ఆచార్య వెలమల సిమ్మన్న, 94406 41617
‘‘ఆంధ్ర భాషయందు, చరిత్ర గ్రంథంబు
లత్యల్పంబుగ నున్నవి. కాన చేతనైననంత
వరకు మాతృభాషా సేవ చేయవలెననిన
నిచ్ఛతోనే చరిత్ర గ్రంథంబు రాసినాడ
శక్తి వంచన లేక, ఇకముందునునిటులనే
భాషా సేవ చేయువలయునని నిచ్ఛగలవాడను’’కొమర్రాజు వేంకటలక్ష్మణరావు 1876 మే 18వ తేదిన కృష్ణాజిల్లా నందిగామ తాలూక పెనుగంచిప్రోలు గ్రామంలో కొమర్రాజు జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి గంగమ్మ, వేంకటప్పయ గార్లు. లక్ష్మణరావు గారికి అచ్చమాంబ, వినాయకరావు ఇద్దరు పిల్లలు. రావుగారు 13
071923 తేదీన మద్రాసులో తన ఇల్లు ‘‘వేద విలాస్’’ లో పరమపదించారు. తెలుగుభాషపై కృషి చేసిన భాషావేత్తలు ఎందరో వున్నారు. అందులో అగ్రశ్రేణి విశిష్ట భాషా శాస్త్రవేత్తకొమర్రాజు. వీరు గొప్ప పరిశోధకులు. ఉత్తమ విమర్శకులు. భాషాశాస్త్రం, శాసన పరిశోధనలో ఆరితేరిన దిట్ట. కొమర్రాజు అంటే పరిశోధన అనే స్థాయిలో పరిశోధన చేసిన మహానుభావులు. తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని సేవ చేసి, శాశ్వతమైన కీర్తిని గడిరచిన కొమర్రాజు ‘‘తెలుగు భాషాతత్త్వం’’ అనే గ్రంథాన్నిరాశారు. ఎన్నో చారిత్రక, శాసన, భాషా పరిశోధకవ్యాసాలు రాశారు. తెలుగుదేశంలో కొమర్రాజు విశిష్ట భాషాశాస్త్రవేత్తగా మంచిపేరు తెచ్చుకున్నారు. వీరి భాషా సేవ చిరస్మరణీయం. లక్ష్మణరావు గారు 1923లో ‘‘తెలుగు భాషాతత్త్వం’’ అనే గ్రంథం రాశారు. 1923లో చనిపోయాక, 66 సంవత్సరాల తర్వాత ఈ గ్రంథాన్ని 1989లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ వారు ప్రచురించారు. పుటలు 164. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి భాషా సాహిత్య సేవ మరవలేనిది. మరుగపడనిది. ఈ గ్రంథానికి ‘‘పరిచయం’’ అనే పేరుతో డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారు ‘‘ముందుమాట’’ (14
111989) రాశారు. ఈ గ్రంథాన్ని పరిశీలించి, పరిష్కరించినవారు బూదరాజు వారే. రావు గారు ఈ గ్రంథాన్ని గ్రాంథిక భాషలో రాశారు. 