‘సమాజాన్ని అమితంగా ప్రేమించే లోకోపకార మనీషులు నేడు మన మధ్య ఎందరో ఉన్నారు’ అని నిరూపించే ‘ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్’ (‘ఓ అమూల్యమైన ప్రార్థన’) అనే ఆంగ్ల భావగీతాన్ని డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి రచించి ఐక్యరాజ్యసమితికి అంకితం గావించి ఐక్యరాజ్యసమితి దినోత్సవం (24-10-2023) నాడు ఆవిష్కరింపజేసి సరికొత్త చరిత్రను సృష్టించారు. ఈ భావగీతం ఏకైక ప్రతి ధర రూ. 5 కోట్లు. సాటిలేని ఈ కావ్యకృతి ద్వారా వచ్చే నూరుశాతం డబ్బును తిరిగి సమాజ ప్రయోజనాలకే అందజేయడం జరుగుతుందని ఆయన ప్రకటించి ఎందరికో ఆదర్శనీయంగా నిలిచారు. రికార్డులకోసం కాకుండా వసుధైక కుటుంబ భావనను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు విశ్వశాంతి ఆవశ్యకతను ఎలుగెత్తి చాటడం కోసం ఆయన ఈ మానవీయ భావగీతాన్ని రచించడం నిజంగా ప్రశంసనీయం.
విశ్వశాంతిని కాంక్షిస్తూ ప్రపంచ దేశాల మధ్య సమన్వయాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని మానవ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా రచించిన ఈ ‘ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్’ (ఓ అమూల్యమైన ప్రార్థన) అనే భావగీతం ఆంగ్ల సాహిత్యం లోనే అత్యంత సుదీర్ఘ భావగీతం కావడం గమనార్హం. ప్రపంచ దేశాల్లో కోట్ల సంఖ్యలో నిస్సహాయ స్థితిలో అభాగ్యులుగా ఉన్న సామాన్య ప్రజల ధర్మాగ్రహ ఆవేదన, ఆవేశం, ఆక్రందనలను అత్యంత వినయ విధేయతలతో ఆలపించే అద్వితీయ శాంతిగీతమే ఈ ‘ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్’. కవిత్వ ప్రియులు, పండితులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ విశ్వశాంతి, సామరస్యం పట్ల చైతన్యవంతులుగా, కార్యదక్షులుగా ప్రేరేపించే ఓ అమేయ భావగీతమే ‘ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్’. ‘ఈ ప్రపంచాన్ని భూతలస్వర్గంగా మార్చు కోవాల్సిన బాధ్యత మనదే అని, దానికి ఈ భూమిపై ఉండే మనమంతా బృందంగా ఏర్పడి వసుధైక కుటుంబాన్ని నిర్మించుకునే దిశగా అందరూ సిద్ధం కావాలి’ అనే అంతస్సూత్రంతో సమస్త మానవాళికి కవి ఇచ్చిన శాంతి ప్రయత్నమే ఈ భావగీతం.
