పోలీసుల ఎదుట కొత్త స్నేహితురాలు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధావాల్కర్ హత్యకేసులో పలు కథనాలు ఆసక్తి రేపుతున్నాయి. శ్రద్ధాను చంపినందుకు తానేమీ బాధపడటం లేదని అఫ్తాబ్ పోలీసుల ఎదుట చెప్పగా.. అఫ్తాబ్ ఇంటికి రెండు సార్లు వెళ్లినా అక్కడే శ్రద్ధ హత్య జరిగినట్లు గుర్తించలేకపోయానని అఫ్తాబ్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ చెప్తున్నది. శ్రద్ధా హత్య కేసులో అఫ్తాబ్ కొత్త స్నేహితురాలు తెరపైకి రావడంతో పోలీసులు ఆమెను కూడా ప్రశ్నిస్తున్నారు. శ్రద్ధ చేతికున్న ఉంగరాన్ని కొత్త స్నేహితురాలికి తొడిగి డేటింగ్ చేస్తున్నట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నట్లు సమాచారం. అఫ్తాబ్ కొత్త స్నేహితురాలు పోలీసులకిచ్చిన స్టేట్‌మెంట్‌లో శ్రద్ధావాల్కర్ హత్యతో గానీ, ఆమె శరీరం ముక్కలతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆయన్ను కలిసేందుకు అఫ్తాబ్ ఇంటికి వచ్చినప్పుడు శ్రద్ధా శరీరం ముక్కలను ఆ ఇంట్లోనే దాచిన విషయం తాను గుర్తించలేదని చెప్పింది. అఫ్తాబ్‌ను తాను ఎప్పుడూ భయంతో చూడలేదని కూడా పేర్కొన్నది. మే నెలలో శ్రద్ధ హత్య తర్వాత అఫ్తాబ్ ఈ కొత్త స్నేహితురాలితో డేటింగ్ ప్రారంభించాడు. అక్టోబర్‌లో రెండుసార్లు అఫ్తాబ్ ఇంటికి వచ్చినట్లు చెప్పిన కొత్త స్నేహితురాలు.. అక్టోబర్ 12న అఫ్తాబ్ తనకు ఉంగరాన్ని ఇచ్చాడని పోలీసులకు తెలిపింది. పోలీసులు ఆమె నుంచి ఉంగరాన్ని స్వాధీనం చేసుకుని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.శ్రద్ధ హత్య కేసు బయటకు రాగానే అఫ్తాబ్ కొత్త స్నేహితురాలు షాక్‌కు గురైంది. అతడి భయంకరమైన చర్య గురించి తెలుసుకుని కలత చెందింది. ఈ షాక్ నుంచి బయటపడేందుకు తనకు కౌన్సెలింగ్ అవసరమని ఆమె చెప్పిందని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇలాఉండగా, అఫ్తాబ్ కొత్త స్నేహితురాలు మానసిక వైద్యురాలుగా పనిచేస్తున్నట్లు సమాచారం. కాగా, అఫ్తాబ్ వివిధ డేటింగ్ యాప్‌లలో దాదాపు 15-20 మంది అమ్మాయిలతో కాంటాక్ట్‌లో ఉన్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు.