Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సేవాగుణానికి స్ఫూర్తి ప్రతీక ‘స్పర్శవేది’

అవసరంలో ఉన్నప్పుడు మనకు ఎవరో ఒకరు సాయం చేస్తారు. వాళ్ళను దేవుడులా భావించి కృతజ్ఞతలు తెలియజేస్తాం. సాయం చేసిన వాడెప్పుడూ సాయం పొందినవాడి ముందు దేవుడే. మనకేమాత్రం సంబంధం లేని ఒకరు ఎందుకలా సాయం చేశారో ఆలోచిస్తే ఎన్నో అర్థాలు స్ఫురిస్తాయి. కొన్నింటిని కొలతల్లో చెప్పినట్లు ‘సాయం’ను కొలతల్లో చెప్పలేం. అది చిన్న సాయమో, పెద్ద సాయమో తీర్మానించలేం. దాని గొప్పదనాన్ని సాయం పొందినవాడు నిర్వచిస్తాడు. ‘దైవం మానుష రూపేణ’ అన్నారు పెద్దలు. అంటే దైవం ఎక్కడో లేదు, ‘మనిషి’ రూపంలో మన దగ్గరే ఉందని అర్థం. సాయం పొందినప్పుడు మనకు వారి సాక్షాత్కారం లభిస్తుంది.
సేవకు అవకాశం కల్పించిన భగవత్‌ స్వరూపం – అతిథి. సేవ ద్వారానే మన జీవితం ప్రస్ఫుటమవుతుంది. ఎవరికైనా సేవచేసే అవకాశం లభిస్తే సాక్షాత్తు ఆ భగవంతుడికి సేవ చేస్తున్నట్లే భావించమంటారు. ఆ సేవాతత్వం అక్షరాల రూపంలో కాగితాల నిండా పరచుకున్న కథాసంపుటి ఈ ‘స్పర్శవేది’. వృత్తిరీత్యా సేవకు అంకితమైన వ్యక్తి ఎమ్వీ రామిరెడ్డి. తన జీవితాన్ని సేవకు అర్పించాలనే సత్సంకల్పంతో దాన్నే వృత్తిగా ఎంచుకున్నారేమో అనిపిస్తుంది. మనచుట్టూ ఉన్న సమాజంలో మంచి కన్నా చెడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. మంచిగా మారడానికి కొన్నేళ్ళు పట్టొచ్చేమో గానీ చెడుగా మార్పు చెందడానికి క్షణం చాలు. అటువంటి పరిస్థుతుల మధ్య మంచినే నమ్ముకుని, సేవనే దైవంగా భావిస్తూ, దాని గురించి నలుగురికీ తెలియజేయాలన్న ఆశయంతో సేవకు సంబంధించిన కథలన్నీ సంపుటిగా తీసుకొచ్చారు.
రామిరెడ్డి కథల్లో బాగా నచ్చే అంశం-కథలోని కాన్వాస్‌. దాన్ని చాలా షార్ట్‌ గా చెప్తారు. స్వీట్‌గా అనిపిస్తుంది. పాత్రికేయ నేపథ్యం ఉండటంతో పాఠకులను ఆకర్షించేలా రచన చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ‘స్పర్శవేది’ లో మొత్తం పదహారు జీవితాలు మనలోని సేవాగుణాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాయి.
‘మాధవసేవ’ కథ చదవడం మొదలు పెడితే అందులోకి పరకాయ ప్రవేశం చేయడం ఖాయం. అంత సాఫీగా చదివిస్తుంది. హృదయాన్ని తడి చేస్తుంది. లోపలెక్కడో దాగున్న మానవత్వాన్ని గుర్తుచేస్తుంది. జేకేఆర్‌ దగ్గర మాధవయ్య ప్రవర్తన హుందాగా ఉంటుంది. మనలో చాలామంది మాధవయ్యలు ఉంటారు. ఈరోజుల్లో అంతలా అర్థం చేసుకుని మసలుకునేవారు తక్కువ. మాధవయ్య, జేకేఆర్‌ పాత్రలు మానవీయతకు నిదర్శనంగా ఉన్నాయి. హిందీ శీర్షికతో ఉన్న ‘కుఛ్‌ తో హై’కథ ఎవరి ఆలోచనలకూ అందదు. వేశ్యల గురించి కథలంటే వాళ్ళ కష్టాలో, కన్నీళ్ళో నేపథ్యాలుగా వచ్చినవే ఇంతవరకూ చదివాము. ఇది అంతకు మించి… వాళ్ళల్లో ఉన్న పోరాటాన్ని చూపింది. బాలాజీ లాంటివాళ్ళు అరుదు. సరోజ ప్రయోగంతో వీరబాబు తిక్క ఎలా కుదిరిందో కథ చదవాల్సిందే. వనజ లాంటివాళ్ళను ఆటబొమ్మలుగా చూసే వీరబాబు లాంటివాళ్ళకు అలాగే జరగాలి అనిపించడం సహజం. అలాంటివారి ఆలోచనా ధోరణిని మారాలి. మార్చాలి. మారేలా చేయాలి. దానికి నడుం బిగించాలి. ‘ప్రియురాలి మొహంపై యాసిడ్‌ దాడి’ అనే వార్తను చదివినప్పుడల్లా బాధ నిలువెల్లా ఆవహిస్తుంది. ‘పాపం వారి పరిస్థితి ఏమిటి?’ అనుకుంటాం. ఎప్పుడూ అలా అనుకోవడమేనా… కాదని రచయిత ‘యాసిడ్‌ టెస్ట్‌’అనే కథను అమ్మాయి నేపథ్యంలో రాశారు. మొహం కాలిపోతే నిరాశ పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ, మన అభిమానాన్ని చంపుకోకుండా ఎంత హుందాగా బతకొచ్చో రేష్మ పాత్ర ద్వారా కళ్ళకు కట్టారు. అలాంటివారి మనసులో రగిలే మంటలే అక్షరాలుగా రూపు సంతరించు కున్నట్లు ఉంటుంది. స్త్రీ తన కాళ్ళ మీద తాను నిలబడినప్పుడు సమాజంలో మార్పు కచ్చితంగా వస్తుందని చెప్తుంది ఈ కథ.
