Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

ఆత్మవిశ్వాస అలలై ఎగిసే కవిత్వం

కష్టాల కారుచీకట్లు జీవితాల్ని ఆవహించినప్పుడు ఆత్మవిశ్వాసం ఆశల వెలుగులు విరజిమ్మే చిరుదీపమై కొండంత అండనిస్తూ వుంటుంది. బాధల శిశిరం మనల్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు మనలోని ఆశలపత్రాలూ, ఆశయాలపుష్పాలూ రాలిపోతుంటాయి. అయినా అంతటితో కాలం ఆగిపోదు కదా మళ్ళీ మళ్ళీ మనలో ఉద్భవించే ఆత్మవిశ్వాసపు ఆమని కొత్త ఆశల్ని చిగురింపజేస్తూనే వుంటుంది. మన వేదనల ఆవిర్లు అత్మవిశ్వాసపు మేఘాలై వర్షించినప్పుడు మొగ్గతొడిగిన మన హృదయాల రేకులు అత్మస్థైర్యపు సుగంధాలతో విచ్చుకుంటూనే వుంటాయి. ఉదయించే ఆత్మవిశ్వాసపు తూర్పు నుంచి సరికొత్త కాంతులు ఉద్భవించినప్పుడు ఆశయాలు జీవనరశ్మితో వెలిగిపోతుంటాయి. జీవితం పడవ కష్టాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఆత్మవిశ్వాసపు చుక్కాని దానిని గమ్యానికి చేరుస్తుంది. ఆత్మవిశ్వాసం మనిషి జీవనప్రస్థాన రథానికి సారథి అవుతుంటుంది. అది ఆనందాలను అందలమెక్కిస్తుంటుంది. అనుబంధాలను పటిష్టం చేస్తుంటుంది. మనిషి ఊపిరిలో ఊపిరిగా వుంటూ అనుదినం అతని జీవితగమనాన్ని నిర్దేశించే ఆత్మవిశ్వాసంతోనూ జతకట్టే కవిత్వం తానే ఆత్మవిశ్వాసమైపోయి, ఆత్మస్థైర్యపు అక్షరాలతో మనల్ని ఓదారుస్తూ మనలో కొత్త ఆశల్ని రేకెత్తిస్తూనే వుంటుంది. అందుకే అత్మవిశ్వాసానికి కవిత్వమంటే అంత విశ్వాసం. అది మనిషికి ఎంతో అవశ్యం.
‘ఆసుపత్రి కిటికీలోనుంచి ఆశల ఆచూకీ తీస్తున్నాను
కింద నడుస్తున్న మనుషులని
ఎండుటాకులతో అభిషేకిస్తున్నాయి చెట్లు
పతనంలో కూడా పండుటాకులకు ఎంత హుందాతనం?
ఆకులు రాల్చిన కానుగ చెట్టు కొమ్మపై
కాకులు గూడుకడుతున్నాయి
సన్నని పూరిపరకలో,
ఎండుగడ్డో తెస్తోంది మగకాకి ఎక్కణ్ణించో
ఆడకాకి చిట్టిచితుకులతో సర్ది
చిత్రంగా గూడు మరమ్మతు చేస్తోంది
అల్లిబల్లి అల్లకంతో పుడకలు ఎన్నిసార్లు నేలరాలాయో
అయినా విసుగు లేదు ఆ పక్షుల జంటకు
రెక్కల్ని తొడిస్తూ ఆకసంతో కబుర్లు చెబుతున్న
చంటికాకుల్ని ఊహిస్తూ
నేలరాలిన పుడకల్ని ప్రతీసారీ తీస్తూనే వున్నాయి
విరామం లేకుండా గూడు నిర్మిస్తూనే వున్నాయి
…… ……….. ……………
ఔను ‘ప్రయత్నం’ ప్రకృతి పాఠశాలలో
జీవి నేర్చిన తొలిపాఠం
తుదివరకు పోరాటం సాగించడం దాని ప్రాథమిక ధర్మం’ (‘ప్రయత్నం’ ఖండిక నుంచి)
అంటూ కొన్ని నెలలపాటు మృత్యువుతో పోరాడిన ఉద్విగ్న క్షణాలను కవితామయం చేశాడు దుత్తా బాబూరావు. మూడు దశాబ్దాల క్రితం ఆస్పత్రిలో క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ రాయడానికి కూడా వీలుకాని స్థితిలో ఈ కవి చెబుతుంటే ఆయన సతీమణి కాగితం మీద రాసిన కవిత్వమిది. ‘జ్వరతరంగిణి’ సంకలనం పేరుతో ఆత్మవిశ్వాసపు రెక్కలు తొడుక్కొని సాహితీలోకంలో విహరించింది. మృత్యుముఖంలోకి వెళ్లబోయే క్షణాలు తనను వెంటాడుతున్నా అతడిలో ఆశల్ని రేకెత్తించిన ఆస్పత్రిలోని దృశ్యాలు ఆత్మస్థైర్యపు అక్షరాలను తొడుక్కున్న ఆస్పత్రిగీతాలయ్యాయి.
