Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

విశ్వ రహస్య జీవులు

అదిగో విడిచిన చెప్పులు ఎవరో దీనులు
ఎక్కడికి వెళ్లారో ఎక్కడి నుండి వచ్చి
బహుదూరపు బాటసారులు గామోసు
ఏ ఆకాశ గంగకో ప్రయాణం కాబోలు
విశ్వ రహస్యాలను కనుగొనుటకు
ఏమీ పరికరాలు లేవు ఉండవు
బాటలో దొరికినవి తప్ప
ఒక మెదడు తప్ప ఖాళీ చేతులు తప్ప
గాఢ నిద్ర తీస్తారు చేయి తలకు ఆంచి
సృష్టికర్తలాగా కలగంటారు ఎప్పుడూ
నిరంతరం అందులోనే ఉంటారు గనుక
ప్రతి శ్వాసలో అదే ఉత్సుకత
అక్కణ్ణించే ఎక్కడెక్కడో సంచరిస్తూ
వేటినో తాకుతూ
కొన్ని అమరికలు పొందుపరుస్తూ కూరుస్తూ
చేసినదే చేస్తూ పదేపదే అలవక
కూలుతున్న వాటిని ఎత్తుతూ మళ్ళీ మళ్ళీ
నిలబెడుతూ చక్కబెడుతూ సరిచూస్తూ
ఆటా పాటా వ్యాపకం అదే అన్నీనూ
వింటారు కొన్నిసార్లు సంగీతాల్ని చెవులు రిక్కించి
లేదా దూరంగా పోతారు అటువైపు
ఎవరూ లేని వైపు
ముసిముసి నవ్వులు తప్ప
పరధ్యానంగా వచ్చినవే అవి
కొన్ని కొమ్మలు తెంపుకొని
ఆకులు జేబులో వేసుకుని
కొన్ని ఆకారాలను
పుస్తకాల పేజీల మధ్య ఉంచుకొని
కాలం పయ్యపై మర్చిపోతూ నడుస్తుంటారు
వదులు వదులుగా ఉండే వస్త్రాలు చుట్టుకొని
చూస్తుంటారు వెన్నెల రాత్రులని
పాలపుంతల సమూహాల్ని
ఏ గెలాక్సీకి చెందిన వారమని
ప్రశ్నించుకోరు తమను
ఏదీ వాళ్ళది కాదు ఏమీ వాళ్ళకు చెందదు
వాళ్ళూ దేనికి చెందరు ఏవీ ఆపాదించబడవు
ఉంటారు ఉండీ ఉండనట్టు అంతే
ఉంటున్నట్టు తెలియదు కూడా ఒక్కోసారి
శూన్యం విశాలవదనంపై కదులుతూ చిరంజీవులై…
రఘు వగ్గు, 9603245215

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img