అబద్ధం ఆబోతులాంటిది
నిజం గర్భగుడిలో విగ్రహం లాంటిది
విశృంఖలత్వం, విచక్షణారాహిత్యం అబద్ధపుతత్త్వం
నిబద్ధత, నిశ్చలత్వం నిజం స్వత్వం
పంచభూతాల్లో ప్రాణతత్వంసత్యం
మాయచేసే మరీచిక లాంటిది అబద్ధం
ఇప్పుడు ఎక్కడచూసినా అబద్ధాలే రాజ్యాలేలుతున్నాయి
ప్రపంచ కుబేరులై వికటాట్టహాసం చేస్తున్నాయి
అబద్ధాల కోడెత్రాచుల మధ్య
నిజాల మొగలిరేకుల్ని తెచ్చుకోవటమెలా?
వాటి సుమనఃసౌగంధ్యాన్ని ఆఘ్రాణించటమెలా?
ఆబోతులకు ముక్కుతాళ్లు వేసి నిరోధించగలిగే
నేర్పరులు కావాలి
నిజమనే సూర్యుణ్ని నేలపై ఊరేగించే
సౌరశౌర్యశక్తులు రావాలి
దేశభక్తితో నిజాన్ని అధికారసింహాసనంపై
కూర్చోబెట్టే జనశక్తి కూడాలి
కోడెత్రాచుల కోరలు పీకి
పాములబుట్టలో పడుకోబెట్టే
నాగస్వరం ఊది నాగులనాడిరచే
ఒడుపున్న వయసున్న జడుపులేని యువవీరులు
ఐక్యంగా ముందుకు కదలాలి
భూమ్మీద ధర్మమనే గోవు
నాలుగు పాదాలతో నడవాలంటే
సత్యమనే జయపతాకను ప్రతిచేయిపట్టాలి
అబద్ధాల ముళ్లు రాళ్లను ఏరేసి
సత్యసుమరజః పథం వేయాలి.
డాక్టర్ లగడపాటి సంగయ్య, 9490769242.