Friday, April 19, 2024
Friday, April 19, 2024

సర్వకాలీన స్వరభాస్వరం అభ్యుదయోద్యమ పాట

మానవ జీవన ప్రస్థానపు లయలో అతి పురాతన మానవ భావప్రకటన పాట. కళల న్నింటిలోకి అత్యంత విస్తుృతి, సరళతను, గాఢతను, సులభ గ్రాహ్యతను కలిగి అక్షరాస్యత, ఆర్థిక, మత, ప్రాంత, భాషావర్గాలకు అతీతంగా అలవోకగా అతి సూటిగా జనబాహుళ్యపు హృదయాల్లో సుస్థిరస్థానం పొందింది పాట. పని`పాటగా, సమాజ జీవనపు వర్గదొంతర పీడనలకు, అన్యాయాలకు ఎలుగెత్తి నిలిచింది పాట. పాటల పిడికిలి ఉద్యమాలకు ఊపిరిలూది, అభ్యుదయాలకు ఆదర్శాలకు మార్గాల్ని సుగమం చేసి శ్రమించిన, స్వప్నించిన, సాధిం చాల్సిన ఫలాల పోరాటాలలో అగ్రగామిగా నిలిచింది పాట. ప్రపంచమంతటా ప్రజల శ్రమ భారత్వపు, పీడనల విముక్తి పోరాటాల ఉద్యమాలలోనికి ఉరకలెత్తించిన ఈ పాట వివిధరూపాల్లో మానవ నాగరికపరిణామాల్లో, ప్రగతిలోమానవునితో పాటుగా అనాదిగా జతగాను, కొన్నిసార్లు మానవుని కంటే ముందుగాను నడిచింది ఈ పాట. 
వేల్పుల నారాయణ ఈ ‘‘అభ్యుదయోద్యమ పాట ఒక విశ్లేషణ’’ గ్రంథ రచయిత కావడం అతి సహజమైన, సాధికరత, సమగ్రతలతో రాయగలటానికి గల కారణం వారు స్వయంగా అరసం, ప్రజానాట్యమండలి, సింగరేణి సంస్థల్లో భాగస్వామి, ఉద్యమకారులు, చరిత్రాకారులు, రచయితలు కావటం, విశాలాంధ్ర దినపత్రికలలో ‘‘ముల్లుగర్ర’, ‘‘చురక’’లాంటి రన్నింగ్‌ కామెంటరీలు రాయటం సినీ గేయ రచయితలు కావటం, అభ్యుదయ కవులపైన, అభ్యుదయ ఉద్యమగీతాలపైన విశ్లేషణాపూరిత వ్యాసాలు వెలువరించటం మొదలగునవి దోహదపడ్డాయి. వేల్పుల నారాయణ ‘‘ప్రభాత గీతం’’ పాటల సంపుటి, శ్రామిక పోరాట గీతాలు, ఎదనాదాలు వంటి పాటల సంకలనాలు తీసుకురావటం, ఉద్యమాల పట్ల నాటి నుండి నేటి వరకు వారికి గల నిబద్ధతకు కొలమానాలు. వేల్పుల నారాయణ  ‘‘అభ్యుదయోద్యమ పాట ఒక విశ్లేషణ’’ చేతిలో ఇమిడిపోయేంతగా 57 పేజీలతో, క్రీ.శ. 1930 సం॥ నుండి నేటి వరకు గల విభిన్న ఉద్యమాలను వాటి గీతాలను  స్ఫృశించింది. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని రాజకీయోద్యమ సిద్ధాంత గీతాల వరకు 11 విభాగాలుగా ఉన్న ఈ చిరు పొత్తము చదవడం ప్రారంభిస్తే ఆసాంతం ముగింపు వరకు ఒక కాలక్రమ రీతిలో రాజకీయ, ఆర్థిక, సామాజిక, సంక్షోభ, ఫాసిస్ట్‌ భావజాలాల నుండి నేటి ప్రపంచీకరణ వరకు గల విధ్వంస దోపిడి రూపాలను, అందుకై ఉద్భవించిన ఉద్యమ రూపాలను వాటిపై పాడుకొన్న పాటలను చాలా చక్కగా ఇందులో పొందుపరచారు. 