1989 డిసెంబర్‌లో శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, హైదరాబాద్‌లో ‘‘తెలుగు భాషాతత్త్వం’’ గ్రంథావిష్కరణ జరిగింది. ఈ సభలో డాక్టర్ సరోజినీ రెగాని, ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గార్లు పాల్గొన్నారు. విజయవంతంగా సభ జరిగింది. అందరూ కొమర్రాజుపై ప్రశంసల వర్షం కురిపించారు. లక్ష్మణరావు గారి భాషా సేవ అనితరసాధ్యం అని కొనియాడారు వక్తలు. కొమర్రాజు తన జీవిత చివరలోరాసిన విలువైనగ్రంథం ‘‘తెలుగు భాషా తత్త్వం’’. ఈ గ్రంథం చాలా సంవత్సరాలు ముద్రణ కాకుండా వుండి పోయింది. రావుగారు రాసిన ఈ గ్రంథ ప్రతి చివరి రోజుల్లో కనబడకుండా పోయింది. 1923లోనే అభిమానులు తీసుకెళ్ళారు. తిరిగి మరల ఇవ్వలేదు. ఈలోపు కొమర్రాజు చనిపోయారు. ప్రతి దొరకలేదు. చివరకు లక్ష్మణరావు గారి కుమార్తె డాక్టర్ అచ్చమాంబ ప్రయత్నం వల్ల రాత ప్రతి ఎట్టకేలకు దొరికింది. మల్లంపల్లి సోమశేఖర్ శర్మగారి నుంచి ప్రచురిస్తామని రాత ప్రతిని తీసుకెళ్ళారు. వాళ్ల దగ్గర కొంతకాలం వుంచుకున్నారు. ఈలోపు చాలా చాలా చేతులు మారాయి. చివరకు ఫలితం లేదు. ఎవరెవరు ఈ గ్రంథాన్ని ఎంతెంత కాలం, ఏయే కారణాల వల్ల దాచి వుంచారో, ఈ గ్రంథం నుంచి ఎంతెంత లబ్ధిపొందారో అంతా విపులంగా వివరిస్తూ ప్రచురిద్దామని డాక్టర్ అచ్చమాంబ అనుకున్నారు. ఈలోపు ఆమె 1964లో చనిపోయారు. చివరకు కొమర్రాజు కుమారుడు వినాయకరావు ప్రోత్సాహంతో ముందుకు నడిచింది. వీరే స్వయంగా ప్రతిని చక్కగా మరల కాపీ చేశారని బూధరాజువారు వివరించారు. విశాలాంధ్ర వారు ఈ గ్రంథాన్ని బూదరాజు రాధా కృష్ణతో పరిష్కరింపచేసి, యథాతథంగా ముద్రించారు. ఈ గ్రంథంలో పదిహేను అంశాలు చోటు చేసుకున్నాయి. 1. ఆంధ్ర భాషో త్పత్తి, 2. వర్ణ విచారం, 3. ఆంధ్రభాషయందలి శబ్ద సంగ్రహం 4.తత్సమములు 5. తద్భవములు 6. దేశ్యములు 7. లింగ విచారం 8. కృదంతరూపములు 9. విశేషణములు 10. సమాసములు 11. సంధి విచారం 12. తెలుగులోని విభక్తి ప్రత్యయములు 13. ద్వితీయాది విభక్తి ప్రత్యయములు 14. సర్వ నామములు 15. క్రియా రూపములు. చివర అను బంధాల్లో అధస్సూచికలు, స్థాన నిర్దేశం లేని అధస్సూచికలు, తప్పొప్పుల పట్టిక చోటు చేసుకున్నాయి. ‘‘తెలుగు భాషోతత్త్వము అనే ఈ గ్రంథంలో తెలుగు ద్రవిడ భాషా కుటుంబానికి చెందిందని, ఆంధ్ర శాఖకు ఆ కుటుంబంలో ప్రత్యేక స్థాన ముందని కొమర్రాజు గారు ప్రతిపాదించి సమర్ధించారు. గోండీ మొదలయిన వాటిని ‘మధ్యవర్తి భాష’ లన్నారు. ‘భీలీ’ని మధ్య ద్రావిడ భాషల్లో చేర్చారు. కావ్య ప్రయోగాల్లోని ఎరువు మాటలు కృతక శబ్ధాని వాదించారు. మహా ప్రాణోచ్చారణ ద్రవిడ భాషల్లో కూడా ఉందన్నారు. ‘ఱ’ కార యుక్త శబ్దాలు తెలుగులో క్రీ.