న్యూదిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వంతో కేరళ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి భేటీ కావడాన్ని విస్మరించలేమని, ఈ రహస్య సమావేశంపై సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిందేనని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండ్ చేశారు. కేరళ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ఎంఆర్ అజిత్ కుమార్ 2023లో ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ నేతలను రహస్యంగా కలిశారు. ఏడీజీపీకి, ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు మధ్య ఉద్దేశపూర్వక, రహస్య మంతనాల మర్మమేమిటని సీపీఐ ప్రశ్నించింది. ఇదే విషయమై రాజా దిల్లీలోని విలేకరులతో మాట్లాడుతూ ‘ఇది తేలికగా తీసుకునే అంశం కాదు. రహస్యాలను సీపీఎం, కేరళ ప్రభుత్వం విస్మరించలేవు. సమగ్ర దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగుచూస్తాయి. ఈ గోప్య సమావేశాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమావేశాలను ఎవరు నిర్వహించారు, వీటి ఉద్దేశమేమిటి, ఏమీమి అంశాలు చర్చించారు వంటివి తెలియాల్సి ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వాన్ని పోలీసులు ఉన్నతాధికారి కలవడమన్నది చిన్న విషయం కాదు. ముఖ్యమంత్రి నుంచి ముందస్తు అనుమతిని పొందారో లేదో కూడా తెలియదు. ఎల్డీఎఫ్ ప్రభుత్వంతో దీనిపై వివరణ కోరమని సీపీఐ కేరళ నాయకత్వానికి ఆదేశాలిచ్చా. ఈ వ్యవహారం రాజకీయంగానే కాకుండా సామాజికంగా కేరళ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది సీపీఐ అధ్యయనం చేస్తుంది’ అని రాజా అన్నారు.
దర్యాప్తునకు ఎల్డీఎఫ్ మద్దతు
ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వాన్ని కలిసినట్లు ఏడీజీపీ అంగీకరించారని ఎల్డీఎఫ్ కన్వీనర్ టీపీ రామకృష్ణన్ తెలిపారు. దీనిపై ప్రభుత్వ దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. అన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని అన్నారు. ఎల్డీఎఫ్ విధానానికి విరుద్ధంగా… అధికార పరిధిని అతిక్రమించినట్లు తేలితేగనుక ఆ అధికారి పదవిని కోల్పోతారని, ఆయనకు శిక్ష కూడా తప్పదని రామకృష్ణన్ అన్నారు.