్కడే ఉండి దేశసేవకు అంకితమైన వారూ చాలా మంది ఉన్నారు. వారిలో హిందువులూ… ముస్లింలూ ఉన్నారు. ప్రసిద్ధ భౌతికశాస్త్రవేత్త, నోబెల్‌ గ్రహీత సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌, ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఓ.పి.నయ్యర్‌ కూడా లాహోర్‌లో జన్మించారు. హరగోవింద్‌ ఖురానా లాహోర్‌ కళాశాలలో చదువుకున్నారు. సినీనటుడు దేవానంద్‌ కూడా అక్కడే చదివారు.
దేశంలో సమాచార సాంకేతికతకు ఆద్యుడు అనుకునే ఫకీర్‌చంద్‌ కోహ్లీ పెషావర్‌లో జన్మించారు. దేశ విభజన తరవాత పాకిస్తాన్‌కు రావాలని తండ్రి గులాం సర్వర్‌, బంధువులు ఎంత చెప్పినా ససేమిరా అన్న నటుడు దిలీప్‌ కుమార్‌ ఇక్కడే ఉండిపోయారు. ఇండియానే నా మాతృదేశం అని తెగేసి చెప్పారు. ప్రముఖ నటుడు షారుఖ్‌ ఖాన్‌ తండ్రి తాజ్‌ మహమ్మద్‌ ఖాన్‌తో పాటు ఆయన బంధుమిత్రులు అనేకమంది జిన్నా నాయకత్వంలోని పాకిస్తాన్‌ను భరించలేక భారత్‌కు తిరిగి వచ్చేశారు.
ముస్లింలను ఈసడిరచుకోవడంలో, వారిని పరాయివారుగానే కాక ఈ దేశానికి శత్రువులుగా భావించే సంఫ్‌ు పరివార్‌ అభిప్రాయం మారలేదు. ఈ విద్వేషాన్ని మోదీ వీలైనంతమంది హిందువులు నరనరాన జీర్ణించుకునేలా చేస్తున్నారు. హిందూయేతరులను దురాక్రమణదారులుగా కాకపోతే కేవలం అతిథులుగా భావిస్తున్నారు. హిందూ సంస్కృతిని అంగీకరిస్తే తప్ప ముస్లింలు సమానస్థాయి పౌరులు కారని చెప్పడమే సంఫ్‌ు పరివార్‌ లక్ష్యం. దేశాభివృద్ధి అంటే హిందువుల అభివృద్ధేనన్న ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఇది హిందువుల దేశమని నమ్మినవారి చేతుల్లో అధికారం ఉన్నంత కాలం ముస్లింలలో అభద్రతా భావం పెరగడమే కాదు హిందువుల్లోనూ అభద్రత గూడుకట్టుకోక తప్పదు.
ఇప్పటి దాకా దేశంలో వివిధ సందర్భాల్లో చెలరేగిన మత కలహాల్లో చిందిన ముస్లింల రక్తమే ఎక్కువ. ‘2002లో వారికి గట్టిగా బుద్ధి చెప్పిన తరవాతే గుజరాత్‌ ప్రశాంతంగా ఉంది. ఆ తరవాత ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించవలసిన అవసరం రాలేదు’ అన్న అమిత్‌ షా ఎక్కడా ముస్లింల పేరెత్తకపోయినా ఆయన ఉద్దేశించినది ముస్లింలనేనన్న టీకాటిప్పణి అవసరమే లేదు.
హిందూత్వవాదుల బెదిరింపులను, పాకిస్తాన్‌ వెళ్లిపోవాలన్న హెచ్చరికలను భరిస్తున్న ముస్లింలను ఎంత భయకంపితం చేస్తున్నారో ఖాదర్‌ అప్పుడు చెప్పిన దానికన్నా ఇప్పటి పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఈ భయోత్పాతాన్ని ఖాదర్‌ కవితాత్మకంగా ఒడిసిపట్టారు.
దేశ విభజన రక్తసిక్తమైందే కాదు అత్యంత కిరాతకమైంది. ఈ బాధను భరిస్తున్నది ముస్లింలే. ఖాదర్‌ పుట్టుమచ్చలో వాస్తవ చిత్రీకరణే ఉంది తప్ప హిందూ ద్వేషం మచ్చుకు కూడా లేదు. 1951 నాటి జనాభా లెక్కల ప్రకారం 72,26,000 మంది ముస్లింలు పాకిస్తాన్‌ వెళ్తే 72,49,000 మంది హిందువులు పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చారని తేలింది.
పాకిస్తాన్‌ నుంచి వచ్చింది హిందువులు, సిక్కులు మాత్రమే కాదు. దేశంలోని ముస్లింలలో అధిక సంఖ్యాకులు అప్పటికి అసలు పాకిస్తాన్‌ వెళ్లలేదు. వెళ్లిన ముస్లింలలో వేల మంది తిరిగొచ్చారు. ప్రస్తుత పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అంచనా వేయడానికి 31 ఏళ్ల కిందట ఖాదర్‌ రాసిన పుట్టుమచ్చ చదవాల్సిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img