డా॥ సృజన
కత్తి పద్మారావు గారి కవిత్వం పర్యావరణ పరిరక్షణా గీతం. అది ప్రతినిత్యం ఒక సుస్థిర సందేశాన్ని వ్యాప్తి చేస్తుంది. ఈ సందేశం తరతరాల మన నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తుంది. పర్యవసానాల్ని మన కళ్ళముందు ప్రభ కడుతుంది. నవ తరాన్ని కార్యోన్ముఖుల్ని చేస్తుంది.
దుబ్బ నిట్ట నిలువునా/ చేలో ఎండిపోతుంది
ఆ నడిచేలో ఎండిన దుబ్బ కవిని ప్రశ్నిస్తుంది. కవి సున్నిత మనస్కుడు. మన నిర్లక్ష్యానికి ఆ దుబ్బ నిలువెత్తు సాక్ష్యం.
సేంద్రియమైనదంతా నిరాకరించబడినాక
విత్తనానికి ఆయువు పోయింది.
సేంద్రియ ఉద్యమం నేడు ప్రముఖంగా ఊపందుకుంటున్న నేపధ్యంలో కవులు, కళాకారులు ప్రధాన భూమిక పోషించనున్నారు. సాహిత్యం పర్యావరణ పరిరక్షణా అవగాహనను సులువుగా ప్రజలలోకి జొప్పించగలదు.
ఒక తుఫాను వచ్చినప్పుడు/ సముద్రం విధ్వంసం సృష్టిస్తుంది
ప్రకృతిలోని అనంతశక్తులు/ఒకేసారి మాట్లాడుతాయి
అంటూ కవి ప్రకృతి అభివ్యక్తిలోని సముజ్వల కాంతులను సచేతనంగా పరిచయం చేస్తున్నారు.
ప్రతి ఋతువులో/ తల్లిది కొత్త భాష
కవికి ప్రకృతి ప్రేరణ వారికి ప్రకృతిలో తల్లి మమేకమైనట్లు అనిపిస్తుంది. వారి ఆలోచనా ప్రవాహాన్ని సమాజానికి ప్రకృతి ద్వారా అన్వయిస్తారు. వారి కవిత్వానికీ, సమాజానికీ ప్రకృతి వాహిక.
తొలకరిలో చిగురాకులు/వెన్నెలను ధరించి
కిరీటాలున్న రాజుల్లా వున్నాయి
తొలకరి, చిగురాకులు, వెన్నెల, కడలి తరంగాలు, సూర్య కిరణాలు, నక్షత్రాలు, పాలపుంతలు వంటి ప్రకృతి ప్రతీకలు కవిత్వం మొత్తం దర్శనమిస్తాయి.
ప్రకృతిలో అన్నీ కంచలే/కవాతు చేసేవాడి
పాదం నిండా గాయాలే
నేడు పర్యావరణ పరిరక్షణ ఒక ఉద్యమం. పలువురు పర్యావరణ వేత్తలు కార్పొరేట్ వ్యవస్థను ఎదిరించి పోరాడి తమ ప్రాణాలను పణంగా పెట్టారు. మన దేశంలో పర్యావరణ వేత్తలుగా మేధా పాట్కర్, సునీతా నారాయణ, వందనా సింగ్, సుగత కుమారి, గౌరీదేవి, సుందర్‌లాల్ బహుగుణ వంటి వారు ప్రసిద్ధి గాంచారు. వారంతా ప్రకృతి వినాశనాన్ని ప్రశ్నిస్తున్నారు. వారి ప్రయాణంలో అనేక కంచెలు ఆ కవాతు ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక గాయాలు మిగిల్చింది.
1985లో డియన్ ఫాసీ అనే పర్యావరణ పరిరక్షకురాలిని గొరిల్లాలను వేటాడి వ్యాపారం చేయడానికి విఘాతం కలిగిస్తున్నదనే నెపంతో అత్యంత దారుణంగా ఆఫ్రికాలో హత్యచేశారు.
