మాజీ ఎంపీ సజ్జన్‌కు సుప్రీం బెయిల్ నిరాకరణ
న్యూదిల్లీ : సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మరోసారి నిరాకరించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సజ్జన్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన మెడికల్ రికార్డులు పరిశీలించిన ధర్మాసనం.. వైద్యుల నివేదిక ప్రకారం ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది. సజ్జన్ కుమార్ తన సొంత ఖర్చులతో మేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన అతి క్రూరమైన నేరంలో నిందితుడని, అలాంటి వ్యక్తిని వీఐపీ పేషెంట్లా పరిగణించమంటారా అని ప్రశ్నించింది. ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, అందువల్ల వైద్యపరమైన కారణాలతో బెయిల్ మంజూరు చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ దోషిగా తేలడంతో ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 2018 డిసెంబరులో దిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడిరచింది. అప్పటి నుంచి ఆయన మండోలి జైలులో ఉన్నారు. జైలుకు వెళ్లాక తన ఆరోగ్యం క్షీణించిందని, అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు బెయిల్ మంజూరు చేయాలని సజ్జన్ చాలాసార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతేడాది సెప్టెంబరులో ఆయన అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు.. యావజ్జీవ శిక్షను రద్దు చేయాలనే సజ్జన్ అప్పీలును న్యాయస్థానాలు భౌతికంగా పనిచేసినప్పుడు పరిశీలిస్తామని వెల్లడిరచింది.