Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాజరాజ నరేంద్రునిపై పరిశోధనాత్మక రచన

క్రీ.శ.1018లో పట్టాభిషిక్తుడైన రాజరాజ నరేంద్రుడు 1061 వరకు పాలన కావించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ మధ్య కాలంలో రాజరాజనరేంద్రుడు అనుభవించిన కష్టాలు, పడిన బాధలు గురించి వెలువడిన పుస్తకాలు తెలుగులో చాలా తక్కువ. ఈమని శివనాగిరెడ్డి అందించిన ‘వేంగీ చాళుక్యమేరు నగధీర రాజరాజనరేంద్ర’ అనే చిన్న పుస్తకంలో వాటి వివరణ స్పష్టంగా, క్లుప్తంగా పొందుపరచారు. 2022 చివర్లో విడుదలైన ఈ పుస్తకంలో రాజరాజనరేంద్రకు సంబంధించిన అనేకానేక అంశాలను రచయిత పొందుపరచారు. అవి ఊహాజనితం కాదనటానికి ఆనాటి శిలాశాసనాలు కూడా పొందుపరచారు. చలనచిత్రంగా విడుదలయ్యి, అంతకన్నా ముందే పుస్తక రూపంలో, నాటక రూపంలో ప్రేక్షకులను, పాఠకులను ఉర్రూతలూగించిన ‘‘చిత్రాంగి’’ కథాంశం ఊహాజనితమని, రాజరాజనరేంద్రుడిని అపఖ్యాతి పాలు చేయటానికి కల్పించిన కట్టుకథ మాత్రమే అని నిరూపించటానికి శాసనాలను సైతం ఈ పుస్తకంలో పొందుపరచటం విశేషం.
‘వేంగీ (తూర్పు) చాళుక్యులు’ అనే అంశంతో ప్రారంభమైన ఈ పుస్తకం ‘రాజరాజనరేంద్రుని రాగిరేకుల శాసనాలు’, కోరుమిల్లి శాసనం, నందంపూడి శాసనం, మండ శాసనంలతో ముగుస్తుంది. రాజరాజనరేంద్రుడు క్రీ.శ.1018 ఆగస్టు 16న పట్టాభిషిక్తుడు కావటం కవిగా, సాహితీ పోషకునిగా, మంచి పాలనాదక్షునిగా గుర్తింపు పొందాడు. ఇది తమ్ముడైన విజయా దిత్యుడు సహించలేక కుయుక్తులతో, కుట్రలతో సుమారు 8 ఏళ్లు పైగా గడిచాక క్రీ.శ.1031 జూన్‌ 27న రాజరాజనరేంద్రుడిని పదవీచ్యుతుణ్ణి చేశాడు. పండిత, పామరుల ప్రశంసలందుకున్న రాజరాజనరేంద్రుడు, 1935 లో మళ్లీ సింహాసనాన్ని ఎక్కగలిగాడు. క్రీ.శ. 1042 లో విధి అడ్డం తిరిగింది. మళ్లీ సింహాసనాన్ని వదులుకోవలసి వచ్చింది. ఎనిమిదేళ్ల కాలం రాజరాజనరేంద్రుడు కష్టాలతో, కడగండ్లతో గడిపి, 1050 లో నాల్గవసారి గద్దె నెక్కాడు. క్రీ.శ. 1061 వరకూ అవిచ్ఛిన్నంగా పాలన గావించాడు. ఈ మధ్య కాలంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు.
అతి ప్రధానంగా చెప్పుకోవలసిన విషయం చిత్రాంగి కథ. ఈ కథ తెలియని తెలుగు ప్రేక్షకుడు, సాహితీకారుడు ఉండరు. ఇది కేవలం కట్టుకథ అని రచయిత ఈమని శివనాగిరెడ్డి కొట్టి పారేశారు. అందుకవసరమైన శాసనాలను కూడా పొందుపరచారు. రాజరాజనరేంద్రుని కుటుంబ వివరాలు, ఆయన విడుదల చేసిన నాణెములు, అతని ఆస్థాన కవులను విశదీకరించిన రచయిత, రాజరాజనరేంద్రుడు నిర్మించిన ఆలయాల సమగ్ర సమాచారాన్ని కూడా ఈ పుస్తకం ద్వారా అందించారు. రాజరాజనరేంద్రునికి ఆపాదించిన బిరుదులు మరీ ఆసక్తి రేకెత్తిస్తాయి. రాజమహేంద్రుడు, రాజనృపుడు అనే ప్రధాన బిరుదులే కాక మహా రాజాధిరాజ పరమేశ్వర నుంచి బాంధవాంభోజ వనద్యుమణీ అనే వరకు మరో 50 బిరుదులు కూడా ఉన్నట్లు ఈ పుస్తకంలో అందిస్తూ, అందుకవసరమైన ఆధారాలను కూడా పొందుపరచారు.
ప్రత్యేకంగా చెప్పుకోవలసింది కోరుమిల్లి శాసనం, కలిదిండి శాసనం, నందంపూడి శాసనం, మండ శాసనం. 48వ పేజీలో మొదలైన కోరుమిల్లి శాసనం 60 వ పేజీతో ముగుస్తుంది. ఐదు రాగిరేకుల చిత్రాలను కూడా ఈ పుస్తకంలో పొందుపరచారు. 61వ పేజీలతో మొదలైన కలిదిండి శాసనం 74వ పేజీతో ముగుస్తుంది, ఐదు రాగిరేకుల ముఖచిత్రాలు ముద్రించి వాటిపై ఉన్న శాసనాల వివరాలను కూడా విశదీకరించారు. 145 వ పేజీ వరకు పాద సూచికలు కూడా పొందుపరచారు. 75 పేజీతో మొదలైన నందంపూడి శాసనం 86వ పేజీతో ముగుస్తుంది. దీని చివర 32 పాద సూచికలు పొందుపరచారు. 87 వ పేజీతో మొదలైన మండ శాసనం 96వ పేజీతో ముగుస్తుంది. దీనికి 93 పాద సూచికలు చేర్చారు.
ఈ పుస్తక రచనకు ఆధారమైన రాగిరేకులు, సాహిత్య గ్రంథాల పేర్లు వివరించటంతో ఈ పుస్తకం ‘యదార్థ నిలయం’ అని అనక తప్పదు.
దాసరి ఆళ్వారస్వామి, సెల్‌: 9393818199

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img