కడలి సుడులు సుడులుగా/తిరుగుతున్నప్పుడు
అందులో అలజడి వుంది
ప్రకృతిలో అలజడికి మనిషి పాత్రను మనం విశ్లేషణ చేసుకోవాల్సి వుంది. కవి ప్రకృతిలోని తీవ్రతలను నిశితంగా పరిశీలిస్తూ తద్వారా ఉత్పన్నమయ్యే ప్రకంపనల పట్ల మానవులను అనేక ఉదాహరణలతో వారించడం గమనార్హం.
జనం మౌనంగా వున్నప్పుడే/ నదులు స్వేచ్ఛగా ప్రవహించాయి
మానవుడు నదిని తన మనుగడకు జీవనాధారం చేసుకున్నాక అనేక కాలుష్య కారక అంశాలు నదీ జలాల స్వచ్ఛతను కలుషితం చేశాయి.
అనేక కృత్రిమంశాలు/ స్వల్ప కాలాన్ని పాలిస్తున్నాయి
నాగరికత సుస్థిరత పునాదిపై నిర్మించినపుడే అనతికాలం వర్థిల్లుతుంది. వీరి కవిత్వం సూక్తులు విరివిగా సాక్షాత్కరిస్తాయి.
‘‘చిన్నమొగ్గ’’లో కూడా వికాసాన్ని ఆస్వాదించగల ప్రేమికుడు కవి. ‘‘సమన్వయం’’ లోపించినపుడు రాగాలలోని ‘‘వైరుధ్యం’’ ప్రస్ఫుటిస్తుందని ప్రకృతిలో వున్న సమన్వయాన్ని ఆవిష్కరించారు.
ఆ పొలంగట్టున నిలబడ్డవాడు/ పాలకంకులను ముక్కులతో
పొడుస్తున్న పిట్టలను చూసి/పొలానికి నీళ్లందినంత కాలం
పంటవస్తూనే ఉంటుందని/ ఆనందించాడు.
వ్యవసాయం సజావుగా సాగాలంటే నీటి యాజమాన్యం ప్రధానాంశం. ఈ విషయాన్ని ‘‘పాలకంకులను ముక్కులతో పొడుస్తున్న పాలపిట్టల ద్వారా దృశ్యీకరించారు కవి. ‘పంట సరుకయ్యాక’’ ‘‘దుఃఖం మిగిలిందని’’ కవితాత్మకంగా వ్యక్తీకరించడంలో ఆయనకు ఎవరూ సాటిరారు. కవిత్వం కేవలం భావాత్మక వ్యక్తీకరణ మాత్రమే కాదు. కత్తి పద్మారావు కవిత్వం సామాజిక బాధ్యతకు దారి వేయడాన్ని గమనించవచ్చు.
ఋతువు ఆలస్యం కావడం, విత్తనానికి భూమికి ఉన్న సంబంధాన్ని ధ్వంసిస్తున్న తేలిపోతున్న మబ్బులనుద్దేశించి కవి ప్రకృతి వినాశనానికి మనిషి ఎంత వరకూ కారకుడు అని చర్చిస్తూ…
ప్రతిదానిలో మనుష్యులు/ముగింపుకోరినంత/కొనసాగింపు కోరడంలేదు.
ప్రకృతి కేవలం వర్ణనలకు వస్తు మాత్రం కాదు. ఒక సైద్ధాంతిక చర్చను నిరంతరం కవి తన కవిత్వం ద్వారా చేస్తూ వస్తున్నారు. కీట్స్, షెల్లీ, ఖలీల్ జిబ్రాన్, జాన్ మిల్టన్ వంటి ప్రఖ్యాత కవులను దాటి కవి మానవునిలో నూతన ఆలోచనకు ఊపిరులూదుతున్నారు.
నీరుకు బలం చేకూరిస్తే/కొత్త చిగురొస్తదని/వీరికి తెలుస్తుంది.
కత్తి పద్మారావు మానవీయ విలువలను, వ్యక్తిత్వ నిర్మాణాన్ని, సామాజిక స్పృహను తన కవిత్వం ద్వారా సమాజంలోకి చేర్చుతున్న సామాజిక తత్వవేత్త.