ప్రతి విభాగమునకు ముందు ఆ ఉద్యమ నేపధ్యాలను, నిర్వచనలను, చరిత్రను, ఏర్పరచుకొన్న వ్యవస్థలు, సంస్థలు, సాహిత్యాలు, ఉద్యమకారులు, రచయితలు, వారి ప్రత్యేకతల గూర్చి సంక్షిప్తంగా, సమగ్రంగా వివరించడం జరిగింది. ప్రతి విభాగంలో ఆ కవుల రచయితల చిత్రపటాల్ని పొందుపరచడం, వారి రచనలో అతి ముఖ్య మైనవి. నేటికి అందరి నోళ్ళలో, అన్ని వేదికలపై వినిపిస్తున్న వారి పాటల్ని, అతిక్లుప్తంగా వారి పేర్ల వారిగా అందించటంలో వేల్పుల కృషి అమూల్యమైనది.
ఈ పుస్తకం చదువుతూ మెల్ల మెల్లగా మనం ఆ చరిత్రలో పాత్రలుగా మారి ఆ ఉద్వేగాల తాలూకు పాటలను, ఆవేదనగాను, ఆవేశంగాను, ఆరాధన పూర్వకంగాను మనలో మనం పాడుకొంటూ మమేకమై ఆనాటి స్మృతుల్ని పునరనుభవంలోకి అనుభవిస్తూ ఈ పాటల రచయితల, కవుల, ఉద్యమకారుల, ఉద్యమ నిర్మాతల జీవితాన్ని, ధైర్యాల్ని, త్యాగాల్ని, అవలోకిస్తూ వారి చిత్రపటాల్ని చూస్తూ, కొన్ని సార్లు మనం విన్న పాడుకొన్న పాటలు, అరే వీరు రాసిందన్న మాట, వీరు ఇలా ఉంటారన్నమాట అని వారినిగౌరవపూర్వకంగా స్మరిస్తుంటాము. ఆ పాటల ఉద్వేగాల ప్రవాహపు జడిలో మనం పడిపోవా ల్సిందే. తిరిగి తిరిగి పుస్తకాన్ని మస్తకాన్ని సమాజాన్ని, స్వభావాల్ని, ఉద్యమాల అవసరాల్ని తడమాల్సిందే. అందుకే ఈ పాటలు సర్వకాలీన స్వరభాస్వరాలుగా చెప్పడం జరిగింది. 
ప్రథమ విభాగం తెలంగాణ సాయుధ పోరాట కాలం పాటల గూర్చి చెబుతూ ఆనాటి నిజాం భూస్వాముల, అకృత్యాలు పీడనల గూర్చి, ఆంధ్ర మహాసభ, విశాలాంధ్ర సంస్థ, 1936 అరసం, విరసం ఏర్పాట్లు, వాటి ప్రచురణలు, 1917 లో రష్యాలోని సోషలిజం విప్లవ విజయం ప్రభావం మన దేశ రచయితలపై పడడటం. 1910లలో గురుజాడ అప్పారావు  దేశమును ప్రేమించుమన్న అభ్యదయ గీతం, గరిమెల్ల సత్యనారాయణ మా కొద్దీ తెల్లదొరతనం, త్రిపురనేని రామస్వామి చౌదరి  వీరగంధం తెచ్చినాము వీరులెవ్వరో తెలుపుడి అంటూ అస్పృశ్యతకు, మద్యపానానికి వ్యతిరేకంగాను, కార్మిక గీతాలు, తొలి కర్షక గీతాలు, శ్రీశ్రీ మహా ప్రస్థానం బాలాంత్రపు రజనీకాంత్‌ రావు తెలుగు అనువాదం చేసిన యాజిని పాటియర్‌ అంతర్జాతీయ అభ్యుదయ గీతం ఇలా సమగ్రంగా, సంక్షిప్తంగా వివరించారు.  తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తిరునగరి రామాంజనేయులు ఎక్కుబాబా పడవెక్కుబాబా, ఆంధ్రమహాసభ పడవెక్కుబాబా, సుద్దాల హన్మంతు`సంఘం వచ్చిందిరో రైతన్న మేలుకో, చాలా చేసిందిరో కూలన్న మేలుకో, పల్లెటూరి పిల్లగారు, పసులగాచే మొనగాడా, యాదగిరి గారి నైజాము సర్కరోడా లాంటి పాటలు రాసిన 12 మంది రచయితల చిత్రపటాలతో సవివరంగా పొందుపర్చారు.
