డా॥ తక్కోలు మాచిరెడ్డి
సెల్: 7569693239 సొదుం జయరామ్, సొదుం గోవిందరెడ్డి , సొదుం రామ్మోహన్ సోదరులు. జయరామ్ కథకుడు. గోవిందరెడ్డి కవి. రామ్మోహన్ విమర్శకుడు, పాత్రికేయుడు. కడప జిల్లా ఉరుటూరువీరి స్వగ్రామం. సొదుం రామ్మోహన్ విశాలాంధ్ర దినపత్రికలో 20 ఏండ్లు, ఉదయంలో 10 సంవత్సరాలు ఉప సంపాదకుడుగా పని చేశాడు. విశాలాంధ్రలో ‘సామాన్యుని డైరీ’, ఆనంద భైరవిఅసావేరి’ అనే శీర్షికలతో కాలమ్స్ నిర్వహించాడు. రామ్మోహన్ రెండు పుస్తకాలు రాశాడు. ‘సాహిత్యావలోకనం’, ‘సాహిత్యంలో శిల్పం’. 1976 లో అచ్చయిన మొదటి పుస్తకంలో 28 వ్యాసాలున్నాయి. 2 వేల ప్రతులు ముద్రించారు. రెండవ పుస్తకం 1999 లో ప్రచురితం అయింది. దీనికి కేతు విశ్వనాథరెడ్డి ముందు మాట రాశారు. ఇందులో 36 వ్యాసాలున్నాయి. ‘సాహిత్యావలోకనం’ ను రారాకు అంకితమిచ్చాడు రామ్మోహన్ ఈ మాటలతో
‘‘సమాజ అధ్యయనానికి మెదడు, సారస్వత రసగ్రహణకు హృదయం ప్రధానమని మొదటిసారిగా తెలిపిన రాచమల్లు రామచంద్రారెడ్డి అన్నకు అంకితం’. రారా అనుభూతికి పెద్దపీట వేసి విరసం వాళ్ల చేత ‘శిల్సవాది’ అన్పించుకున్నాడు.
సాహిత్యావలోకనం సంపుటికి ఉపోద్ఘాతం అనకుండా, సొదుం రామ్మోహన్ ‘‘క్షమిస్తే రెండు మాటలు’’ అంటూ వినయంతో ఈ రెండు మాటలు రాశాడు అవి: ఏ వర్గం ప్రజల గూర్చి నాకు బాగా తెలుసు? ఏ వర్గం ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయి? ఏ వర్గం కోసం నేను రాయాలి? ఎందుకు రాయాలి? వారి జీవన పరిస్థితులేమిటి? వారినెలా మందలించాలి? వారి జీవితంలోని లొసుగులను వారికెలా తెలియజేయాలి? ఇంతకంటె ఉన్నతమైన, సౌభాగ్యవంతమైన జీవితం వైపుకి వారి దృష్టినెలా మళ్లించాలి? వగైరా ప్రశ్నలను ప్రతి రచయితా తనకు తానే వేసుకుని పరిష్కారాలు తప్పకుండా కనుక్కోవాలి. కార్మికుల జీవితాలను గూర్చి రాయాలనుకున్న రచయిత వారిని గూర్చి ప్రాక్టికల్‌గా, థియెరిటికల్‌గా క్షుణ్నంగా తెలుసుకోవాలి. పై మేడలో ఈజీ చైర్‌లో కూచుని పూరిపాకల్లోని వ్యక్తుల జీవితాలను ఊహించి రచనలు చేస్తే ఒక విధంగా నేరమే అవుతుంది.
