కథలను రాయటం, అందులో హాస్య కథలను రాయటం కొంచెం కష్టం అయినా అటువంటి కథలనే రాయటం కాక ఆ ప్రాంతం మాండలీకాన్ని తీసుకొని దాన్ని పాత్రలతో చెప్పించటం విశేషం. ముఖ్యంగా ఈ పుత్తూరు పిలగోడు పుస్తకంలోని కథలన్ని చిత్తూరు జిల్లా మాండలికంలో సాగుతుంది.ఇందులో కృష్ణా, కిష్టడు, కృష్ణ అనే ఒకే పేరులా సాగే హాస్య రసగుళికలు ఈ పుత్తూరు పిలగోడు. ఇందులో దాదాపు 32 కథలున్నాయి. ప్రతి కథ ఆంధ్రప్రభలో ప్రచురితమైనది. అన్ని కథలను హాస్యంతో పాటు ఆ ప్రాంత మాండలికం, ఆ ప్రాంత పద్ధతి, ఆ ప్రాంత వాడుక భాష మొదలైన వాటిని నేర్పుగా పట్టి కిష్టా పాత్రతో హాస్యం కలిపి పాఠకుల ముందుంచారు రచయిత ఆర్.సి.కృష్ణస్వామిరాజు.
ఈ కథలలోని సంఘటనలు అన్ని చాలామంది నిజ జీవితంలో జరిగే ఉంటాయి. హైస్కూలు చదివే ఒక కుర్రవాని ఆలోచనలు. అతని ప్రవర్తన మొదలగు వాటిని ప్రతి కథలో కూర్చటం వల్ల ఎప్పుడో మన చిన్నతనంలో ఇటువంటి సంఘటనలు మనకు జరిగినవి గుర్తుకు వస్తాయి. కథలన్నీ హాస్యమే ఓపిక లేకపోయినా, చదవటం మొదలుపెడితే చివర వరకు ఆగవు. ఇందుకు దుశ్శాలువా కప్పంగ కథ నేటికి చాల పల్లెటూర్లలో జరిగే వాస్తవ సంఘటనే కాని దాన్ని ఇలా హాస్యంగ చెప్పటం విశేషం.
అలాగే అమ్మకు ఏమైంది అనే కథలో పెద్ద పెద్ద పేరున్న డాక్టరు వద్దకువెళ్లి వందలు, వేలు తగలేసుకొనే బదులు దగ్గరలోని యం.బి.బి.యస్ లేదా ఆర్.ఎం.పి వద్దకు వెళ్లి జబ్బు సంగతి తేల్చుకోవటం మంచిది అనేది సత్యం . ఇది ఆనాటి కాలం పెద్దవారిలో ఈనాటికి ఉంది అని తెలియజెప్పే నీతి కథ అనొచ్చు. ఇక నల్లంచు తెల్లచీర కథ చివరి వరకు ఉత్కంఠ కల్గిస్తుంది. చివరిలో ఆమె భర్త అమెకు చీర కడతాడు అనే సంగతి తెలియటంతో కథలోని ఉత్కంఠ తగ్గుతుంది. మరో గొప్ప హాస్య కథ ఒక మాటకు ఎన్ని అర్థాలు ఉంటాయో తెలిపే కథ ‘కరీంనగర్ కుట్టి’. ఆ కరీంనగర్ కుట్టి కిష్టాని అండా కావాలంటే కిష్టడు ఏ అండా ఇచ్చాడో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే. అలాగే బుజ బుజ నెల్లూరు బుల్లికథలో నెల్లూరు నెరజాణ లాంటి అమ్మాయి వచ్చి ఈత నేర్చుకునేందుకు సొరకాయలు అడిగితే… చివరకు ఏమైందో తెలుసుకోవాలంటే ఈ కథను చదవాల్సిందే. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి కథలో ఏదో ఒక విశేషం ఉంది. అది తెలుసుకోవాలంటే పుత్తూరు కథలు చదవాల్సిందే.
విష్ణుభొట్ల రామకృష్ణ