శ. పదో శతాబ్దం దాకా వున్నట్లు కనిపెట్టితిని అని చెప్పారు. ఆంధ్రభాషలోని శబ్ద సంపదను శబ్ద రత్నాకరం ఆధారంగా విశ్లేషించారు. పాఠ్యగ్రంథాల నుంచి పిల్లల వాడుకలో ఉన్న పదాలను సేకరించారు. సంస్కృతం నుంచి ఎరువు తెచ్చుకున్న సంఖ్యా వాచకాల వ్యాప్తిలోని విశేషాన్ని ప్రస్తావించారు. తెలుగులో మొదట ఒకే లింగముండేదని, తరువాత రెండు లింగాలేర్పడ్డాయని వాదించారు. డు, ము, వులే గాక ను, యు, అనే ప్రథమైక వచన ప్రత్యయాలున్నాయని నిర్ధారించారు. ప్రాచీన ద్రావిడంలోని ళ, ణ పర్యాయ రూపతను గుర్తించారు. చేయ్యాదులను సకారాంతాలుగా పరిగణించారు. నేటి భాషా శాస్త్రజ్ఞుల్లాగా ఇలా అనేకం. ఈ గ్రంథం మొత్తానికి సమాసాలను గుర్తించిన పదో ప్రకరణం సర్వోత్తమం. సంప్రదాయ వ్యాకరణాలు గాని, ఆంధ్ర భాషా చరిత్ర వికాస కారులుగాని, గుర్తించని అనేకవిషయాలను ఆయన స్పృశించి చర్చించారు. కారక విభక్తులను గురించి 12, 13 ప్రకారణాల్లో ఎన్నో విశేషాలను వెలికి తీశారు. డు.వు ప్రత్యయ చరిత్రను అనంతర రచయితల కన్నా విస్పష్టంగా వివరించారు. కర్మణి ప్రయోగం విషయంలో, సర్వనామాల చరిత్ర విషయంలో, అనేక నూతనాంశాలను ప్రతిపాదించారు. తెలుగు నిఘంటువుల సంస్కృత దాస్యం గురించి ప్రస్తావించారు. మానవ శాస్త్రానికి సంబంధించి ఆయన ప్రసంగాలిప్పటికి వారికి విడ్డూరంగా ఉండవచ్చు. తమిళ సాహిత్యంలో బ్రాహ్మణేతరులప్రాబల్యం వంటి వాస్తవాలను ఆయన సున్నితంగా గ్రహించారు. ఈనాటికి తెలుగులో వచ్చిన భాషా చరిత్ర గ్రంథాల్లో ఇది మొదటిదని (రచనా కాలాన్ని బట్టి) గ్రహించినప్పుడు ఈ గ్రంథ ప్రామాణ్యాన్ని ఎవరయినా గుర్తించి గౌరవించగలరు.’’ (తెలుగు భాషా తత్వం
ముందుమాటడాక్టర్ బూదరాజు రాధాకృష్ణ
పుట 10,11) ఇది సత్యం. కొమర్రాజు ‘‘తెలుగు భాషా తత్త్వం’’ గ్రంథమే కాక ఎన్నో చారిత్రక, భాష, శాసన వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలన్నీ ప్రముఖుల మెప్పును పొందాయి. భాషా పరిశోధకుడుగా కొమర్రాజు మంచి పేరు సంపాదించు కున్నారు. వీరు అక్షరములు, అక్షర సమామ్నాయం, అచ్చ తెలుగు, త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?, ద్రావిడ భాషలలోని ఉత్తమ పురుష వాచక సర్వనామం, అరవం నుండి తెలుగు పుట్టినా? తెలుగు నుండి అరవము పుట్టినదా? కానే కాదు, ఇలాంటి అనేక భాషా పరిశోధనవ్యాసాలు రావుగారు రాశారు. ప్రతీ వ్యాసంలో ఏదో ఒక కొత్త అంశాన్ని చెప్పారు. అదే వీరి ప్రత్యేకత.