‘సాహిత్యావలోకనం’ లోని కొన్ని వ్యాసాల్ని ఇపుడు పరిశీలిద్దాం. ఈ సంపుటిలోని ‘సాహిత్యంవిప్లవం’ లో విప్లవాన్ని నిర్వచిస్తూ రామ్మోహన్ ఉంటాడు. సామాజిక సంబంధాలు సమూలంగా మార్పు చెందడాన్ని విప్లవం అంటారు అని కాని సామాజిక సంబంధాలతో పాటు ఆర్థిక సంబంధాల్లో గుణాత్మకమైన మార్పు రావడం కూడ విప్లవమే. విప్లవం జరగడానికి ముందు విప్లవకర పరిస్థితి ఉండి తీరాలి అంటూ విప్లవకర పరిస్థితి ఉన్నంత మాత్రాన విప్లవం వూడిపడాలన్న రూలెక్కడా లేదు. విప్లవకర సన్నివేశాన్ని మార్క్సిస్టు
లెనినిస్టు అవగాహనతోఇలా పేర్కొన్నాడు సొదుం రామ్‌మోహన్. మొదటిది: ఏ మార్పూ లేకుండా, పాత పద్ధతుల్లో పరిపాలించడం అసాధ్యమైపోవాలి. రెండవది: కొల్లగొట్టబడే వారికి కష్టాలు, వేదనలు దుర్భరమై, అసహనీయమై పోవాలి. ఫలితంగా వాళ్లలో తిరుగుబాటు, ధోరణి జ్వలించాలి. మూడవది: పీడిత వర్గం కార్యరంగంలోకి దుమకాలి అంటే, ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, ఆందోళనలు ఫెళఫెళమని విరుచుకుపడాలి. సాహితీ రంగానికి సంబంధించి మరో లక్షణం వేదనలూ, కష్టాలూ దుర్భరమై పీడిత వర్గంలో తిరుగుబాటు తత్వం కలగాలన్నా, సాహిత్యంలో కూడా స్పష్టంగా, తీవ్రంగా, బలంగా ఆ తత్వం చోటు చేసుకోవాలి. సామాజిక విప్లవం జరగడానికి కారణభూతమైన వివిధ సామాజిక శక్తులు సాహిత్య ఒక్కటన్న పరిమితిని గుర్తించాలి.విప్లవకర పరిస్థితి లేకపోయినా, విప్లవ ఆవశ్యకత గూర్చి రాయడం వల్ల ప్రయాజనమే ఉంటుంది తప్ప, నష్టం ఉండదు. ‘సాహిత్యం
ప్రచారం’ అనే వ్యాసంలో ప్రగతిశీల దృక్పథం అంటేనే ‘అదిగో ప్రచారం’ అంటూ దుష్ప్రచారానికి లంకించుకునే శుద్ధ కళావాదులూ, పక్కా అభివృద్ధి నిరోధకులూ ఎప్పుడూ ఉంటారు. ఇలాంటి వారికి ఎప్పకికప్పుడు తగు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అభ్యుదయ రచయితలపై ఉంది,
చార్లీచాప్లిన్ ఆత్మకథ ఆధారంగా అతనిపై ఓ వ్యాసం రాశాడు రామ్మోహన్. చాప్లిన్ ఫ్రాయిడ్ వాదాన్ని ఖండిస్తూ ఒకచోట రాశాడు. ‘‘మనిషి ప్రవర్తన మీద సెక్సు కంటే, ఆకలి, దారిద్య్రాలకే ఎక్కువ ప్రాబల్యం ఉంటుంది.’’ చార్లీచాప్లిన్ తీసిన సినిమాలు పెద్దగా సెన్సార్‌కు గురి అయినాయి. రామ్మోహన్ మాటల్లో ‘‘చాప్లిన్ గొప్ప నటుడే కాదు, ఉత్తమ రచయితే కాదు, కరుణ, శాంతి ప్రియత్వం న్యాయకాంక్ష, మానవాళి పట్ల అపారమైన దయ, యుద్ధం పట్ల తీవ్ర నిరసన ఆయన వ్యక్తిత్వపు మూల స్తంభాలు. అడోల్ఫ్ హిట్లర్ చర్యలను ఖండిస్తూ ఆయన తీసిన చిత్రం ‘ది గ్రేట్ డిక్టేటర్’ ఆ చిత్రం తీస్తే చంపుతామని చాప్లిన్‌కు అనేక ఉత్తరాలొచ్చాయి.