చారిత్రక కథలు చదివినప్పుడు ‘మన చరిత్ర ఇలా ఉండేదట..’, జానపద కథలు చదివినప్పుడు ‘రాజులు, రాజ్యాలు ఇలా ఉండేవట..’, వరకట్నం, వితంతు బాల్య వివాహాల మీద కథలు చదివినప్పుడు ‘ఇంత దారుణమా?’ అని మనం ఎలాగైతే అనుకుంటామో కొన్నేళ్ల తర్వాత ‘స్పర్శవేది’కథను చదివితే ‘కరోనా వచ్చినప్పుడు జనం ఇలా ఉండేవారట, మనుషుల్ని దగ్గరికి రానిచ్చేవారు కాదట..’ లాంటివి చెప్పుకుంటారు. కరోనా విజృంభణ నాటి పరిస్థితుల్ని ఈ కథలో బాగా చిత్రించారు. అంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా మనిషికి మనిషి సాయం ఎలా చేసాడో చదివితే మనసు భారమవుతుంది.
‘మరణానికి ఇవతలి గట్టు’అనేది కోవిడ్‌ టైంలో ఎంతోమంది అనుభవాలగుట్ట.. డబ్బే గొప్పదని నమ్మేవాళ్ళను సైతం మార్చిన ప్రకృతి బీభత్సం.. ప్రకృతితోనే, ప్రకృతిలోనే మమేకమవమని పరోక్షంగా హెచ్చరించిన వైనం… ఒక్కో సంఘటన చదువుతుంటే మనకే అలా జరుగుతుందేమో అనిపించి ఏడుపు వచ్చేస్తుంది. ఆయా సంఘటనల్ని అనుభవించిన వాళ్ళు చదివితే కన్నీటి గట్టు తెగడం ఖాయం. పొందికైన వాక్య నిర్మాణంతో, అక్కడక్కడా వచన కవిత్వాన్ని అలంకరించుకున్న సన్నివేశాల కూర్పు మనల్ని పట్టి లాక్కెళ్తుంది.
బ్యాట్స్‌మన్‌ సొంతగడ్డపై ఎందుకు ఎక్కువగా చెలరేగిపోతాడు అంటే ఆ పిచ్‌లోనే జీవితాన్ని వెతుక్కుంటాడు కాబట్టి. ఏ పనైనా పంతంతో చేయకూడదు. పనితనంతో చేయాలి. పంతం పట్టేముందు ఉదయ్‌ కూడా అదే ఆలోచించి ఉంటే ఆత్మహత్య వరకు వెళ్లి ఉండేవాడు కాదు. ఈ సంపుటిలో అన్ని కథలతో పాటు ఓ మెట్టు అమితంగా మనల్ని సంతృప్తి పరిచే కథ ‘నాగలి గాయాల వెనక’. ఈ కథ చదువుతుంటే మన తండ్రో, తాతో గుర్తుకొస్తూనే ఉంటారు. మార్కెట్‌ యార్డులో జరిగే మోసాల్ని చూసి కూడా ఏమీ చేయలేని మన నిస్సహాయత గుర్తుకొస్తుంది.
