Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

రసాత్మక కన్నీరు


నీరంతా ఒక్కటి కాదు
అంతవరకు రంగు రుచులతో
అస్థిత్వమై మూడునదులు
త్రివేణి సంగమ రసాయన చర్యలో
ఒకేరుచి ఒకే రంగువస్త్రంతో
గంగ ప్రయాణం!
కాషాయమై గోదావరి
జాతీయజెండాను గుర్తుచేస్తే
శరత్‌ కాల నీలాకాశంలా
కృష్ణమ్మ రంగుమారింది
నీటికి రంగువుంది రుచివుంది!
కన్నీరంతా ఒక్కటికాదు
పుట్లధాన్యం బండికెక్కించి
ముక్కుతాడు చర్నాకోలు బట్టి
రైతు ఎద్దుల్ని పదపదమంటే
పంట దిగుబడిలో భాగమైన ఎద్దులు
అడుగులు వేస్తూ
గాలికుంటు అర్రుపుండు
అశనిపాతమై
మూగగా మోరెత్తి కన్నీరు కార్చాయి
కన్నీరు భయానక రసం!
కాలు దువ్వి దుమ్ములేపి
రెండు పొట్టేళ్ళు బొబ్బిలి యుద్ధమై
ఫాలభాగాలు పగులుతున్న చప్పుడు
పరుగెత్తిన కాపరి రాజీలోగా
ఓడిన పొట్టేలు ఆయువు
కన్నీరుకార్చి గాల్లో కలిసింది
కన్నీరు వీరరసం!
కులవివక్షలో చిక్కి
ప్రేమించిన హృదయాలు
రక్త సంబంధ దాష్టీకానికి బలై కార్చిన
కన్నీరు బీభత్స రసం!
ప్రార్థనా స్థలిలో గాంధి
గాడ్సే పిస్టలుకు బలైనపుడు
చెమ్మగిల్లిన గాంధీ కళ్ళ
తడి శాంతరసం!
ఉయ్యాల్లో పసిబిడ్డ గుక్కపట్టిన ఏడ్పు
అంతంలేక సాగితే
భయపడ్డ ఉయ్యాలకంపించింది
అమ్మ కోసమో ఆకలికోసమో
పక్కతడుపో`
ఎడారి చెక్కిళ్ళపై పారిన కన్నీరు
నోటి ఒయాసిస్సుకు జారితే
నవరసాల్లో ఏరసమూకాని కన్నీరు
వడకట్టిన మంచినీటి మూట!
మాటలు రాని పసిబిడ్డకు
ఏడుపే మాట, ఏడుపే పిలుపు!
అడిగోపుల వెంకటరత్నమ్‌,
సెల్‌ : 9848252946

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img