సాహిత్యంలో వర్గ దృక్పథం అనే వ్యాసంలో రామ్మోహన్ అంటాడు: కార్మిక వర్గ పక్షపాతాన్ని ప్రదర్శించేందుకు రచయిత తప్పనిసరిగా శ్రమ జీవులున్న కథనో, నవలనో ఎన్నుకోవాల్సిన పనిలేదు. ఈనాడు మన రచయితలు అత్యధికంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే కాబట్టి అలాంటి రచయితలు మధ్య తరగతి పాత్రలతో కూడిన కథలూ, నవలలూ రాయొచ్చునని సూచిస్తాడు రామ్మోహన్. 1970 దశాబ్దంలో రాసిన ఈ పంక్తులు విరసం రచయితలు క్రియాశీలముగా ఉంటున్న నేటి సందర్భంలో సముచితమని అన్పించదు. అభ్యుదయ భావాలకేంఅవి చాలా మందికి ఉంటాయి పుష్కలంగా. వాటిని ‘కళాత్మకం’ గా వ్యక్తీకరించిన వాడే అభ్యుదయ రచయిత అవుతాడన్న విషయాన్ని నిద్రలో కూడా విస్మరించరాదు అని గట్టిగా చెబుతాడు సొదుం రామ్మోహన్. కేవలం జీవిత వాస్తవాలను చిత్రించడం లేదు. వాటి వెనుక గల శక్తులను అంటే, జీవితంలోని ఘోరాలకు , అనర్థాలకు, సుఖాలకు, దుఃఖాలకు గల కారణాలను విశ్లేషించి సాహిత్య రచన సాగించడం వేరు. ఈ రకం రచనలోనే సామాజిక దృక్పథం ఉంది అంటాం. అని ప్రగతిశీల విమర్శకుడు రామ్మోహన్ రాస్తాడు. తిలక్‌ను రారా భావకవి అన్నాడు. రామ్మోహన్ తిలక్‌ను సామాజిక కవిగా పేర్కొంటాడు. తిలక్ రాసిన ‘ఆర్త గీతం’ కవితను ఉటంకిస్తూ. స్త్రీ వాదాన్ని హృదయ పూర్వకంగా స్వాగతిస్తాడు రామ్మోహన్. దాని నేపథ్యం కూడా వివరిస్తాడు. దురహంకారంపై దూసిన కత్తులు అనే శీర్షికన దీన్ని విశదీకరించాడు. ఆయన మాటల్లోనే, ‘‘మన రాష్ట్రంలో (అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో) 1993 లో జనవరి నుంచి జూన్‌లోగా అంటే కేవలం ఆరునెలల వ్యవధిలోనే 136 కట్నం చావులతో బాటు 36 కట్నం హత్యలు జరిగాయంటే స్త్రీల పరిస్థితి ఎంత దయనీయంగా, దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. స్త్రీ వాద కవిత్వాన్ని వ్యతిరేకించడంలో ఎస్వీ కంటే జ్వాలాముఖి ఏడాకులు ఎక్కువ చదివినట్లుంది. స్త్రీ వాద కవిత్వాన్ని ఆయన ఏకంగా అంతర్జాతీయ కుట్రగా ప్రచారం చేస్తున్నాడు. శ్రామిక వర్గం విముక్తి సాధించేదాకా స్ల్రీ ఇలా అత్యాచారాలకు, కట్నం చావులకూ, ఆత్మహత్యల పేరిట హత్యలకూ నిత్యం గురి కావల్సిందేనా? అని ప్రశ్నిస్తున్నాడు రామ్మోహన్. రా.వి.శాస్త్రి ధోరణి మరీ విడ్డూరంగా ఉంది. ఈయన సోషలిజాన్ని నిజంగా సమర్థిస్తున్నాడంటే, నమ్మశక్యం కాదు. ఆయన ఇలా అన్నాడు
ఈ గయ్యాళుల్లా కాకుండా మధుర వాణిలా ఫెమినిస్టులున్నా బాగుండేది. సోకాల్డ్ మధ్య తరగతి స్త్రీలకు వేరే పనీపాటా లేకుండా చేసే అల్లర్లు స్త్రీయా? పురుషుడా? అని ఆలోచించకూడదు. మనిషిగా ఆలోచించమనండి. ఆధునిక సమాజంలో స్త్రీల చైతన్యం పెరుగుతోంది. వారు తమ వ్యక్తిత్వం కోసం పోరాడుతున్నారు. తమకు మాత్రమే అనుభూతం కాగల అనుభవాల గురించి కవితల్లో కలవరిస్తున్నారు. ఆ కవితల్ని సానుభూతితో అర్థం చేసుకోవాలా? అక్కర్లేదా? స్త్రీ స్వేచ్ఛ కోసం ఆరాటపడుతున్నదీ, పోరాటాలకు ఉద్యుక్తుమవుతున్నదీ విద్యాధిక మహిళలే. ఆర్థికమే స్త్రీలకు సర్వ సంపూర్ణ సమానత్వం ప్రసాదిస్తుందని భావించడం పొరపాటు. స్త్రీ సమానత్వం కోసం రెండు రంగాల్లో పోరాటం కొనసాగించాలి అని, ఒకటి శాసన రంగం, రెండు సాంస్కృతిక రంగం. అంటే, చట్టాలు ఎంత అవసరమో,పురుషుని సంస్కారాన్ని మెరుగుపరచడం కూడా అంతే అవసరం. ఈ తరంలోని పురుషుని సంస్కారంలో మార్పు వస్తే, ఆ మార్పు రక్తగతం కావాలంటే కొన్ని తరాలు పట్టవచ్చు అంటాడు రామ్మోహన్.
