ఏడుగురిని అరెస్టు చేసిన సీబీఐ
న్యూదిల్లీ : ఆన్లైన్లో పిల్లల లైంగిక దోపిడీ వీడియోల వ్యవహారంపై సీబీఐ తాను నిర్వహించిన ఆపరేషన్‌లో ఏడుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. దిల్లీ నుంచి రామ్ గౌతమ్, సతేందర్ మిట్టల్, పురుషోత్తం, ఒడిశాలోని ధేనుకనల్ నుంచి సురేంద్ర కుమార్ నాయక్, నొయిడా నుంచి నిషాంత్ జైన్, రaాన్సీ నుంచి జితేందర్ కుమార్, తిరుపతి నుంచి టి.మోహన్ కృష్ణను అరెస్టు చేసినట్లు వారు వివరించారు. కాగా సీబీఐ నిందితులను బుధవారం ఒక న్యాయస్థానం ముందు హాజరపరచనున్నది. అయితే మిగిలిన వారిని తదుపరి విచారణ కోసం దిల్లీకి ట్రాన్సిస్ట్ రిమాండ్‌కు కోరనున్నట్లు చెప్పారు. విచారణ సాగుతున్న కొద్దీ మరిన్ని అరెస్టులు జరగవచ్చని అన్నారు. ‘దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాలలో ఉన్న వ్యక్తుల వివిధ సిండికేట్లు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, గ్రూప్‌ల ద్వారా చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేషన్ మెటీరియల్(సీఎస్ఈఎం)ను చెలామణి చేయడం, నిల్వ చేయడం, చూడటం వంటివి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా సోషల్ మీడియా గ్రూప్‌లు, ప్లాట్‌ఫారమ్‌లు, థర్డ్ పార్టీ స్టోరేజీ, హోస్టింగ్ ప్లాట్ఫామ్ల్లో లింక్‌లు, వీడియోలు, చిత్రాలు, టెక్స్ట్‌లు, పోస్ట్‌లు, అలాంటి విషయాలను పంపిణీ చేయడం ద్వారా వ్యక్తులు సీఎస్ఈఎంను ప్రచారం చేస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి’ అని సీబీఐ అధికార ప్రతినిధి ఆర్.సి.జోషి తెలిపారు. ఇదిలాఉండగా, సీబీఐ నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా ఈ భారీ ఆపరేషన్ ప్రారంభించింది. 83 మంది నిందితులపై 23 ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. అది మరుసటి రోజు వరకు కొనసాగింది. పాకిస్తాన్, కెనడా, బంగ్లాదేశ్, నైజీరియా, ఇండోనేషియా, అజర్బైజాన్, శ్రీలంక, అమెరికా, సౌదీ అరేబియా, యెమెన్, ఈజిప్ట్, బ్రిటన్, బెల్జియం, ఘనా వంటి దేశాల్లోని కొంతమంది నిందితులతో బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన విషయాలను పంచుకున్న 5 వేల మందికి పైగా నేరస్తులు ఉన్న 50కు పైగా సోషల్ మీడియా గ్రూప్‌లపై ఈ ఆపరేషన్ లక్ష్యంగా పెట్టుకుంది.