Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

విభిన్నతను అందించే కథాసంపుటి

‘కోరాపుట్‌ అండ్‌ అదర్‌ స్టోరీస్‌’ అనే ఈ ఆంగ్ల కథాసంపుటిని చదవడం ఒక మరపురాని అనుభవంలా మిగిలిపోతుంది అంటే అతిశయోక్తి కాదు. గౌరహరిదాస్‌ ఒరియా భాషలో రాసిన కథల్ని ఇలా ఆంగ్లభాషలోకి సరోజ్‌ మిశ్రా, గోప నాయక్‌ అనువదించారు. ఇంతకుముందు కూడా ఓ పుస్తకం వచ్చింది. దానిపేరు ‘ద లిటిల్‌ మాంక్‌ అండ్‌ అదర్‌ స్టోరీస్‌’. పత్రికా సంపాదకునిగా, కథకునిగా, నాటక రచయితగా, కాలమిస్ట్‌గా గౌరహరిదాస్‌ ఒరియా పాఠకులకు ఎంతో తెలిసినవారు, రచనలో తనదైన ప్రత్యేక శైలి కలిగినవారు.
కోరాపుట్‌ అనే పేరు వినగానే ప్రకృతి దృశ్యాలు మన కళ్ళముందు మెదులుతాయి. అలాగే అక్కడి శ్రామిక జనుల వెతలూ గుర్తుకువస్తాయి. ఈ పుస్తకం లో మొత్తం 15 కథలు ఉన్నాయి. అవి అన్నీ కూడా వివిధ ఇతివృత్తాలతో కూడి ఉన్నాయి. మొదటి కథ కోరాపుట్‌తో సంబంధం ఉన్న కథ. కొన్ని కథల గురించి ముచ్చటించుకుందాము.
కథావ్యూహం కూడా పఠితని నిలవనివ్వదు. చివరిదాకా వెళ్ళు అంటుంది. కొద్దిసేపటిలో కథ అవబోతుంది అనుకున్నప్పుడు ‘ఎండిరగ్‌’ తెలిసిపోయిందిలే అనిపిస్తుంది. కాని చివరి వాక్యాలకి వచ్చేసరికి ఊహించలేని ఒక ట్విస్ట్‌ ఇచ్చి మన పెదాలపై నవ్వుని తెప్పిస్తారు. ఎంతో సాధనతో, ఆలోచనాపటిమతోగాని అలాంటి విద్య వస్తుంది. కొన్ని ముఖ్యమైన దృశ్యాల్ని, మానసిక పరిస్థితుల్ని వర్ణించేటప్పుడు మనల్ని పరకాయ ప్రవేశం చేయిస్తారు ఆ పాత్రల్లోకి. మొదటి కథ కోరాపుట్‌ గురించి చెప్పుకుందాం. పూర్ణిమ అనే అమ్మాయి హీరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భువనేశ్వర్‌ నుంచి కోరాపుట్‌ వస్తూంటుంది. అక్కడ ఉన్నత అధికారిగాగా పనిచేసే ప్రశాంత్‌ అనే వ్యక్తిని ఈమె త్వరలో పెళ్ళి చేసుకోవల్సిఉంది. కోరాపుట్‌లో రైలు దిగి, ప్రభుత్వ కార్యాలయాలు ఉండే జేపూర్‌కి వెళ్ళడానికి టాక్సి ఎక్కుతుంది. విధివక్రించి ఈమెని నక్సలైట్లు కిడ్నాప్‌ చేస్తారు. లోపల ఎక్కడో ఉండే ఓ గ్రామంలో ఈమెని ఉంచుతారు. పారిపోవడానికి దారితెలియదు. అక్కడ ఉండే పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళయినా ఇంకా కొంతమంది ప్రజలు ఎలా జీవిస్తున్నారో అర్థమవుతుంది.
తాను పెళ్ళాడబోయే ప్రశాంత్‌ కూడా అవినీతి అధికారుల్లో ఒకడని తెలిసి హతాశురాలవుతుంది. అతని వద్ద నుంచి డబ్బు, కొన్ని ప్రయోజనాల్ని పొందిన తర్వాత గాని తీవ్రవాదులు ఆమెని విడిచిపెట్టరు. ఈ కథలో ఒరియా, ఆంధ్రా బోర్డర్‌లోని గిరిజనుల స్థితిగతుల్ని, జీవనాన్ని కళ్ళకి కడుతుంది. కోరాపుట్‌ అందచందాల్ని వివరిస్తూంది.
‘ఒన్స్‌ ద స్కై వజ్‌ బ్లూ’ అనేది మరో వినూత్నమైన కథ. ఒక బంగ్లాదేశీ శరణార్ధ కుటుంబం ఒరిస్సా రాష్ట్రంలో ఎదుర్కునే వెతల్ని దీనిలో చిత్రించారు. మార్కెట్‌ ఎకానమీలో పెద్దచేప చిన్నచేపల్ని మింగే పద్ధతి అంతర్లీనంగా ఉంటుందనే సత్యాన్ని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.
‘ద మిరేజ్‌’ అనే కథ రాజకీయుల్ని ఆశ్రయించి మనుగడ సాగించే గూండాల జీవితాల్ని చిత్రించింది. పన్ను అనే గూండా…ఆ చుట్టుపక్కల 12 గ్రామాలకి హడల్‌. ఎంతో జాగ్రత్తగా ప్రత్యర్థుల్ని మట్టిగరిపించేతను, ఒక యువతి పెట్టిన చిన్నపరీక్షని సవాలుగా తీసుకుని, పాములున్న చెరువు లోకి దిగి తెల్ల కలువపూలు కోస్తూ విషనాగులుకి బలి అవుతాడు. ఈ కథ మొత్తం మనసుచేసే గారడిని మన ముందు పెడుతుంది. గ్యాంగ్‌స్టర్‌ల ఆలోచనా విధానాన్ని సూక్ష్మంగా వర్ణించారు గౌరహరిదాస్‌. పన్ను జీవితగమనాన్ని బాగా వాస్తవానికి దగ్గరగా చిత్రించారు.
‘హేండ్‌ రైటింగ్‌’ అనే కథలో ఒక ఉపాధ్యాయుడు తన దగ్గర చదివిన ఇద్దరు విద్యార్థుల జీవితాల్ని గమనించి ఆశ్చర్యపోతాడు. స్కూల్‌లో ఎంతో మంచిగా చదివి తన ఫేవరేట్‌ స్టూడెంట్‌గా ఉండే ఓ పిల్లాడు పెద్దయిన తర్వాత ఉన్నత అధికారిగా సెక్రటేరియట్‌లో ఉంటాడు. మరో స్టూడెంట్‌ పెద్దయి కండక్టర్‌ అవుతాడు. వారి ప్రవర్తన, ఆలోచనలను బట్టి చిన్నప్పుడు బాగా చదివేవాళ్ళందరికి గొప్ప హృదయం ఉంటుందని ఊహించుకోవడం తప్పని మేస్టారికి తెలుస్తుంది.
‘వేర్‌ హేజ్‌ సుదాం జెనా గాన్‌’’ అనే కథ, విదేశీ మదుపుదారులు ఎలా దేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి వ్యవస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటారు అనే విషయాన్ని వివరిస్తుంది. ఇంకా మిగిలిన కథలు దేనికి దానికే ప్రత్యేకత కలిగినవి. ఒరియా సమకాలీన కథా సాహిత్యంలో వస్తోన్న అనేక మార్పుల్ని మనం ఈ కథాసంపుటి ద్వారా తెలుసుకోవచ్చు.
మూర్తి కెవివిఎస్‌, 7893541003

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img