ఇక్కడ కవిత్వం కవి ఆలోచనాధారను ఆత్మవిశ్వాసంతో అనుసంధానం చేసింది. రాలిపోయే పండుటాకుల హుందాతనాన్ని దర్శింపజేసింది. ఆస్పత్రిలోని చెట్టును ఆశావహదృక్పథానికి కేంద్రాన్ని చేసింది. చెట్టుకొమ్మపైని కాకిజంట గూడుకట్టుకుంటూ చేసే జీవనపోరాటంలో అచంచల ఆత్మస్థైర్యాన్ని చూపించింది. గూడునిర్మాణంలో కనిపించే చిట్టిచితుకులు, విసుగులేని, విరామంలేని అల్లిబిల్లి అల్లకం వంటి ప్రయత్నాలు మనిషి జీవనప్రస్థానంలో మైలురాళ్లపుతాయి. ఇక్కడ కవిత్వం పక్షుల గూడు నిర్మాణాన్ని మనిషి జీవనపోరాటంతో అనుసంధానించి అందులో నేర్చుకోవలసిన సత్యాన్ని విడమరచిచెప్పింది.
‘చీకటి సంద్రంలో/ రాలిపడ్డ నక్షత్రపుముక్కలతో
వెలుగు దృశ్యాలను ఏరుకొని
ఊహల రెక్కలను కట్టుకొని
ఆకాశాన్ని ఆలింగనం చేసుకుంటూ
………… ………… ………….. ………………
కంటిచూపులు రాలుతున్నా
మనసు చిగురిస్తూనే వుంటుంది
కోరికల సీతాకోకచిలుకలు
మానసిక మైదానంలో విహరిస్తూ
రంగులు చల్లడం
కనురెప్పల మీదుగా ఇంద్రధనస్సు అల్లడం
చీకటి ఆకాశానా
వెలుగు పావురాలను ఎగురవేయడం
…….. ……………… ………… ………………
శూన్యంలోంచి శూన్యంలోకి
పయనించడమే జీవితం
మనసులోంచి మనసులోకి
ప్రవహించడమే సృష్టి
గుండెలోతుల్లోకి
గుప్పెడు వెలుగుతునకల్ని
చేర్చడమే కదా ప్రేమ
…………… …………… …………….
కనురెప్పల కొమ్మలనుండి ఎగిరిపోయి
వెలుగుపక్షి/ గుండెగూటికి చేరుకొని
దేహమంతా/ జీవచైతన్యాన్ని నింపుతుంది’ (‘రాత్రిసూర్యుడు’ దీర్ఘకవిత నుంచి)
అంటూ కనురెప్పల్లో చీకటి జలపాతం కలవరపెడుతున్నా మనోనేత్రాలతో వెలిగించుకున్న ఆశాదీపాల వెలుగుల్లో బతుకుల్ని సాగించే అంధుల జీవనశైలిని ఆత్మవిశ్వాసపు తొడుగులతో కవిత్వీకరించింది అనంతకవి కెరె జగదీష్‌ కలం. వారికి ప్రపంచం చీకటిగా కనిపించినా వారి మనసుల్లోని వెన్నెలంత వెలుగును దర్శించింది కవిత్వం. వారి ఆత్మవిశ్వాసం వసంతమై వారి మనసులెప్పుడూ చిగురిస్తూనే వుంటాయి. ఆత్మవిశ్వాసం వారి అంతరంగాల్లో ఇంద్రధనస్సుల్ని సృష్టిస్తుంది. రంగులు వెదజల్లుతుంది. శూన్యంలోని తియ్యదనాన్ని వారికి రుచిచూపిస్తూ వుంటుంది. మనసునుంచి మనసులోకి ఆత్మీయత ప్రవహించడమే అసలైన జీవితమంటుంది. కళ్లు లేకపోతేనేం గుండెల్లో గుప్పెడు వెలుగు వుంటే చాలంటుంది. వారి కళ్లనుంచి వెలుగు రెక్కలు విప్పుకొని ఎగిరిపోయినా అదే వారి హృదయాల్లో చైతన్యాన్ని నింపే ఆత్మవిశ్వాసమవుతుంది. బాధల బురద నుంచి ఆత్మవిశ్వాసం కమలమై వికసిస్తుంది. దిగులు ఎడారిలో ఓయాసిస్సై ఓదారుస్తుంటుంది. అందుకే నిత్యం ఆత్మవిశ్వాసపు చలివేంద్రాల అక్షరాలతో జీవనపోరాట దాహంతో అల్లాడే మనల్ని సేదదీరుస్తూవుంటుంది కవిత్వం.
-డాక్టర్‌ కొత్వాలు అమరేంద్ర, 9177732414

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img