పనాజీ: గోవా ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులతో ఈసారి ప్రతిజ్ఞలు చేయిస్తున్నాయి. తాము అవినీతి, ఫిరాయింపులకు పాల్పడబోమని ఆప్ నుంచి పోటీ చేస్తున్న 40 మంది అభ్యర్థులు అఫిడవిట్‌పై సంతకాలు చేశారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులతో ఆలయాలు, మసీదులు, చర్చీల వద్ద ప్రమాణం చేయింది. ఆప్ అభ్యర్థులు తమ అఫిడవిట్లతో పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి మీడియా సమావేశంలో బుధవారం పాల్గొన్నారు. ‘గోవా రాజకీల్లో ఫిరాయింపులనేది అతి పెద్ద సమస్య. ప్రజలు మాకు ఓటు వేయక ముందే మేము ఈ సంస్కృతికి చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నాం’ అని కేజ్రీవాల్ తెలిపారు. ఈ లీగల్ అఫిడవిట్లు గోవాలో ప్రజలకు అందుబాటులో ఉంటాయని, ఎమ్మెల్యేలు విశ్వాస రాహిత్యానికి పాల్పడితే ఓటర్లు కేసు వేయవచ్చని అన్నారు. దీనికి ముందు కాంగ్రెస్ పార్టీ సైతం తమ అభ్యర్థులందరితో కలిసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడబోమంటూ ప్రతిని చేయించింది. గోవా అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 14న జరుగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.