మనిషిని మార్చేది ఏమిటని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. డబ్బు అనుకుంటాము, పలుకుబడి అనుకుంటాము, ప్రేమ అనుకుంటాము. కానీ, ‘సంకెళ్ళు తప్ప’ అనే కథ చదివితే మరో శక్తి ఏమిటో తెలుస్తుంది. అదే తెగింపు… కొన్ని అనివార్య పరిస్థితుల్లో తెగింపు మనిషిని పూర్తిగా మార్చేస్తుంది. తన బిడ్డలకు ఏమైనా జరుగుతుంది అంటే పిల్లి కూడా పులిమీద తిరగబడుతుంది. ఆ తెగింపే చంద్రయ్యలో కలిగింది. అతనికో దారి చూపింది. ఈ కథలో పిల్లాడు టింకూ పాత్ర కథను మలుపు తిప్పే, చంద్రయ్యకు దారి చూపే పాత్ర. అటువంటి పాత్రలను సృష్టించడం రామిరెడ్డికి బాగా అలవాటైన విద్య. కథ చదువుతున్నంతసేపు చంద్రయ్య నిర్ణయం ఏమై ఉంటుందా? అన్న ఉత్కంఠ మనల్ని కథ వెంట పరుగులు పెట్టిస్తుంది.
మన ఇంట్లోనో, పక్కింట్లోనో, బంధువుల ఇంట్లోనో జరిగిన కథే ‘చీపురు పుల్ల’. పిల్లలకు డెంగూ జ్వరం వచ్చినప్పుడు, ఆర్థికంగా వెనకబడినవాళ్ళు పడే నరకయాతన ఎలా ఉంటుందో కళ్ళకు కట్టారు రచయిత. హాస్పటిల్‌ సీన్స్‌ చదువుతుంటే భయం వేస్తుంది. ప్లేట్‌లెట్స్‌ విలువేంటో మనకు తెలియజేశారు రచయిత. నాగరాజులాగా సాయం చేసేవాళ్ళు ఉండబట్టే ఆర్థికంగా వెనకబడినవాళ్ళు జీవనం సాగించగలుగుతున్నారు. లేదంటే… ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. జంగమ్మ సేవా దృక్పథాన్ని చదివి తీరాల్సిందే. మన చుట్టుపక్కల్లో ఒకరు గుర్తుకొస్తారు.
ఎన్నిసార్లు చదివినా ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చే కథ ‘కురు’క్షేత్రం. గుండు చేయించుకున్నాక మూడు నెలల్లోనే పూర్వ వైభవం సంతరించుకునే జుట్టును దానం చేయడాన్ని మగవాళ్ళు ఘనకార్యంగా భావించకపోవచ్చు. పట్టించుకోకపోవచ్చు. ఆడవాళ్ళకు అలా కాదు. వాళ్ళ అందం, ఆత్మవిశ్వాసం అందులోనే ఉందని నమ్ముతారు. దానికి లోటు రానివ్వకుండా చూసుకుంటారు. ఒక్క తెల్ల వెంట్రుక వచ్చినా వెంటనే రంగు వేసేస్తారు. ఒక్క అంగుళం జుట్టు తక్కువగా ఉన్నా తమ అందానికి ఏదో లోటు అని మథనపడే స్త్రీలు, అలా తమ జుట్టును సేవా కార్యక్రమానికి ఇవ్వడం చాలా గొప్ప విషయం. కేన్సర్‌ పేషంట్స్‌కు జుట్టును దానంచేస్తే లభించే సంతృప్తి ఎలాంటిదో కృష్ణవేణి పాత్ర తెలియజేస్తుంది. ‘హెయిర్‌ ఫర్‌ హోప్‌’ అనే సంస్థ గురించి విపులంగా తెలుసుకుంటాము. సాయం చేయడానికి మనమూ ముందుకొస్తాము. ‘నిజమైన శ్రీమంతులు ఎవరు?’ అంటే కలలు రాకుండా నిద్రపోగలిగినవారు, తృప్తిగా జీవనం సాగించగలిగినవారు… అది తెలియక ఎంతోమంది వేటి వెంటో పడుతుంటారు. ఎంత సంపాదించినా తృప్తి కలిగే మార్గం తెలీక మథన పడుతుంటారు. అలాంటివారికి కనువిప్పు కలిగించే కథ ‘శ్రీమంతులు’. ఈ కథను చదివినట్లయితే వారికో మార్గం దొరికినట్లే.
ఈ సంపుటిలో అన్ని కథలూ సేవ ప్రధానంగా ఉంటాయి. జీవితాన్ని అనుభవించిన వారి, దగ్గరగా చూసిన వారి రచనలు వాస్తవికతకు అద్దం పడతాయి. ఎమ్వీ రామిరెడ్డివి అనుభవపూర్వకమైన కథలు. అందులో జీవం ఉంటుంది. ఓ రకమైన ప్రేమ ఉంటుంది. కథలోని పాత్రలతో మమేకమవుతారు. ఆశావాద దృక్పథాన్ని కలిగిస్తారు.
దొండపాటి కృష్ణ, 9052326864

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img