ఈ పద్యకావ్య రచన నిర్మాణ క్రమాన్ని పరిశీలిస్తే, రామాయణం కాండలుగా, మహాభారతం పర్వాలుగా విభజితమైనట్టు, ఈ మహా కావ్యాన్ని కవి పది కాంటోలుగా విభజించారు. ఈ పది కాంటోలు వరుసగా శాంతి పీఠిక, ప్రార్థన, మానవజాతి-ఐక్యత, దుఃఖమయ ప్రపంచం, ప్రపంచ శాంతి- ఐక్యత, ఐక్య రాజ్యాలు-ఐక్య కార్యాచరణ, భూమాత పరిరక్షణ, మానవ శక్తిసామర్థ్యాల గుర్తింపు, అంతిమ పద్యకృతి-ప్రపంచ శాంతి ప్రయాణ సారాంశం, కృతజ్ఞతాంజలి. ఈ పది కాంటోలు మొత్తం 237 ఉపశీర్షికలతో విశ్వ శాంతి- సమన్వయం ప్రాధాన్యతను నొక్కి చెప్పే స్వతంత్ర పద్యాలుగా తీర్చిదిద్దారు. ఈ కావ్య రచనలో కవి పాటించిన సాహితీ నియమాలు, కచ్చితత్వం అత్యంత ప్రశంసనీయం. ఈ పద్యకావ్యం మొదటి నుంచి చివరి దాకా ప్రతి విషయం పట్ల కవి ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం అనన్య సామాన్యం. ఐక్యరాజ్యసమితిలో ఉన్న 193 సభ్య దేశాలు, 2 సభ్యేతర దేశాలు మొత్తంగా 195 దేశాలకు సంబంధించి పరిశోధించి ప్రతి దేశానికి తన జాతీయ జెండాతో పాటు 6 పంక్తులు కేటాయించి మొదటి రెండు పంక్తులు ఆ దేశ పూర్వ వైభవం, తర్వాతి రెండు పంక్తులు కవి ఈ పుస్తకాన్ని రాస్తున్న సమయంలో తన పరిశోధనలో తారసపడిన ఆ దేశంలోని ఒకటి లేదా రెండు ప్రధాన సమస్యలు, అలాగే చిట్టచివరి రెండు పంక్తులు ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు సాధ్యపడే పరిష్కార మార్గాలను ప్రామాణిక పధ్ధతిలో నిర్దేశించడంతో ఈ పుస్తకం విశిష్ట ప్రాధాన్యతను సంతరించుకుంది. యుద్ధం, నిరుద్యోగం, ఆకలి, అవినీతి, పేదరికం, తీవ్రవాదం, ఆహార భద్రత, ఆర్థిక అసమానత, లింగ వివక్ష, ప్రభుత్వ ధర్మాలు, పర్యావరణ విపత్తులు, చిన్నబోతున్న చిన్నారుల బాల్యం, వ్యధతో నిండిన వృద్ధులజీవనం, భూమాత పరిరక్షణ, సామాజిక పతనం, మానసిక సంఘర్షణలు, సాంకేతిక వ్యసనాలు, యువత తీరుతెన్నులు, జీవకారుణ్యం ఇలా మానవాళి ఎదుర్కొం టున్న అనేక సమకాలీన సమస్యలకు అద్దం పట్టి, వాటికి పరిష్కార మార్గాలతో కూడిన పిలుపునిచ్చింది ఈ పద్యకావ్యం. ప్రపంచ శాంతి, సామరస్యం పట్ల మక్కువ ఉన్న కవిత్వప్రియులు, పండితులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ చైతన్యవంతులుగా, కార్య దక్షులుగా ప్రేరేపించే ఓ అమేయ భావగీతమే ‘ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్’. ఈ పద్యకావ్యం ‘ప్రపంచ శాంతి’కి తప్పకుండా దోహదం చేస్తుందని ఘంటాపథంగా చెప్పవచ్చు.
ఈ శాంతి భావగీతాన్ని రాయడానికి మూడు దశాబ్దాల ఊహా పరికల్పనలు, మూడేళ్ల మేధోమథన అధ్యయనం, నిబద్ధతతో కూడిన కఠోర రచనా పరిశ్రమ అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయని కృతికర్త డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి పేర్కొన్నారు. అక్షరాల అయిదు కోట్ల రూపాయల ధరగల ఈ సుదీర్ఘ భావగీత పుస్తకం వెల కట్టలేనంత సామాజిక స్పృహ, దాని ధరను మించిన ప్రయోజనాన్ని చేకూర్చుతుందని, ఈ అమూల్య ఆంగ్ల కావ్యానికి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరిస్తాయని, నోబెల్ బహుమతి సైతం ఈ పుస్తకాన్ని వరించగలదన్న నమ్మకం దాన్ని చదువుతుండగానే ప్రతి ఒక్కరి మదిలో తప్పక మెదులుతుంది. ఎన్నో రకాలుగా ఎందరికో ప్రేరణనిస్తున్న డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి సృజనాత్మక సాహితీ రంగంలో మరింతగా రాణించి ఎన్నో అత్యున్నత అవార్డులు, గౌరవాలు పొందాలని ఆకాంక్షిద్దాం.
- జె.జె.సి.పి. బాబూరావు, రీసెర్చ్ స్కాలర్,
సెల్: 94933 19690.