Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వీరగాథల రాశి, ‘ఎర్రజెండాల’ వారాశి, ఉదయిని గంగినేని!

మందలపర్తి కిషోర్‌

‘‘కోపం రూపం ఎరుపు, గుండెల గాయం ఎరుపు రక్తగానం ఎరుపు, నేనెత్తిన జెండా ఎరుపు’’ అంటూ తన కవితా సంకలనం ‘ఉదయిని’లో ఎలుగెత్తి ప్రకటించిన కవి గంగినేని వెంకటేశ్వరరావు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల వీరగాథల సముచ్చయంగా ఆయన రాసిన కథలను ‘‘ఎర్రజెండాలు’’ పేరిట, మూడు సంపుటాలుగా 1952లో ప్రచురించారుÑ ఆ వెంటనే కాంగ్రెస్‌ సర్కార్‌ ‘‘ఎర్రజెండాల’’ను నిషేధించింది! ఇక, గంగినేని రాసిన ఒకే ఒక్క నవల ‘‘పామునిచ్చెన’’ కొత్తతరం పాఠకుల అభిరుచికి తగినరీతిలో వుండి, రచయితగా ఆయనలోని వైవిధ్యానికి తార్కాణంగా నిలిచింది. 1980కి అటూ ఇటూగా ఆయన్ని కొందరు మిత్రులం హైదరాబాద్‌లోని అన్నపూర్ణా హోటల్లో కలిశాం. అప్పుడే జయంతి ప్రచురణ సంస్థ ‘‘ఎర్ర జెండాలు’’ కథలను, ‘‘పామునిచ్చెన’’ నవలను పునర్ముద్రించిన సమాచారం మాకు వెల్లడిరచారు గంగినేని. అప్పటికి దశాబ్దాల తరబడి గంగినేని పేరు వినడమే కానీ, ఆయన రచనలు చదువుకునే భాగ్యానికి తెలుగు పాఠకలోకం నోచుకోలేకపోయింది!
‘‘ఎర్రజెండాలు’’ మొదటి సంపుటిలోని మూడు కథలు, రెండోదాన్లోని అయిదు కథలు, మూడో సంపుటిలోని రెండు కథలకు సంబంధించిన జాడ తమకు తెలుసని ‘కథానిలయం’ సమాచారం. త్వరలోనే ఆయాకథల పీడీఎఫ్‌ ప్రింట్లు మనకు అందుబాటు లోకి వస్తాయని ఆశిద్దాం! ఎర్రజెండాలు కథలతోపాటుగా మిత్రుడు పెనుగొండ సూచించిన శివశంకర శాస్త్రి, తుమ్మల, వుప్పల, తెన్నేటిసూరి, మా గోఖలే, పమిడిముక్కల లక్ష్మీకాంతమోహన్‌, గిడుతూరి సూర్యం, ప్రయాగ, కొసరాజు శేషయ్య, శారద, పిచ్చేశ్వరరావు తదితరులు రాసిన కథలు కూడా చేర్చి, ఒక సంపూర్ణ సంకలనం ప్రచురించడం ఒక సాంస్క ృతిక అవసరంగా పరిణమించిందిప్పుడు! (ఆ సంకలనంలో మరికొన్ని కథలను కూడా చేర్చాలిఉదాహరణకు తెన్నేటి సూరి రాసిన ‘నిజాం రాజబంధువు’ కథానిక. ఇది అభ్యుదయ రచయితల సంఘం నడిపిన పత్రికలోనే అచ్చయిన కథ!!) తెలంగాణ ప్రాంతానికి చెందని రచయితలుగా వారందరినీ ఈ తరం విమర్శకులు భావిస్తే భావించవచ్చు కానీ, విశాలాంధ్ర భావావేశం ప్రభావంలో వుండిన ఆ కాలపు అభ్యుదయ రచయితల మధ్య ప్రాంతీయ అస్తిత్వ స్పృహ అంత బలంగా లేదని, ఇక్కడ మనం చెప్పుకున్న రచయితల రచనలు చూస్తే అర్థమవుతుంది. కృష్ణాగుంటూరు జిల్లాలు తెలంగాణకు సరిహద్దు జిల్లాలు. తెలంగాణ సాయుధ పోరాటం మొదలయిన దశనుంచీ ఈ జిల్లాలకు ఆ ప్రాంతం నుంచి వలసలు వచ్చిన సంగతి కూడా చరిత్రలో నమోదయిన విషయమే! ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా వాడయిన మహీధర, ఒడిషా ప్రాంతానికి చెందిన వుప్పలలాంటివాళ్ళుఏ ప్రాంతీయ అస్తిత్వ స్పృహతో తమ రచనలు చేశారనుకోవాలి?
గంగినేని విషయానికి వస్తే, ‘‘ఉదయిని’’ కవితా సంకలనంతో ఆయన కవిగా కూడా ఆదరణకు పాత్రులయ్యారు. ఉదయినిలోని 18 కవితలకు బంగాలీ చిత్రకారుడు చిత్తప్రసాద్‌ గీసిన బొమ్మలు ఈ కవితా సంకలనాన్ని మరింత ఆదరణీయంగా మార్చాయి. ఉదయిని ఖండ కావ్య సంకలనమే అయినప్పటికీ, ఇతివృత్తంలో ఏకసూత్రత ఉన్న విషయం తెలిసిందే. బహుశా అందుకేనేమో దీన్ని మూడు భాగాల కావ్యంగా మలిచారు కవి. మహాభారతంలోని అరణ్య పర్వం, యుద్ధ పర్వం, శాంతి పర్వం అనేపేర్లనే గంగినేని ఆ మూడుభాగాలకూ శీర్షికలుగా ఉపయోగించడం విశేషం. ఈ పుస్తకానికి మార్కి ్సస్టు మేధావి మద్దుకూరి చంద్రశేఖరరావు (‘చంద్రంగారు’) ‘ఆముఖం’ సమకూర్చారు. కారణం తెలియదు కానీ, 1950లో, తెలంగాణ పోరాటం ఉధృతంగా ఉన్న దశలో అభ్యుదయ రచయితల సంఘం వెలువరించిన ఈ తొలి ప్రచురణ జోలికి పాలకులు పోనేలేదు! ఒక్కోసారి, మన పాలకులు తమ విచక్షణకు పని చెప్తుంటారేమో మరి! 1989నాటికి గానీ రెండో ప్రచురణ వెలువడక పోవడం కూడా విడ్డూరంగానే వుంది!! గంగినేని గట్టుమీద కూర్చుని కబుర్లు చెప్పడానికే పరిమితమయిన వ్యక్తి కాదు. (కవిగా, కథకుడిగా, నవలా రచయితగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా రాణించిన గంగినేని వెంకటేశ్వరరావు తర్వాతి కాలంలో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఒకసారి, ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు.) విద్యార్థి దశలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని, పాలకుల కన్నెర్రకు గురయ్యారు. అజ్ఞాత వాసానికి వెళ్ళిన అనుభవమూ, నిర్బంధంలో ఉన్న అనుభవమూ వున్నాయి! ఆ దశలోనే, పులుపుల వెంకటశివయ్యతో పరిచయమై, సన్నిహిత సహచరుడిగా మారారు. ‘ఉదయిని’కి రాసిన ‘ఆముఖం’లో చంద్రంగారన్నట్టుగా, పోలీసుల చిత్రహింసల క్యాంపుల్లో వుండివచ్చిన అనుభవం ఉన్న కవి గంగినేని. ఇదే సందర్భంగా ఓ విషయం తప్పకుండా చెప్పుకోవలసివుంది! తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా కవితలు రాసిన ఆంధ్ర ప్రాంతం కవి ఒక్క గంగినేనే కాదుశివయ్యతాత, సుంకర, తుమ్మల, కొండేపూడి, నార్ల చిరంజీవి, విద్వాన్‌ విశ్వం, రెంటాల, కుందుర్తి, అనిసెట్టి, సోమ సుందర్‌, ఆరుద్ర, కారుమంచి, టి.వి. కృష్ణ అనే తాళ్ళూరి వెంకటకృష్ణయ్య, తిరునగరి రామాంజనేయులు తదితరుల కవితలు ఆ రోజుల్లో ‘విశాలాంధ్ర’ నలుమూలలా మార్మోగాయి. తెనాలి ప్రాంతానికి చెందిన కళ్యాణితో గంగినేని వివాహం1953లోజరిగిన సందర్భంగా పెళ్ళికానుకగా రూపొందిన పుస్తకమే ‘కల్పన.’ ఈ పుస్తకానికి అనిశెట్టి, అవసరాల, బెల్లంకొండ, రెంటాల సంపాదకులుగా వ్యవహరించారు. మొత్తం మీద 55 మంది కవుల కవితలు ఆ సంకలనంలో చేరాయి. అప్పటికి దాదాపు దశాబ్దం కిందట, అనిసెట్టిలక్ష్మీదేవి దంపతుల (‘అనిల’)కు పెళ్ళికానుకగా ‘నయాగరా’ వెలువడిన సంగతి తెలిసిందే! అదే దారిలో, రూపుదిద్దుకున్నదే ‘కల్పన’. అయితే, ‘కల్పన’ వెలువడేనాటికి తెలుగునాట వామపక్ష రాజకీయాలు పుంజుకునివున్నాయిÑ అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్యమండలి ఊరూరా మార్మోగుతూన్నాయి. కృష్ణశాస్త్రి ప్రభావంలో ముద్దుకృష్ణ సంకలించిన ‘‘వైతాళికులు’’కూ, ‘‘కల్పన’’కూ కొన్ని పోలికలు లేకపోలేదు. భావకవిత్వం పేరిట తెలుగునాట ప్రసిద్ధమయిన కాల్పనిక కవితా ధోరణిలో ప్రసిద్ధులయిన కవుల రచనలు ‘‘వైతాళికులు’’లో కనిపిస్తాయి. అదే రీతిలో అభ్యుదయ కవితా మార్గంలో ప్రసిద్ధులయిన కవుల రచనలు ‘‘కల్పన’’లో కనిపిస్తాయి. అంతకుమించిన పోలికలు వాటి మధ్య లేవనే చెప్పాలి! ‘‘వైతాళికులు’’లో స్థానందక్కని కవుల రచనలు, ‘‘కల్పన’’లో కనిపించడానికి కారణం, వాళ్ళందరూ తర్వాతితరం కవులు కావడమే! ఈ రెండు పుస్తకాల ప్రచురణల మధ్యా పద్దెనిమిది సంవత్సరాల యెడంవుందని మర్చిపోకూడదు!!
గంగినేని రచనల్లో యువపాఠకుల ఆదరణకు విశేషంగా పాత్రమయింది ‘పామునిచ్చెన.’ అభ్యుదయ సాహిత్యంలో వచ్చిన మార్పులకు ఈ నవల వస్తురూపాలు రెండిరటిపరంగానూా ప్రతినిధి ప్రాయమైంది. పరస్పరం పరిచితులయిన యువతీయువకులు యూనివర్సిటీ ప్రాంగణంలో కలిసి, ప్రేమలో పడడం టూకీగా ఈ నవల ఇతివృత్తం. అయితే, నవల చిన్నదే అయినప్పటికీ మొత్తం లేఖల రూపంలోనే వుండడం ఓ విశేషం! రూపం పరంగా ఇది కొత్త ప్రయోగమే! అంతకుమించి,‘పామునిచ్చెన’ రచనా శైలికీ, అంతకుముందటి గంగినేని రచనల శైలికీ పోలిక లేదు. కథానాయకుడు ఆంగ్ల సాహిత్యంలో ప్రగాఢమైన అభినివేశం వున్నవాడు కావడంచేత తరచుగా ప్రముఖ రచయితల రచనల్నుంచి ముఖ్యంగా కవితల నుంచి తనలేఖల్లో విస్తృతంగా ఉటంకిస్తూ వుంటాడు! మూసకట్టు ప్రేమకథల్లో తిరిగే మలుపులన్నీ తిరిగిన తర్వాత, వాళ్ళ ప్రేమకథ సుఖాంతమవుతుంది. చక్కని శైలిలో, ప్రయోగాత్మకంగా రాసిన ఈ నవల విశేషించి చిత్రించిన జీవిత వాస్తవంగానీ, అది అందించే ఉదాత్తసందేశంగానీ ఏమీలేవనే చెప్పాలి. ఆరోగ్యకరమైన ప్రేమ కథ ‘పామునిచ్చెన.’ వెన్నెల్లో నౌకావిహారంలా చక్కని సౌందర్యాత్మక మయిన అనుభూతిని పాఠకులకు అందించడంలో మాత్రం రచయిత నూటికి నూరుపాళ్ళు విజjవంతం అయ్యారు! చిన్న వ్యాసంలో ఇమడనంత విశాల మూర్తిమత్వం గంగినేనిది. కానీ, పత్రికల్లో రాసే వ్యాసాలకు స్థలకాల పరిమితులు తప్పవు మరి!
వ్యాస రచయిత సెల్‌: 8179691822

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img