బీజేపీ వెన్నుపోటుతో నిజాలు తెలుసుకున్నాం : శివసేన
పనాజీ: బీజేపీతో స్నేహం కారణంగా గోవాపై తాము ఇప్పటి వరకూ దృష్టి కేంద్రీకరించలేదని శివసేన నాయకుడు ఆదిత్య థాక్రే చెప్పారు. తమకు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆ పార్టీ నిజస్వరూపం తెలుసుకున్నామని, గోవాలో జరిగే భవిష్యత్ ఎన్నికల్లో తాము పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని ఆయన స్పష్టంచేశారు. పంచాయతీ ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు పోటీ చేస్తామని థాక్రే తెలిపారు. గోవాకు శివసేన అవసరం చాలా ఉందని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ గోవాలో సుస్థిర అభివృద్ధి సాధించడంలో కాషాయపార్టీ వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. 2019లో మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీకి శివసేన గుడ్‌బై చెప్పింది. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో జత కట్టి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గోవాలో ఎన్‌సీపీతో పొత్తుతో శివసేన పోటీ చేస్తోంది. ఫిబ్రవరి 14న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం శివసేన పది సీట్లలో పోటీ చేస్తోంది. పనాజీ అసెంబ్లీ నియోజకవర్గానికిగాను మాజీ సీఎం మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్‌కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆ స్థానం నుంచి పోటీ చేసిన తన అభ్యర్థిని శివసేన ఉపసంహరించుకుంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఉత్పల్ పారికర్‌కు మద్దతుగా నిలిచింది. ఆదిత్య థాక్రే శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ‘బీజేపీతో మితృత్వం కారణంగా శివసేన గతంలో గోవాపై దృష్టి కేంద్రీకరించలేదు. బీజేపీ మాకు వెన్నుపోటు పొడవటం, ఇతర రాజకీయ పరిణామాలను పరిశీలించిన తర్వాత గోవాలో భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. పంచాయతీలు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలన్నింటిలో మేము పోటీ చేస్తాం’ అని చెప్పారు. గోవాలో తమ పార్టీకి మంచి స్పందన లభిస్తోందని, ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికలు శివసేన భవిష్యత్ కోసం కాదని, స్థానికులు, వారి భవిష్యత్ కోసమని ఆయన అన్నారు. గోవాలో ఇప్పటికీ నీటి సమస్య ఉందని, విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని, ఈ రెండు సమస్యలను ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య తెలిపారు. అసలైన సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన బీజేపీ, దాని నాయకులు సంబంధం లేని అంశాల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా సమాజంలో విభజన సృష్టించడం, విద్వేష ప్రసంగాలను ప్రస్తావిస్తోందని మండిపడ్డారు.