(దేశభక్తి విభాగంలో) ప్రాంతీయ ఉద్యమాలు, జాతీయ ఉద్యమాలు,  కార్మిక, కర్షక, ఆస్థిత్వవాదం నుండి అంతర్జాతీయం దాకా సాగిన ఉద్యమాలు, ఆ ఉద్యమాలకు భావాల్ని ఆలోచనల్ని, అస్థిత్వాల్ని, ప్రణాళికల్ని మార్గదర్శకత్వాలను ఇచ్చిన పాటల్ని రచయితల్ని అమూలాగ్రం అక్షరీకరించారు.  దేశభక్తి విభాగంలో దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ, సుందరాచారి మా తెలుగు తల్లి గీతం, అందెశ్రీ `  జయజయహే తెలంగాణ గీతం, ఆ గీతం సాధించిన తెలంగాణ నినాదం,  ఉద్యమ కాలంలో వందేమాతరం గీతంలా ప్రతి తెలంగాణ బిడ్డ నోట, వేదికలన్నింటిపై మారు మ్రోగిన ఈ పాట తెలంగాణ గీతంగా ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినప్పటికి నిర్లక్ష్యానికి గురి కావటంగూర్చి నిష్కర్షగా, నిజాయితీగా అక్షరీకరించి అన్యాయాన్ని స్పష్టంగా ఈ పుస్తకంలో నిలబెట్టారు. సమాజంలో అన్ని రంగాలలో వలనే ఈ అభ్యుదయోద్యమ పాట ఒక విశ్లేషణ గ్రంథంలో కూడా మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా కనబడుతుంది. అబల` సబలగా మారినప్పుడే` వట్టికొండ విశాలక్షి (20) ఆశ్లీలాన్ని అంతం చేద్దాం రండీ ముందుకు రాండీ స్మిత (33) యువజన విభాగంలో భవ్యోజ్వల యువకులారా విజయలక్ష్మి (44)ల  చిత్ర పటాలతో కలిపి అన్ని విభాగాల్లో 62 మంది చిత్రపటాలు ఉన్నాయి. దాదాపు 200 మందికి పైగా రాసిన మూడు లేక నాలుగువందల అభ్యుదయ గీతాలలో మహిళల స్థానం భాగస్వామ్యం పెరగవలసిన ఆవశ్యకతను మనమంతా గుర్తించి శ్రమించాల్సి ఉంది. ఈ గ్రంథంలోని ప్రతి పాట, ప్రతి రచయిత పేరు తెలపాలంటే అన్ని పాటలు, అందరు వందనీయులైనప్పటికి ముద్రణ పరిమితి మేరకు పేర్కొనడం సాధ్యం కానప్పటికీ, అందరు గ్రంథం పఠించుతారని నా ఆకాంక్ష. గ్రంథ రచయిత వేల్పుల, గ్రంథం అంకితమొందిన కందిమళ్ళ ప్రతాపరెడ్డి, ముందు మాటలు రాసిన ఏటుకూరి ప్రసాద్‌, ఆచార్య ఎస్‌.వి. సత్యనారాయణ, పెనుగొండ లక్ష్మినారాయణ అభ్యుదయపాటలు అన్ని విభాగాల్లో మనం చూడవచ్చు.  ఈ గ్రంథం అందించిన అతి విలువైన, సమగ్రమైన సాధికార సమాచారం కారణంగా చారిత్రకపరంగా, ఉద్యమాల సాహిత్యం, కళలు, పాటలు, కవుల, రచయితల జీవిత చరిత్రలు, విమర్శ పరిశోధనలకు, రచయితలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పోటీ పరీక్షలకు తయారయ్యే వారికి, వక్తలకు, వ్యాసకర్తలు, సమీక్షలకు అనేక రకాలుగా ఉపయుక్తంగా ఉంది. ప్రతి గ్రంథాలయంలో తన స్థానాన్ని సుస్థిర పరచుకునే గ్రంథం ఇది. 
వేల్పుల మరింత విస్తుృత సమాచారంతో ఈ గ్రంథపు కొనసాగింపు చేసి భవిష్యత్తులో ఈ గ్రంథాన్ని మన అందరికి అందిస్తారని ఉద్యమ నేపధ్యాల్ని, చరిత్రల్ని, పాటల్ని విపులంగా వివరిస్తారని ఆశిస్తున్నాం. సాహితీ ప్రియులు, ఉద్యమకారులు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు అందరు తప్పక చదవాల్సిన ప్రామాణిక గ్రంథం అభ్యుదయోద్యమ పాట ఒక విశ్లేషణ. 

అన్వేషి (చందనాల సుమిత్రాదేవి), సెల్‌. 9550217802

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img