మొగ్గ చిట్లుతున్న శబ్ధం వినపడదు
కానీ,/ పునఃసృష్టి జరుగుతూనే వుంది.
ప్రకృతికి మనం ఎన్ని అవరోధాలు కలిగించినా పునఃసృష్టి జరుగుతూనే వుంది. కానీ
ఆకులు రాలుతున్నంతగా
చిగురులు వేయడం లేదు
ఈ రెండు ప్రక్రియలకు మధ్యన మానవ విధ్వంసం చర్చనీయాంశం. ఎక్కువ మొగ్గలు ఎండిపోతున్నాయి. కానీ, నానాటికి పెరుగుతున్న కాలుష్యం కారణం ఈ రోజున మనం ఆశించిన మేరకు ఫలితాలు రావడం లేదు.
నక్షత్రాల, తెల్లటి గువ్వలు/ నదుల్లో అద్దం చూసుకుంటున్నాయి
వాటి ముఖాల కంటే/ నీరే మకిలిగా వుంది.
ఇలా ఒక్కొక్క కవితలో పర్యావరణ కాలుష్యంపై వారు చేస్తున్న విశ్లేషణ ఆలోచింపజేస్తుంది. వారు సునిశితమైన ప్రతి శాస్త్రీయ అధ్యయనాల్ని ప్రతీకాత్మకంగా సార్వజనీనం చేయడం గమనించవచ్చు.
‘‘వీళ్ళు ఆకాశ నక్షత్రాలను చూసి/ఎన్నాళ్ళయిందో’’ అనే మాట నేటి తరం తీరు తెన్నులకు అద్దం పడుతుంది. బ్లూ స్క్రీన్ ఆకర్షించినంతగా ప్రకృతిలోని సున్నితమైన అభివ్యక్తులు వారిని చేరడం లేదు.
నేటి పాలకుల ప్రాధాన్యాలను, వైఫల్యాలను నాలుగు మాటల్లో మన ముందుంచారు.
గ్రానైట్ స్టోన్స్/ తవ్వకాలకు పెట్టిన శ్రద్ధ,
నాలుగు పప్పు ధాన్యాలను/పండిరచడానికి పెడితే
ప్రజలకు అవి లభ్యమయ్యేవి కదా!
ఈనాడు మైనింగ్ ప్రక్రియ ద్వారా ఎంత ఆర్థిక పురోగతిని ఆపేక్షిస్తున్నారో అంతకుమించిన దుమ్ము, ధూళి, మానవ శ్వాసకోశాన్ని శాసిస్తున్న సూక్ష్మ రేణువులు విడుదలౌతున్నాయి. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, శ్వాసకోశ వ్యాధులు కలిగిన వారు వీటివల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కవి ప్రజలు ఈ అంశాలపై దృష్టి పెట్టాలని హైలైట్ చేస్తున్నారు.
అడవి నిజాయితీగా పూస్తుంది/ ఆకుల కంటే పూతే ఎక్కువ
ఆ చెట్లు నరికి/అద్దాల భవనం కట్టిన వారు
వీధుల వెంట మొక్కలు నాటుతున్నారేంటి?
ప్రకృతి నిజాయితీకి ప్రతీక. పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో చిత్తశుద్ధి కొరవడిరది. కార్పొరేట్‌ల సామాజిక బాధ్యత ప్రచారంగా మాత్రమే మిగలకూడదు. పర్యావరణ కాలుష్యాన్ని కట్టడి చేయడానికి కార్పొరేట్ వ్యవస్థ ఒక సామాజిక విప్లవ నినాద బాధ్యతను భుజాన వేస్కోంది.
ప్రకృతిది ఒక అనంత/పరివాహిత సృజనమైనా
దానది కొన్నిసార్లు కఠిన చర్య/ అనివార్యత దాని లక్షణం
అందుకే/మనిషి అనంతుడైనా
ప్రకృతి దాని బహుళ్యాన్ని/ఎరుక పరుస్తూనే వుంది.