ఇకపోతే మరో కోణం నుంచి దళితవాదం అనే తన వ్యాసంలో దళిత చైతన్యం పెరిగిందనీ, దీనికి ఒక కారణం ప్రధాని ఇందిరాగాంధీ చేపట్టిన కొన్ని చర్యలు అనీ అభిప్రాయం వ్యక్తం చేస్తాడు రామ్మోహన్. రామ్మోహన్ రాసిన ‘సాహిత్యంలో శిల్పం’ అనే పుస్తకానికి ముందుమాట రాస్తూ కేతు విశ్వనాథరెడ్డి రామ్మోహన్ విలక్షణమైన వ్యాసకర్త అని అన్నాడు. ఎవదుకంటే, సాహిత్య వ్యాసాలు రాయడం ఇతనికి ‘‘నీళ్ల చెర్లాటం’’ వంటిది అని కూడా అన్నాడు కేతు. వస్తువు, శిల్పంఅనుభూతి సంయోగాన్ని కోరే సాహిత్య హృదయం ఇతనిది అని అన్నాడు కేతు. మరల రారాను గుర్తు చేసుకుందాం. ఆయన మాటల్లోనే
శిల్పం అనేది ఒక సాధనం మాత్రమే. శిల్పం ద్వారా సాధించవలసింది కళ. కళ అంటే అనుభూతి. అనుభూతి సంపదలేని రచన. గొప్ప శిల్ప నైపుణ్యం అనిపించుకోవచ్చు కానీ, కళ అన్పించుకోదు. కథలలోని గొప్పతనం అంతా అదే. ఉన్నత మానవీయ సంవేదనయే. ఇది కథ చదివేటప్పుడే రీడర్ ఫీల్ కావాలి. లేకపోతే తరువాత కోల్డ్ ఇంటలెక్చువల్ ఎనాలసిస్‌కు అందేది కాదు.
రారా శిల్పానికీ, అనుభూతికీ అంత ప్రాముఖ్యం ఇవ్వాల్సి వచ్చింది అని రామ్మోహన్ అభిప్రాయపడతాడు. అంతే తప్ప సాహితీ ప్రయోజనం పట్లగానీ, సాహిత్యంలో వస్తువు ప్రాధాన్యం పట్లగానీ ఆయనకు చిన్నచూపు ఏనాడు లేదు. విరసం వాళ్లు ఆయనను శిల్పవాది అనడం సబబు కాదు. శిల్పాన్ని మింగరాదు అంటాడు రామ్మోహన్. ఆయన మాటల్లో కథలూ, నవలలూ వాస్తవాలు ప్రాతిపదిక పైనే రచించాలి. ఐతే, వాస్తవాలు మాత్రమే కొట్టొచ్చినట్లు కనబడి, రచనలో శిల్పాన్ని మింగరాదు. అందరికీ అర్థమయ్యే ఓ భావ చిత్రం ద్వారా వాస్తవానికీ, సాహిత్యానికీ ఉన్న సంబంధం తెలియజేస్తాడు రామ్మోహన్ అంటాడునిజానికి
వాస్తవానికీ, సాహిత్యానికీ ఉన్న సంబంధం నూలుకూ, వస్త్రానికీ ఉన్న సంబంధం లాంటిది. నూలు లేకపోతే వస్త్రం లేదు. వస్త్రంలో మనకు ప్రత్యేకించి నూలు నూలుగా కనబడదు. వస్త్రమే కన్పిస్తుంది. సాహిత్యమూ అంతే అంటాడు` ప్రగతిశీల విమర్శకుడు సొదుం రామ్మోహన్.