‘‘అక్షరములు’’ అనే వ్యాసం కొమర్రాజుకి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇందులో లిపి పుట్టుపూర్వోత్తరాలు చోటుచేసుకున్నాయి. ఆనాటికి తెలుగు లిపి గూర్చి అంతకుముందు ఇంత సమగ్రంగా వ్యాసం కానీ, గ్రంథం కానీ, రాలేదు. ప్రపంచలిపుల్ని గూర్చి పాశ్చాత్యులు రాసిన గ్రంథాల్ని బాగా పరిశీలించి, పరిశోధించి, మన భారతీయ లిపుల పుట్టుపూర్వోత్తరాల్ని, శాసనాల ఆధారంతో, ఉదాహరణ పూర్వకంగా కొమర్రాజు ఈ వ్యాసం రాశారు. లిపి విషయంలో సహేతుకంగా లేని పాశ్చాత్యుల సిద్ధాంతాల్ని వీరు ఖండిరచారు. లిపిని గూర్చి చెప్పవలసిన దంతా కొమర్రాజు ఈ వ్యాసంలో చెప్పారు. మరో గొప్ప వ్యాసం ‘‘వర్ణ సమామ్నాయం’’. ‘‘అక్షరములు’’ అనే వ్యాసంలో అక్షరాల ఆకారం(లిపి) గూర్చి వివరించారు. ‘‘వర్ణ సమామ్నాయం’’ వ్యాసంలో అక్షరాల ఉచ్చారణను విశదీకరించారు. సంస్కృత భాషలోని అచ్చులను, హల్లులను, పేర్కొని, ఆ అక్షరాల్లో కొన్నింటి ఉచ్చారణ, ఇతర భాషల్లో ఎలా వుందో ఈ వ్యాసంలో రావు గారు విశ్లేచించారు. ఇందులో ఉత్తర భారత, దక్షిణ భారత ఉచ్చారణబేధాల్ని కొమర్రాజు చక్కగా వివరించారు.
‘‘అచ్చ తెలుగు’’ వ్యాసంలో కేతన, అప్పకవి, కూచిమంచి తిమ్మకవి మొదలైన లాక్షణికులు తెలుగు పదాల్ని ఏ విధంగా వర్గీకరించారో విపులీకరించారు. చిన్నయసూరి ‘‘బాలవ్యాకరణం’’లో సంజ్ఞ పరిచ్ఛేదంలో ‘‘త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబగు భాష దేశ్యంబు’’, లక్షణ విరుద్ధంబగు భాష గ్రామ్యంబు’’ అని సూత్రీకరించారు. సూరి గారి అభిప్రాయంతో కొమర్రాజు విభేదించి, గ్రామ్యపదాల్ని కూడా దేశ విభాగంలో చేర్చారు. ‘‘త్రిలింగము నుండి తెలుగు పుట్టినా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టినా?’’ అనే వ్యాసం ఇప్పటికీ ప్రామాణికమైందే. ఆ రోజుల్లో తెలుగు భాషకు పర్యాయ పదాలైన ఆంధ్రం తెలుగు
తెనుగు వీటి వ్యుత్పత్తిని గూర్చి చాలా వాదోపవాదాలు జరిగాయి. ఆ సందర్భంలో కొమర్రాజు ఈవ్యాసాన్ని రాశారు. వీరి వాదనను అందరూ అంగీకరించారు ఆమోదించారు. కొమర్రాజు వాదన ఏమంటే తెలుగు శబ్దం, ‘త్రిలింగ’ శబ్దభావం కాదు అనీ, ‘‘త్రిలింగం’’ శబ్దం, తెలుగు నుండి వచ్చిందని చెప్పారు. త్రిలింగమే తెలుగు శబ్దానికి సంస్కృతీ కరించిన రూపం అని తేల్చిపడేశారు. త్రిలింగ శబ్దం నన్నయ కాలంలో వాడుకలో లేదని, ఇది విద్యానాథుడు కల్పించి చెప్పిన పదం అని కొమర్రాజు తెలియజేశారు. లక్ష్మణరావు వెలుబుచ్చిన అభిప్రాయానికి భిన్నంగా గంట జోగి సోమయాజులు త్రిలింగ శబ్దం నుంచే తెలుగు శబ్దం పుట్టిందని వాదించారు. గంటి వారి వాదనలో పసలేదు. తెలుగు, తెనుగు, ఈ రెండు శబ్దాలు నన్నయ కాలం నుండి వాడుకలో వున్నాయి. కాబట్టి తెలుగు శబ్దం ప్రాచీనమైందన్న కొమర్రాజు వాదం అంగీకరించదగ్గదే. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం, క్షేత్రాల లింగాలకు చిహ్నంగా ఈ త్రిలింగ శబ్దం ఉద్భవించింది. పరిశోధనలో ఘనాపాటి కొమర్రాజు.