మనిషి ప్రకృతితో సామరస్యాన్ని సాధించినపుడే ఒక సమన్వయ స్రవంతి భాసిస్తుంది. వైరుధ్యం అధిగమనం కాజాలదు. ఆవాహనమే ఈ వైరుధ్యానికి సామరస్యం. ఈనాడు దేశంలోని అనేక నగరాలు వాయు కాలుష్యాన్ని విషవాయువులతో విలవిల లాడుతున్నాయి. అట్టి నగరాలలోని పరిస్థితిని విశ్లేషిస్తూ…
ఇది నగరమే/విషవాయువుల కాటుకు
మూర్చబోయిన నగరం/ నగరముఖద్వారంలోనే
అడ్డుకుంటున్న నగరం/చల్లని గాలిలేని
నీటి తుంపరలేని/ చాల సూర్య ప్రభాసం లేని నగరం
మన నగరాలు చల్లని గాలి, నీటి తుంపరలు, చాల సూర్య ప్రభాసం లేక మూర్చబోయాయి. ప్రతి నగర ముఖ ద్వారం ఒక చెత్త కుప్పతో స్వాగతిస్తుంది. అక్కడ తగలబెడుతున్న చెత్త నుండి విషం చిమ్ముతూ ఉద్గారాల మయం. ఎక్కువగా వ్యర్థాల నిర్వహణ, యాజమాన్యం సాంకేతికతను నగర పాలక సంస్థలు పాటించిన దాఖలాలు లేవు. ఎక్కడో జిల్లాలో ఒక నగర పాలక సంస్థ కూడా వ్యర్థాల సమగ్ర నిర్వహణ చేయడం లేదు. కవి మూర్ఛపోయిన మన నగరాలకు ఆయువు పోయాలని కాంక్షిస్తున్నారు.
అంత అడవిలోనూ/ ఒక్క పాలపిట్ట ధ్వని
ఎంత సొబుగుగా వుంది…./మనిషి ప్రకృతి జన్యం
ప్రకృతికి అంతంలేదు/ నశించే దానికంటే సృజనమే అధికం
ప్రకృతిని మనం డిస్టర్బ్ చేసే కొలది మనిషి వినాశనాన్ని కోరుకుంటున్నట్లే. ప్రకృతికి అంతంలేదు. సృజనం నశించే దానికంటే ఎక్కువే. మనల్ని మనం ప్రకృతిలో నివశించే జీవుల్లో వుంచుకుంటామా లేదా మన వినాశనానికి పునాదులు వేసుకుంటామా యోచించుకోవాలి.
‘‘ఎవడి నేలను వారు రక్షించుకోవడం
చారిత్రక అవసరం’’
కవి యిక్కడ నేలను రక్షించడం గురించి ప్రత్యేక దృష్టిని సారించుచున్నారు. అసలు నేలను ఎందుకు రక్షించవలసిన ఆవశ్యకత ఏర్పడిరది? ఈ ప్రశ్న దగ్గరే పరిష్కారం లభిస్తుంది. భూ సంరక్షణ లోకల్‌గా జరగాలి. గ్రామ స్థాయిలో కాలుష్యాన్ని కట్టడి చేయడం సముచితం.
ప్రవహించే నీటిని చూస్తున్నాం/ కురిసే చినుకును చూస్తున్నాం
ప్రతి వీక్షణంలో/ఏదో కొత్తదనం వుండనే వుంది
మనుషులు ప్రకృతిని ప్రేమించాలి. అప్పుడు ప్రకృతిని ఆస్వాదిస్తారు. పరిరక్షిస్తారు. మనిషి ప్రకృతిని పరస్పర ఆధారితాలుగా వర్థిల్లుతారు.
ప్రకృతి ప్రతిరోజు కొత్త పుస్తకమే
ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసే ఆసక్తి నేటి మానవ సమాజానికి కొరవడిరది.
ప్రకృతిలోని ప్రతి అణువు/ తిరుగుబాటు చేస్తూనే వుంది.