పలస్తీనా కవిత :
మహమూద్ దర్విష్
అనువాదం:
పెనుగొండ లక్ష్మీనారాయణ
అరసం జాతీయ అధ్యక్షుడు
ప్రియమైన అమ్మా!
నీకో ముద్దు
అభినందనలు
ఇంకేం చెప్పను?
మొదలెక్కడ
తుదియెక్కడ
కాల ప్రవాహమిది
అనంతం
ఈ ప్రవాసంలో
మిగిలింది
ఒక ఎండిన రొట్టె
తపన
మరుగుతున్న మస్తిష్కాన్ని
తనలో పరుచుకున్న నోట్‌బుక్
ఎక్కడ మొదలెక్కడ!
ఎన్నో చెప్పుండొచ్చు
ముందెన్నో చెప్పొచ్చు
ఎన్ని చెప్పినా ఇంటికి
చేరువకాను
చెప్పినవేవీ వానలు కురిపించలేవు
వయస్సుడిగిన ముసలి పక్షికి
రెక్కలు మొలిపించలేవు
ఆకాశవాణిలో
క్షేమమని నెచ్చెలికి
సందేశమిచ్చిన అవ్యక్తుని
మధుర స్వరపేటిక
కలిగించిన ఉత్సుకతకు
శారికతో కబురు పెడితి
చెంతకు చేర చేరిన వెంటనే
మరువనీకు మరచి పోక
తన మానిసి
మనుగడకే లోటూ లేదని.
బాగుందెంతో బాగుంది
నిశిలో నేవున్నా
నా కనులకు ఆకాశాన
శశి దర్శనమౌతున్నది.
పడితేనేం అతుకు
అసలుందొక చిరుగుపాత.
నేనిప్పుడు యిరవయ్యోపడిలో
ఉన్నానని తెలుసు కదమ్మా
నీవు చూసే ఉంటావు
జీవితంలో మనుష్యులు
సమస్యల్లో కూరుకుపోవటం
ప్రస్తుతానికి
పలహారశాలలో
పళ్ళాలు కడుగుతున్నా
నా బాధల భయానకపు
మోము మీద బలవంతపు
చిరునువ్వుల నతికించుకొని
ఖాతాదార్ల సంతృప్తి కోసం
కాఫీ కలుపుతున్నా
అందరు యువకుల మల్లే
పొగ పీలుస్తూ
గోడ వార చేరి
అందమైన అమ్మాయిల
పలకరిస్తున్నా
చెలి చెంతన లేకపోతే
బ్రతుకు చేదు నిజం కాదా!
కడుపు నింప
రొట్టె ముక్క నొక్కదాన్ని
యాచిస్తే
ఇవ్వలేక
తనకు లేక
కడుపు మంట మండుచున్న
ప్రతిరోజు పస్తుకాగ
ఈ బ్రతుకుల విలువెంత?
ఆరగించ రొట్టెముక్క
కొద్ది కూరలున్న నేను క్షేమం
ఆకాశవాణిలో
నిషిద్ధుల సందేశం
‘అంతా బాగున్నాం’
ఏ ఒక్కరి నోటా
వెలవడలేదు ‘విచారం’
అమ్మా
నాన్నగారెలా ఉన్నారు?
ఆయనిప్పటికీ ప్రార్ధనాబద్ధులై
పసిపాపల మీద
భూమ్మీద మొలచి నిలిచిన
ఆలివ్ వృక్షాల మీద
ప్రేమ కురిపిస్తున్నారా!
అన్నలందరూ కులాసేనమ్మా?
నాన్న ఆశించినట్లు
వాళ్లంతా చక్కటి టీచర్లయ్యారా?
నా కళ్లలో కన్నీళ్ల
సుడిగుండాలు కలచి
నా హృదయాన్ని వేదనతో
కదిలించిందేదో నీకు తెలుసా!
ఏ సాయంత్రమో
నేను జబ్బున పడితే
నన్ను ఈ రాత్రి కనికరిస్తుందా!
కాలిడిన కాందిశీకులెవ్వరూ
తిరిగి పోనే లేదు ఇంటికి
ఏ తరుచ్ఛాయలోనో
ఒరిగిపోయిన నన్ను
ఈ మృత ప్రాణి మనిషేనని
గుర్తిస్తుందా ఈ చెట్టు
గుర్తించి రక్షిస్తుందా
రాబందుల బారినుండి
ప్రియమైన అమ్మా!
భూమి సముద్రం ఆకాశం
అన్ని మార్గాలు మూసివేయబడ్డా
ఏ వాహనం ఈ లేఖను
చేరవేస్తుందని ఇన్ని
పేజీలు నింపాను
ఈ ఉత్తరం చేరేప్పటికి
మీరు మరణించేరో
లేక నాలాగే
జాడలేక నీడల్లా బతికేరో!
నాదని దేశం లేక
నా యిల్లే నాదికాక
నాకో జెండా లేక
ఏ చిరునామా లేక
నా వ్రాతలకేది మిగులు విలువ?
(ఆఫ్రో ఆసియా రచయితల సంఘం జాతీయ సమితి ప్రచురించిన ‘‘లోటస్ ఇండియా’’ లో ముద్రితమైన లోటస్ అవార్డ్ గ్రహీత మహమూద్ దర్విష్ (పలస్తీనా కవి) రాసిన ‘‘లెటర్ ఫ్రమ్ ఎక్సైల్’’ కు అనువాదం.)