Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

ప్రశ్న… నిరంతరం సాగే ప్రక్రియ

ఒక మనిషి మరో మనిషిని పలకరిస్తున్నాడంటే తొలి ప్రశ్న ఉదయించినట్లే. ఉదాహరణకు తెలిసిన వ్యక్తిని ‘హలో!’ అని పలకరిస్తే ‘ఎలా ఉన్నారు?’ అని అడుగుతారు. అదే తొలి ప్రశ్నగా మారుతుంది. అలా ఉదయం నుండి నిద్రపోయేవరకు ప్రశ్నల పరంపర సాగుతూనే ఉంటుంది. ఇది నిరంతరంసాగే ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ఆకలిలో ప్రశ్న, ఆవేదనలో ప్రశ్న, ఆవేశంలో ప్రశ్న, ఆనందంలోనూ ప్రశ్నే. ఇలా అన్నీ ప్రశ్నతోనే ప్రారంభమవుతాయి. ఇందులో ‘ఆలోచించడం అంటే ప్రశ్నించటం, వినటం అంటే ప్రశ్నించటం, మాట్లాడటం అంటే ప్రశ్నించటం, చదవటమంటే ప్రశ్నించటం, రాయటం అంటే ప్రశ్నించటం, విశ్లేషించటం అంటే ప్రశ్నించటం. ప్రశ్న లేకపోతే భావసృష్టి లేదు, భావ ప్రసరణలేదు. ఆ రెండు లేకుంటే ప్రగతి లేదు. ప్రగతికి మూలం ప్రశ్న. సృజనకు, పరిశోధనకు మూలం ప్రశ్న అని చెబుతారు. అంటే ఇది నిరంతరం సాగే ప్రక్రియ.
ప్రశ్నిస్తేనే ఫలితం ఉంటుంది. ప్రయోజనం ఉంటుంది. అయితే అపజయమైనా, విజయమైనా, తప్పయినా ఒప్పయినా ప్రశ్నకు సమాధానం తెలిసిన తర్వాత మరో ప్రశ్న…అలా ప్రశ్నలపరంపర సాగుతూనే ఉంటుంది. ప్రశ్న అన్నది ఓ రంగానికో, కొందరికో సంబంధించినది కాదు. అది అందరినుండి ఉదయిస్తుంది. అయితే ప్రశ్నంటే భయపడేవారు ఉంటారు. ఏ రంగంలోని వారైనా కొంతమందికి తమను ప్రశ్నించడం నచ్చదు. అందుకు కారణం తామే అధికులమన్న భావన వారిలో ఉండటం కావచ్చు, లేదా ఎదుటివారికి తమకంటే బాగా తెలుసన్న భయం కావచ్చు. ఉదాహరణకు బడిలో చివరిబెంచ్‌ విద్యార్ధి తనకు తెలియని ప్రశ్నను టీచర్‌ తననే అడుగుతారేమోనని భయపడతాడు. ఆ భయంతో ఆయా ప్రశ్నల తాలూకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ భయంలో అతని భవిష్యత్తు ఉంటుంది. ప్రశ్న రేపటి ప్రగతికి, సత్యాన్వేషణలో తొలి అడుగుగా భావించవచ్చు. ప్రశ్న వల్ల ఏంతెలుస్తుంది, ఎంతవరకు ప్రయోజనమో, అలాగే ప్రశ్న గురించిన విశేషాలు, విశ్లేషణలు తదితరాలను గురించి తెలుసుకోవాలంటే ‘ప్రశ్న ఎందుకు?’ పుస్తకం తప్పక చదవాలి. టెడ్‌ అగాన్‌ ఆంగ్ల రచనకు ‘ప్రశ్న ఎందుకు?’ పేరుతో తెలుగులో సంక్షిప్త స్వేచ్ఛానువాదం చేశారు డా. పి. హరిపద్మరాణి, పెద్ది సాంబశివరావులు. ఈ రచనను విశాలాంధ్ర పబ్లిషింగ్‌హౌస్‌ వారు అందించారు.
‘అనుభవం నుంచే విజ్ఞానం అంతా ఆవిర్భవిస్తుంది’ అన్నాడు ఐన్‌స్టీన్‌. టెడ్‌ అగాన్‌ జీవితానుభవాలే ఈ గ్రంథ రచనకు వనరులు. ఇందులో ‘ప్రశ్నల ప్రారంభం’ అనే వ్యాసంతో ప్రారంభమై ‘చెయ్యండి, అంతే’ వరకు వ్యాసపరంపర సాగుతుంది. ప్రశ్నించడం పిల్లల ఎదుగుదలకు ఎంతో ఉపయుక్తం.‘క్లుప్తంగా చెప్పాలంటే బాల్యంలో పిల్లలకు మనం నేర్పితే వాళ్ల జీవితాలలో వచ్చే మార్పు చిన్నదిగా ఉండదు. అందులోనే ఉంటుంది తేడా అంతా’ అన్న అరిస్టాటిల్‌ మాటలను మననం చేసుకోవాలి. ప్రశ్నించడమంటే కేవలం సమాధానం తెలుసుకోవడంకాదు ఆ సమాధానంలో దాగున్న అనేక విశేషాలను, విషయాలను అన్వేషించడమే. ఇందలి ప్రతి వ్యాసం కొత్త విషయాలను తెలియజేస్తుంది. ‘కేవలం ప్రశ్నలు అడగటంలో ప్రావీణ్యం సంపాదిస్తే చాలదు, ప్రశ్నలను కార్యాచరణలుగా మలచుకోవాలి. వాటి గురించి కృషిచేయాలి, తప్పకచేయాలి’ అన్నాడు అమెరికాకు 28వ అధ్యక్షునిగా పనిచేసిన ఉడ్రోవిల్సన్‌. ఆ దిశగా తొలి అడుగువేయాలంటే ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి. ముఖ్యంగా విద్యార్ధులు పదిలపరచుకోదగ్గ రచన.

ప్రశ్న ఎందుకు?
ఆంగ్లమూలం: టెడ్‌ అగాన్‌
సంక్షిప్త స్వేచ్ఛానువాదం:
డా॥ పి. హరిపద్మరాణి, పెద్ది సాంబశివరావు
పేజీలు: 132, వెల: రూ.100/ ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 33222, చంద్రం బిల్డింగ్స్‌, చుట్టుగుంట, విజయవాడ520004
మరియు విశాలాంధ్ర బుక్‌హౌస్‌
అన్ని బ్రాంచీలలో

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img