వీరు రాసిన భాషా వ్యాసాల్లో ‘‘ద్రావిడ భాషలలోని ఉత్తమ పురుష వాచక సర్వనామం’’ చెప్పుకోదగ్గది. ద్రావిడ భాషల మధ్య గల సంబంధాన్ని నిరూపించడానికి ప్రయత్నించిన తెలుగు భాషా పరిశోధకుల్లో కొమర్రాజు ఒకరు. ఆచార్య పి.యస్. సుబ్రహ్మణ్యం గారు ‘‘ద్రావిడ భాషలు’’ అనే గ్రంథంలో ద్రావిడ భాషల్లోని ఉత్తమ పురుష వాచక సర్వనామాల ఏకవచన రూపాలు ‘‘యాన్’’ అనే మూల ద్రావిడ రూపం నుండి ఏర్పడ్డాయని ఆధునిక భాషా పరిశోధకులు నిర్ణయించారు’’ (పుట 234) అని అన్నారు. కొమర్రాజు మూల ద్రావిడ ఏకవచన రూపం ‘‘ఏన్’’ అని నిర్ధారించడమే కాక, దాని ఉచ్చారణ ‘‘ఆ్య’’, ‘‘యా’’,ల ఉచ్చారణతోకూడి వుంటుందని చెప్పారు. ఆధునిక భాషావేత్తలు కూడా తమిళంలో ఏకవచన రూపమైన ‘‘యాన్’’ పదాన్ని మూల రూపంగా స్థిరపరచారు. కొమర్రాజు ఇంకా ముందుకు వెళ్ళి మూలరూపం ఉచ్చారణను కూడా వివరించారు. మొత్తం మీద సారాంశం ఏమంటే కొమర్రాజు అభిప్రాయం, ఆధునిక భాషావేత్తల అభిప్రాయం దాదాపుగా ఒకేలాగే వున్నాయి. కొమర్రాజు వీటి బహువచన రూపం ‘‘యామ్’’ అని నిర్ధారించారు. అంతేకాదు ఆధునిక భాషావేత్తలు దాన్ని అంగీకరించారు. దీనిబట్టి లక్ష్మణరావుగారి పరిశీలన ఎంత విశిష్టమైందో మనకు అర్ధమవుతుంది.
‘‘అరవము పురాతనమైనదా? తెనుగు నుండి అరవము పుట్టినదా? కానే కాదు’’ అనే వ్యాసంలో తమిళం పురాతనమైంది కాదు, తమిళం నుండి తెలుగు పుట్టలేదని తెలియజేశారు. వీరి పరిశోధన ఎక్కువగా సత్యం చోటు చేసుకుంటుంది. ‘‘తెలుగు భాషాతత్త్వం’’ అనే గ్రంథంరాసి, అనేక విలువైన భాషా పరిశోధక వ్యాసాలు రాసి, విఖ్యాత భాషాశాస్త్రవేత్తగా ఎనలేని పేరు తెచ్చుకున్నారు లక్ష్మణరావు గారు. పరిశోధననే తపస్సుగా భావించిన సాహితీ మూర్తి రావు గారు. పరిశోధనలో పరాకాష్ఠకు చేరుకున్న పరమ పరిశోధక పరమేశ్వరులు కొమర్రాజు. విజ్ఞాన ప్రదాత కొమర్రాజు లక్ష్మణరావు. అగ్ర శ్రేణి పరిశోధకులుగా, ఉత్తమ విమర్శకులుగా, సుప్రసిద్ధ భాషాశాస్త్ర వేత్తగా…ఇలా ఎన్నో కోణాల్లో తెలుగుభాషకు నిరంతర నిర్విరామంగా కృషి చేసిన మహనీయులు లక్ష్మణరావు గారు. తెలుగు భాషా పరిశోధన వికాసానికి పునాదులు వేసి, దాని కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమూర్తి, ప్రతిభామూర్తి, కొమర్రాజు వేంకట లక్ష్మణరావు.
‘‘అతడు బహుభాషావేత్త, భావదర్శి, కార్యవాది నిండు మనస్సు గలవాడు. గంభీరుడు, ముందు చూపుగలవాడు. ఒక్క ఊపుతో ఆంధ్ర వాఙ్మయమును అర్ధ శతాబ్దపు మేరకు ముందు నెట్టినాడు.’’
` సురవరం ప్రతాపరెడ్డి